ముంబై: చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ)పై మరింత సానుకూల ధోరణితో వ్యవహరించాలని ఆర్థిక సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ సూచించారు. ఎకానమీలో కీలక పాత్ర పోషించే ఈ పరిశ్రమకు మద్దతుగా నిల్చే క్రమంలో రుణాల పునర్‌వ్యవస్థీకరణ, గ్రేస్ పీరియడ్ ఇవ్వడం తదితర చర్యల రూపంలో తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
విదేశీ మారక డీలర్ల అసోసియేషన్ (ఫెడాయ్) వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వామినాథన్ ఈ విషయాలు తెలిపారు. తక్కువ వడ్డీలకు రుణాలు దొరక్కపోవడం, చెల్లింపుల్లో జాప్యాలు, మౌలికసదుపాయాలపరమైన సమస్యలు మొదలైన అనేక సవాళ్లను ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటూ ఉంటాయని ఆయన పేర్కొన్నారు. చిన్న సంస్థలు ఎకానమీకి వెన్నెముకలా మాత్రమే కాకుండా వృద్ధి, కొత్త ఆవిష్కరణలు, ఉద్యోగాల కల్పనకు చోదకాలుగా కూడా ఉంటున్నాయని స్వామినాథన్ వివరించారు.
అయితే, ఈ సంస్థలు వృద్ధిలోకి రావాలంటే ఆర్థిక రంగం వినూత్న పరిష్కారమార్గాలతో వాటికి తగు మద్దతు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్దిష్ట మద్దతు కల్పించడం ద్వారా ఎంఎస్‌ఎంఈ ఎగుమతులు పెరగడంలో ఆర్థిక రంగం కీలక పాత్ర పోషించగలదని స్వామినాథన్ వివరించారు.
ఫైనాన్స్, ఫ్యాక్టరింగ్, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ వంటి సంప్రదాయ ప్రోడక్టులతో పాటు ఎగుమతులకు రుణ బీమా, కరెన్సీ రిస్క్ హెడ్జింగ్ సొల్యూషన్స్ వంటివి ఆఫర్ చేయొచ్చని పేర్కొన్నారు. చెల్లింపులపరమైన డిఫాల్ట్‌లు, కరెన్సీ హెచ్చుతగ్గుల సవాళ్ల నుంచి ఇలాంటివి రక్షణ కల్పించడంతో పాటు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లలో విస్తరించేందుకు ఎంఎస్‌ఎంఈలకు ఆత్మవిశ్వాసం ఇవ్వగలవని స్వామినాథన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment