
2050కల్లా 57 శాతానికి పెరగనుంది
భారత్‌లో 45 కోట్ల మంది ఊబకాయులు
చైనా, భారత్, అమెరికా సరసన ఆఫ్రికా
న్యూఢిల్లీ: ప్రపంచ జనాభాలో సగానికి పైగా వయోజనులు ఊబకాయులుగా మారిపోయారు! 2050 నాటికి ఇది 57 శాతం దాటనుంది. అంతేగాక పిల్లలు, టీనేజర్లు, యువకుల్లో మూడింట ఒక వంతు ఊబకాయులుగా మారొచ్చని లానెస్‌ట్ జర్నల్ అంచనా వేసింది. 200 పైగా దేశాలకు చెందిన గ్లోబల్ డేటాను విశ్లేషించిన మీదట ప్రచురించిన తాజా అధ్యయనంలో ఈ వివరాలను వెల్లడించింది. దశాబ్ద కాలంలో ముఖ్యంగా అల్పాదాయ దేశాల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీని కట్టడికి ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ)కు చెందిన ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఊబకాయుల సంఖ్య 1990తో పోలిస్తే నేడు రెట్టింపైంది. 2021 నాటికి ప్రపంచ వయోజనుల్లో సగం మంది ఊబకాయులుగా మారిపోయారు. 25 ఏళ్లు, అంతకు పైబడ్డ వారిలో ఏకంగా 100 కోట్ల పురుషులు, 111 కోట్ల మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు.
ఈ ధోరణులు ఇలాగే కొనసాగితే 2050 ప్రపంచవ్యాప్తంగా వయోజనుల్లో ఊబకాయుల సంఖ్య పురుషుల్లో 57.4 శాతానికి, స్త్రీలలో 60.3 శాతానికి పెరగవచ్చు. ఇక 1990 నుంచి 2021 నాటికి పిల్లలు, టీనేజర్లలో ఊబకాయులు 8.8 శాతం నుంచి 18.1 శాతానికి పెరిగారు. 20–25 మధ్య వయసు యువతలో 9.9 నుంచి 20.3 శాతానికి
పెరిగింది.
చైనాలో 62 కోట్లు
ఊబకాయుల సంఖ్య 2050 నాటికి చైనాలో 62.7 కోట్లు, భారత్‌లో 45 కోట్లు, అమెరికాలో 21.4 కోట్లకు చేరనుంది. సబ్ సహారా ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య ఏకంగా 250 శాతానికి పైగా పెరిగి 52.2 కోట్లకు చేరుతుదని అంచనా. నైజీరియా 2021లో 3.66 కోట్ల మంది అధిక బరువుతో ఉండగా 2050 కల్లా 14.1 కోట్లకు చేరనుంది.
సామాజిక వైఫల్యం...
వయోజనుల్లో సగం ఊబకాయులే కావడాన్ని సామా జిక వైఫల్యంగా చూడాలని ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ అన్నారు. యువతలో ఊబకాయం వేగంగా పెరుగుతుండటం ఆందోళనకరమన్నారు. ‘‘కొత్తగా వచ్చిన బరువు తగ్గించే మందుల ప్రభావాన్ని అధ్యయనం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే విపత్తును ఎంతో కొంత నివారించవచ్చు’’అని ఆమె వెల్లడించారు.
ఆరోగ్య వ్యవస్థలకు సవాలు
ఊబకాయం పెరగడం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు సవాలేనంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డోక్ చి్రల్డన్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ జెస్సికా కెర్. ‘‘పిల్లలు, టీనేజర్ల విషయంలో ఇప్పట్నుంచే శ్రద్ధ పెడితే ఊబకాయాన్ని నివారించడం సాధ్యమే. యూరప్, దక్షిణాసియా దేశాల్లో పిల్లలు, టీనేజర్లు అధిక బరువుతో ఉన్నట్టు అధ్యయనంలో తేలింది.
ఉత్తర అమెరికా, ఆస్ట్రలేషియా, ఓషియానియా, ఉత్తర ఆఫ్రికా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కూడా ఊబకాయుల సంఖ్య భారీగా పెరుగుతోంది. టీనేజీ బాలికల్లో ఎక్కువగా ఉంది’’అని చెప్పారు. భావి తరాలు అనారోగ్యం బారిన పడకుండా చూడటం, ఆర్థిక, సామాజిక నష్టాలను నివారించడం తక్షణ కర్తవ్యమని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment