ఊ... కొడతారా?ఊహూ... అంటారా? | Other stars who went for liposuction | Sakshi
Sakshi News home page

ఊ... కొడతారా?ఊహూ... అంటారా?

Published Sun, Jun 7 2015 10:26 PM | Last Updated on Sun, Sep 3 2017 3:23 AM

ఊ... కొడతారా?ఊహూ... అంటారా?

ఊ... కొడతారా?ఊహూ... అంటారా?

 దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరం నుంచి చూసేవాళ్లకి సినిమా తారల జీవితం చాలా విలాసవంతంగా అనిపిస్తుంది. కానీ, అందంగా కనిపించడానికి వాళ్లు పడే పాట్లు  అన్నీ ఇన్నీ కావు. బరువు పెరగకుండా కేలరీలు లెక్కపెట్టుకుని మరీ ఆహారం తీసుకుంటారు. ఒంట్లో నిల్వ ఉండే అదనపు కొవ్వుని తగ్గించడానికి, అవసరమైతే లైపో సక్షన్ కూడా చేయించుకుంటుంటారు. కానీ, ఒక్కోసారి లైపో వికటించి, ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇటీవల ఆర్తీ అగర్వాల్ అలా బలైన విషయం తెలిసిందే. భారతీయ తారల్లో లైపో చేయించుకుంటున్న వారిని వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. విదేశీ తారల్లో ఈ చికిత్స చేయించుకున్నవాళ్ల సంఖ్య చాలానే ఉంది. వాళ్లల్లో కొంతమంది గురించి...
 
 అంత అవపరమా?
 గాయని మారియా కేరీ సన్నగానే ఉండేవారు. కానీ, నాలుగేళ్ల క్రితం కవలలకు జన్మనిచ్చిన తర్వాత ఆమె అమాంతంగా బరువు పెరిగారు. ఈ బరువు తగ్గించాలంటే ఇప్పట్లో అయ్యే పని కాదనుకున్నారేమో.. లైపో సక్షన్ చేయించుకోవడానికి నిర్ణయించుకున్నారు. దానివల్ల ప్రమాదం అని కొంతమంది స్నేహితులు వారించినా లెక్క చేయకుండా ఆపరేషన్ టేబుల్ ఎక్కేశారామె. ఫలితంగా తాను అనుకున్నట్లుగా సన్నబడిపోయారు.
 
 నాజూకు నడుము కోసం...
 నటి డెమీ మూర్‌కి చాలామంది అభిమానులు ఉన్నారు. ‘ఇంత స్లిమ్‌గా ఎలా ఉంటుందబ్బా’ అని ప్రేక్షకులు ఆశ్చర్యపోయే రీతిలో ఆమె ఉండేవారు. కానీ, వయసు మీద పడుతున్నకొద్దీ వచ్చే మార్పుల్లో భాగంగా, ఆమె కొంచెం బరువు పెరిగారు. ముఖ్యంగా నడుము, భుజాల దగ్గర కొవ్వు పేరుకుంటున్నట్లుగా అనిపించిందట. అంతే.. లైపో చేయించేసుకున్నారు.
 
 అంతకు మించిన అందం కోసం!
 నటి కిమ్ కర్దాషియాన్ లైపో సక్షన్ చేయించుకోవాల్సినంత బొద్దుగా లేకపోయినా ఈ చికిత్స చేయించుకున్నారనే టాక్ ఉంది. మాజీ భర్త డామన్ థామస్ ఆజ్ఞ మేరకు ఆమె లైపో చేయించుకున్నారనే వార్త కూడా ప్రచారంలో ఉంది. అయితే, శిల్పంలాంటి శరీరాకృతి కోసం ఆమే కావాలని లైపో చేయించుకున్నారన్నది కొంతమంది వాదన. ఏదేమైనా.. కిమ్ లైపో చేయించుకున్నారన్నది నిజం.
 
 ఇంకా హాలీవుడ్‌లో తారల్లో కతీ గ్రిఫ్ఫిన్, హీడీ మోంటాగ్, కైల్ రిచర్డ్స్.. వంటివాళ్లు లైపో సక్షన్ చేయించుకుని సన్నబడ్డారు. ఈ చికిత్స తర్వాత వాళ్లు స్లిమ్‌గా కనిపించినా, మునుపటి కళ లేదని కొంతమంది అంటున్నారు. సహజమైన అందం కోల్పోయారన్నది కూడా కొంతమంది అభిప్రాయం. లైపో కారణంగా ప్లస్సులూ, మైనస్సులూ ఉన్నాయి. ముఖ్యంగా లైపో కారణంగా ఆర్తీ ఆగర్వాల్ బలైన విషయం ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైంది కాబట్టి,  ఇక లైపో చేయించుకోవడానికి తారలు ఊ కొడతారో.. ఊహూ అంటారో...?
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement