
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్‌డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది.
► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది.
► ఆర్‌బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ..
సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి.
► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్‌బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment