ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల విడుదల చేసిన డిజిటల్ లెండింగ్ నిబంధనలు వినియోగ హక్కుల పరిరక్షణకు అలాగే రెగ్యులేటరీ పరమైన అడ్డంకులను అధిగమించడానికి ఉద్దేశించినవి డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పేర్కొన్నారు.
ఇండస్ట్రీ వేదిక అసోచామ్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, థర్డ్ పార్టీ జోక్యం, అక్రమాలు డేటా గోప్యతలను ఉల్లంఘించడం, రికవరీ పద్దతుల్లో తగిన విధానాలు పాటించకపోవడం, అధిక వడ్డీ వసూళ్ల వంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ డిజిటల్ లెండింగ్ నిబంధనలను తీసుకువచ్చినట్లు తెలిపారు. విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాత ఆగస్టు 10న డిజిటల్ రుణ నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్‌లోగా వాటిని అమలు చేయాలని పరిశ్రమను గత వారం కోరింది.
ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆందోళన
ఫిన్‌టెక్ పరిశ్రమలోని కొన్ని సంస్థలు– రుణాలు ఇవ్వడంపై నిబంధనలు తమ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు/ఆర్‌ఈలు) చెల్లించాలి.
రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలి. రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపించకపోతే.. బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment