మీరట్: జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశద్రోహం కేసులో జైలుపాలై, మధ్యంతర బెయిల్ పై బయటకొచ్చిన అతడిపై మరో కేసు నమోదైంది. భారత సాయుధ దళాలను అవమానించాడంటూ కన్హయ్యపై భజరంగ్ దళ్ కార్యకర్త ఫిర్యాదుతో అతడిపై తాజాగా మరో దేశద్రోహం కేసు దాఖలు చేశారు. ఈ నెల 28న కోర్టులో విచారణకు రానుంది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కన్హయ్య కుమార్ భారత సైన్యానికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడని రైట్ వింగ్ కార్యకర్త హేమంత్ సింగ్ ఆరోపించారు. భారత సైనికులు కాశ్మీర్, ఈశాన్య ప్రాంతాల్లోని మహిళలపై అత్యాచారాలతో పాటు, దురాగతాలకు పాల్పడ్డారంటూ కన్హయ్య చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వ్యాఖ్యలుగా భావించి అతడిపై బులందర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళామని ఆయన తెలిపారు.
అయితే అక్కడి పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించికపోవడంతో బులందర్ ఛీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించామని హేమంత్ సింగ్ తెలిపారు. సెక్షన్ 124-A (సెడిషన్) తో పాటు.. ఇండియన్ పీనల్ కోడ్ 153-B కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. తమ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు మార్చి 28న హాజరు కావాలని కోర్టు చెప్పిందని అన్నారు. ఈ సందర్భంలో తాను కోర్టుకు టెలివిజన్ లో ప్రసారమైన కన్హయ్య కుమార్ తప్పుడు వ్యాఖ్యల వీడియో క్లిప్పులను సమర్పించినట్లు తెలిపారు.