న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (సీబీడీసీ) హోల్‌సేల్, రిటైల్ విభాగాలకు దశలవారీగా అమలు చేసే ప్రక్రియలో ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సీబీడీసీని ప్రవేశపెడుతున్నట్లు 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆర్థిక బిల్లు 2022 ఆమోదంతో ఆర్‌బీఐ చట్టం-1934లోని సంబంధిత సెక్షన్‌కు అవసరమైన సవరణలు చేసినట్టు ఆర్‌బీఐ ఫిన్‌టెక్ ఈడీ అజయ్ కుమార్ చౌదరి ఫిక్కీ సదస్సులో బుధవారం తెలిపారు. బిల్లు ఆమోదం పొందడంతో పైలట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించి, డిజిటల్ కరెన్సీని జారీ చేసేందుకు ఆర్‌బీఐకి వీలు కల్పించిందని ఆయన చెప్పారు.
డిజిటల్/వర్చువల్ కరెన్సీ అయిన సీబీడీసీ 2023 ప్రారంభంలో రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ప్రైవేట్ వర్చువల్ కరెన్సీలు లేదా క్రిప్టోకరెన్సీలతో ఇది పోల్చదగినది కాదు. ఈ ఏడాది 323 బ్యాంక్‌ల ద్వారా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అజయ్ వెల్లడించారు. నెలవారీ లావాదేవీలు 590 కోట్లకు చేరుకున్నాయని, వీటి విలువ రూ.10,40,000 కోట్లు అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment