ముంబై: ధరల స్థిరత్వమే ఎకానమీ స్థిరమైన వృద్ధికి పునాదిగా పనిచేస్తుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కేంద్రం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి తగ్గించడమే సెంట్రల్ బ్యాంక్ లక్ష్యమని ఆయన అన్నారు.
భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఆందోళనకరంగా 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయిన నేపథ్యంలో గవర్నర్ తాజా వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ సౌత్ దేశాల సెంట్రల్ బ్యాంకుల ఉన్నత స్థాయి విధాన సదస్సులో ఆయన ‘సమతౌల్య ద్రవ్యోల్బణం, వృద్ధి: ద్రవ్య పరపతి విధానానికి మార్గదర్శకత్వం’ అనే అంశంపై ఆయన చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు...
⇒ దేశ ఎకానమీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండడం.. 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్య సాధనపై ఆర్‌బీఐ గురి తప్పకుండా చూస్తోంది. ⇒ సుస్థిర ద్రవ్యోల్బణం అటు ప్రజలు, ఇటు ఎకానమీ ప్రయోజనాలకు పరిరక్షిస్తుంది. ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి, పెట్టుబడులకు తగిన వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదపడే అంశమిది.
⇒ గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభ పరిస్థితులను తట్టుకుని తన స్థిర స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతోంది. అయినప్పటికీ, ఇప్పటికీ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.
⇒ అనిశ్చితితో కూడిన ఈ వాతావరణంలో ద్రవ్య, పరపతి విధాన రూపకల్పన.. స్పీడ్ బ్రేకర్లతో కూడిన పొగమంచు మార్గంలో కారును నడపడం లాంటిది. ఇవి డ్రైవర్ సహనం, నైపుణ్యాన్ని పరీక్షించే కీలక సమయం.
⇒ ప్రస్తుతం ఎన్నో సవాళ్లు సెంట్రల్ బ్యాంకులకు ఎదురవుతున్నాయి. విధాన నిర్ణేతలు పలు కీలక పరీక్షలను ఎదుర్కొనాల్సి వస్తోంది. మన కాలపు చరిత్రను వ్రాసినప్పుడు, గత కొన్ని సంవత్సరాల అనుభవాలు, అభ్యాసాలు అందులో భాగంగా ఉంటాయి. భవిష్యత్ సెంట్రల్ బ్యాంకింగ్ పరిణామంలో తాజా పరిణామాలు ఒక మలుపుగా మారుతాయి.
⇒ గ్లోబల్ సౌత్ దేశాలకు స్థిరమైన వృద్ధి, ధరలు, ఆర్థిక స్థిరత్వాలను కొనసాగించడం సవాలు.
⇒ కోరుకున్న ఫలితాలను సాధించేందుకు సెంట్రల్ బ్యాంకులు ఎంతో వివేకంతో వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ మేరకు ద్రవ్య, ఆర్థిక, నిర్మాణాత్మక విధానాలను అవలంభించాలి. మరింత దృఢమైన, వాస్తవిక, అతి క్రియాశీల పాలసీ ఫ్రేమ్‌వర్క్‌లను రూపొందించాలి.
రేటు తగ్గింపు ఉండకపోవచ్చు...
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2% అటు ఇటుగా 4% వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 % పైకి పెరగకూడదు. అక్టోబర్‌లో నమోదయిన తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావి స్తున్నారు.
ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6% దిగువన కొనసాగింది. రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ద్రవ్యోల్బణం సమీక్షా నెల్లో ఏకంగా 10.87 శాతంగా నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment