లావు తగ్గే ఆపరేషన్‌కు ఆర్తి అగర్వాల్ బలి
* గుండెపోటుతో అమెరికాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూత
* లైపోసక్షన్ ఆపరేషన్ వికటించడం వల్లే మరణించినట్టు అనుమానాలు
* కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు
న్యూజెర్సీ/హైదరాబాద్: ప్రముఖ సినీ నటి ఆర్తి అగర్వాల్(31) గుండెపోటుతో కన్నుమూశారు. గత కొంతకాలంగా స్థూలకాయం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న ఆర్తి శనివారం అమెరికా న్యూ జెర్సీలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబ సన్నిహితులు వెల్లడించారు. ఆర్తి కొద్దిరోజుల క్రితం లైపోసక్షన్ ఆపరేషన్ (లావు తగ్గే శస్త్ర చికిత్స) చేయించుకున్నారని, అయితే ఆ ఆపరేషన్ వికటించడం వల్లే ఆమె గుం డెపోటుకు గురై మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నువ్వు నాకు నచ్చావ్‌తో..
1984 మార్చి 5న న్యూజెర్సీలో అమెరికాలో స్థిరపడిన గుజరాతీ కుటుంబంలో ఆర్తి అగర్వాల్ జన్మించారు. 2001లో సినీ రంగప్రవేశం చేశారు. హిందీ చిత్రం పాగల్‌పన్‌లో ఆమె తొలిసారి వెండితెరపై కనిపించారు. అదే ఏడాది ప్రముఖ హీరో వెంకటేష్‌తో కలసి నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఆర్తికి అవకాశాలు వెల్లువెత్తాయి. దీంతో ఆమె అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్‌బాబు, తరుణ్, ఉదయ్‌కిరణ్, రవితేజ, సునీల్ తదితరుల సరసన నటించారు.
నువ్వు నాకు నచ్చావ్, నువ్వు లేక నేను లేను, ఇంద్ర, నీ స్నేహం, వసంతం, సంక్రాంతి, నేనున్నాను తదితర చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. అతి తక్కువ సమయంలోనే ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ సమయంలోనే వ్యక్తిగత కారణాలతో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అనంతరం కోలుకుని 2006లో సునీల్ కథానాయకుడిగా వచ్చిన అందాల రాముడు చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆర్తి సుమారు 25 చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన చివరి సినిమా రణం-2 ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆర్తి సోదరి అదితి కూడా అల్లు అర్జున్ సరసన గంగోత్రి సినిమాలో నటించింది.
ఎన్నో ఎత్తుపల్లాలు..: 2005లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రేమ విఫలం కావడం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 2007 నవంబర్ 21న ఎన్‌ఆర్‌ఐ ఉజ్వల్ కుమార్‌ను ఆర్తి అగర్వాల్ వివాహం చేసుకుంది. తెలుగు సినిమాల్లో మంచిస్థాయిలో ఉన్న ఆర్తి.. ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చానీయాంశమైంది. కొద్దిరోజులు అమెరికాలో కాపురం చేసిన తర్వాత ఆమె చిత్ర సీమలోకి పునరాగమనం చేశారు.
అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె సునీల్ సరసన అందాల రాముడులో కథానాయికగా తెరపై కనిిపించారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో నటించినా అవి ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో బరువు పెరిగిన ఆర్తికి అవకాశాలు దూరమయ్యాయి. దీంతో అమెరికాలో స్థూలకాయం, శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా, ఆర్తి మరణవార్త తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
‘విన్నర్’ మలుపుతిప్పి ఉండేది
తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ న్యూజెర్సీ అమ్మాయిపై తమిళ చిత్ర పరిశ్రమ దృష్టి కూడా పడింది. దీంతో ‘బంపరకన్నాలే’ చిత్రంతో ఆర్తి తమిళ సినీరంగ ప్రవేశం చేశారు. ఇది ప్రేక్షకాదరణ పొందడంతో దర్శకుడు సుందర్ సి తన చిత్రం ‘విన్నర్’లో ఆర్తిని హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రం నుంచి ఆర్తి అనివార్య కారణాల వల్ల వైదొలిగారు. ఒకవేళ ఆర్తి ‘విన్నర్’లో నటించి ఉంటే తమిళ చిత్ర పరిశ్రమలోనూ ఆమె మంచి స్థాయికి అందుకునేవారేమో.