
న్యూఢిల్లీ: త్వరలోనే డిజిటల్ కరెన్సీని చూడనున్నాం!. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని దశలవారీగా అమలు చేసే విషయమై ఆర్‌బీఐ పనిచేస్తోందని.. హోల్‌సేల్, రిటైల్ విభాగంలోనే త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించే అవకాశం ఉందని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ తెలిపారు. దీన్ని సాధారణ కరెన్సీ మాదిరే వినియోగించుకోవచ్చన్నారు. ఒక వర్చువల్ కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు.
సీబీడీసీ ఫలించే దశలో ఉందంటూ.. ప్రపంచవ్యాప్తంగా పలు సెంట్రల్ బ్యాంకులు దీన్ని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నాయని, పలు దేశాలు ఇప్పటికే కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ప్రారంభించినట్టు చెప్పారు. సౌర్వభౌమ మద్దతు లేని పలు వర్చువల్ కరెన్సీల్లో తీవ్ర అస్థిరతల నేపథ్యంలో.. వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు సీబీడీసీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ అత్యున్నతస్థాయి అంతర్గత మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. విధానాలు, చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసిన తర్వాత సీబీడీసీని డిజిటల్ రూపీగా ప్రవేశపెట్టే విషయమై సిఫారసులు, సూచనలను ఈ కమిటీ తెలియజేయనుంది.