దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ అభి సినిమాతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు రమ్య (దివ్య స్పందన). ఆ మరుసటి ఏడాదే కుట్టు చిత్రంతో తమిళ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో బోలెడన్ని అవకాశాలు ఆమె తలుపు తట్టాయి. అలా తమిళ, కన్నడ, హిందీలో సినిమాలు చేశారు. తెలుగులో అభిమన్యు అనే ఒకే ఒక్క సినిమాలో నటించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.
'నా తల్లిదండ్రులే నా ప్రాణం. నాన్న చనిపోయిన రెండు వారాలకే నేను పార్లమెంటులో అడుగుపెట్టాల్సి వచ్చింది. కానీ పార్లమెంటు కార్యకలాపాల గురించి నాకు ఏమీ తెలియదు. అయినా ప్రతీదీ నేర్చుకున్నాను. నేను నా బాధను పనివైపు మళ్లించాను. అంతటి శక్తిని నాకు మాండ్యా ప్రజలే ఇచ్చారు. జీవితంలో నన్ను ఎక్కువ ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అమ్మానాన్నల తర్వాత రాహుల్ గాంధీ ఉన్నారు. నాన్న మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయాను. అలాంటి కష్ట సమయంలో రాహుల్ గాంధీ నాకు అండగా నిలబడి సహాయం చేశారు. మానసికంగా ధైర్యాన్ని నూరిపోసి సపోర్ట్ చేశారు' అని చెప్పుకొచ్చారు.
కాగా 2012లో రాజకీయాల్లో ప్రవేశించిన ఆమె 2013లో మాండ్య లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షురాలిగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవలే ఉత్తరకాండతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment