ఆర్థిక వృద్ధికి మద్దతు
ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పాత్ర
ముంబై: గృహ పొదుపులు ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి అవసరాలకు మద్దతుగా నిలుస్తున్నాయని (వృద్ధికి) ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మేకేల్ దేబబ్రత పాత్ర అన్నారు. వెలుపలి నిధులను కేవలం అదనపు మద్దతుగా పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘‘గృహాలకు సంబంధించి నికర ఆర్థిక పొదుపులు 2020–21 నుంచి చూస్తే సగానికి తగ్గాయి. కరోనా విపత్తు సమయంలో వివేకంతో దాచుకున్న పొదుపులు ఇల్లు వంటి భౌతిక ఆస్తుల్లోకి మళ్లుతుండడమే దీనికి కారణం.
రానున్న రోజుల్లో పెరిగే ఆదాయాలతో గృహ పొదుపులు తిరిగి ఆర్థిక సాధనాల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2011–17 నాటికి జీడీపీలో గృహ ఆర్థిక పెట్టుబడులు 10.6 శాతంగా ఉంటే, 2017–23 నాటికి 11.5 శాతానికి చేరాయి’’అని పాత్ర వివరించారు. కరోనా అనంతరం భౌతిక పొదుపులు సైతం జీడీపీలో 12 శాతానికి పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయన్నారు.
ప్రైవేటు కార్పొరేట్ రంగం నికర రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్టు చెప్పారు. మూలధన వ్యయాల సైకిల్ పుంజుకున్నందున కార్పొరేట్ రంగం రుణాలు ఇకమీదట పెరగొచ్చని అంచనా వేశారు. ఈ విధమైన రుణ అవసరాలను గృహ పొదుపులతోపాటు, వెలుపలి వనరులు తీరుస్తాయన్నారు. ఆర్థిక ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ విదేశీ నిధులను సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, కరెన్సీ విషయంలో ఆర్‌బీఐ పాత్రను ఇదే సమావేశంలో భాగంగా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మెచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment