liposuction operation
-
ఇద్దరు బిడ్డల తల్లి : ఒకే రోజు ఆరు బ్యూటీ సర్జరీలు.. చివరికి!
ఐశ్వర్య అంత అందంగా కనిపించాలి, ఎత్తుపెరగాలి.. ఆరడుగులు డార్లింగ్‌గా మారిపోవాలి...ఆధునిక యువతలో ఇదో పెద్ద క్రేజ్. ఈ పిచ్చినే కొంతమంది స్వార్థపరులు క్యాష్ చేసుకుంటున్నారు. అందంకోసం ఆరాటపడి ప్రాణాలనే పొగొట్టుకున్న షాకింగ్ సంఘటన ఒకటి చైనాలో చోటు చేసుకుంది. దీంతో ఉన్నదానితో సంతృప్తి పడే కాలం పోయింది. లేని దాని కోసం అర్రులు చాచడం ఒక వేలం వెర్రిగా మారిపోయిందంటన్న నెటిజన్లు కామెంట్లు వైరల్‌గా మారాయి.దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని గుయిగాంగ్లోని గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ 24 గంటల వ్యవధిలో ఆరు కాస్మెటిక్ సర్జరీలు చేసుకుంది. కానీ తన అందాన్ని తనివి తీరా చూసుకోకముందే తనువు చాలించింది. సుమారు రూ. 4.7 లక్షలు ( 40వేల యువాన్లు) అప్పు చేసి మరీ నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌లో చేరింది.. ఒకే రోజు కళ్లు, ముక్కు, ఉదరం కోసం సర్జరీలు చేయించుకుంది. తరువాత ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే లైపోసక్షన్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఆ మహిళ డిశ్చార్జి కాగానే క్లినిక్‌లోని లిఫ్ట్ ముందేఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వైద్యులు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. లైపోసక్షన్ తర్వాత పల్మనరీ ఎంబోలిజం కారణంగా తీవ్రమైన శ్వాసకోశ సమస్య రావడంతో చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఆమెకు ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు.మరోవైపు మహిళ మరణంపై కుటుంబ సభ్యులు తమకు న్యాయం కావాలంటూ క్లినిక్‌పై కేసు వేశారు . అయితే 2 లక్షల యువాన్ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది. అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్లు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీన్ని విచారించిన కోర్టు చివరికి సుమారు 70 లక్షల రూపాయలు (590,000 యువాన్ల ) నష్టపరిహారంచెల్లించాలని ఆసుపత్రిని ఆదేశించింది. పరిస్థితిని సరిగ్గా గమనించకుండా, కొన్ని వైద్యపరమైన తప్పులు చేసిందని న్యాయమూర్తి లి షాన్ వ్యాఖ్యానించారు. తపుడు వాగ్దానాలతో అప్పు చేసి మరీ ఆపరేషన్లు చేయించుకునేలా ప్రేరేపించిందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.2020ల నాటి ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అందంకోసం అతిగా పోతే అనర్థం తప్పదంటూ కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించగా , డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ క్లినిక్‌పై కొందరు, ఒకే రోజులో ఆరు సర్జరీలు? క్లినిక్‌కి ఇంగితజ్ఞానం లేదా? ముఖ్యంగా రక్తం గడ్డకట్టడానికి దారితీసే లైపోసక్షన్‌తో సమస్యల ప్రమాదాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదా? అంటూ మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. (వైరల్ వీడియో: కీరవాణిగారూ.. ఒక్క ఛాన్స్ ప్లీజ్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్)చైనాలో లైపోసక్షన్ ఆపరేషన్లు చాలా సాధారణంగా మారిపోతున్నాయి. అందంగా, స్లిమ్‌గా ఉండాలనే కోరికతో మహిళలు కాస్మొటిక్ సర్జరీలవైపు మొగ్గు చూపుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. మరికొంతమంది తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. -
లైపోసక్షన్ వికటించి స్టార్ సింగర్ కన్నుమూత, విషాదంలో ఫ్యాన్స్
బ్రెజిలియన్ పాప్ స్టార్ డానీ లీ (42) మరణించిన ఘటన విషాదాన్ని నింపింది. లైపోసక్షన్ మెట్రో కథనం రిపోర్ట్ ప్రకారం బ్రెజిల్లో గాయనిగా పాపులర్ అయిన లీ బాడీలోని కొన్ని భాగాల్లో కొవ్వును తొలగించుకునేందకు ఆపరేషన్ చేయించుకుంది. అయితే ఆపరేషన్ తరువాత సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రలో కన్నుమూసింది. ఇది ఊహించని పరిణామమంటూ ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అటు తమ అభిమాన స్టార్ సింగర్ ఆకస్మిక మరణంపై ఫ్యాన్స్ కూడా దిగ్ర్భంతి వ్యక్తం చేశారు. బ్రెజిల్‌లోని పిన్హైస్లో నిర్వహించిన బొడ్డు, వీపుపై లైపోసక్షన్‌తో పాటు రొమ్ములను తగ్గించుకునేందు కూడా ఆపరేషన్ చేయించుకుంది. అయితే పరిస్థితి విషమించడంతో సమీపంలోని మీపంలోని కురిటిబాలోని ఒక ఆసుపత్రికి తరలించినా ఫలితంలేకపోయింది. లీకి భర్త, ఏడేళ్ల కుమార్తె ఉంది. గాయని మృతిపై విచారణ జరుగుతోందని మెట్రో నివేదించింది. అమెజాన్‌లోని అఫువా అనే ద్వీపంలో పుట్టిన లీ సింగర్అయ్యేందుకు చిన్నతనం నుంచీ కృషి చేసింది. 2014లో విడుదలైన ఆమె 'యూ సౌ డా అమెజోనియా' (ఐ యామ్ ఫ్రమ్ ది అమెజాన్) అనే పాటతో గాయనిగా ఆమె ప్రసిద్ధి చెందింది. అయిదేళ్ల వయసునుంచే పాడటం ప్రారంభించిన ఆమె టాలెంట్ షోలతో పేరు తెచ్చుకుంది. ఆ తరువాత సింగింగ్ కరియర్ కోసం 17 సంవత్సరాల వయస్సులో మకాపాకు వెళ్లింది. 'వెమ్ మీ డైజర్', 'ప్రా వోస్ ఫికార్ కోమిగో' 'కైక్' తదితర పాటలో స్టార్ సింగర్‌గా ఎదిగింది. ఆమె చివరి పాట ‘గుయెర్రా డి అమోర్' జనవరి 14న విడుదలైంది.డాని లి, అసలు పేరు, డానియెల్ ఫోన్సెకా మచాడో. View this post on Instagram A post shared by Dani Li (@danili.dl) -
కత్తిగాటు లేకుండా..రక్తపు చుక్క కారకుండా
సాక్షి, హైదరాబాద్: పొట్టపై కత్తిగాటు లేకుండా... రక్తం చిందించకుండా.. కనీసం నొప్పి కూడా తెలియకుండా బరువు తగ్గించే ప్రక్రియను కేర్ ఆస్పత్రి అందుబాటులోకి తెచ్చింది. కొవ్వు కరిగింపు చర్యలో భాగంగా బెరియాట్రిక్ సర్జరీల్లో ఇప్పటి వరకు అనుసరించిన కీహోల్‌కు బదులు.. తాజాగా రోబోటిక్ ఎండోస్కోపిక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, స్లీప్ ఆప్నీయా వంటి సమస్యలతో బాధపడుతున్న స్థూలకాయులకు ఈ పద్ధతి ఓ వరం లాంటిది.బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తొలిరోజే ముగ్గురు బాధితులకు విజయవంతంగా చికిత్స చేయడం విశేషం. ఈ మేరకు శుక్రవారం హోటల్ గోల్కొండలో ఈ అంశంపై ప్రముఖ రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ మోహిత్ బండారి, కేర్ ఫెసిలిటీ చీఫ్ ఆపరేటివ్ ఆఫీసర్ డాక్టర్ రియాజ్ ఖాన్లు విలేకరులకు ఆ వివరాలు వెల్లడించారు. ఆ రెండు చికిత్సలకు భిన్నంగా.. బరువు తగ్గించే చికిత్సలు రెండు రకాలు. ఒకటి లైఫోసక్షన్. దీనిలో సూదుల ద్వారా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును బయటికి లాగేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదంతో కూడినది. రెండోది బెరియాట్రిక్ శస్త్రచికిత్స. ఈ ప్రక్రియలో పొట్టపై మూడు నుంచి నాలుగు చిన్నపాటి రంధ్రాలు చేసి(కీ– హోల్)బెలూన్ తో పెద్దపేగు సైజును తగ్గించే పద్ధతి. ఈ రెండు చికిత్సలూ ప్రమాదకరమైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా శస్త్రచికిత్స అవసరం లేని ‘ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రో ప్లా స్టీ’అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌ల్లో మాత్రమే ఈ తరహా చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. బెరియాట్రిక్, లైఫో సక్షన్కు భిన్నంగా ఈ ఎండోస్కోపిక్ పద్ధతి లో చేస్తారు. అత్యాధునిక కెమెరాతో తయారు చేసిన రోబోటిక్ ఎండోస్కోపిని నోటి ద్వారా పొట్టలోకి పంపించి, పెద్ద పేగు సైజు ను తగ్గించి కుట్లు వేసే ప్రక్రియే ఈ చికిత్స. పొట్ట సైజును 1/4 శాతం తగ్గిస్తారు. తక్కువ ఆహారానికే కడుపు నిండిపోవడం, ఎక్కువ ఆహారం తీసుకోలేక పోవడం వల్ల క్రమంగా బరువు తగ్గుతుంది. ఇలా 25 నుంచి 30 కేజీల వరకు తగ్గుతారు. ఈ తరహా చికిత్సలో కత్తిగాటు లేకపోవడమే కా దు..కనీసం నొప్పి కూడా తెలియదు. ఇన్ఫెక్షన్ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది. బరువు తగ్గింపునకిది శాశ్వత పరిష్కారంగా వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలి రోబోటిక్ బెరియాట్రిక్ సర్జన్ ఆయనే దేశంలో రోబోటిక్ బెరియాట్రిక్ సర్జరీలు నిర్వహించిన తొలి వైద్యుడు డాక్టర్ మోహిత్ బండారే. ఆయన ఇప్పటి వరకు 11 వేలకు పైగా కొవ్వు కరిగింపు చికిత్సలు చేశారు. కేవలం 11 గంటల్లో 25 చికిత్సలు చేసి, లిమ్కాబుక్‌లో చోటు సంపాదించారు. 2012లో 350 కేజీల బరువు ఉన్న ఆసియా మహిళకు ఆయన చికిత్స చేశారు. 2013లో ఆరేళ్ల బాలునికి బెరియాట్రిక్ నిర్వహించి ఖ్యాతి గాంచారు. -
లావు తగ్గే ఆపరేషన్‌కు ఆర్తి అగర్వాల్ బలి
* గుండెపోటుతో అమెరికాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూత * లైపోసక్షన్ ఆపరేషన్ వికటించడం వల్లే మరణించినట్టు అనుమానాలు * కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు న్యూజెర్సీ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్(31) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆర్తి శనివారం అమెరికా న్యూ జెర్సీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. ఆర్తి కొద్దిరోజుల క్రితం లైపోసక్షన్ ఆపరేషన్ (లావు తగ్గే శస్త్ర చికిత్స) చేయించుకున్నారని, అయితే ఆ ఆపరేషన్ వికటించడం వల్లే ఆమె గుం డెపోటుకు గురై మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నువ్వు నాకు నచ్చావ్తో.. 1984 మార్చి 5న న్యూజెర్సీలో అమెరికాలో స్థిరపడిన గుజరాతీ కుటుంబంలో ఆర్తి అగర్వాల్ జన్మించారు. 2001లో సినీ రంగప్రవేశం చేశారు. హిందీ చిత్రం పాగల్పన్లో ఆమె తొలిసారి వెండితెరపై కనిపించారు. అదే ఏడాది ప్రముఖ హీరో వెంకటేష్‌తో కలసి నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఆర్తికి అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌బాబు, తరుణ్, ఉదయ్‌కిరణ్, రవితేజ, సునీల్ తదితరుల సరసన నటించారు. నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, ఇంద్ర, నీ స్నేహం, వసంతం, సంక్రాంతి, నేనున్నాను తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. అతి తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్గా ఎదిగారు. ఆ సమయంలోనే వ్యక్తిగత కారణాలతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కోలుకుని 2006లో సునీల్ కథానాయకుడిగా వచ్చిన అందాల రాముడు చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్తి సుమారు 25 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి సినిమా రణం-2 ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్తి సోదరి అదితి కూడా అల్లు అర్జున్ సరసన గంగోత్రి సినిమాలో నటించింది. ఎన్నో ఎత్తుపల్లాలు..: 2005లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2007 నవంబర్ 21న ఎన్ఆర్ఐ ఉజ్వల్ కుమార్‌ను ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకుంది. తెలుగు సినిమాల్లో మంచిస్థాయిలో ఉన్న ఆర్తి.. ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. కొద్దిరోజులు అమెరికాలో కాపురం చేసిన తర్వాత ఆమె చిత్ర సీమలోకి పునరాగమనం చేశారు. అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సునీల్ సరసన అందాల రాముడులో కథానాయికగా తెరపై కనిిపించారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో బరువు పెరిగిన ఆర్తికి అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అమెరికాలో స్థూలకాయం, శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆర్తి మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘విన్నర్’ మలుపుతిప్పి ఉండేది తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ న్యూజెర్సీ అమ్మాయిపై తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి కూడా పడింది. దీంతో ‘బంపరకన్నాలే’ చిత్రంతో ఆర్తి తమిళ సినీరంగ ప్రవేశం చేశారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో దర్శకుడు సుందర్ సి తన చిత్రం ‘విన్నర్’లో ఆర్తిని హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం నుంచి ఆర్తి అనివార్య కారణాల వల్ల వైదొలిగారు. ఒకవేళ ఆర్తి ‘విన్నర్’లో నటించి ఉంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమె మంచి స్థాయికి అందుకునేవారేమో.