ముంబై: కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు (ఎస్‌ఎఫ్‌బీలు) విపరీత పోకడలు పోతూ.. అట్టడుగు వర్గాలకు చెందిన రుణ గ్రహీతల నుంచి భారీ వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నాయని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ వ్యాఖ్యానించారు. ముందస్తుగానే కొన్ని వాయిదాల మొత్తాన్ని రుణ గ్రహీతల నుంచి తీసుకుని, వాటిని రుణంలో సర్దుబాటు చేయడం లేదన్నారు. పైగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు చెప్పారు.
వ్యాపార వృద్ధి కోసం స్థిరమైన, బాధ్యతాయుత వ్యాపార విధానాలను పాటించాలని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు సూచించారు. ఎస్‌ఎఫ్‌బీలపై బెంగళూరులో ఆర్‌బీఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా స్వామినాథన్ మాట్లాడారు. కొన్ని ఎస్‌ఎఫ్‌బీల బోర్డులో కనీసం ఇద్దరు హోల్‌టైమ్ డైరెక్టర్లను కూడా లేకపోవడాన్ని ఆర్‌బీఐ గుర్తించినట్టు చెప్పారు. కేవలం ఒకే ఒక్క పూర్తి కాల డైరెక్టర్ కలిగి ఉండడం కొన్ని సందర్భాల్లో సమస్యలకు దారితీయవచ్చంటూ.. మరింత మంది హోల్‌టైమ్ డైరెక్టర్ల నియామకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
డిపాజిట్ల విషయంలో జాగ్రత్త..
అధిక వ్యయంతో కూడిన టర్మ్ డిపాజిట్లపై ఆధారపడడం లేదంటే కేవలం కొన్ని సంస్థల బల్క్ డిపాజిట్లపై ఆధారపడడం పట్ల ఎస్‌ఎఫ్‌బీలను స్వామినాథన్ హెచ్చరించారు. ఇలా ఏదో ఒక విభాగంలో ఎక్కువ డిపాజిట్లు తీసుకోవడం పట్ల ఉండే రిస్‌్కను మదింపు వేయాలని సూచించారు.
సామాజిక బాధ్యత..
సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సేవల విస్తరణకు, యువ పారిశ్రామికవేత్తల సాకారానానికి ఎస్‌బీఎఫ్‌లు కీలక పాత్ర పోషించాలని స్వామినాథన్ సూచించారు. సమ్మిళిత వృద్ధి దేశ ఆర్థిక పురోగతికి ఎంతో అవసరమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందుబాటు ధరలకే రుణాలను కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అందించేందుకు కృషి చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment