సినీతారలతో రైతుల ఆత్మహత్యలకు చెక్!
ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు సినీ తారలను ప్రచార రంగంలోకి దింపి లబ్ధి పొందడం రివాజే. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను ఆపేందుకు పార్టీకి చెందిన సినీ తారలను రంగంలోకి దింపింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతూ ప్రభుత్వం పరువు గంగలో కలిసిపోతున్న నేపథ్యంలో ఆర్థికంగా తీసుకోవాల్సిన చర్యలను పక్కనపెట్టి సినీ తారలను ఆశ్రయించింది. రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకే తాము పార్టీకి చెందిన తారలను రైతుల వద్దకు పంపితే తప్పేంటని పాలకపక్ష కాంగ్రెస్ నేతలు బాహటంగానే తమ చర్యను సమర్థించుకుంటున్నారు.
కన్నడ సూపర్ స్టార్, పార్టీ మాజీ ఎంపీ రమ్య పార్టీ వ్యూహంలో భాగంగా మాండ్యా జిల్లాలో పర్యటించి రైతులను కలుసుకున్నారు. ఆ జిల్లాలో గత రెండు నెలల్లో 25 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది చెరుకు రైతులే. గతంలో మాండ్యా లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన రమ్యకు గ్లామర్ ఎంతున్నా నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారన్న కారణంగా గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఉన్నత చదువుల కోసమని విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగొచ్చారు. చక్కెర మిల్లులు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడం వల్లనే రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆమె ఆరోపించారు. చెరకు సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా ధరను నిర్ణయించకపోవడమూ ఒక కారణమేనని అంగీకరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు కొంత ఆర్థిక సహాయం అందించి తన జిల్లా పర్యటనను ముగించారు.
ఇప్పుడు ఆమె బాటలోనే మిగతా జిల్లాల్లో పర్యటించేందుకు సినీ తార, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్, మరో సినీతార, జవహర్ బాల భవన్ చైర్‌పర్సన్ భావన సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రైతుల్లో భరోసా కల్పించేందుకు రేడియా ద్వారా ప్రసంగించినా, స్వయంగా రైతులను కలుసుకున్నా రైతుల ఆత్మహత్యలు ఆగలేదని, అందుకే సినీ తారలను రంగంలోకి దింపాల్సి వచ్చిందని పేరు వెల్లడించేందుకు ఇష్టం లేని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించారు.