RBI Deputy Governor
-
ఆర్థిక సంస్థల స్థాయి పెరిగితేనే ‘అభివృద్ధి చెందిన దేశం’
ముంబై: భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే ఆకాంక్షను సాధించాలంటే ఆర్థిక సంస్థల స్థాయి, పరిమాణం గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర రావు అన్నారు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 90వ వార్షికోత్సవాన్ని పురష్కరించుకుని ఇక్కడ నిర్వహించిన ‘గ్లోబల్ సౌత్‌లోని సెంట్రల్ బ్యాంక్‌ల ఉన్నత–స్థాయి విధాన సదస్సు’లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు...గతంలో ప్రారంభించిన నియంత్రణా విధానాలు, తీసుకున్న విధానపరమైన చర్యలు భారత్‌లో పటిష్టమైన. సవాళ్లను తట్టుకోగల ఆర్థిక వ్యవస్థ, ఆర్థికాభివృద్ధికి దారితీశాయి. అనేక సంక్షోభాలను ఎదుర్కొన్న భారత్ ఎకానమీని స్థిరపరచాయి. అయితే ఎకానమీ మరింత పురోభివృద్ధికి ఫైనాన్షియల్ సంస్థల పరిమాణం మరింత పెరగాలి. దృఢమైన పాలన వ్యవస్థ, ప్రభావవంతమైన రిస్క్ మేనేజ్మెంట్ ఈ దిశలో పురోగతికి దారితీసే అంశాలు. బ్యాంకులతో పాటు సంస్థలుసైతం తమ పెరుగుతున్న నిధులు అవసరాలను నెరవేర్చుకోడానికి క్యాపిటల్ మార్కెట్లను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్బీఐకి ఉన్నంత విస్తృత ఆధారిత ప్రపంచంలో చాలా సెంట్రల్ బ్యాంకులు లేవు. ఎకానమీ పురోభివృద్ధి, ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తోంది. ఆర్బీఐ 75 సంవత్సరాల అనుభవం.. దేశ అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చడంతోపాటు, ఎకానమీకి మద్దతు ఇవ్వగల బలమైన ఆర్థిక రంగానికి పునాదిని నిర్మించింది. -
చిన్న బ్యాంకుల్లో దారుణంగా వడ్డీ రేట్లు
ముంబై: కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు (ఎస్ఎఫ్బీలు) విపరీత పోకడలు పోతూ.. అట్టడుగు వర్గాలకు చెందిన రుణ గ్రహీతల నుంచి భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ముందస్తుగానే కొన్ని వాయిదాల మొత్తాన్ని రుణ గ్రహీతల నుంచి తీసుకుని, వాటిని రుణంలో సర్దుబాటు చేయడం లేదన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.వ్యాపార వృద్ధి కోసం స్థిరమైన, బాధ్యతాయుత వ్యాపార విధానాలను పాటించాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు సూచించారు. ఎస్ఎఫ్బీలపై బెంగళూరులో ఆర్బీఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వామినాథన్ మాట్లాడారు. కొన్ని ఎస్‌ఎఫ్‌బీల బోర్డులో కనీసం ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లను కూడా లేకపోవడాన్ని ఆర్బీఐ గుర్తించినట్టు చెప్పారు. కేవలం ఒకే ఒక్క పూర్తి కాల డైరెక్టర్ కలిగి ఉండడం కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీయవచ్చంటూ.. మరింత మంది హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకంపై దృష్టి పెట్టాలని సూచించారు. డిపాజిట్ల విషయంలో జాగ్రత్త.. అధిక వ్యయంతో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఆధారపడడం లేదంటే కేవలం కొన్ని సంస్థల బల్క్ డిపాజిట్లపై ఆధారపడడం పట్ల ఎస్ఎఫ్బీలను స్వామినాథన్ హెచ్చరించారు. ఇలా ఏదో ఒక విభాగంలో ఎక్కువ డిపాజిట్లు తీసుకోవడం పట్ల ఉండే రిస్‌్కను మదింపు వేయాలని సూచించారు.సామాజిక బాధ్యత.. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సేవల విస్తరణకు, యువ పారిశ్రామికవేత్తల సాకారానానికి ఎస్బీఎఫ్లు కీలక పాత్ర పోషించాలని స్వామినాథన్ సూచించారు. సమ్మిళిత వృద్ధి దేశ ఆర్థిక పురోగతికి ఎంతో అవసరమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందుబాటు ధరలకే రుణాలను కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందించేందుకు కృషి చేయాలని సూచించారు. -
గృహ పొదుపులే ఆదుకుంటాయ్
ముంబై: గృహ పొదుపులు ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి అవసరాలకు మద్దతుగా నిలుస్తున్నాయని (వృద్ధికి) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మేకేల్ దేబబ్రత పాత్ర అన్నారు. వెలుపలి నిధులను కేవలం అదనపు మద్దతుగా పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘‘గృహాలకు సంబంధించి నికర ఆర్థిక పొదుపులు 2020–21 నుంచి చూస్తే సగానికి తగ్గాయి. కరోనా విపత్తు సమయంలో వివేకంతో దాచుకున్న పొదుపులు ఇల్లు వంటి భౌతిక ఆస్తుల్లోకి మళ్లుతుండడమే దీనికి కారణం. రానున్న రోజుల్లో పెరిగే ఆదాయాలతో గృహ పొదుపులు తిరిగి ఆర్థిక సాధనాల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2011–17 నాటికి జీడీపీలో గృహ ఆర్థిక పెట్టుబడులు 10.6 శాతంగా ఉంటే, 2017–23 నాటికి 11.5 శాతానికి చేరాయి’’అని పాత్ర వివరించారు. కరోనా అనంతరం భౌతిక పొదుపులు సైతం జీడీపీలో 12 శాతానికి పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయన్నారు. ప్రైవేటు కార్పొరేట్ రంగం నికర రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్టు చెప్పారు. మూలధన వ్యయాల సైకిల్ పుంజుకున్నందున కార్పొరేట్ రంగం రుణాలు ఇకమీదట పెరగొచ్చని అంచనా వేశారు. ఈ విధమైన రుణ అవసరాలను గృహ పొదుపులతోపాటు, వెలుపలి వనరులు తీరుస్తాయన్నారు. ఆర్థిక ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ విదేశీ నిధులను సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, కరెన్సీ విషయంలో ఆర్బీఐ పాత్రను ఇదే సమావేశంలో భాగంగా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మెచ్చుకున్నారు. -
ఎంఎస్ఎంఈలకు దన్నుగా నిలవండి
ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)పై మరింత సానుకూల ధోరణితో వ్యవహరించాలని ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ సూచించారు. ఎకానమీలో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమకు మద్దతుగా నిల్చే క్రమంలో రుణాల పునర్వ్యవస్థీకరణ, గ్రేస్ పీరియడ్ ఇవ్వడం తదితర చర్యల రూపంలో తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.విదేశీ మారక డీలర్ల అసోసియేషన్ (ఫెడాయ్) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామినాథన్ ఈ విషయాలు తెలిపారు. తక్కువ వడ్డీలకు రుణాలు దొరక్కపోవడం, చెల్లింపుల్లో జాప్యాలు, మౌలికసదుపాయాలపరమైన సమస్యలు మొదలైన అనేక సవాళ్లను ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిన్న సంస్థలు ఎకానమీకి వెన్నెముకలా మాత్రమే కాకుండా వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనకు చోదకాలుగా కూడా ఉంటున్నాయని స్వామినాథన్ వివరించారు.అయితే, ఈ సంస్థలు వృద్ధిలోకి రావాలంటే ఆర్థిక రంగం వినూత్న పరిష్కారమార్గాలతో వాటికి తగు మద్దతు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్దిష్ట మద్దతు కల్పించడం ద్వారా ఎంఎస్ఎంఈ ఎగుమతులు పెరగడంలో ఆర్థిక రంగం కీలక పాత్ర పోషించగలదని స్వామినాథన్ వివరించారు.ఫైనాన్స్, ఫ్యాక్టరింగ్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సంప్రదాయ ప్రోడక్టులతో పాటు ఎగుమతులకు రుణ బీమా, కరెన్సీ రిస్క్ హెడ్జింగ్ సొల్యూషన్స్ వంటివి ఆఫర్ చేయొచ్చని పేర్కొన్నారు. చెల్లింపులపరమైన డిఫాల్ట్‌లు, కరెన్సీ హెచ్చుతగ్గుల సవాళ్ల నుంచి ఇలాంటివి రక్షణ కల్పించడంతో పాటు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లలో విస్తరించేందుకు ఎంఎస్ఎంఈలకు ఆత్మవిశ్వాసం ఇవ్వగలవని స్వామినాథన్ పేర్కొన్నారు. -
Michael D Patra: 2031 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
ముంబై: భారత్ 2031 నాటికి ప్రంపచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డి పాత్ర పేర్కొన్నారు. 2060 నాటికి ప్రంపచ నంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. కాకపోతే ఈ దిశగా కొన్ని సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. కారి్మక ఉత్పాదకత, మౌలిక వసతులు, జీడీపీలో తయారీ రంగం వాటాను పెంచడం, ఆర్థిక వ్యవస్థను పర్యావరణం అనుకూలంగా మార్చడం తదితర సవాళ్లను ప్రస్తావించారు. ముస్సోరిలో ఐఏఎస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో భాగంగా పాత్ర మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏటా 9.6 శాతం చొప్పున దశాబ్ద కాలం పాటు వృద్ధిని సాధిస్తే దిగువ మధ్యాదాయ ఉచ్చు నుంచి బయట పడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించొచ్చని చెప్పారు. ‘‘4516–14005 డాలర్ల తలసరి ఆదాయ స్థాయి అన్నది మధ్యాదాయ దేశం హోదాకు సంబంధించినది. ఇది దాటితేనే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ హోదాకు చేరుకుంటాం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపునకు తలసరి ఆదాయ పరిమితి 34,000 డాలర్లకు చేరుకోవచ్చు’’అని పాత్ర పేర్కొన్నారు. కరెన్సీల విలువలు అస్థిరంగా ఉన్నాయంటూ.. దేశాల మధ్య పోలికకు ఇవి తగినవి కాదని పాత్ర అభిప్రాయపడ్డారు. దీనికి ప్రత్యామ్నాయ కొలమానం ‘కొనుగోలు శక్తి సమానత’ (పీపీపీ) అని చెప్పారు. ఆర్థిక సహాకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) పీపీపీ ప్రకారం భారత్ 2048 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నది చెప్పడం గమనార్హం. -
ఏఐ ప్రయోజనాలకు మద్దతుగా నిలవాలి
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) ప్రయోజనాలను వినియోగించుకోవడానికి వీలుగా నియంత్రణపరమైన కార్యాచరణ మద్దతు అవసరమని, అదే సమయంలో ఆర్థిక వ్యవస్థపై దీని దు్రష్పభావాలను దృష్టిలో పెట్టుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వరరావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ వార్షిక సదస్సుల్లో భాగంగా ఆయన మాట్లాడారు. ఏఐని ప్రతిపాదించే వారు సైతం ఇది భవిష్యత్తును మార్చేదిగా భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘పలు బ్యంక్‌లు, నాన్ బ్యాంక్‌లు ఏఐతో ప్రయోగాలు చేస్తుండడాన్ని చూస్తున్నాం. కాకపోతే ఇదంతా బ్యాక్ ఆఫీస్ పనులకు సంబంధించే ఎక్కువగా ఉంటోంది’’అని చెప్పారు. నిబంధనల అమలుకు సంబంధించి, చెల్లింపులు లేదా లావాదేవీల్లో మనీలాండరింగ్ ప్రయత్నాలను గుర్తించేందుకు ఏఐని కొన్ని బ్యాంక్‌లు అమల్లో పెట్టినట్టు తెలిపారు. రుణ వితరణ నిర్ణయాలు, కస్టమర్ గుర్తింపునకు సంబంధించి కూడా కొనఇన సంస్థలు ఏఐ సొల్యూషన్లను వినియోగిస్తున్నట్టు రాజేశ్వరరావు చెప్పారు. మార్పు స్వభావం, సామర్థ్యాల రీత్యా జెనరేటివ్ ఏఐ ఉత్పాదకత, ఉద్యోగులు, ఆదాయం పంపిణీపై బలమైన ప్రభావం చూపించగలదన్నారు. ఆర్థిక వ్యవస్థ, సమాజం, ఆదాయం పెంపు, మళ్లీ మళ్లీ చేయాల్సిన పనుల ఆటోమేషన్‌పై ఏఐ చూపించే ప్రభావాన్ని సైతం పేర్కొన్నారు. అదే సమయంలో ఏఐ నిరుద్యోగాన్ని పెంచుతుందన్న ఆందోళనలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఐటీ రంగం నుంచి ఈ తరహా ఆందోళనలు వస్తున్నాయంటూ, దీనిపై చర్చకు ఇప్పట్లో ముగింపు రాకపోవచ్చన్నారు. -
2027 నాటికి మూడో స్థానానికి భారత్
ముంబై: భారత్ 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డీ పాత్ర అంచనా వేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాత్రా ప్రసంగించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం తూర్పు ఆసియావైపు మళ్లుతుందన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో ఈ ప్రాంతం మూడింట రెండొంతులు ఆక్రమించిందని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ 16.66 శాతం వాటా పోషించినట్టు చెప్పారు. ‘‘మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేట్ల పరంగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో 140 కోట్లతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్. 28 ఏళ్లలోపు యువ జనాభా ఎక్కువ. భారత పురోగతికి ఇతర ముఖ్య ప్రేరణ ఏమిటంటే ఫైనాన్షియల్ రంగం నాణ్యత పెరగడం’’అని పాత్రా వివరించారు. భారత్ వృద్ధి ఆకాంక్షలకు కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు వీలుగా ఆధునికంగా, సమర్థవంతంగా, బలంగా పనిచేసే ఆర్థిక రంగం అవసరమని అభిప్రాయపడ్డారు. -
కస్టమర్‌కు ప్రాధాన్యం ఇవ్వండి
ముంబై: వినియోగదారు ఆధారిత ప్రాధాన్య విధానాన్ని అనుసరించాలని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలకు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ జే స్వామినాథన్ సూచించారు. తద్వారా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని బలోపేతం చేయవచ్చన్నారు. బ్యాంకుల కస్టమర్ సరీ్వస్ ఇన్‌చార్జ్‌లు, ఎండీ, ఈడీ తదితర ఉన్నతాధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కస్టమర్ల ఫిర్యాదులను కచి్చతంగా పరిష్కరించడం, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని క్రమబదీ్ధకరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించేందుకు, మోసాల నివారణ, నష్టాలను తగ్గించుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చ జరిగినట్టు ఆర్బీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ పట్ల నమ్మకం, విశ్వాసాన్ని పెంచడంతో కస్టమర్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా స్వామినాథన్ పేర్కొన్నారు. కస్టమర్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులకు అసలు మూల కారణాలు, స్వీకరించిన అధికారే నేరుగా పరిష్కరించడం తదితర ఐదు అంశాలపై దృష్టి పెట్టాలని కోరారు. -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
కొత్త సాంకేతిక సాధనాలను అందిపుచ్చుకోండి
ముంబై: ఆర్థిక రంగానికి సంబంధించిన టెక్నాలజీలు శరవేగంగా మారిపోతున్న నేపథ్యంలో కొత్త సాంకేతిక సాధనాల గురించి బ్యాంకింగ్ పర్యవేక్షకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ ముకేశ్ జైన్ సూచించారు. తద్వారా ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగేలా పర్యవేక్షణ మెళకువలను మెరుగుపర్చుకోవాలని, రిస్క్ నిర్వహణ సామరŠాధ్యలను పటిష్టం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఆసియా–పసిఫిక్ దేశాల 25వ సీసెన్–ఎఫ్ఎస్ఐ సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైన్ ఈ విషయాలు తెలిపారు. ఇటీవల కొన్ని విదేశీ బ్యాంకులు విఫలమైన ఉదంతాలు బైటపడిన నేపథ్యంలో బ్యాంకింగ్ సూపర్వైజర్ల పని మరింత కఠినతరంగా మారిందని ఆయన పేర్కొన్నారు. కొత్త సవాళ్లు ఎదురవుతుండటంతో వారు ఇటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం, అటు నైతికంగా వ్యవహరించడం మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉందని జైన్ చెప్పారు. వివేకవంతమైన నిబంధనలను అమలు చేయడం, సమర్ధమంతమైన రిస్కు ఆధారిత పర్యవేక్షణ విధానం పాటించడం, పారదర్శకతను ప్రోత్సహించడం, సకాలంలో జోక్యం చేసుకోవడం, స్వతంత్రత.. జవాబుదారీతనంతో వ్యవహరించడం ద్వారా దీన్ని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీజతో అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ పలు రిస్కులు కూడా పొంచి ఉంటాయని జైన్ వివరించారు. కాబట్టి సాంకేతికతను ఉపయోగించుకోవడంలో బ్యాంకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. -
RBI Bulletin: వృద్ధి నెమ్మదించదు..
ముంబై: ఆర్థిక మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ మందగించదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బులెటిన్‌లో ప్రచురించిన ఒక ఆర్టికల్ స్పష్టం చేసింది. భారత్‌లో పలు రంగాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి ఫలితాలను సాధించాయని పేర్కొన్న ఆర్టికల్, ఇదే మంచి ఫలితాలు మున్ముందూ కొనసాగుతాయన్న ధీమాను వ్యక్తం చేసింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రచించిన ఈ కథనంలోని అభిప్రాయాలు ఆర్బీఐగా పరిగణించడానికి వీలు లేదని కూడా బులెటిన్ పేర్కొనడం గమనార్హం. ► గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అనిశ్చితి కారణంగా 2023లో ప్రపంచ వృద్ధి మందగించడానికి లేదా మాంద్యంలోకి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయినప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్టంగా కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుండి స్థిరమైన వృద్ధి ధోరణి ఊపందుకోవడం దీనికి కారణం. తొలి అంచనాలకన్నా ఎకానమీ వృద్ధి బాటన పయనిస్తోంది. మహమ్మారి తీవ్రత నుంచి సమర్థవంతమైన రీతిలో బయట పడింది. ► ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల్లో మనం ఫలితాలను వార్షికంగా సమీక్షించుకుంటే వృద్ధి ధోరణి కనబడదు. బేస్ ఎఫెక్ట్ ఇక్కడ ప్రధానంగా శాసిస్తుంది. త్రైమాసికంగా ఈ మదింపు జరపాల్సి ఉంటుంది. ► కొత్త వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం (ఎస్టీఏఆర్టీ) నుండి రష్యా తన భాగస్వామ్యాన్ని సస్పెండ్ చేయడం, వడ్డీరేట్లకు సంబంధించి కఠిన వైఖరి కొనసాగుతుందని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) నుంచి వచ్చిన సంకేతాలు, అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ భారీ పెరుగుదల వంటి అంశాలు భారత్ మార్కెట్ల సానుకూల వైఖరిని ఫిబ్రవరి 2023 ద్వితీయార్థంలో తగ్గించాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ ఫిబ్రవరిలో తన తొలి లాభాలను వదులుకొని మొత్తంగా ఒక శాతం క్షీణించింది. మార్చి తొలినాళ్లలో తిరిగి కొంత కోలుకుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండడం దీనికి ఒక కారణం. అయితే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభ వాతావరణం దేశీయ ఈక్విటీలపై తిరిగి ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. -
డిజిటల్ లెండింగ్ నిబంధనలు..వినియోగ హక్కుల పరిరక్షణ కోసమే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు. ఇండస్ట్రీ వేదిక అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, థర్డ్ పార్టీ జోక్యం, అక్రమాలు డేటా గోప్యతలను ఉల్లంఘించడం, రికవరీ పద్దతుల్లో తగిన విధానాలు పాటించకపోవడం, అధిక వడ్డీ వసూళ్ల వంటి పరిస్థితుల్లో ఆర్బీఐ డిజిటల్ లెండింగ్ నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత ఆగస్టు 10న డిజిటల్ రుణ నిబంధనలను ఆర్బీఐ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లోగా వాటిని అమలు చేయాలని పరిశ్రమను గత వారం కోరింది. ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆందోళన ఫిన్‌టెక్ పరిశ్రమలోని కొన్ని సంస్థలు– రుణాలు ఇవ్వడంపై నిబంధనలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలి. రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపించకపోతే.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. -
బ్యాంకింగ్‌లో పాలనా ప్రమాణాలు పెరగాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో పాలనా ప్రమణాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ పేర్కొన్నారు. ఒక ఆంగ్లపత్రిక నిర్వహించన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాలనా ప్రమాణాల పెంపువల్ల ప్రజల్లో బ్యాంకింగ్ పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఏదైనా సంస్థకు మూలస్తంభం వంటిదన్నారు. ఇది బ్యాంకులకు భిన్నమైన గుర్తింపును, ప్రాముఖ్యతను ఇస్తుందని అన్నారు. బ్యాంకింగ్ సేవల పరంగా ప్రత్యేక సేవా లక్షణాలను కలిగివుందన్నారు. దీనితోపాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉత్ప్రేరకాలుగా బ్యాంకులు పనిచేస్తాయని అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. ఇటువంటి ప్రత్యేక లక్షణాల వల్లే ఎటువంటి హామీ లేకుండానే భారీ ఎత్తున డిపాజిట్లను బ్యాంకులు సమీకరించగలుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల్లో పాలనా సంస్కరణలు కీలకంగా ఉన్నాయన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ నేపథ్యంలో సైబర్ భద్రత అనేది కీలక పర్యవేక్షక అంశంగా మారిందన్నారు. ఈ విషయంలో ఆందోళనలను పరిష్కరించడానికి, వివిధ ప్రమాద సూచికలను ఉపయోగించి బ్యాంకులలో సైబర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ ఒక నమూనా ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసిందని తెలిపారు. ‘‘ఒక ఆర్థిక సంస్థ కార్యకలాపాలు, దాని పాలనా ప్రమాణాలు, వ్యాపార నమూనా, ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం, ఈ విషయంలో ఇచ్చే హామీ వంటి అంశాలు... దీర్ఘకాలంలో ఆ సంస్థ ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది‘ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. -
Cryptocurrency: ప్రత్యేక ఆస్తిగా క్రిప్టో కరెన్సీ !
న్యూఢిల్లీ: క్రిప్టోలు కరెన్సీ కాదని.. అదే సమయంలో వీటిని ఒక ప్రత్యేక అసెట్‌గా (ఒక ఆస్తి/పెట్టుబడి సాధనం) గుర్తించి, నియంత్రించాలన్న అభిప్రాయాన్ని మాజీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ వ్యక్తం చేశారు. వర్చువల్ కరెన్సీల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను సమర్థవంతంగా నియంత్రించేందుకు మార్గంగా ఆయన దీన్ని ప్రస్తావించారు. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. కరెన్సీ అంటే దానికి చట్టబద్ధత ఉంటుందని.. కనుక క్రిప్టోలు కరెన్సీ కాదన్న విషయాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నట్టు గాంధీ చెప్పారు. క్రిప్టోలను ఒక ఆస్తిగా పరిగణించాలని కానీ.. చెల్లింపుల సాధనం, కరెన్సీ, ఆర్థిక సాధనంగా పరిగణించకూడదన్న సాధారణ అంగీకారం విధాన నిర్ణేతల్లో ఉన్నట్టు తెలిపారు. ఎందుకంటే క్రిప్టోలను జారీ చేసే వ్యక్తుల కచ్చితమైన గుర్తింపు లేదన్నారు. ‘‘కనుక దీన్ని ఒక ఆస్తిగా అర్థం చేసుకుని, ఆమోదించేట్టు అయితే.. నియంత్రించడం సులభం అవుతుంది’’ అని గాంధీ చెప్పారు. ప్రభుత్వాల నియంత్రణల పరిధిలో లేకపోతే క్రిప్టోలు నేరపూరిత కార్యకలాపాలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉందన్నారు. కొన్ని సంఘటనలు దీన్ని సూచిస్తున్నాయన్నారు. చదవండి: Cryptocurrency: క్రిప్టోకరెన్సీ దెబ్బకు వీటి ధరలు భారీగా పెరగనున్నాయా..! -
క్రిప్టోకరెన్సీపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: క్రిప్టోకరెన్సీ (బిల్లు)పై కేబినెట్ నోట్ సిద్దమైందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. బిల్లుకు క్యాబినెట్ ఆమోదం గురించి తాను ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిప్టోపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలో ఒక మంత్రిత్వ స్థాయి కమిటీ ఇప్పటికే దీనిపై తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జారీచేసే ఏదైనా వర్చువల్ కరెన్సీ మినహా అన్ని ప్రైవేటు క్రిప్టోకరెన్సీలనూ భారత్‌లో నిషేధించాలని కమిటీ సిఫారసు చేసింది. కాగా,గతంలో ఓ వర్చువల్ కార్యక్రమంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ మాట్లాడుతూ.. త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోంది. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తుండగా.. పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం వినియోగిస్తున్నాయి. చదవండి : ఇకపై వాట్సాప్‌లో మాటలే కాదు..మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు -
బిట్ కాయిన్స్‌ను తలదన్నేలా, ఇండియాలో డిజిటల్ కరెన్సీ
న్యూఢిల్లీ: త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్బీఐ పనిచేస్తోందని.. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చన్నారు. ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీబీడీసీ ఫలించే దశలో ఉందంటూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ప్రారంభించినట్టు చెప్పారు. సౌర్వభౌమ మద్దతు లేని పలు వర్చువల్ కరెన్సీల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సీబీడీసీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అత్యున్నతస్థాయి అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. విధానాలు, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన తర్వాత సీబీడీసీని డిజిటల్ రూపీగా ప్రవేశపెట్టే విషయమై సిఫారసులు, సూచనలను ఈ కమిటీ తెలియజేయనుంది. -
ఇక ముద్రా ‘మొండి’ భారం..!
ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ‘ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం నుంచి బైటపడి ఉండవచ్చు. అయితే, ఈ రుణాల్లో మొండిబాకీలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించేదిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే రుణాలు తీసుకోబోయే వారి చెల్లింపు సామర్ధ్యాలను బ్యాంకులు మరింత మెరుగ్గా మదింపు చేయాలి. సదరు ఖాతాలను చివరిదాకా పరిశీలిస్తూనే ఉండాలి‘ అని సూక్ష్మ రుణాలపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంత సులువుగా అప్పు దొరకని చిన్న వ్యాపార సంస్థలకు .. రుణ లభ్యత పెరిగేలా చూసేందుకు 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముద్రా స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, స్కీమ్ ప్రారంభించిన ఏడాదిలోనే .. ముద్రా రుణాల్లో మొండి బాకీల సమస్య గురించి అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని తోసిపుచ్చారు. ఈ ఏడాది జూలై నాటి గణాంకాల ప్రకారం ముద్రా స్కీమ్ కింద ఇచ్చిన రుణాలు రూ. 3.21 లక్షల కోట్లకు చే రాయి. ఇందులో మొండి బాకీలు 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో 2.52 శాతం నుంచి 2.68 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది జూన్ దాకా మొత్తం 19 కోట్ల రుణాలు మంజూరు కాగా .. సుమారు 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు సమాచార హక్కు చట్టం కింద బైటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,277 కోట్లుగా ఉన్న మొండి బాకీలు ఏకంగా 126 శాతం ఎగిసి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,481 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జైన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎకానమీపై జీఎస్టీ దెబ్బ.. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానంతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని జైన్ చెప్పారు. డిజిటల్ సాంకేతికత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి.. చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఎంఎస్ఎంఈలకు రుణాలపై అధిక వడ్డీ భారం తప్పుతుందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు.. ప్రధానంగా డిజిటల్ ఫైనాన్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని.. అదే సమయంలో డేటా భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎం.కె. జైన్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఐడీబీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కె.జైన్‌ను ఎస్.ఎస్.ముంద్రా స్థానంలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమించింది. ముంద్రా మూడేళ్ల పదవీ కాలం గతేడాది జూలైలో ముగిసింది. ‘బ్యాంకింగ్‌లో మంచి అనుభవమున్న, ఐడీబీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో మహేశ్ కుమార్ జైన్‌ను ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈయన పదవీ కాలం మూడేళ్లు’ అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ట్వీట్ చేశారు. జైన్‌కు బ్యాంకింగ్ రంగంలో 30 ఏళ్ల అనుభవముంది. ఈయన 2017 మార్చి నుంచి ఐడీబీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికన్నా ముందు ఇండియన్ బ్యాంక్ ఎండీగా పనిచేశారు. పలు బ్యాంకింగ్ రంగ ప్యానెల్స్‌లో కూడా సభ్యుడిగా కూడా వ్యవహరించారు. ఆర్బీఐలో నలుగురు డిప్యూటీ గవర్నర్లున్నారు. విరాల్ వి ఆచార్య, ఎన్.ఎస్.విశ్వనాథన్, బి.పి.కనుంగోతో తాజాగా జైన్ జత కలిశారు. డిప్యూటీ గవర్నర్‌కు అలవెన్సులు కాకుండా నెలకు రూ.2.25 లక్షల వేతనం ఉంటుంది. -
కొత్త నోట్లు దాచుకోవద్దు: ఆర్బీఐ
ముంబై: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన నోట్ల కష్టాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) తెలిపింది. నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నెల రోజుల వ్యవధిలో 4 లక్షల 61 వేల కోట్ల విలువ చేసే నోట్లు బ్యాంకులు, ఏటీఎంల ద్వారా పంపిణీ చేశామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. ఇందులో 1.70 లక్షల కోట్ల రూపాయల విలువ చేసే రూ. 2 వేల నోట్లు, కొత్త రూ. 500 నోట్లు ఉన్నాయని చెప్పారు. మిగతా మొత్తానికి చిన్న నోట్లు పంపించామన్నారు. కొత్త నోట్లను దాచుకోవద్దని, చెలామణి చేయాలని ప్రజలకు సూచించారు. డిసెంబర్ 10 వరకు బ్యాంకుల్లో రూ.12 లక్షల 44 వేల కోట్ల విలువైన పాత రూ.500, వెయ్యి రూపాయల నోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ఇవన్నీ తమ వద్దకు వచ్చాయని చెప్పారు. పాత పెద్ద నోట్ల మార్పిడి వ్యవహారాల్లో పలు బ్యాంకుల్లో వెలుగు చూసిన అక్రమాలపైనా ఆర్బీఐ స్పందించింది. బ్యాంకుల ఆడిటింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ ఎస్ ముంద్రా అన్నారు. బ్యాంకు కార్యకలాపాలపై నిఘా కొనసాగుతుందని తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో లావాదేవీలకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని భద్రపరచాలని ఆదేశించారు. బెంగళూరులో అవకతవకలకు పాల్పడిన ఆర్బీఐ ఉద్యోగిని సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. నకిలీ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసిన ఢిల్లీ యాక్సిస్ బ్యాంకుకు షోకాజ్ నోటీసు జారీచేసినట్టు ముంద్రా తెలిపారు. -
ఆర్బీఐ డిప్యూటీగవర్నర్గా విశ్వనాథన్
న్యూఢిల్లీ: ఆర్బీఐ డిప్యూ టీ గవర్నర్‌గా ఎన్.ఎస్. విశ్వనాథన్ నియమితులయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న హెచ్.ఆర్.ఖాన్ స్థానాన్ని ఈయన భర్తీ చేస్తారు. ఖాన్ వచ్చే వారంలో (జూలై 7) పదవీ విరమణ చేయనున్నారు. ప్రస్తుతం విశ్వనాథన్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా నియామకానికి సంబంధించి తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని విశ్వనాథన్ తెలిపారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ల నియామకం సాధారణంగా ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షతన గల కమిటీ ద్వారా జరుగుతాయి. కానీ విశ్వనాథన్ నియామకం మాత్రం తొలిసారిగా క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్యానెల్ ఎంపిక ద్వారా జరిగింది.