భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరో నవ శకానికి నాంది పలికింది. మొన్న గురువారం నుంచి వ్యక్తుల మధ్య ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీ వినియోగాన్ని ప్రారంభించింది. ముంబయ్, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్‌లలోని నిర్ణీత వర్తకులు, కస్టమర్ల బృందాలకు ఈ డిజిటల్ కరెన్సీని అందు బాటులో ఉంచింది. వారు తమ మధ్య లావాదేవీలకు సాధారణ కరెన్సీ లాగే ఈ డిజిటల్ రూపీని వినియోగిస్తారు.
ఈ పైలట్ ప్రాజెక్ట్‌తో లోటుపాట్లను గమనించి, మరింత మెరుగ్గా డిజిటల్ రూపీని విస్తృతస్థాయిలో అందరికీ అందుబాటులోకి తేవాలన్నది ప్రణాళిక. ఇలా సొంత ‘కేంద్ర బ్యాంక్ డిజి టల్ కరెన్సీ’ (సీబీడీసీ)తో నడుస్తున్న మరో 15 దేశాల సరసన భారత్ చేరుతోంది. సీబీడీసీతో కష్ట నష్టాల్ని ఆర్బీఐ కొద్దికాలంగా పరిశీలిస్తోంది. ఓ వ్యూహంతో, దశలవారీ ఆచరణ కోసం చూస్తోంది.
సీబీడీసీ, లేదా డిజిటల్ రూపీ... డబ్బుకు ఎలక్ట్రానిక్ రూపమే! మరోమాటలో కేంద్ర బ్యాంక్ (మన దగ్గర రిజర్వ్ బ్యాంక్) జారీ చేసిన కరెన్సీనోట్లకు డిజిటల్ రూపం. చేతికి ఇచ్చిపుచ్చుకోని లావాదేవీలకు ఈ ఎలక్ట్రానిక్ డబ్బును వాడవచ్చు. రిజర్వ్ బ్యాంక్ త్వరలోనే డిజిటల్ కరెన్సీని తెస్తుందని ఈ ఏడాది బడ్జెట్‌లోనే కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
అందరూ వాడేందుకు అందు బాటులో ఉండే ‘రిటైల్ సీబీడీసీ’, నిర్ణీత ఆర్థిక సంస్థలే వాడేందుకు ఉద్దేశించిన ‘టోకు సీబీడీసీ’– ఇలా సీబీడీసీ రెండు రకాలు. కేంద్ర బ్యాంక్ అండదండలతో నడిచే ఈ డిజిటల్ రూపీని నవంబర్ 1 నుంచి టోకు వ్యాపారంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ ట్రేడింగ్‌కు దాన్ని వాడారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి చిల్లర వర్తక విభాగంలోకీ విస్తరించారు.
ఈ రిటైల్ ప్రయోగం తొలిదశకు 4 బ్యాంక్‌లను గుర్తించారు. అవి కోరినట్టు రూ. 1.7 కోట్ల విలువైన డిజిటల్ కరెన్సీని జారీ చేశారు. బ్యాంక్‌ల నుంచి డిమాండ్ పెరిగేకొద్దీ, మరింత డిజిటల్ రూపీని ఆర్బీఐ సృష్టిస్తుంది. వీధిలో వ్యాపారుల నుంచి ఆహార యాప్‌ల వరకు 50 వేల మంది వర్తకుల్నీ, కస్టమర్లనీ దీనిలో భాగం చేస్తున్నారు. కొద్దిరోజుల్లో మరిన్ని బ్యాంకులకూ, హైదరాబాద్ లాంటిచోట్లకూ విస్తరించనున్నారు. నిజానికి, డిజిటల్ రూపీ వ్యాలెట్... జేబులో పర్సు లాంటిదే.
కాకపోతే యాప్‌తో డిజిటల్ రూపంలో, స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు జరపాలి. మరి, ఇప్పటికే గూగుల్‌పే లాంటి డిజిటల్ వ్యాలెట్లతో ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేజ్’ (యూపీఐ)లో చెల్లింపులు చేస్తున్నాం కదా? అక్కడ మొబైల్‌లో లింక్ చేసిన బ్యాంక్ ఖాతాలతో చెల్లింపులు జరపాలి గనక తెర వెనుక బ్యాంక్‌ల లాంటి మధ్యవర్తులకు బోలెడంత పని! ఇక్కడ మధ్యవర్తుల్లేని డిజిటల్ రూపీలో పర్సులోని నోట్లలా నేరుగా నగదు బదలీ అవుతుంది.
అయితే బిట్‌కాయిన్, ఈథెరియం లాంటి క్రిప్టోకరెన్సీలకు ఇది పూర్తి భిన్నం. 2008లో ఒక ఊహగా మొదలై, 2015లో తెరపైకొచ్చిన బిట్‌కాయిన్ సైతం పారదర్శకంగా, ప్రభుత్వ నియంత్రణ లేకుండా, అజ్ఞాతంగా సాగే డిజిటల్ కరెన్సీ కావాలనే భావన ముందుకు తెచ్చింది. కరోనా వేళ వందలాది క్రిప్టోకరెన్సీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తీరా 2022కు వచ్చేసరికి అనుమానాస్పద లావాదేవీలతో ఆ కల చెదిరింది.
క్రిప్టోలు కుప్పకూలి, ఇప్పటికి దాదాపు 1200 కోట్ల డాలర్ల మేర మదుపర్ల సొమ్ము ఆవిరై, కథ మారిపోయింది. ఒక్క మాటలో బ్లాక్‌చెయిన్ సాంకేతికతతో నడిచే వికేంద్రీకృత డిజిటల్ ఆస్తి – క్రిప్టో. దాని వికేంద్రీకృత స్వభావం, అలాగే బ్యాంకులు – ఆర్థిక సంస్థల లాంటి మధ్యవర్తులే లేని దాని నిర్వహణ వివాదాస్పదం. అందుకు భిన్నంగా సీబీడీసీ... సాక్షాత్తూ ఆర్బీఐ డిజిటల్ రూపంలో ఇచ్చే అధికారిక కరెన్సీ. దీనికి ప్రభుత్వపు అండ ఉంటుంది గనక విలువ మారదు. ఫోన్‌లో డిజిటల్ రూపీ ఉంటే చేతిలో కరెన్సీ నోట్లున్నట్టే!
ఆర్బీఐ ఇలా ‘సీబీడీసీ’ని తేవడం ప్రశంసనీయమైన చర్యే. డిజిటల్ రూపీతో లావాదేవీల ఖర్చు తగ్గుతుంది. అధీకృత నెట్‌వర్క్‌ల పరిధిలో లావాదేవీలన్నీ ప్రభుత్వం ఇట్టే తెలుసుకోగలుగుతుంది. ప్రతిదీ చట్టాలకు లోబడి సాగుతుంది. దేశంలోకి డబ్బు ఎలా వస్తోంది, ఎలా పోతోందన్న దానిపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక ప్రణాళికలకూ, మెరుగైన బడ్జెట్‌కూ వెసులు బాటు లభిస్తుంది.
భౌతిక కరెన్సీ నోట్లలా చిరిగిపోవడం, కాలిపోవడం, చేజారడం లాంటివేవీ ఉండవు గనక ఈ డిజిటల్ కరెన్సీ ఆయుఃప్రమాణం అనంతం. ఈ దెబ్బతో నగదు స్వరూప స్వభా వాలు, విధులు సమూలంగా మారిపోతాయి. అన్నివర్గాలనూ ఆర్థికంగా కలుపుకొనిపోవడానికీ, చెల్లింపుల ప్రపంచంలో సామర్థ్యం తేవడానికీ సీబీడీసీ ప్రోద్బలమిస్తుంది. ఇప్పటికే ఉన్న రిజర్వ్ బ్యాంక్ ‘ఆర్టీజీఎస్’ విధానం, ఈ కొత్త సీబీడీసీ కలసి లావాదేవీల్లో పారదర్శకత, భద్రత తెస్తాయి.
కాలగతిలో డబ్బు తన రూపం మార్చుకొంటూ వచ్చింది. ఆర్థిక సంక్షోభాలతో పాటు అనేక వ్యవస్థాగత జాగ్రత్తలూ వచ్చాయి. ఆధునిక సాంకేతికతతో నూతన సహస్రాబ్దిలో ధనలక్ష్మి అనేక రూపాలు ధరించింది. కరెన్సీ నోట్లలా ముద్రించాల్సిన పని లేని డిజిటల్ రూపీతో మున్ముందు మరిన్ని మార్పులు చూడనున్నాం. ప్రపంచవ్యాప్త అంగీకారంతో ప్రవాసీయులూ వినియోగించే వీలుంది గనక సరిహద్దులు చెరిగిపోనున్నాయి.
యూపీఐ లాగా లావాదేవీలకు బ్యాంక్ ఖాతాతో పనిలేకపోవడం మరో సౌకర్యం. నవీన భారతావనిలో యూపీఐ చెల్లింపుల విజయగాథ ఆధునిక విధానాల పట్ల మనకు పెరుగుతున్న ఆసక్తికి తార్కాణం. ఇవాళ డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలో మనదే అగ్రస్థానం. అందుకే, సరైన సమయంలో పుట్టిన పాపాయి... మన డిజిటల్ రూపాయి!
పాపాయి... డిజిటల్ రూపాయి!
Published Sat, Dec 3 2022 2:15 AM | Last Updated on Sat, Dec 3 2022 2:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment