న్యూఢిల్లీ: 1995లో జరిగిన జంట హత్యల కేసుల్లో లోక్‌సభ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్(70)కు సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది. రెండు బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించింది. బిహార్ ప్రభుత్వం కూడా బాధితులకు ఇంతే మొత్తం చెల్లించాలని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఇలాంటి కేసును గతంలో ఎన్నడూ చూడలేదన్న ధర్మాసనం.. ఈ కేసులో నిందితుడు ప్రభునాథ్ సింగ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ దిగువ కోర్టు, పట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కొట్టివేసింది. సాక్ష్యాలన్నిటినీ మాయం చేసేందుకు ప్రభునాథ్ సింగ్ ప్రయత్నాలు చేశాడని పేర్కొంది. దర్యాప్తు అధికారి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవ్యవస్థ తమ విధులను నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యాయంది. ఇద్దరి హత్యతోపాటు మరో మహిళపై హత్యాయత్నం కేసుల్లో ఆగస్ట్ 18వ తేదీన ప్రభునాథ్ సింగ్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్థారించింది.
1995 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభునాథ్ సింగ్ బిహార్ పీపుల్స్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. ఓటింగ్ రోజు చప్రాలోని పోలింగ్ స్టేషన్ నుంచి వస్తున్న కొందరు స్థానికులను ఎవరికి ఓటేశారంటూ కారులో వచ్చిన సింగ్ ఆరా తీశాడు. వేరే పార్టీకి ఓటేశామంటూ రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ మరికొందరు సమాధానమిచ్చారు. ఆగ్రహంతో సింగ్ తన వద్ద ఉన్న రైఫిల్‌తో వారిపైకి కాల్పులు జరపగా ముగ్గురు గాయపడ్డారు. వీరిలో రాజేంద్ర రాయ్, దరోగా రాయ్ అనంతరం చికిత్స పొందుతూ చనిపోయారు. ఘటనపై చప్రా పోలీస్‌స్టేషన్‌లో 1995 మార్చి 25న కేసు నమోదైంది. 1995లోనే జనతాదళ్ ఎమ్మెల్యే అశోక్ సింగ్ సొంతింట్లో హత్యకు గురైన కేసులో సింగ్ ప్రస్తుతం హజారీబాగ్ జైలులో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment