మృతి చెందిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త(ఫైల్ ఫోటో)
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్‌డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్, ఎస్‌డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్‌డీపీఐ ఆర్గనైజేషన్ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్‌డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా బంద్..
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు. కాజర్‌గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్‌డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్తలపై ఆర్‌ఎస్‌ఎస్ దాడి చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందని ఎస్‌డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్‌డీపీఐ కర్యకర్తలతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది.
చదవండి: మందేశాడు.. ఎస్సైని ఢీకొట్టాడు
Comments
Please login to add a commentAdd a comment