ఇక ముద్రా ‘మొండి’ భారం..! | RBI Deputy Governor Jain Forecast For Banks About Debts | Sakshi
Sakshi News home page

ఇక ముద్రా ‘మొండి’ భారం..!

Published Wed, Nov 27 2019 12:49 AM | Last Updated on Wed, Nov 27 2019 5:20 AM

RBI Deputy Governor Jain Forecast For Banks About Debts - Sakshi

ముంబై: ముద్రా రుణాలకు సంబంధించి మొండిబాకీలు గణనీయంగా పెరుగుతున్నాయని బ్యాంకులను రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యూటీ గవర్నర్‌ ఎంకే జైన్‌ హెచ్చరించారు. నిలదొక్కుకోలేని రుణాల వృద్ధితో మొత్తం వ్యవస్థకే ముప్పు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ఇటువంటి లోన్స్‌పై ఓ కన్నేసి ఉంచాలని, నిశితంగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ‘ముద్రా రుణాలతో చాలా మంది లబ్ధిదారులు పేదరికం నుంచి బైటపడి ఉండవచ్చు. అయితే, ఈ రుణాల్లో మొండిబాకీలు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగించేదిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక స్థాయిలోనే రుణాలు తీసుకోబోయే వారి చెల్లింపు సామర్ధ్యాలను బ్యాంకులు మరింత మెరుగ్గా మదింపు చేయాలి. సదరు ఖాతాలను చివరిదాకా పరిశీలిస్తూనే ఉండాలి‘ అని సూక్ష్మ రుణాలపై జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అంత సులువుగా అప్పు దొరకని చిన్న వ్యాపార సంస్థలకు .. రుణ లభ్యత పెరిగేలా చూసేందుకు 2015 ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ముద్రా స్కీమ్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే, స్కీమ్‌ ప్రారంభించిన ఏడాదిలోనే .. ముద్రా రుణాల్లో మొండి బాకీల సమస్య గురించి అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వీటిని తోసిపుచ్చారు. ఈ ఏడాది జూలై నాటి గణాంకాల ప్రకారం ముద్రా స్కీమ్‌ కింద ఇచ్చిన రుణాలు రూ. 3.21 లక్షల కోట్లకు చే రాయి.

ఇందులో మొండి బాకీలు 2018 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరంలో 2.52 శాతం నుంచి 2.68 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది జూన్‌ దాకా మొత్తం 19 కోట్ల రుణాలు మంజూరు కాగా .. సుమారు 3.63 కోట్ల ఖాతాలు డిఫాల్ట్‌ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటు సమాచార హక్కు చట్టం కింద బైటికి వచ్చిన గణాంకాల ప్రకారం.. 2018 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,277 కోట్లుగా ఉన్న మొండి బాకీలు ఏకంగా 126 శాతం ఎగిసి 2019 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,481 కోట్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జైన్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఎకానమీపై జీఎస్‌టీ దెబ్బ.. 
వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానంతో అసంఘటిత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని జైన్‌ చెప్పారు. డిజిటల్‌ సాంకేతికత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు మొదలైనవి.. చిన్న, మధ్యతరహా సంస్థలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ఎంఎస్‌ఎంఈలకు రుణాలపై అధిక వడ్డీ భారం తప్పుతుందన్నారు. సూక్ష్మ రుణ సంస్థలు.. ప్రధానంగా డిజిటల్‌ ఫైనాన్స్‌ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుందని.. అదే సమయంలో డేటా భద్రతకు గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement