ఈ - రూపీ అంటే ఏమిటి? దాని వల్ల లాభాలేంటి? అది ఎలా పనిచేస్తుంది? | What Is Cbdc Rupee Or Digital Rupee And How It Works In India | Sakshi
Sakshi News home page

ఈ - రూపీ అంటే ఏమిటి? దాని వల్ల లాభాలేంటి? అది ఎలా పనిచేస్తుంది?

Published Mon, Dec 26 2022 7:05 AM | Last Updated on Mon, Dec 26 2022 8:56 AM

What Is Cbdc Rupee Or Digital Rupee And How It Works In India - Sakshi

రఘురామ్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. రైలు వెళ్లిపోతుందన్న హడావుడితో కంగారుగా వచ్చి సికింద్రాబాద్‌ స్టేషన్‌లో రైలు ఎక్కేశాడు. పండుగ రోజులు కావడంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. అయినా కానీ ఏదో విధంగా తోసుకుంటూ రైలెక్కి కూర్చున్నాడు. జేబులో చేయి పెట్టి చూడగా, పర్స్‌ కనిపించలేదు. ఒక్కసారిగా ముఖం మాడిపోయింది. పర్స్‌లో కార్డులతోపాటు డ్రా చేసిన రూ.5,000 నగదు కూడా ఉంది. ఒకవేళ నోట్ల రూపంలో కాకుండా, మొబైల్‌ వ్యాలెట్‌లో ఈ కరెన్సీ ఉంటే..? ఇలా జరిగేది కాదు కదా..! భౌతిక కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వచ్చిందే సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపీ). దీనిపై కొందరిలో అస్పష్టత నెలకొంది. దీని పనితీరు, చెల్లింపులు చేయడం ఎలా, ఇది ఉంటే యూపీఐ అవసరం లేదా? ఇలా ఎన్నెన్నో సందేహాలు. వీటికి స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కథనం.  

ఈ–రూపీ అంటే.. కరెన్సీ నోటుకు డిజిటల్‌ రూపమే ఇది. అందుకే సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)గా దీనికి పేరు. ముద్రించిన కరెన్సీ నోట్లను ఆర్‌బీఐ ఎప్పటికప్పడు అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలోకి విడుదల చేస్తుంటుంది. అచ్చం అదే మాదిరి ఇక మీదట డిజిటల్‌ కరెన్సీని సైతం విడుదల చేయనుంది.

లిక్విడిటీ చర్యల్లో భాగంగా భౌతిక, డిజిటల్‌ రూపీ మధ్య సమన్వయం ఉంటుంది. కరెన్సీ ఏ రూపంలో ఉన్నా ఆర్‌బీఐ బ్యాలన్స్‌ షీట్‌లో ఈ మేరకు లయబిలిటీని చూపిస్తారు. ఈ డిజిటల్‌ కరెన్సీ మొబైల్‌ ఫోన్‌ వ్యాలెట్లలోనే ఉంటుంది. కరెన్సీ నోట్‌ మాదిరే దీనికి సైతం చట్టబద్ధ హోదా ఉంటుంది. డిజిటల్‌ కరెన్సీని కోరుకున్నంత కాలం ఈ–రూపీల్లో రూపంలో ఉంచుకోవచ్చు. భౌతిక కరెన్సీకి వర్తించే అన్ని రకాల నిబంధనలు డిజిటల్‌ కరెన్సీకి సైతం అమలవుతాయి. కేవలం రూపంలోనే వ్యత్యాసం. కనుక దీన్ని పౌరులు అందరూ భవిష్యత్తులో కరెన్సీ మాదిరిగా మార్పిడి చేసుకోవచ్చు. 

వినియోగం ఎలా..? 
బ్యాంక్‌ ఖాతాలో బ్యాలన్స్‌ ఉంటే, అందులో నుంచి కోరుకున్న మేర డిజిటల్‌ రూపాయిలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌ అవసరం. ప్రస్తుతానికి ఈ–రూపీ రిటైల్‌ (వ్యక్తులు) ప్రాజెక్ట్‌ను ఆర్‌బీఐ ప్రయోగాత్మకంగా అమలు చేసి, చూస్తోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్, యస్‌ బ్యాంక్‌ బ్యాంకులు డిజిటల్‌ రూపీ వ్యాలెట్లను అందిస్తున్నాయి.

ఐవోఎస్‌ ఆధారిత యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయలేదు. ఈ బ్యాంక్‌లకు సంబంధించిన కస్టమర్లు, ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వాడుతున్నట్టు అయితే, వారి ఫోన్‌కు ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్‌ రూపంలో లింక్‌ వస్తుంది. ఆసక్తి ఉన్న వారు లింక్‌ను తెరిచి ఈ–రూపీ వ్యాలెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్‌ అయి ఉన్న ఫోన్‌ నంబర్‌ను వినియోగించాలి.  

ఎలా పనిచేస్తుంది..? 
ఈ–రూపీ వ్యాలెట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు, తమ బ్యాంకు ఖాతా నుంచి నగదును వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవాలి. ఏ డినామినేషన్‌లో ఎన్ని కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కస్టమర్‌కే ఉంటుంది. అంటే రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయిలు, రూ.10, 20, 50, 100, 200, 500 డినామినేషన్‌లలో కస్టమర్‌ తన ఇష్టం మేరకు వ్యాలెట్‌లో లోడ్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.5,000 బదిలీ చేసుకున్నారని అనుకుందాం.

అప్పుడు రూ.500 డినామినేషన్‌లో 5 ఈ–రూపీలు, రూ.200 డినామినేషన్‌లో 5 ఈ–రూపీలు, రూ.100 డినామినేషన్‌లో 10 ఈ–రూపీలు, రూ.50 డినామినేషన్‌లో 8 ఈ–రూపీలు, మిగిలిన రూ.100 విలువకు రూ.20, 10, 5, 1 ఇలా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా అనేమీ కాదు. కస్టమర్‌ కావాలనుకుంటే రూ.50 డినామినేషన్‌లో 100 ఈ–రూపీలను కూడా తీసుకోవచ్చు. లేదంటే రూపాయి డినామినేషన్‌లో 5,000 ఈ–రూపీలను తీసుకోవచ్చు. భౌతిక కరెన్సీ మాదిరే ఇవి పనిచేస్తాయి. మన పర్స్‌లో నోట్లు ఉన్న మాదిరే, వ్యాలెట్‌లో ఈ–రూపీలు ఉంటాయి. భౌతికంగా వినియోగంలో ఉన్న అన్ని రకాల డినామినేషన్‌కు సమానమైన ఈ–రూపీలు వ్యాలెట్‌లో అందుబాటులో ఉంటాయి.  

వెంటనే బదిలీ..  
వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మధ్య ఈ–రూపీ చెల్లింపులు చేసుకోవచ్చు. వ్యక్తుల మధ్య సీబీడీసీలను బదిలీ చేసుకోవాలంటే, అవతలి వ్యక్తికి సైతం ఈ–రూపీ వ్యాలెట్‌ ఉండడం తప్పనిసరి. అదే వర్తకులకు ఈ–రూపీలను చెల్లించాలనుకుంటే క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ విధానంలో చేయవచ్చు. ఇది అచ్చం యూపీఐ చెల్లింపుల మాదిరే పనిచేస్తుంది. ప్రస్తుతం యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేంత సులభంగానే.. ఈ–రూపీ చెల్లింపులు కూడా ఉంటాయి. యూపీఐ మాదిరే అప్పటికప్పుడే ఈ–రూపీ బదిలీ అవుతుంది. క్షణాల్లోనే అవతలి వ్యక్తి వ్యాలెట్‌కు మీరు పంపిన ఈ–రూపీ చేరిపోతుంది.  

కొద్ది మందికే..  
డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రాగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లో కొద్ది మంది వినియోగానికే (క్లోజ్డ్‌ యూజర్‌ గ్రూప్‌) రిటైల్‌ సీబీడీసీ (ఈ–రూపీ)ని పరిమితం చేశారు. పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించిన తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఈ–రూపీ లావాదేవీలు పూర్తయ్యే బాధ్యతను ఆర్‌బీఐతో కలసి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) చూస్తోంది. లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడితే ఎన్‌పీసీఐ పరిష్కరిస్తుంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ను తరచూ వినియోగించే కస్టమర్లు, డిజిటల్‌ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్న వారి నుంచి కొందరిని ప్రయోగాత్మక పరీక్షల కోసం బ్యాంక్‌లు ఎంపిక చేసుకున్నాయి. అలా ఎంపిక చేసిన వారి ఫోన్లకు ఈ రూపీ వ్యాలెట్‌ లింక్‌ను పంపిస్తాయి. ఒకవేళ బ్యాంక్‌ నుంచి ఎటువంటి సందేశం కానీ, యూఆర్‌ఎల్‌ లింక్‌ కానీ రాని వారు, ఈ రూపీ వ్యాలెట్‌ పట్ల ఆసక్తిగా ఉంటే, బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించొచ్చు. అభ్యర్థనను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణ వారిపై ఉంటుంది.  

అనుకూలతలు/ప్రతికూలతలు
 కరెన్సీ నోట్లు అయితే నకిలీలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్‌ కరెన్సీకి ఆ బెడద ఉండదు. మొబైల్‌ ఫోన్‌ పోయినా దుర్వినియోగం బెడద ఉండదు. బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌ నంబర్‌కు కాల్‌ చేసి, వ్యాలెట్‌లోని నగదును బదిలీ చేసుకోవచ్చు. యూపీఐ అన్నది బ్యాంక్‌ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. కనుక యూపీఐ యాప్‌ ఉన్న ఫోన్‌ పోతే దుర్వినియోగం ప్రమాదం ఎక్కువ. ఈ–రూపీ వ్యాలెట్‌తో ఆ రిస్క్‌ ఉండదు. ప్రతి లావాదేవీ టోకెనైజ్డ్‌ విధానంలో, యూనిక్‌గా, భద్రంగా ఉంటుంది. ఇంటర్నెట్‌ కనెక్టివిటీలో సమస్యలు ఉంటే టోకెన్‌ జారీ కాదు. లావాదేవీ తక్షణమే జరిగిపోతుంది కనుక ఫెయిల్యూర్‌ అవకాశాలు తక్కువ. సీబీడీసీ వినియోగం పెరిగే కొద్దీ ఆర్‌బీఐకి భారీగానే వ్యయాలు ఆదా అవుతాయి. ఎందుకంటే కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు, బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు భౌతిక కరె న్సీ నిర్వహణ వ్యయా లు తగ్గుతాయి. వాటి మధ్య అంతర్గత చెల్లింపుల వ్యయాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ మరింత డిజిటల్‌గా మారుతుంది. దీని వల్ల అధికారిక ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. దేశాల మధ్య చెల్లింపులకు అనువుగా ఉంటుంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని వ్యాప్తి, వినియోగం, సౌకర్యం, సమస్యలపై మరింత స్పష్టత వస్తుంది.   

వడ్డీ రాదు..
యూపీఐ విధానానికి, ఈ రూపీకి మధ్య వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. యూపీఐ అన్నది మన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వేరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా బదిలీ చేయడం. కానీ, ఈ–రూపీ అలా కాదు. ఒక వ్యక్తి వ్యాలెట్‌ నుంచి మరో వ్యక్తి ఈ–రూపీ వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో రోజువారీ బ్యాలన్స్‌పై ఎంతో కొంత వడ్డీ ముడుతుంది. కానీ, వ్యాలెట్‌లో ఉన్న ఈ–రూపీలపై వడ్డీ రాబడి ఉండదు. ఎందుకంటే ఇది బ్యాంక్‌ బ్యాలన్స్‌ కిందకు రాదు. భౌతిక కరెన్సీ మన పర్స్‌లో ఉన్న మాదిరే అని గుర్తించాలి. ఈ–రూపీ వ్యాలెట్‌లో ఉన్న బ్యాలన్స్‌ను తిరిగి బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. అప్పటి నుంచి వడ్డీ ఆదాయం వస్తుంది.  

యూపీఐ వర్సెస్‌ ఈ–రూపీ 
ఈ–రూపీ రాకతో యూపీఐ విషయంలో కొందరిలో సందేహాలున్నాయి. కానీ, ఈ రెండు వేర్వేరు సాధనాలు. దేశంలో 26 కోట్ల యూపీఐ యూజర్లు ఉన్నారు. అక్టోబర్‌ నెలకు 730 కోట్ల యూపీఐ లావాదేవీలు (రూ.12.11 లక్షల కోట్లు విలువైన) నమోదయ్యాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన టెక్నాలజీకి డిజిటల్‌ రూపీ పూర్తి భిన్నమైనది. యూపీఐ లావాదేవీల నిర్వహణలో బ్యాంక్‌ల పాత్ర ఉంటుంది. డిజిటల్‌ రూపీ లావాదేవీల్లో బ్యాంక్‌ల పాత్ర ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య కరెన్సీ మార్పిడిలో మరొకరి పాత్ర ఎలా అయితే ఉండదో.. డిజిటల్‌ రూపీలోనూ అంతేనని అర్థం చేసుకోవాలి. యూపీఐ లావాదేవీలను ట్రాక్‌ చేయగలరు. కానీ, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య ప్రైవేటుగా కొనసాగే సీబీడీసీ లావాదేవీలను వేరెవరూ ట్రాక్‌ చేయలేరు. గోప్యంగా ఉంటాయి.  

చెల్లింపుల పరంగా యూపీఐ సౌకర్యం? 
ఎవరైనా కానీ వినియోగంలో సౌకర్యాన్నే చూస్తారు. సీబీడీసీతో పోలిస్తే యూపీఐ చెల్లింపులే సౌకర్యం. ఎలా అంటే, ఉదాహరణకు రూ.47 విలువ చేసే వాటిని కొనుగోలు చేశారు. అప్పుడు చెల్లింపులు చేయాలి. యూపీఐ ద్వారా అయితే కేవలం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి పిన్‌ ఇస్తే చాలు రూ.47 చెల్లింపు పూర్తవుతుంది. మరి ఈ–రూపీ అలా కాదు. రూ.47ను ఏ డినామినేషన్‌లో చెల్లించాలన్నది నిర్ణయించాలి. రూ.20 డినామినేషన్‌ రెండు, లేదా రూ.10 డినామినేషన్‌ నాలుగు.. ఆ తర్వాత రూ.5 డినామినేషన్‌ ఒకటి, రూ.2 డినామినేషనన్‌ ఎంపిక చేసుకుని బదిలీ చేయాలి. లేదంటే రూపాయి డినామినేషన్‌లో 47 ఈ–రూపీలను సెలక్ట్‌ చేసుకోవాలి. వ్యాలెట్‌లో అన్ని డినామినేషన్లలో ఈ–రూపీ ఉంటేనే చెల్లింపులు సాధ్యపడతాయి. అలా కాకుండా వ్యాలెట్‌లో కేవలం రూ.10, 20, 50 డినామినేషన్‌లోనే ఈ–రూపీలు ఉంటే రూ.47 చెల్లింపు సాధ్యపడదు. ఆటోమేటిగ్గా చెల్లింపునకు తగినట్టు డినామినేషన్‌ స్ప్లిట్‌ అయ్యి, బదిలీ అయ్యే విధానాన్ని అభివృద్ధి చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది. అప్పుడు యూపీఐకి ప్రత్యా మ్నాయం కాగలదు. అయినా కానీ రిటైల్‌ చెల్లింపులకు యూపీఐ ఎక్కువ అనుకూలం. యూపీఐ ముందుగా వచ్చి, దేశంలోని అన్ని  ప్రాంతాలకూ చేరిపోయింది. దీనికి టెక్నాలజీ పెద్దగా తెలియక్కర్లేదు. బ్యాంకు ఖాతాకు వెళ్లి లోడ్‌ చేసుకోవక్కర్లేదు. అందుకే ఇకపైనా చెల్లింపుల్లో యూపీఐ హవా కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా.  బ్యాంకుల మధ్య, సంస్థల మధ్య చెల్లింపుల సెటిల్‌మెంట్‌కు, విదేశాలతో రూపాయి వాణిజ్యానికి సీబీడీసీ అనుకూలిస్తుందని చెబుతున్నారు.

ఎక్కడ వినియోగం? 
ఈ–రూపీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, యూపీఐ మాదిరే దీన్ని కూడా దేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం క్లోజ్‌ హెల్డ్‌ గ్రూపు పరిధిలోని వ్యక్తులు, వర్తకుల మధ్య లావాదేవీలకే పరిమితంగా ఉంది. ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని, అవసరమైన చోట చెల్లింపులు చేస్తుంటాం. అదే మాదిరి ఈ–రూపీని వ్యాలెట్లలోకి లోడ్‌ చేసుకుని కావాల్సిన చోట చెల్లింపులు/బదిలీ చేసుకోవచ్చు.  
 
రెండు రకాలు.. 
సీబీడీసీ రెండు రకాలుగా వర్గీకరణ చేశారు. రిటైల్, హోల్‌సేల్‌. రిటైల్‌ సీబీడీసీని వ్యక్తులు, ప్రైవేటు రంగం, వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. హోల్‌సేల్‌ సీబీడీసీ కేవలం బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మధ్య వినియోగానికే ప్రస్తుతం పరిమితం చేశారు. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య లావాదేవీలకు ఉద్దేశించినది రిటైల్‌ సీబీడీసీ. హోల్‌సేల్‌ సీబీడీసీ అన్నది రెండు బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీల సెటిల్‌మెంట్‌కు ఉద్దేశించినది.  
 
అదనపు సాధనం
సీబీడీసీ అనేది ప్రస్తుతమున్న మరే సాధనానికి బదులుగా తీసుకొచ్చింది కాదు. అదనపు చెల్లింపు సాధనంగా, కరెన్సీకి డిజిటల్‌ రూపంగా తీసుకొచ్చినది మాత్రమే. వినియోగంలో సౌకర్యం, వ్యయాలు తగ్గింపు, భద్రత, రక్షణ ఎన్నో అంశాలు డిజిటల్‌ రూపీతో ఇమిడి ఉన్నాయి.

 చదవండి👉 నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement