మన్‌హటన్: చైనా ప్రభుత్వం తరఫున అమెరికాలో నడిపే రహస్య పోలీస్‌స్టేషన్ ఒకటి మొట్టమొదటిసారిగా బయటపడింది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో 2022 నుంచి చెన్ జిన్‌పింగ్, లు జియన్‌వాంగ్ అనే వారు చైనా ప్రభుత్వం పబ్లిక్ సెక్యూరిటీ శాఖ తరఫున దీనిని నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదే ఏడాది ఫెడరల్ బ్యూరో అధికారులు దీనిని మూసివేయించారు. చెన్ జిన్‌పింగ్, లు జియాన్ వాంగ్‌లు తమ సెల్‌ఫోన్లలోని చైనా మంత్రిత్వ శాఖ మెసేజీలను పూర్తిగా డిలీట్ చేశారు.
అమెరికా పౌరసత్వమున్న వీరిద్దరినీ గతేడాది ఏప్రిల్‌లో అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18వ తేదీన కోర్టులో వీరిపై విచారణ పూర్తయింది. ఆరోపణలు రుజువని తేలితే వచ్చే ఏడాది వెలువడే తీర్పులో కోర్టు చెన్‌కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది. లుపై విచారణ ఇంకా పూర్తి కాలేదు. కాలిఫోర్నియాలోని ప్రజాస్వామ్య అనుకూల వాదిని గుర్తించేందుకు చైనా ప్రభుత్వానికి సాయం చేయడంతోపాటు, పరారీలో ఉన్న నేరస్తుడిని అమెరికా నుంచి తిరిగి చైనా వెళ్లిపోవాలంటూ ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ దేశస్తులపై నిఘా పెంచి, వారిని తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు చైనాలోని నియంతృత్వ కమ్యూనిస్ట్ ప్రభుత్వం దాదాపు 53 దేశాల్లో 100కు పైగా ఇటువంటి పోలీస్‌స్టేషన్లను నిర్వహిస్తోందని హక్కుల సంస్థలు ఆరోపిస్తున్న వేళ ఈ వ్యవహారం బయటపడటం గమనార్హం. అయితే, ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. విదేశాల్లోని తమ దేశస్తులకు పరిపాలనా సేవలను అందించే సర్వీస్ స్టేషన్లే తప్ప, ఇవి పోలీస్‌స్టేషన్లు కావని చెబుతోంది. మన్‌హటన్‌లోని చైనాటౌన్‌లో తాజాగా బయటపడిన పోలీస్ స్టేషన్ రామెన్ మాల్‌లోని ఓ ఫోర్ మొత్తం ఆక్రమించింది. ఇందులో చైనీయులకు పౌరసత్వ పొడిగింపు సేవలను అందిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, ఇక్కడి ప్రజాస్వామ్య అనుకూల చైనీయులను గుర్తించేందుకే వాడుతున్నట్లు అమెరికా న్యా య శాఖ ఆరోపిస్తోంది.
చదవండి: పాకిస్తాన్‌కు షాకిచ్చిన అమెరికా..
ఏమాత్రం సహించం
‘ఈ అప్రకటిత విదేశీ పోలీసు స్టేషన్ అమెరికా సార్వభౌమాధికారానికి అవమానం, ప్రమాదకరం. దీనిని ఏమాత్రం సహించం’అని ఆ శాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ మాథ్యూ ఓల్సెన్ స్పష్టం చేశారు. గతేడాది సెప్టెంబర్‌లో న్యూ యార్క్ గవర్నర్ కార్యాలయంలో పనిచేసే మాజీ ఉద్యోగిని లిండా సన్ చైనా ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలా అధికారం దుర్వినియోగానికి పాల్పడినట్లు గుర్తించారు. అందుకామె ప్రతిఫలాలు అందుకున్నారని తేలింది. గతేడాది చైనా పబ్లిక్ సెక్యూరిటీ శాఖకు సాయం అందిస్తున్నట్లుగా 34 మంది అధికారులను గుర్తించి, కేసులు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment