కొత్తందం కొనేద్దాం
- ముచ్చటైన ముఖాల కోసం నేతల తాపత్రయం
- ఎన్నికలకు ముందు ప్లాస్టిక్ సర్జన్లకు పెరిగిన గిరాకీ
ఎన్నికల బరిలోకి దిగిన నేతలు ప్రత్యర్థులపై సంధించే ఆరోపణాస్త్రాలను, విమర్శనాస్త్రాలను మాత్రమే నమ్ముకోవడం లేదు. టీవీ చానళ్ల హడావుడి పెరగడంతో బుల్లితెరపై ఆకర్షణీయంగా కనిపించే లక్ష్యంతో ముచ్చటైన ముఖ కవళికల కోసం ‘శస్త్ర’మార్గాన్ని ఆశ్రయించేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. ఇదివరకు ఎక్కువగా సినీతారలు తమ అందచందాల కోసం ప్లాస్టిక్ సర్జరీని ఆశ్రయించేవారు. వారికి పోటీగా రాజకీయ నేతలు సైతం ప్లాస్టిక్ సర్జన్ల వద్ద క్యూ కడుతుండటంతో శస్త్ర వైద్యులకు కాసుల పంట పండుతోంది.
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తేదీలు వెలువడేందుకు కొద్దినెలల ముందే పలువురు నేతలు ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించి, తమ ముఖ కవళికలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ ఎన్నికల సీజన్‌కు ముందు నిపుణులైన ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయించిన వారిలో కుర్ర నేతలతో పాటు వయసు మళ్లిన నేతలూ ఉన్నారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఎన్నికలకు కొద్ది నెలల కిందట ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీ ముంబై వెళ్లి, తన ముఖానికి మెరుగులు దిద్దించుకున్నారు.
ప్రముఖ కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ మోహన్ థామస్ వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన బండ ముక్కును, లావాటి మెడను సరిచేయించుకునేందుకు ఆ ఎంపీ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు ఆయన చెప్పారు. ‘దాదా మాదిరిగా కాదు, నేత మాదిరిగా కనిపించాలనుకుంటున్నాను’ అని ఆయన కోరుకున్నారని తెలిపారు. ముక్కును సరిచేసేందుకు రినోప్లాస్టీ, లావాటి మెడను సన్నగా తీర్చిదిద్దేందుకు లైపోసెక్షన్ చికిత్సలు చేసినట్లు వివరించారు. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళా నేత తన లావాటి నడుమును తగ్గించుకునేందుకు లైపోసెక్షన్ చికిత్స చేయించుకున్నారు.
ముఖంపైన మచ్చలు, పులిపిర్లు, పిగ్మెంటేషన్ వంటి సమస్యల పరిష్కారం కోసం డెర్మటాలజిస్టులను ఆశ్రయించే నేతల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. దక్షిణ ముంబై, నాగపూర్, ముంబై పశ్చిమ శివారు ప్రాంతాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఎన్నికలకు ముందు తన వద్ద ఇలాంటి చికిత్సల కోసం వచ్చారని ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ రేఖా సేథ్ చెప్పారు.
ఇలాంటి చికిత్సల కోసం వస్తున్న వారిలో మహిళా నేతల కంటే పురుష నేతల సంఖ్యే ఎక్కువగా ఉన్నట్లు ఆమె తెలిపారు. కోపిష్టి ముఖాలతో కనిపించే నేతలను ఎవరూ చూడాలనుకోరని డాక్టర్ కల్పేశ్ అనే ప్లాస్టిక్ సర్జన్ వ్యాఖ్యానించారు. ముఖం జేవురించి, ఉబ్బిపోయి కోపిష్టుల్లా కనిపించే నేతలు, శస్త్రచికిత్సల ద్వారా తమ ముఖ కవళికలను సౌమ్యంగా మార్చుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ఇలాంటి సమస్యలతో తన వద్దకు వచ్చిన ఇద్దరు ఎంపీలకు, ఒక స్థానిక మహిళా నేతలకు చికిత్స చేశానని తెలిపారు.
బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ స్థూలకాయాన్ని తగ్గించుకునేందుకు బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ ముఫజల్ లక్డావాలా వద్ద శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆస్పత్రులకు వెళితే, ప్రజలు, మీడియా తమను గుర్తిస్తే ఇబ్బందనే ఉద్దేశంతో వైద్యులనే ఇళ్ల వద్దకు రప్పించుకుంటున్న నేతలూ ఉంటున్నారని డాక్టర్ అప్రతిమ్ గోయల్ చెప్పారు.