డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు.
"CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు.
దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment