CBDC
-
ఆఫ్లైన్లోనూ ‘ఈ-రుపీ’ లావాదేవీలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) ఆఫ్లైన్లోనూ ఈ-రుపీ లావాదేవీలను అందుబాటులోకి తేనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇది అందుబాటులోకి వస్తే డిజిటల్ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్ట్‌లోనే ఆఫ్‌లైన్ ఈ-రుపీ లావాదేవీలను పరిచయం చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. 2022 డిసెంబర్లో పైలట్ ప్రాజెక్టుగా రిటైల్ సీబీడీసీని ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్లో ఇది 10 లక్షల లావాదేవీలకు చేరింది. ఎంపిక చేసిన బ్యాంకులు తమ కస్టమర్లకు డిజిటల్ రుపీ వ్యాలెట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారానే వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారస్థుల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులను ఆఫ్లైన్లోనూ జరిపేలా ఆర్బీఐ అనుమతించింది. -
ఫ్యూచర్ మనీ అదే.. ఆర్బీఐ గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
డిజిటల్ కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) క్రాస్-బోర్డర్ చెల్లింపులను ఖర్చుతో కూడుకున్నది కాకుండా మరింత సమర్థవంతం, వేగవంతం చేయగలదని ఆయన భావిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రసంగించారు. "CBDC గొప్ప ప్రయోజనం అంతర్జాతీయ చెల్లింపులు. దీని వల్ల అంతర్జాతీయ చెల్లింపులు మరింత సమర్థవంతంగా, వేగవంతంగా, చౌకగా మారతాయి. ఇతర దేశాలు ఈ డిజిటల్ కరెన్సీని స్వీకరించినప్పుడు అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థలు సమర్ధత, వేగం, ఖర్చు అంశాల్లో లాభపడతాయి. అంతిమంగా ఇది ఫ్యూచర్ మనీగా మారుతుందని నేను భావిస్తున్నాను" అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పైలట్ వెర్షన్ విజయవంతంపైనే దేశవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అమలు ఆధారపడి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. ‘దీన్ని మనం అధిగమించాల్సి ఉంటుంది. అయితే ఇంతలోపే దీన్ని సాధించాలన్న లక్ష్యం అంటూ ఏమీ లేదు. దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అనవసరమైన తొందరపాటు లేదు. ఎందుకంటే అది కరెన్సీ అయిన తర్వాత, దాని భద్రత, సమగ్రత, సామర్థ్యాన్ని నిర్ధారించాలి’ అన్నారు. దేశంలో 2022లో నవంబర్-డిసెంబర్ టోకు, రిటైల్ కేటగిరీలలో డిజిటల్ కరెన్సీని పైలట్ ప్రాతిపదికన ఆర్బీఐ ప్రారంభించింది. ప్రస్తుతం రిటైల్ విభాగంలో 40 లక్షల మంది, వ్యాపారుల్లో 4 లక్షల మంది ఈ డిజిటల్ కరెన్సీ వినియోగిస్తున్నారు. -
డిజిటల్ రూపాయి లావాదేవీలు.. ఎస్బీఐ ముందడుగు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ప్రాజెక్ట్‌లో భాగంగా పలు బ్యాంకులు డిజిటల్ రూపాయితో యూపీఐ ఇంటర్ఆపరబిలిటీ ఫీచర్‌ను ప్రవేశపెట్టాయి. వీటిలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ముందడుగు వేస్తోంది. ఆర్బీఐ తీసుకొచ్చిన సీబీడీసీ ప్రాజెక్ట్‌లో భాగస్వాములు కావాలని ఎస్బీఐ తమ కస్టమర్లను ఆహ్వానిస్తోంది. తాజాగా ఈమేరకు ఎంపిక కస్టమర్లకు సందేశాలు పంపుతోంది. ఈ-రూపాయికి చట్టబద్ధమైన చెల్లుబాటు ఉందని, సాధారణ కరెన్సీ లాగే డిజిటల్ రూపాయితోనూ సురక్షితంగా లావాదేవీలు చేయొచ్చని పేర్కొంది. ఈ ఫీచర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఈ-రూపీ బై ఎస్బీఐ’ యాప్ అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఈ-రూపీ లావాదేవీల కోసం ఎస్బీఐ సీబీడీసీ కస్టమర్లు ఏదైనా మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయవచ్చని ఎస్బీఐ ప్రకటించింది. ‘ఈ-రూపీ బై ఎస్బీఐ’ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లోనూ, ఐఫోన్ యూజర్ల కోసం ఆపిల్ యాప్ స్టోర్‌లోనూ అందుబాటులో ఉందని, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరింది. సీబీడీసీ గురించి.. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) పైలట్ ప్రోగ్రామ్‌ను ఆర్బీఐ 2022లో ప్రారంభించింది. ఈ సీబీడీసీని డిజిటల్ రూపాయి అని కూడా అంటారు. ఆర్బీఐ జారీ చేసే, నియంత్రించే కరెన్సీకి ఇది టోకనైజ్డ్ డిజిటల్ వర్షన్. -
కెనరా బ్యాంక్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్.. ఇక్కడ మామూలు రూపాయిలు కాదు..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్ తాజాగా యూపీఐ ఇంటరాపరబుల్ డిజిటల్ రూపీ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. వ్యాపారుల యూపీఐ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి డిజిటల్ కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపేందుకు ఇది ఉపయోగపడగలదని బ్యాంక్ ఎండీ కె. సత్యనారాయణ రాజు తెలిపారు. అలాగే ప్రత్యేకంగా సీబీడీసీ బోర్డింగ్ ప్రక్రియ అవసరం లేకుండా ప్రస్తుతం తమకున్న యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారానే వ్యాపారులు డిజిటల్ కరెన్సీలో చెల్లింపులను పొందవచ్చని ఆయన వివరించారు. అనుసంధానించిన ఖాతా నుంచి కస్టమర్లు తమ సీబీడీసీ వాలెట్‌లోకి కరెన్సీని లోడ్ చేసుకోవచ్చని, దాన్ని సీబీడీసీ వాలెట్ ఉన్న ఎవరికైనా బదలాయించవచ్చని, అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చని, స్వీకరించవచ్చని రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 నగరాల్లో దీన్ని కస్టమర్లు, వ్యాపారులకు పైలట్ ప్రాతిపదికన దీన్ని ఆఫర్ చేస్తున్నట్లు వివరించారు. -
సీబీడీసీ పైలట్ ప్రాజెక్టులోకి 1.7 లక్షల మంది వ్యాపారులు
ముంబై: అధికారిక సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) పైలట్ ప్రాజెక్టులో 1 లక్ష మంది కస్టమర్లు, 1.7 లక్షల మంది పైచిలుకు వ్యాపారులు భాగమైనట్లు ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకు వెల్లడించింది. కస్టమర్ల నుంచి ఈ–రూపీల రూపంలో చెల్లింపులను స్వీకరించడంలో వ్యాపారవర్గాలకు ఉపయోగపడేలా యూపీఐ క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించినట్లు వివరించింది. ఇది ప్రస్తుతం ఆండ్రాయిడ్ 10 పైగా వెర్షన్లలో పని చేస్తుందని, త్వరలో ఐవోఎస్ కోసం కూడా అందుబాటులోకి తేనున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేమెంట్స్ విభాగం హెడ్ పరాగ్ రావు తెలిపారు. పెద్ద మెట్రో నగరాలు మొదలుకుని విశాఖ, విజయవాడ వంటి 26 నగరాల్లో ఈ–రూపీ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రోజుకు రూ. 5,000 – 10,000 గా ఉన్న డిజిటల్ రూపాయి లావాదేవీల పరిమితిని ఈ ఏడాది ఆఖరు నాటికి రోజుకు రూ. 10 లక్షల స్థాయికి పెంచే యోచనలో ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ డిప్యుటీ గవర్నర్ టి. రబి శంకర్ ఇటీవలే వెల్లడించారు. -
రోజుకు 10 లక్షల డిజిటల్ రూపీ లావాదేవీలు
ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది. తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు. -
ఈ - రూపీ అంటే ఏమిటి? దాని వల్ల లాభాలేంటి? అది ఎలా పనిచేస్తుంది?
రఘురామ్ విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖపట్నం వెళ్లాల్సి ఉంది. రైలు వెళ్లిపోతుందన్న హడావుడితో కంగారుగా వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో రైలు ఎక్కేశాడు. పండుగ రోజులు కావడంతో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. అయినా కానీ ఏదో విధంగా తోసుకుంటూ రైలెక్కి కూర్చున్నాడు. జేబులో చేయి పెట్టి చూడగా, పర్స్ కనిపించలేదు. ఒక్కసారిగా ముఖం మాడిపోయింది. పర్స్‌లో కార్డులతోపాటు డ్రా చేసిన రూ.5,000 నగదు కూడా ఉంది. ఒకవేళ నోట్ల రూపంలో కాకుండా, మొబైల్ వ్యాలెట్‌లో ఈ కరెన్సీ ఉంటే..? ఇలా జరిగేది కాదు కదా..! భౌతిక కరెన్సీకి ప్రత్యామ్నాయంగా వచ్చిందే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపీ). దీనిపై కొందరిలో అస్పష్టత నెలకొంది. దీని పనితీరు, చెల్లింపులు చేయడం ఎలా, ఇది ఉంటే యూపీఐ అవసరం లేదా? ఇలా ఎన్నెన్నో సందేహాలు. వీటికి స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నమే ఈ కథనం. ఈ–రూపీ అంటే.. కరెన్సీ నోటుకు డిజిటల్ రూపమే ఇది. అందుకే సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)గా దీనికి పేరు. ముద్రించిన కరెన్సీ నోట్లను ఆర్బీఐ ఎప్పటికప్పడు అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలోకి విడుదల చేస్తుంటుంది. అచ్చం అదే మాదిరి ఇక మీదట డిజిటల్ కరెన్సీని సైతం విడుదల చేయనుంది. లిక్విడిటీ చర్యల్లో భాగంగా భౌతిక, డిజిటల్ రూపీ మధ్య సమన్వయం ఉంటుంది. కరెన్సీ ఏ రూపంలో ఉన్నా ఆర్బీఐ బ్యాలన్స్ షీట్లో ఈ మేరకు లయబిలిటీని చూపిస్తారు. ఈ డిజిటల్ కరెన్సీ మొబైల్ ఫోన్ వ్యాలెట్లలోనే ఉంటుంది. కరెన్సీ నోట్ మాదిరే దీనికి సైతం చట్టబద్ధ హోదా ఉంటుంది. డిజిటల్ కరెన్సీని కోరుకున్నంత కాలం ఈ–రూపీల్లో రూపంలో ఉంచుకోవచ్చు. భౌతిక కరెన్సీకి వర్తించే అన్ని రకాల నిబంధనలు డిజిటల్ కరెన్సీకి సైతం అమలవుతాయి. కేవలం రూపంలోనే వ్యత్యాసం. కనుక దీన్ని పౌరులు అందరూ భవిష్యత్తులో కరెన్సీ మాదిరిగా మార్పిడి చేసుకోవచ్చు. వినియోగం ఎలా..? బ్యాంక్ ఖాతాలో బ్యాలన్స్ ఉంటే, అందులో నుంచి కోరుకున్న మేర డిజిటల్ రూపాయిలుగా మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అవసరం. ప్రస్తుతానికి ఈ–రూపీ రిటైల్ (వ్యక్తులు) ప్రాజెక్ట్‌ను ఆర్బీఐ ప్రయోగాత్మకంగా అమలు చేసి, చూస్తోంది. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యస్ బ్యాంక్ బ్యాంకులు డిజిటల్ రూపీ వ్యాలెట్లను అందిస్తున్నాయి. ఐవోఎస్ ఆధారిత యాప్‌ను ఇంకా అభివృద్ధి చేయలేదు. ఈ బ్యాంక్‌లకు సంబంధించిన కస్టమర్లు, ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్టు అయితే, వారి ఫోన్‌కు ఎస్ఎంఎస్, ఈ మెయిల్ రూపంలో లింక్ వస్తుంది. ఆసక్తి ఉన్న వారు లింక్‌ను తెరిచి ఈ–రూపీ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్యాంక్‌లో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను వినియోగించాలి. ఎలా పనిచేస్తుంది..? ఈ–రూపీ వ్యాలెట్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారు, తమ బ్యాంకు ఖాతా నుంచి నగదును వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవాలి. ఏ డినామినేషన్లో ఎన్ని కావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కస్టమర్‌కే ఉంటుంది. అంటే రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయిలు, రూ.10, 20, 50, 100, 200, 500 డినామినేషన్లలో కస్టమర్ తన ఇష్టం మేరకు వ్యాలెట్‌లో లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు బ్యాంక్ ఖాతా నుంచి రూ.5,000 బదిలీ చేసుకున్నారని అనుకుందాం. అప్పుడు రూ.500 డినామినేషన్లో 5 ఈ–రూపీలు, రూ.200 డినామినేషన్లో 5 ఈ–రూపీలు, రూ.100 డినామినేషన్లో 10 ఈ–రూపీలు, రూ.50 డినామినేషన్లో 8 ఈ–రూపీలు, మిగిలిన రూ.100 విలువకు రూ.20, 10, 5, 1 ఇలా ఎంపిక చేసుకోవచ్చు. ఇలా అనేమీ కాదు. కస్టమర్ కావాలనుకుంటే రూ.50 డినామినేషన్లో 100 ఈ–రూపీలను కూడా తీసుకోవచ్చు. లేదంటే రూపాయి డినామినేషన్లో 5,000 ఈ–రూపీలను తీసుకోవచ్చు. భౌతిక కరెన్సీ మాదిరే ఇవి పనిచేస్తాయి. మన పర్స్‌లో నోట్లు ఉన్న మాదిరే, వ్యాలెట్‌లో ఈ–రూపీలు ఉంటాయి. భౌతికంగా వినియోగంలో ఉన్న అన్ని రకాల డినామినేషన్‌కు సమానమైన ఈ–రూపీలు వ్యాలెట్‌లో అందుబాటులో ఉంటాయి. వెంటనే బదిలీ.. వ్యక్తి నుంచి వ్యక్తికి, వ్యక్తి నుంచి వ్యాపారికి మధ్య ఈ–రూపీ చెల్లింపులు చేసుకోవచ్చు. వ్యక్తుల మధ్య సీబీడీసీలను బదిలీ చేసుకోవాలంటే, అవతలి వ్యక్తికి సైతం ఈ–రూపీ వ్యాలెట్ ఉండడం తప్పనిసరి. అదే వర్తకులకు ఈ–రూపీలను చెల్లించాలనుకుంటే క్యూఆర్ కోడ్ స్కాన్ విధానంలో చేయవచ్చు. ఇది అచ్చం యూపీఐ చెల్లింపుల మాదిరే పనిచేస్తుంది. ప్రస్తుతం యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసేంత సులభంగానే.. ఈ–రూపీ చెల్లింపులు కూడా ఉంటాయి. యూపీఐ మాదిరే అప్పటికప్పుడే ఈ–రూపీ బదిలీ అవుతుంది. క్షణాల్లోనే అవతలి వ్యక్తి వ్యాలెట్‌కు మీరు పంపిన ఈ–రూపీ చేరిపోతుంది. కొద్ది మందికే.. డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రాగా.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లో కొద్ది మంది వినియోగానికే (క్లోజ్డ్ యూజర్ గ్రూప్) రిటైల్ సీబీడీసీ (ఈ–రూపీ)ని పరిమితం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా గుర్తించిన సమస్యలను పరిష్కరించిన తర్వాతే పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ–రూపీ లావాదేవీలు పూర్తయ్యే బాధ్యతను ఆర్బీఐతో కలసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) చూస్తోంది. లావాదేవీలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడితే ఎన్పీసీఐ పరిష్కరిస్తుంది. మొబైల్ బ్యాంకింగ్‌ను తరచూ వినియోగించే కస్టమర్లు, డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్న వారి నుంచి కొందరిని ప్రయోగాత్మక పరీక్షల కోసం బ్యాంక్‌లు ఎంపిక చేసుకున్నాయి. అలా ఎంపిక చేసిన వారి ఫోన్లకు ఈ రూపీ వ్యాలెట్ లింక్‌ను పంపిస్తాయి. ఒకవేళ బ్యాంక్ నుంచి ఎటువంటి సందేశం కానీ, యూఆర్ఎల్ లింక్ కానీ రాని వారు, ఈ రూపీ వ్యాలెట్ పట్ల ఆసక్తిగా ఉంటే, బ్యాంకు మేనేజర్‌ను సంప్రదించొచ్చు. అభ్యర్థనను ఆమోదించే లేదా తిరస్కరించే విచక్షణ వారిపై ఉంటుంది. అనుకూలతలు/ప్రతికూలతలు కరెన్సీ నోట్లు అయితే నకిలీలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది. డిజిటల్ కరెన్సీకి ఆ బెడద ఉండదు. మొబైల్ ఫోన్ పోయినా దుర్వినియోగం బెడద ఉండదు. బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, వ్యాలెట్‌లోని నగదును బదిలీ చేసుకోవచ్చు. యూపీఐ అన్నది బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉంటుంది. కనుక యూపీఐ యాప్ ఉన్న ఫోన్ పోతే దుర్వినియోగం ప్రమాదం ఎక్కువ. ఈ–రూపీ వ్యాలెట్‌తో ఆ రిస్క్ ఉండదు. ప్రతి లావాదేవీ టోకెనైజ్డ్ విధానంలో, యూనిక్‌గా, భద్రంగా ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీలో సమస్యలు ఉంటే టోకెన్ జారీ కాదు. లావాదేవీ తక్షణమే జరిగిపోతుంది కనుక ఫెయిల్యూర్ అవకాశాలు తక్కువ. సీబీడీసీ వినియోగం పెరిగే కొద్దీ ఆర్బీఐకి భారీగానే వ్యయాలు ఆదా అవుతాయి. ఎందుకంటే కరెన్సీ నోట్ల ముద్రణ కోసం చేసే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు, బ్యాంకు లు, ఆర్థిక సంస్థలకు భౌతిక కరె న్సీ నిర్వహణ వ్యయా లు తగ్గుతాయి. వాటి మధ్య అంతర్గత చెల్లింపుల వ్యయాలు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ మరింత డిజిటల్‌గా మారుతుంది. దీని వల్ల అధికారిక ఆర్థిక కార్యకలాపాలు, లావాదేవీలు పెరుగుతాయి. దేశాల మధ్య చెల్లింపులకు అనువుగా ఉంటుంది. అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దీని వ్యాప్తి, వినియోగం, సౌకర్యం, సమస్యలపై మరింత స్పష్టత వస్తుంది. వడ్డీ రాదు.. యూపీఐ విధానానికి, ఈ రూపీకి మధ్య వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. యూపీఐ అన్నది మన బ్యాంకు ఖాతాలో ఉన్న నగదును వేరొక వ్యక్తి బ్యాంకు ఖాతాకు యూపీఐ ద్వారా బదిలీ చేయడం. కానీ, ఈ–రూపీ అలా కాదు. ఒక వ్యక్తి వ్యాలెట్ నుంచి మరో వ్యక్తి ఈ–రూపీ వ్యాలెట్‌కు బదిలీ చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో రోజువారీ బ్యాలన్స్‌పై ఎంతో కొంత వడ్డీ ముడుతుంది. కానీ, వ్యాలెట్‌లో ఉన్న ఈ–రూపీలపై వడ్డీ రాబడి ఉండదు. ఎందుకంటే ఇది బ్యాంక్ బ్యాలన్స్ కిందకు రాదు. భౌతిక కరెన్సీ మన పర్స్‌లో ఉన్న మాదిరే అని గుర్తించాలి. ఈ–రూపీ వ్యాలెట్‌లో ఉన్న బ్యాలన్స్‌ను తిరిగి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. అప్పటి నుంచి వడ్డీ ఆదాయం వస్తుంది. యూపీఐ వర్సెస్ ఈ–రూపీ ఈ–రూపీ రాకతో యూపీఐ విషయంలో కొందరిలో సందేహాలున్నాయి. కానీ, ఈ రెండు వేర్వేరు సాధనాలు. దేశంలో 26 కోట్ల యూపీఐ యూజర్లు ఉన్నారు. అక్టోబర్ నెలకు 730 కోట్ల యూపీఐ లావాదేవీలు (రూ.12.11 లక్షల కోట్లు విలువైన) నమోదయ్యాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసిన టెక్నాలజీకి డిజిటల్ రూపీ పూర్తి భిన్నమైనది. యూపీఐ లావాదేవీల నిర్వహణలో బ్యాంక్‌ల పాత్ర ఉంటుంది. డిజిటల్ రూపీ లావాదేవీల్లో బ్యాంక్‌ల పాత్ర ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య కరెన్సీ మార్పిడిలో మరొకరి పాత్ర ఎలా అయితే ఉండదో.. డిజిటల్ రూపీలోనూ అంతేనని అర్థం చేసుకోవాలి. యూపీఐ లావాదేవీలను ట్రాక్ చేయగలరు. కానీ, ఇద్దరు వ్యక్తులు లేదా రెండు పార్టీల మధ్య ప్రైవేటుగా కొనసాగే సీబీడీసీ లావాదేవీలను వేరెవరూ ట్రాక్ చేయలేరు. గోప్యంగా ఉంటాయి. చెల్లింపుల పరంగా యూపీఐ సౌకర్యం? ఎవరైనా కానీ వినియోగంలో సౌకర్యాన్నే చూస్తారు. సీబీడీసీతో పోలిస్తే యూపీఐ చెల్లింపులే సౌకర్యం. ఎలా అంటే, ఉదాహరణకు రూ.47 విలువ చేసే వాటిని కొనుగోలు చేశారు. అప్పుడు చెల్లింపులు చేయాలి. యూపీఐ ద్వారా అయితే కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఇస్తే చాలు రూ.47 చెల్లింపు పూర్తవుతుంది. మరి ఈ–రూపీ అలా కాదు. రూ.47ను ఏ డినామినేషన్లో చెల్లించాలన్నది నిర్ణయించాలి. రూ.20 డినామినేషన్ రెండు, లేదా రూ.10 డినామినేషన్ నాలుగు.. ఆ తర్వాత రూ.5 డినామినేషన్ ఒకటి, రూ.2 డినామినేషనన్ ఎంపిక చేసుకుని బదిలీ చేయాలి. లేదంటే రూపాయి డినామినేషన్లో 47 ఈ–రూపీలను సెలక్ట్ చేసుకోవాలి. వ్యాలెట్‌లో అన్ని డినామినేషన్లలో ఈ–రూపీ ఉంటేనే చెల్లింపులు సాధ్యపడతాయి. అలా కాకుండా వ్యాలెట్‌లో కేవలం రూ.10, 20, 50 డినామినేషన్‌లోనే ఈ–రూపీలు ఉంటే రూ.47 చెల్లింపు సాధ్యపడదు. ఆటోమేటిగ్గా చెల్లింపునకు తగినట్టు డినామినేషన్ స్ప్లిట్ అయ్యి, బదిలీ అయ్యే విధానాన్ని అభివృద్ధి చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది. అప్పుడు యూపీఐకి ప్రత్యా మ్నాయం కాగలదు. అయినా కానీ రిటైల్ చెల్లింపులకు యూపీఐ ఎక్కువ అనుకూలం. యూపీఐ ముందుగా వచ్చి, దేశంలోని అన్ని ప్రాంతాలకూ చేరిపోయింది. దీనికి టెక్నాలజీ పెద్దగా తెలియక్కర్లేదు. బ్యాంకు ఖాతాకు వెళ్లి లోడ్ చేసుకోవక్కర్లేదు. అందుకే ఇకపైనా చెల్లింపుల్లో యూపీఐ హవా కొనసాగుతుందని విశ్లేషకుల అంచనా. బ్యాంకుల మధ్య, సంస్థల మధ్య చెల్లింపుల సెటిల్మెంట్కు, విదేశాలతో రూపాయి వాణిజ్యానికి సీబీడీసీ అనుకూలిస్తుందని చెబుతున్నారు. ఎక్కడ వినియోగం? ఈ–రూపీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే, యూపీఐ మాదిరే దీన్ని కూడా దేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం క్లోజ్ హెల్డ్ గ్రూపు పరిధిలోని వ్యక్తులు, వర్తకుల మధ్య లావాదేవీలకే పరిమితంగా ఉంది. ఏటీఎం నుంచి నగదును విత్‌డ్రా చేసుకుని, అవసరమైన చోట చెల్లింపులు చేస్తుంటాం. అదే మాదిరి ఈ–రూపీని వ్యాలెట్లలోకి లోడ్ చేసుకుని కావాల్సిన చోట చెల్లింపులు/బదిలీ చేసుకోవచ్చు. రెండు రకాలు.. సీబీడీసీ రెండు రకాలుగా వర్గీకరణ చేశారు. రిటైల్, హోల్‌సేల్. రిటైల్ సీబీడీసీని వ్యక్తులు, ప్రైవేటు రంగం, వ్యాపార సంస్థలు ఉపయోగించుకోవచ్చు. హోల్‌సేల్ సీబీడీసీ కేవలం బ్యాంక్‌లు, ఆర్థిక సంస్థల మధ్య వినియోగానికే ప్రస్తుతం పరిమితం చేశారు. వ్యక్తుల మధ్య, వ్యక్తులు–వర్తకుల మధ్య లావాదేవీలకు ఉద్దేశించినది రిటైల్ సీబీడీసీ. హోల్‌సేల్ సీబీడీసీ అన్నది రెండు బ్యాంకులు, ఆర్థిక సంస్థల మధ్య లావాదేవీల సెటిల్మెంట్కు ఉద్దేశించినది. అదనపు సాధనం సీబీడీసీ అనేది ప్రస్తుతమున్న మరే సాధనానికి బదులుగా తీసుకొచ్చింది కాదు. అదనపు చెల్లింపు సాధనంగా, కరెన్సీకి డిజిటల్ రూపంగా తీసుకొచ్చినది మాత్రమే. వినియోగంలో సౌకర్యం, వ్యయాలు తగ్గింపు, భద్రత, రక్షణ ఎన్నో అంశాలు డిజిటల్ రూపీతో ఇమిడి ఉన్నాయి. చదవండి👉 నట్టేట ముంచిన ఉద్యోగి, రాత్రికి రాత్రే లక్షల కోట్లు ఆవిరి! -
పాపాయి... డిజిటల్ రూపాయి!
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో నవ శకానికి నాంది పలికింది. మొన్న గురువారం నుంచి వ్యక్తుల మధ్య ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ వినియోగాన్ని ప్రారంభించింది. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలోని నిర్ణీత వర్తకులు, కస్టమర్ల బృందాలకు ఈ డిజిటల్ కరెన్సీని అందు బాటులో ఉంచింది. వారు తమ మధ్య లావాదేవీలకు సాధారణ కరెన్సీ లాగే ఈ డిజిటల్ రూపీని వినియోగిస్తారు. ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లోటుపాట్లను గమనించి, మరింత మెరుగ్గా డిజిటల్ రూపీని విస్తృతస్థాయిలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక. ఇలా సొంత ‘కేంద్ర బ్యాంక్ డిజి టల్ కరెన్సీ’ (సీబీడీసీ)తో నడుస్తున్న మరో 15 దేశాల సరసన భారత్ చేరుతోంది. సీబీడీసీతో కష్ట నష్టాల్ని ఆర్బీఐ కొద్దికాలంగా పరిశీలిస్తోంది. ఓ వ్యూహంతో, దశలవారీ ఆచరణ కోసం చూస్తోంది. సీబీడీసీ, లేదా డిజిటల్ రూపీ... డబ్బుకు ఎలక్ట్రానిక్ రూపమే! మరోమాటలో కేంద్ర బ్యాంక్ (మన దగ్గర రిజర్వ్ బ్యాంక్) జారీ చేసిన కరెన్సీనోట్లకు డిజిటల్ రూపం. చేతికి ఇచ్చిపుచ్చుకోని లావాదేవీలకు ఈ ఎలక్ట్రానిక్ డబ్బును వాడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని తెస్తుందని ఈ ఏడాది బడ్జెట్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అందరూ వాడేందుకు అందు బాటులో ఉండే ‘రిటైల్ సీబీడీసీ’, నిర్ణీత ఆర్థిక సంస్థలే వాడేందుకు ఉద్దేశించిన ‘టోకు సీబీడీసీ’– ఇలా సీబీడీసీ రెండు రకాలు. కేంద్ర బ్యాంక్ అండదండలతో నడిచే ఈ డిజిటల్ రూపీని నవంబర్ 1 నుంచి టోకు వ్యాపారంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌కు దాన్ని వాడారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి చిల్లర వర్తక విభాగంలోకీ విస్తరించారు. ఈ రిటైల్ ప్రయోగం తొలిదశకు 4 బ్యాంక్‌లను గుర్తించారు. అవి కోరినట్టు రూ. 1.7 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీని జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి డిమాండ్ పెరిగేకొద్దీ, మరింత డిజిటల్ రూపీని ఆర్బీఐ సృష్టిస్తుంది. వీధిలో వ్యాపారుల నుంచి ఆహార యాప్‌ల వరకు 50 వేల మంది వర్తకుల్నీ, కస్టమర్లనీ దీనిలో భాగం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మరిన్ని బ్యాంకులకూ, హైదరాబాద్ లాంటిచోట్లకూ విస్తరించనున్నారు. నిజానికి, డిజిటల్ రూపీ వ్యాలెట్... జేబులో పర్సు లాంటిదే. కాకపోతే యాప్‌తో డిజిటల్ రూపంలో, స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు జరపాలి. మరి, ఇప్పటికే గూగుల్‌పే లాంటి డిజిటల్ వ్యాలెట్లతో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్’ (యూపీఐ)లో చెల్లింపులు చేస్తున్నాం కదా? అక్కడ మొబైల్లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలతో చెల్లింపులు జరపాలి గనక తెర వెనుక బ్యాంక్‌ల లాంటి మధ్యవర్తులకు బోలెడంత పని! ఇక్కడ మధ్యవర్తుల్లేని డిజిటల్ రూపీలో పర్సులోని నోట్లలా నేరుగా నగదు బదలీ అవుతుంది. అయితే బిట్‌కాయిన్, ఈథెరియం లాంటి క్రిప్టోకరెన్సీలకు ఇది పూర్తి భిన్నం. 2008లో ఒక ఊహగా మొదలై, 2015లో తెరపైకొచ్చిన బిట్‌కాయిన్ సైతం పారదర్శకంగా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా, అజ్ఞాతంగా సాగే డిజిటల్ కరెన్సీ కావాలనే భావన ముందుకు తెచ్చింది. కరోనా వేళ వందలాది క్రిప్టోకరెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరా 2022కు వచ్చేసరికి అనుమానాస్పద లావాదేవీలతో ఆ కల చెదిరింది. క్రిప్టోలు కుప్పకూలి, ఇప్పటికి దాదాపు 1200 కోట్ల డాలర్ల మేర మదుపర్ల సొమ్ము ఆవిరై, కథ మారిపోయింది. ఒక్క మాటలో బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో నడిచే వికేంద్రీకృత డిజిటల్ ఆస్తి – క్రిప్టో. దాని వికేంద్రీకృత స్వభావం, అలాగే బ్యాంకులు – ఆర్థిక సంస్థల లాంటి మధ్యవర్తులే లేని దాని నిర్వహణ వివాదాస్పదం. అందుకు భిన్నంగా సీబీడీసీ... సాక్షాత్తూ ఆర్బీఐ డిజిటల్ రూపంలో ఇచ్చే అధికారిక కరెన్సీ. దీనికి ప్రభుత్వపు అండ ఉంటుంది గనక విలువ మారదు. ఫోన్లో డిజిటల్ రూపీ ఉంటే చేతిలో కరెన్సీ నోట్లున్నట్టే! ఆర్బీఐ ఇలా ‘సీబీడీసీ’ని తేవడం ప్రశంసనీయమైన చర్యే. డిజిటల్ రూపీతో లావాదేవీల ఖర్చు తగ్గుతుంది. అధీకృత నెట్‌వర్క్‌ల పరిధిలో లావాదేవీలన్నీ ప్రభుత్వం ఇట్టే తెలుసుకోగలుగుతుంది. ప్రతిదీ చట్టాలకు లోబడి సాగుతుంది. దేశంలోకి డబ్బు ఎలా వస్తోంది, ఎలా పోతోందన్న దానిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకూ, మెరుగైన బడ్జెట్‌కూ వెసులు బాటు లభిస్తుంది. భౌతిక కరెన్సీ నోట్లలా చిరిగిపోవడం, కాలిపోవడం, చేజారడం లాంటివేవీ ఉండవు గనక ఈ డిజిటల్ కరెన్సీ ఆయుఃప్రమాణం అనంతం. ఈ దెబ్బతో నగదు స్వరూప స్వభా వాలు, విధులు సమూలంగా మారిపోతాయి. అన్నివర్గాలనూ ఆర్థికంగా కలుపుకొనిపోవడానికీ, చెల్లింపుల ప్రపంచంలో సామర్థ్యం తేవడానికీ సీబీడీసీ ప్రోద్బలమిస్తుంది. ఇప్పటికే ఉన్న రిజర్వ్ బ్యాంక్ ‘ఆర్టీజీఎస్’ విధానం, ఈ కొత్త సీబీడీసీ కలసి లావాదేవీల్లో పారదర్శకత, భద్రత తెస్తాయి. కాలగతిలో డబ్బు తన రూపం మార్చుకొంటూ వచ్చింది. ఆర్థిక సంక్షోభాలతో పాటు అనేక వ్యవస్థాగత జాగ్రత్తలూ వచ్చాయి. ఆధునిక సాంకేతికతతో నూతన సహస్రాబ్దిలో ధనలక్ష్మి అనేక రూపాలు ధరించింది. కరెన్సీ నోట్లలా ముద్రించాల్సిన పని లేని డిజిటల్ రూపీతో మున్ముందు మరిన్ని మార్పులు చూడనున్నాం. ప్రపంచవ్యాప్త అంగీకారంతో ప్రవాసీయులూ వినియోగించే వీలుంది గనక సరిహద్దులు చెరిగిపోనున్నాయి. యూపీఐ లాగా లావాదేవీలకు బ్యాంక్ ఖాతాతో పనిలేకపోవడం మరో సౌకర్యం. నవీన భారతావనిలో యూపీఐ చెల్లింపుల విజయగాథ ఆధునిక విధానాల పట్ల మనకు పెరుగుతున్న ఆసక్తికి తార్కాణం. ఇవాళ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో మనదే అగ్రస్థానం. అందుకే, సరైన సమయంలో పుట్టిన పాపాయి... మన డిజిటల్ రూపాయి! -
డిజిటల్ కరెన్సీ: సీబీడీసీపై ఆర్బీఐ కీలక ప్రకటన
సాక్షి,ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిజిటల్ కరెన్సీకి సంబంధించి కీలక ప్రకటన చేసింది. డిజిటల్ రుపీ వెర్షన్ డిసెంబర్ 1 న లాంచ్ చేస్తున్నట్టు మంగళవారం(నవంబర్ 29) ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ సీబీడీసీపైలట్ ప్రాజెక్ట్‌ను నవంబర్ 1న ప్రారంభించిన సంగతి తెలిసిందే. (ఫోర్బ్స్ టాప్ -10 లిస్ట్: బిలియనీర్లు అదానీ, అంబానీ ఎక్కడ?) క్లోజ్డ్ యూజర్ గ్రూప్ వినియోగదారులు భాగస్వామ్య బ్యాంకులు అందించే డిజిటల్ వాలెట్ ద్వారా ఇ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్లు లేదా పరికరాలలో నిల్వ చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీంతో రీటైల్ సెగ్మెంట్లో సాధారణ వ్యాపారులకు, కస్టమర్లకు డిజిటల్ రుపీ అందుబాటులోకి రానుంది. (నైకా ఫల్గుణి సంచలనం: తగ్గేదేలే అంటున్న బిజినెస్ విమెన్) కొన్ని ముఖ్యాంశాలు ♦రిటైల్ డిజిటల్ ప్రస్తుతం చలామణిలోఉన్న 2 వేలు, 500, 200 రూపాయలు తదితర కరెన్సీ నోట్లు, నాణేలలాగానే అదే డినామినేషన్లలో అందుబాటులో ఉంటుంది. ♦వ్యక్తి నుండి వ్యక్తికి ( పీటూపీ) లావాదేవీలు అలాగే వ్యక్తి నుండి వ్యాపారి (పీటూ మర్చంట్) లావాదేవీలు చేసుకోవచ్చు. ♦అన్ని క్యూఆర్ కోడ్లను ఉపయోగించి చెల్లింపులు చేయవచ్చు ♦భౌతిక నగదు విషయంలో మాదిరిగానే రిటైల్ డిజిటల్ రూపాయిలో సెటిల్మెంట్ ట్రస్ట్, సేఫ్టీ హామీ ఇస్తుంది. ♦ వాలెట్లలో నిల్వ ఉంచిన డిజిటల్ కరెన్సీకి ఎటువంటి వడ్డీ రాదు ♦ అయితే రిటైల్ డిజిటల్ రూపాయిని వడ్డీని సంపాదించే బ్యాంకుల్లో డిపాజిట్లుగా మార్చుకోవచ్చు . ♦తొలిదశగా దేశంలోని నాలుగు నగరాల్లో ఎస్బీఐ, సీఐసీ బ్యాంక్, యస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ ద్వారా తొలి దశలో లావాదేవీలను ప్రారంభించనుంది. ♦ రెండో దశలో మరిన్ని నగరాల్లో బీవోబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,హెచ్డీఎఫ్సీ బ్యాంక్ , కోటక్ మహీంద్రా బ్యాంక్ తదుపరి దశలో పైలట్‌లో చేరనున్నాయి. ♦ ప్రారంభంలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ అనే నాలుగు నగరాల్లో డిజిల్ రూపాయి లావాదేవీలు ప్రారంభం. క్రమంగా అహ్మదాబాద్, గ్యాంగ్‌టక్, గౌహతి, హైదరాబాద్, ఇండోర్, కొచ్చి, లక్నో, పాట్నా సిమ్లాలకు అమల్లోకి వస్తుంది. క్రమంగా మరిన్ని బ్యాంకులు, నగరాలు ఈ జాబితాలో చేరతాయి. కాగా నవంబర్ 1 నుంచే ఆర్బీఐ హోల్‌సేల్ ఇ-రూపాయిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది, ఎనిమిది బ్యాంకులు ఇ-రూపాయిని ఉపయోగించి ప్రభుత్వ సెక్యూరిటీలలో లావాదేవీలు జరుపు తున్నాయి. దీని ఆధారంగా ఇ-రూపాయి ఇతర ఫీచర్లు ,అప్లికేషన్లను తర్వాత టెస్ట్ చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ అమలుపై సమీక్ష తరువాత మరిన్ని బ్యాంకులు, వినియోగదారులు పరిధిని క్రమంగా విస్తరిస్తామని గతంలో ఆర్బీఐను ప్రకటించింది. ఇదీ చదవండి : షాకింగ్: 5.4 మిలియన్ల ట్విటర్ యూజర్ల డేటా లీక్! మస్క్ స్పందన ఏంటి?