మరోసారి చిక్కుల్లో పడ్డ హీరోయిన్
బెంగళూరు: కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. పాకిస్థాన్ నరకం కాదంటూ ఇటీవల రమ్య చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం చల్లారకముందే.. ఆమెపై క్రిమనల్ కేసు నమోదు చేయాలని స్థానిక కోర్టు..పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వారికి సహకరించారంటూ రమ్య చేసిన వ్యాఖ్యలపై వసంత్ మరకడ అనే న్యాయవాది ప్రయివేట్ పిటిషన్ దాఖలు చేశారు.
రమ్యపై చర్య తీసుకోవాలని ఆయన మంగళూరు సమీపంలోని బెల్తాన్ గడి కోర్టులో పిటిషన్లో కోరారు. అయితే అంతకు ముందు ఆయన రమ్యపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసేందుకు అంగీకరించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. వసంత్ స్టేట్మెంట్ను రికార్డు చేసిన కోర్టు రమ్యపై క్రిమినల్ కేసు నమోదు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమ్యకు సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.
మండ్య పట్టణంలో భారత రాష్ట్రీయ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘విద్యార్థిగళ నడె దేశద బెళవణిగె కడె’ ర్యాలీలో పాల్గొన్న రమ్య బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ల వల్ల దేశానికి స్వాతంత్య్రం రాలేదని, కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రమే స్వాతంత్య్రం లభించిందని అన్నారు. అంతేకాకుండా బిజేపీ, ఆర్ఎస్ఎస్లు బ్రటీష్ వారికి సహకరించారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే రమ్యపై దేశద్రోహం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.
పాకిస్తాన్‌లో ఉన్న వారు కూడా మంచి వారేనంటూ వ్యాఖ్యలు చేసిన ఆమెపై కొడగు జిల్లా సోమవార పేటలోని జేఎంఎఫ్‌సీ కోర్టులో ప్రైవేటుగా దేశద్రోహం కేసు దాఖలైంది. న్యాయవాది విఠల్‌గౌడ ఈ ప్రైవేటు కేసును దాఖలు చేశారు. శత్రుదేశమైన పాకిస్తాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన రమ్యపై సెక్షన్ 124/ఎ, 334ల కింద కేసు నమోదు చేయడంతో పాటు, ఆమెపై తక్షణమే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ విఠల్‌గౌడ న్యాయస్థానాన్ని కోరిన విషయం విదితమే.