ముంబై: ద్రవ్యోల్బణ అదుపు చేయడానికి సంబంధించిన ఉదాహరణను పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ‘ఏనుగు’ నుంచి ‘గుర్రం’ వైపునకు మార్చడం విశేషం. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడిపై ఆయన గతంలో మాట్లాడుతూ, ‘‘ఏనుగు అడవికి తిరిగి వచ్చి అక్కడే ఉండాల్సిన అవసరం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా ఇదే అంశంపై మాట్లాడుతూ, ‘‘చాలా కృషితో ద్రవ్యోల్బణం గుర్రాన్ని స్థిరత్వానికి తీసుకురావడం జరిగింది.
రెండేళ్ల క్రితం ద్రవ్యోల్బణం పెరిగిన స్థాయిలతో పోలిస్తే ప్రస్తుతం ఈ రేటు ఆమోదయోగ్యమైన లక్ష్యాలకు దగ్గరలో ఉంది’’ అని పేర్కొన్నారు. ‘గుర్రం మళ్లీ అదుపుతప్పే అయ్యే అవకాశం ఉన్నందున గేట్ తెరవడం గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అదుపు కోల్పోకుండా గుర్రాన్ని గట్టిగా పట్టి ఉంచాలి’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ద్రవ్యోల్బణంతో పోల్చే విషయంలో జంతువును మార్చడంపై అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాదానం ఇస్తూ, ‘‘ఇందుకు కారణం ద్రవ్యోల్బణంపై యుద్ధం. యుద్ధంలో ఏనుగులను గుర్రాలను ఉపయోగించడం జరుగుతుంది’’ అని చమత్కరించారు. అవసరమైతే పౌరాణిక కథానాయకుడు అర్జునుడు (2022 చివర్లో ఆయన ద్రవ్యోల్బణం కట్టడిని అర్జునుడి గురితో పోలి్చన సంగతి తెలిసిందే) కూడా తిరిగి రాగలడని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ నిస్సందేహంగా దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు.
కొత్త కమిటీ తొలి భేటీ
కేంద్రం ఈ నెల ప్రారంభంలో ముగ్గురు కొత్త సభ్యులను నియమించిన తర్వాత గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశం ఇది. ఆర్‌బీఐ తాజా ద్రవ్య పరపతి విధాన కమిటీని ప్రభుత్వం ఈ నెలారంభంలో పునర్‌వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఎక్స్‌టర్నల్ సభ్యులుగా రామ్ సింగ్, సౌగత భట్టాచార్య, నగేష్ కుమార్‌లను కేంద్ర ఈ నెల ప్రారంభంలో నియమించింది.
పదవీ కాలం ముగిసిన అషిమా గోయల్, శశాంక భిడే, జయంత్ ఆర్ వర్మ స్థానంలో వీరి నియామకం జరిగింది. గత ద్వైమాసిక సమావేశాల్లో అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మలు రేటు తగ్గింపునకు వోటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నియమితులయిన వారితో పాటు కమిటీలో అంతర్గత (ఆర్‌బీఐ తరఫున) సభ్యులుగా గవర్నర్ శక్తికాంతదాస్, డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆర్‌బీఐ పరపతి విధాన విభాగం) రాజీవ్ రంజన్‌లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment