ముంబై: ఈ ఏడాది చివరికి రోజువారీగా 10 లక్షల సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి) లావాదేవీల లక్ష్యాన్ని చేరుకుంటామని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రవిశంకర్ ప్రకటించారు. ప్రస్తుతం రోజువారీగా 5,000–10,000 ఈ–రూపీ లావాదేవీలు నమోదవుతున్నట్టు చెప్పారు. యూపీఐ వ్యవస్థతో సీబీడీసీ అనుసంధానతను ఈ ఏడాది జూన్‌లో ఆర్‌బీఐ ఎంపీసీలో భాగంగా ప్రకటించగా, ఈ నెలాఖరుకు ఇది కార్యరూపం దాలుస్తుందని రవిశంకర్ తెలిపారు. కాకపోతే సీబీడీసీ ఎకోసిస్టమ్ కిందకు మరిన్ని బ్యాంక్‌లు చేరాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది నవంబర్‌లో హోల్‌సేల్ లావాదేవీలకు సీబీడీసీని ప్రయోగాత్మకంగా ఆర్‌బీఐ ప్రారంభించగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి రిటైల్ లావాదేవీలకు సైతం దీన్ని విస్తరించింది.
తొలుత ఎనిమిది బ్యాంక్‌లను అనుమతించగా, ప్రస్తుతం 13 బ్యాంక్‌లకు సీబీడీసీ విస్తరించింది. ప్రస్తుతం 13 లక్షల మంది యూజర్లు సీబీడీసీని వినియోగిస్తున్నారని, ఇందులో 3 లక్షల మంది వర్తకులు ఉన్నట్టు రవిశంకర్ చెప్పారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రోజుకు 10 లక్షల లావాదేవీల లక్ష్యం కష్టమైనది కాదన్నారు. యూపీఐపై రోజుకు 31 కోట్ల లావాదేవీలు నమోదవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువ మంది యూజర్లను ఆకర్షించడంపైనే దృష్టి పెట్టామని, ఏప్రిల్ నాటికి లక్షగా ఉన్న యూజర్ల సంఖ్య అనంతరం రెండు నెలల్లోనే 13 లక్షలకు పెరిగినట్టు వివరించారు. ఇక మీదట రోజువారీ లావాదేవీల పెంపు లక్ష్యంగా పనిచేయనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment