Executive director
-
ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 'అవిరల్ జైన్'ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా నియమించింది. ఈడీగా పదోన్నతి పొందక ముందు, జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేశారు.అవిరల్ జైన్‌కు కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, జైన్ జైన్ లీగల్ డిపార్ట్మెంట్, ప్రాంగణాల విభాగాన్ని చూసుకుంటారు. అంతే కాకుండా సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన జైన్.. యాంటీ మనీ లాండరింగ్ (AML), నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు, క్యాపిటల్ మార్కెట్లకు సంబంధించిన సర్టిఫికేట్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) సర్టిఫైడ్ అసోసియేట్ కూడా.RBI appoints Shri Aviral Jain as new Executive Directorhttps://t.co/Oy4ADeR5Qy— ReserveBankOfIndia (@RBI) October 4, 2024 -
2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
కోల్‌కతా: డాలర్ ప్రాతిపదికన వార్షిక వృద్ధి రేటు 12 శాతంగా ఉంటే, 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 55 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. 2018 నుండి 2021 వరకు ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సుబ్రమణియన్ బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే.2020–2021 కోవిడ్ సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ పటిష్టత చెక్కుచెదరకుండా కీలకపాత్ర పోషించిన ఆయన, మహమ్మారిపై దేశం ప్రతిస్పందన ప్రపంచంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు..» 2016 నుండి ద్రవ్యోల్బణం కట్టడికి దేశం పటిష్ట చర్యలు తీసుకుంది. దీనితో దేశం సగటు ధరల పెరుగుదల రేటును ఐదు శాతం వద్ద కట్టడి జరిగింది. 2016 ముందు ఈ రేటు 7.5 శాతంగా ఉండేది. » ద్రవ్యోల్బణం కట్టడితో దేశం ఎనిమిది శాతం వృద్ధి సాధిస్తుందని విశ్వస్తున్నాం. దీనిని పరిగణనలోకి తీసుకోని నామినల్ గ్రోత్‌రేట్ 13 శాతంగా ఉంటుంది. ఐదు శాతం వద్ద ద్రవ్యోల్బణం కట్టడి కొనసాగుతుందని విశ్వసిస్తున్నాం. » పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, ప్రైవేటు రుణ వ్యవస్థ పురోగతి ఎకానమీకి మూడు కీలక స్తంభాలు. ఇవి ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధికి సహాయపడతాయి. » దీర్ఘకాలంలో డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ తరుగుదల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉండటంతో, ఆర్థిక వ్యవస్థ ఫండమెంటల్స్ పటిష్టంగా, స్థిరంగా కొనసాగుతున్నాయి. » డాలర్లో భారత్ వాస్తవ వృద్ధి రేటు 12 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ఇదే జరిగితే ఆర్థిక వ్యవస్థ పరిమాణం ప్రతి ఆరు సంవత్సరాలకు రెట్టింపు అవుతుంది. ఈ లెక్కన ప్రస్తుత 3.8 ట్రిలియన్ డాలర్ల భారత్ ఎకానమీ 2047 నాటికి 55 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది. » అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో పెట్టుబడులతో సంబంధం లేకుండా, ఉత్పాదకత మెరుగుదల మాత్రమే వృద్ధికి కారణమవుతుంది. » ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా సగం నుంచి రెండు వంతులు ఇంకా అనధికారిక (అన్‌ఫార్మల్) రంగంలోనే ఉంది. » ఆర్థిక వ్యవస్థ ఎంత అధికారికంగా మారితే (ఫార్మల్గా) అది అంత అధిక ఉత్పాదకతకు దారి తీస్తుంది. ప్రపంచ సహచర దేశాలతో పోలిస్తే భారత్ ఫార్మల్ సెక్టార్లో ఉత్పాదకతను పెంచడానికి ఇంకా ఎంతో అవకాశం ఉంది. » భారతదేశ ద్రవ్యోల్బణం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల చారిత్రక సగటు కంటే తక్కువగా ఉన్నందున, ప్రభుత్వం ‘సానుకూల ఫలితాల సాధన సాధ్యమేనన్న’ విశ్వాసంతో ఆర్థిక విధానాలను రూపొందించగలిగింది. ప్రస్తుత జీడీపీ తీరిది.. భారత్‌ను 2047 నాటికి అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా నిర్దేశించుకుని ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే వృద్ధి మందగమనం, అనిశ్చితమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు భారత్ వృద్ధికి సవాళ్లుగా ఉన్నాయి. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి.కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌ను అధిగమించగా, త్వరలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుత దేశ ఎకానమీ విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇక ప్రస్తుతం భారత్ తలసరి ఆదాయం దాదాపు 2,300 డాలర్లు. 2031 ఆర్థిక సంవత్సరం భారత్ తలసరి ఆదాయం 4,500 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. ఇదే జరిగితే దేశం ఎగువ మధ్య–ఆదాయ దేశాల క్లబ్లో ప్రవేశిస్తుంది. ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. -
Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
వ్యాపార విభజనతో గోద్రెజ్ కంపెనీ వార్తల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆ కంపెనీ ఫ్యూచర్ మేనేజింగ్ డైరెక్టర్ క్యాండెట్ నైరికా హోల్కర్‌పై ప్రత్యేక దృష్టి పడింది. ‘గోద్రెజ్’లో న్యూ జనరేషన్ ప్రతినిధిగా భావిస్తున్న నైరికా హోల్కర్ లీడర్షిప్ ఫిలాసఫీ గురించి....గోద్రెజ్ కుటుంబంలో నాల్గవ తరానికి చెందిన నైరికా హోల్కర్కు నేర్చుకోవాలనే తపన. ఆఫీసులోని సీనియర్ల నుంచి ఇంట్లో చిన్న పిల్లల వరకు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఎలాంటి ఇబ్బందీ పడదు. ‘వినడం వల్ల కలిగే ఉపయోగాలు, కమ్యూనికేషన్స్ స్కిల్స్ నా కూతురి నుంచి నేర్చుకున్నాను’ అని వినమ్రంగా చెబుతుంది నైరిక. ఐడియా రాగానే ఆ క్షణానికి అది గొప్పగానే ఉంటుంది. అందుకే తొందరపడకుండా తనకు వచ్చిన ఐడియా గురించి అన్నీ కోణాలలో విశ్లేషించి ఒక నిర్ధారణకు వస్తుంది. ‘నా అభి్రపాయమే కరెక్ట్’ అని కాకుండా ఇతరుల కోణంలో కూడా ఆలోచించడం అలవాటు చేసుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ లండన్’లో లా చదివిన నైరిక కొలరాడో కాలేజీలో (యూఎస్)లో ఫిలాసఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్ చదువుకుంది. లీగల్ ఫర్మ్ ‘ఏజెడ్‌బీ అండ్ పార్ట్నర్స్’తో కెరీర్ప్రారంభించిన నైరిక మన దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకునే విదేశీ కంపెనీలకు సలహాలు ఇవ్వడంలో ప్రత్యేక ప్రతిభ సాధించింది. గోద్రెజ్ అండ్ బోయ్స్ (జీ అండ్ బి)లోకి అడుగు పెట్టి డిజిటల్ స్ట్రాటజీ నుంచి కంపెనీ లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించడం వరకు ఎన్నో విధులు నిర్వహించింది. ఆమె నేతృత్వంలో కంపెనీ ఎన్నో ఇంక్యుబేటెడ్ స్టారప్లతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. మహిళా సాధికారతకుప్రాధాన్యత ఇచ్చే నైరిక ‘పవర్’ అనే మాటకు ఇచ్చే నిర్వచనం...‘అర్థవంతమైన మార్గంలో ప్రభావం చూపే సామర్థ్యం’ ‘నాయకత్వ లక్షణాలకు చిన్నా పెద్ద అనే తేడా ఉండదు. చిన్న స్థాయిలో పనిచేసే మహిళలలో కూడా అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉండవచ్చు. అలాంటి వారిని గుర్తించి నాయకత్వ బాధ్యతలు అప్పగించడం నాప్రాధాన్యతలలో ఒకటి’ అంటుంది నైరిక.కోవిడ్ కల్లోల కాలం నుంచి ఎంతోమంది లీడర్స్లాగే నైరిక కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంది.‘మాలాంటి కంపెనీ రాత్రికి రాత్రే డిజిటల్లోకి వచ్చి రిమోట్ వర్కింగ్‌లోకి మారుతుందని చాలామంది ఊహించలేదు’ అంటున్న నైరిక సిబ్బంది వృత్తి నైపుణ్యాలను మరింతగా మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ‘స్ప్రింట్’ ΄ోగ్రాం ద్వారా కొత్త ఐడియాలను ్ర΄ోత్సహించడం నుంచి ప్రయోగాలు చేయడం వరకు ఎన్నో చేసింది. ‘నైరిక ఎవరు చెప్పినా వినడానికి ఇష్టపడుతుంది. ఒకప్రాజెక్ట్లో భాగంగా సమర్ధులైన ఉద్యోగులను ఒకచోట చేర్చే నైపుణ్యం ఆమెలో ఉంది. న్యూ జనరేషన్ స్టైల్ ఆమె పనితీరులో కనిపిస్తుంది’ అంటారు గోద్రెజ్లోని సీనియర్ ఉద్యోగులు.‘గోద్రెజ్ అండ్ బోయ్స్’ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జంషెడ్ గోద్రేజ్ సోదరి స్మితా గోద్రెజ్ కూతురే నైరికా హోల్కర్. ఇండోర్ రాజ కుటుంబానికి చెందిన యశ్వంత్‌రావు హోల్కర్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. దశాబ్ద కాలానికి పైగా ఇంజనీరింగ్–ఫోకస్డ్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలో కీలక బాధ్యతలు తీసుకొని రాణించడం అంత తేలికేమీకాదు. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లను తన సామర్థ్యంతో అధిగమించి గోద్రెజ్ మహాసామ్రాజ్యంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది నైరికా హోల్కర్. గ్లోబల్ లీగల్ స్ట్రాటజీ నుంచి స్త్రీ సాధికారతకు పెద్ద పీట వేయడం వరకు కంపెనీలో తనదైన ముద్ర వేసింది. 2030 నాటికి...కోవిడ్ తరువాత కొత్త ప్రాధాన్యత రంగాలను... ఉత్పత్తులు, సేవలను మెరుగు పరిచే అవకాశాలను గుర్తించాం. కార్బన్ తీవ్రతను తగ్గించాలనుకుంటున్నాం. ఎనర్జీప్రాడక్టివిటీని రెట్టింపు చేయాలనుకుంటున్నాం. పర్యావరణ హిత ఉత్పత్తుల నుంచి 32 శాతం ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. రాబోయే కాలంలో కంపెనీ ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేది మా లక్ష్యం.– నైరికా హోల్కర్ -
బీపీసీఎల్ చైర్మన్‌గా కృష్ణకుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ను కృష్ణకుమార్ పూర్తి చేశారు. -
డిజిటల్ రూపీ ప్రారంభం చరిత్రాత్మక మైలురాయి
న్యూఢిల్లీ: డిజిటల్ రూపాయి ప్రారంభం ఒక చరిత్రాత్మక మైలురాయి అని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కుమార్ చౌదరి పేర్కొన్నారు. దీనివల్ల కరెన్సీ వ్యవస్థ సామర్థ్య మరింత పెరుగుతుందని, ఆర్థిక సేవలు భారీగా విస్తరిస్తాయని తెలిపారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) ట్రాకర్ ప్రకారం, ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 95 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 105 దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ కరెన్సీని ప్రారంభించడానికి ఇప్పటికే తగిన చర్యలు తీసుకున్నాయని ఆయన తెలిపారు. దాదాపు 50 దేశాలు డిజిటల్ కరెన్సీని ప్రారంభించే తుది దశలో ఉండగా, 10 దేశాలు డిజిటల్ కరెన్సీని పూర్తిగా ప్రారంభించాయని పేర్కొన్నారు. పీహెచ్డీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ఆయన చేసిన ప్రకటనలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► డిజిటల్ రూపాయి చెల్లింపులు చేసే విధానంలో వినూత్నతను తీసుకువస్తుంది. అంతర్జాతీయ స్థాయి చెల్లింపుల్లో సైతం పూర్తి సులభతరమైన వెసులుబాటును కల్పిస్తుంది. ► సీబీడీసీ వినియోగదారుల ఆర్థిక పరిరక్షణకు దోహదపడటమే కాకుండా, హానికరమైన సామాజిక– ఆర్థిక పరిణామాలను నివారిస్తుంది. ప్రజలకు అవసరమైన తగిన సేవలు అందించడంలో దోహదపడుతుంది. ► ఆర్బీఐ ఇప్పటికే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ.. సీబీడీసీ–డబ్ల్యూ, అలాగే సీబీడీసీ–ఆర్‌లను భారత వ్యవస్థలో పైలట్ ప్రాతిపదికన ఆవిష్కరించింది. సీబీడీసీ–డబ్ల్యూ టోకు లావాదేవీలను సీబీడీసీ–ఆర్ రిటైల్ లావాదేవీలను సూచిస్తాయి. ► డిజిటల్ కరెన్సీ– యూపీఐ మధ్య వ్యత్యాసాన్ని ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివరిస్తూ, భౌతిక కరెన్సీ తరహాలోనే సెంట్రల్ బ్యాంక్ జారీ చేసే డిజిటల్ కరెన్సీ ఆర్బీఐ నిర్వహణాలో ఉంటుంది. ఇక యూపీఐ చెల్లింపు సాధనం తద్వారా జరిగే లావాదేవీ సంబంధిత బ్యాంకు బాధ్యతకు సంబంధించినది అని చెప్పారు. -
ఐటీసీలో రూ.కోటికిపైగా వేతన ఉద్యోగులు 220
న్యూఢిల్లీ: ఐటీసీలో రూ.కోటికిపైగా వేతనం తీసుకునే ఉద్యోగుల సంఖ్య 220కు చేరింది. 2021–22 సంవత్సరంలో వీరి సంఖ్య 44 శాతం పెరిగినట్టు వార్షిక నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రతి నెలా రూ.8.5 లక్షలు (ఏడాదికి రూ.కోటి, అంతకంటే ఎక్కువ) అంతకుమించిన వేతన ఉద్యోగులు 2020–21 నాటికి 153 ఉండగా, 2021–22 నాటికి 220కి పెరిగిందని ఐటీసీ తన వార్షిక నివేదికలో పేర్కొంది. ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌పురి 2021–22లో అందుకున్న స్థూల వేతనం 5.35 శాతం పెరిగి రూ.12.59 కోట్లుగా ఉంది. ఇందులో రూ.2.64 కోట్ల కన్సాలిడేటెడ్ వేతనం, పెర్క్‌లు, ఇతర ప్రయోజనాలు రూ.49.63 లక్షలు, పనితీరు ఆధారిత బోనస్ రూ.7.52 కోట్లు ఉంది. 2020–21లో సంజీవ్‌పురి స్థూల వేతనం రూ.11.95 కోట్లుగా ఉంది. ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీ సుమంత్ రూ.5.76 కోట్లు, మరో ఈడీ రవి టాండన్ రూ.5.60 కోట్ల చొప్పున గత ఆర్థిక సంవత్సరంలో అందుకున్నారు. 2021–22 చివరికి ఐటీసీలో మొత్తం ఉద్యోగులు 23,889 మంది ఉన్నారు. ఆశ్చర్యకరం ఏమిటంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 8.4 శాతం తగ్గింది. మొత్తం ఉద్యోగుల్లో మహిళా ఉద్యోగుల శాతం చాలా తక్కువగా ఉంది. రూ.21,568 మంది పురుషులు ఉంటే, మహిళలు కేవలం 2,261 మంది ఉన్నాయి. పర్మినెంట్ కేటగిరీ కాకుండా ఇతర ఉద్యోగులు 25,513 మంది పనిచేస్తున్నారు. ఉద్యోగుల సగటు వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 7 శాతం పెరిగింది. ముఖ్యమైన ఉద్యోగులకు (కేఎంపీలు/కీలక బాధ్యతలు చూసేవారు) వేతన పెంపు 8 శాతంగా ఉంది. ఐటీసీ ఎఫ్ఎంసీజీ విభాగం స్పీడ్ గతేడాది రూ. 24,000 కోట్ల టర్నోవర్ మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ఎఫ్ఎంసీజీ విభాగంలో రికార్డు టర్నోవర్‌ను సాధించింది. కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం ఈ విభాగంలో వినియోగదారు వ్యయాలు రూ. 24,000 కోట్లను తాకాయి. ఫుడ్, వ్యక్తిగత సంరక్షణ, ఎడ్యుకేషన్, స్టేషనరీ తదితర విభాగాలలో 25కుపైగా మదర్ బ్రాండ్స్‌తో కంపెనీ పురోభివృద్ధిని సాధిస్తున్నట్లు ఐటీసీ పేర్కొంది. గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ బిజినెస్ ప్రస్తావించదగ్గ పురోగతిని నమోదు చేస్తున్నట్లు తెలియజేసింది. అయితే ఇప్పటికీ పొగాకు బిజినెస్ నుంచే టర్నోవర్‌లో సగ భాగం సమకూరుతున్నట్లు వెల్లడించింది. గతేడాది ఐటీసీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 59,101 కోట్ల టర్నోవర్‌ను ప్రకటించింది. గతేడాది దేశీయంగా 20 కోట్ల కుటుంబాలకు వినియోగ విభాగం చేరువైనట్లు వార్షిక నివేదికలో ఐటీసీ పేర్కొంది. ఎఫ్ఎంసీజీ విభాగంలో ఆశీర్వాద్, బింగో, సన్‌ఫీస్ట్, క్లాస్మేట్, శావ్లాన్, యిప్పీ తదితర సుప్రసిద్ధ బ్రాండ్లను కంపెనీ కలిగి ఉంది. ఎన్ఎస్ఈలో ఐటీసీ షేరు 2 శాతం క్షీణించి రూ. 265 వద్ద ముగిసింది. గత నెల 20న రూ. 282ను అధిగమించడం ద్వారా షేరు 52 వారాల గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఆశావహంగానే కొత్త ఏడాది
కరోనా వైరస్‌పరమైన ప్రభావాల నుంచి ఆటోమొబైల్ పరిశ్రమ క్రమంగా బైటపడుతోంది. ఇటు దేశీయంగా అటు విదేశీ మార్కెట్లలోనూ డిమాండ్ పుంజుకుంటోందని అంటున్నారు కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ. కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముడి వస్తువుల ధరలు ఎగియడం వల్లే రేట్లను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని సాక్షి బిజినెస్ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. మరిన్ని విశేషాలు... ► మారుతీపై కోవిడ్ ప్రభావమెలా ఉంది? ఇది ఎవరూ ఊహించని, కొత్త పరిణామం. ప్రతీ వందేళ్లకోసారి ఏదో ఒక మహమ్మారి విజృంభిస్తుందంటారు. ఇలాంటి సమయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో డిమాండ్ బాగానే ఉన్నట్లు కనిపించినా.. మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధింపుతో పూర్తి ఆర్థిక సంవత్సరంపై ప్రభావం పడింది. ఏప్రిల్‌లో అన్ని కంపెనీలూ జీరో అమ్మకాలే నమోదు చేశాయి. తొలినాళ్లలో మా సరఫరా వ్యవస్థ దెబ్బతింది. భౌతిక దూరం నిబంధనలు అమలు చేయడంతో చాలా మంది వర్కర్లు తమ తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. కానీ, గత కొద్ది నెలలుగా పరిస్థితులు మళ్లీ మెరుగుపడుతున్నాయి. పేరుకుపోయిన డిమాండ్ నెమ్మదిగా బైట పడుతోంది. పండుగ సీజన్ కావడంతో రెండో త్రైమాసికంలో.. ముఖ్యంగా అక్టోబర్‌లో అమ్మకాలు అత్యధికంగా నమోదయ్యాయి. మరోవైపు, మేం ఎగుమతి చేసే మార్కెట్లలో కూడా డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ► పండుగ సీజన్ అమ్మకాల ధోరణి ఇలాగే కొనసాగే అవకాశం ఉందా? కస్టమర్ల కోణంలో చూస్తే అక్టోబర్ ప్రథమార్ధంలో కార్ల కొనుగోలుకు అంత శుభసమయం కాదని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ ద్వితీయార్ధం, నవంబర్‌లో పండుగ సీజన్ తార స్థాయికి చేరింది. ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ సమయం అత్యుత్తమంగా గడిచింది. అత్యధిక స్థాయిలో వాహనాలు అమ్ముడయ్యాయి. అప్పట్నుంచి పురోగతి బాగానే ఉంది. బుకింగ్స్ ట్రెండ్ కూడా బాగుంది. కొత్త ఏడాది మరింత మెరుగ్గా ఉండగలదని ఆశిస్తున్నాం. ► ఆటో పరిశ్రమ ముందున్న ప్రధాన సవాళ్లేమిటి? గత 30 సంవత్సరాల డేటా చూస్తే జీడీపీ వృద్ధిపై ఆటో పరిశ్రమ డిమాండ్ ఆధారపడి ఉంటోంది. సాధారణంగా కారు కొనుగోలు చేయడమనేది విచక్షణపరమైన నిర్ణయం. కాబట్టి కార్లు అమ్ముడవ్వాలంటే కొనుగోలుదారుల సెంటిమెంటు బాగుండాలి. ప్రస్తుతం ఈ సెంటిమెంట్ అంతా కోవిడ్, కోవిడ్ అనంతర పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. ► ప్రస్తుత తరుణంలో ధరల పెంపు సరైనదేనా? కొత్త ఏడాది జనవరిలో ధరలను పెంచబోతున్నామంటూ ముందుగా ప్రకటించిన కంపెనీల్లో మారుతీ సుజుకీ కూడా ఒకటి. ముడి ఉత్పత్తుల వ్యయాలు పెరిగిపోవడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించడం తప్పనిసరైంది. మేం బీఎస్6 ప్రమాణాలకు మళ్లినప్పుడు కూడా అందులో కొంత భారాన్ని కొనుగోలుదారులకు బదలాయించాం. బీఎస్6 వాహనాల్లో ఉపయోగించే లోహాల్లో పలాడియం, రోడియం వంటివి కూడా ఉంటాయి. దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఇవి ఉత్పత్తవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆయా గనుల్లో ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. సాధారణంగా ఈ లోహాలకు ఆటో రంగం నుంచే ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. కొత్త కాలుష్య ప్రమాణాల కారణంగా వాహన తయారీ సంస్థల నుంచి డిమాండ్ పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో రేట్లు ఎగిశాయి. ఇక ఉక్కు ధర కూడా పెరిగింది. అందుకే కార్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నాం. ► కార్ల సబ్స్క్రిప్షన్ సేవలు, వినియోగదారుల ధోరణులు ఎలా ఉన్నాయి? గడిచిన కొన్నేళ్లుగా ఉత్పత్తులను అద్దెకు తీసుకునే ధోరణి ప్రాచుర్యంలోకి వస్తోంది. దీంతో మారుతీ సుజుకీ కూడా దీనిపై దృష్టి పెట్టింది. మేం ప్రధానంగా మూడు కేటగిరీల వారిని చూశాం. వారు.. ► కార్లను కొన్నాళ్ల పాటు వాడేసి, ఆ తర్వాత మరో కారుకు మళ్లే పైస్థాయి వర్గాలు ► ఎక్కడా ఎక్కువ కాలం ఉండకుండా .. తరచూ బదిలీ అయ్యే ఉద్యోగులు. ► దీర్ఘకాలం వాహన ఫైనాన్సింగ్‌కు కట్టుబడటం ఇష్టపడని యువత ► ఇటు దేశీయంగా అటు అంతర్జాతీయంగా ఈ మూడు కేటగిరీల్లోని వారూ ఉంటున్నారు. మెయింటెనెన్స్, దీర్ఘకాలిక కమిట్మెంట్ బాదర బందీ వద్దనుకునే వారికి ఈ సర్వీసులు ఉపయోగపడతాయి. స్వల్పకాలిక లీజింగ్‌కు సబ్స్క్రిప్షన్ మోడల్ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. నెలవారీ అద్దె చెల్లించి.. అవి 2–3 సంవత్సరాల పాటు వాటిని వాడుకుంటాయి. ఉదాహరణకు స్విఫ్ట్ కారు అద్దె సుమారు రూ. 14,000–15,000 దాకా ఉంటుంది. మోడల్‌ను బట్టి మారుతుంది. డౌన్ పేమెంట్ చెయ్యలేని వారికి, డాక్యుమెంటేషన్.. మెయింటెనెన్స్ మొదలైనవి వద్దనుకునే వారికి ఈ సర్వీస్ ఉపయోగకరంగా ఉంటుంది. కారును కొనుక్కోవడం కన్నా ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం. -
138 ఏళ్లకు జపాన్ బ్యాంక్‌కు మహిళా డైరెక్టర్
టోక్యో: సుమారు 138 ఏళ్ల తర్వాత జపాన్ సెంట్రల్ బ్యాంక్ తొలిసారి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమించింది. కరోనా కారణంగా జపాన్‌లో అర్థిక వ్యవస్థ దిగజారడంతో తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యతను ఆరుగురితో కూడిన అధికార బృందం బాధ్యత చేపట్టింది. ఈ అధికారుల బృందంలో టోకికో షిమిజు(55) ఒకరు. ఇకనుంచి రోజువారి బ్యాంక్ కార్యకలాపాలను చూసే బాధ్యత ఈ ఆరుగురు సభ్యులదే. ఈ క్రమంలో టోకికోను బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. కాగా టోకికో 1987 నుంచి బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో బ్యాంకు ఉద్యోగినిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగాక ఫైనాన్షియల్ మార్కెట్స్, విదేశీ మారక కార్యకలాపాలను కూడా ఆమె చూసుకునేవారు. అనంతరం 2016 నుంచి 2018 మధ్య లండన్ ప్రధాన ప్రతినిధిగా ఐరోపాకు జనరల్ మేనేజర్‌గా వ్యవహరించారు. కాగా జపాన్ సెంట్రల్ బ్యాంక్‌లో మహిళ ఉద్యోగులు 47శాతం ఉండగా.. సీనియర్ మేనేజిరియల్ పోస్టులలో కేవలం 13శాతం, న్యాయ వ్యవహారాలు, చెల్లింపు వ్యవస్థలు, బ్యాంక్ నోట్లతో వ్యవహరించే నిపుణుల స్థానాల్లో కేవలం 20శాతం మాత్రమే మహిళా ఉద్యోగులు ఉన్నారు. కాగా 1998లో ప్రారంభించిన సెంట్రల్ బ్యాంకు పాలసీ బోర్డులో ద్రవ్వ విధానాన్ని రూపొందించే బోర్డు పాలసీలో అత్యున్నత స్థాయి నిర్ణయాలకు తీసుకునే బాధ్యతలో మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ బోర్డులో ఉన్న తొమ్మిది మంది సభ్యులలో ఒకరు మాత్రమే మహిళ సభ్యురాలు ఉంటారు. ఇక గత దశాబ్ధాల నుంచి అక్కడి పురుషులకు సమానంగా మహిళలు ఉన్నత చదువులను అభ్యసిస్తూ కీలక రంగాల్లో పదవులు పొందుతున్నారు. దీంతో దశాబ్దాలుగా జపాన్‌లో కొనసాగుతున్న పురుషుల ఆధిపత్యానికి సవాలుగా మహిళలుగా నిలవడం ప్రారంభమైంది. జపాన్ జనాభాలో మహిళలు 51 శాతం ఉండగా.. 2018 ప్రపంచ బ్యాంక్ గణాంకాల ప్రకారం.. ప్రపంచ ఆర్థిక ఫోరం తాజా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్‌లో 153 దేశాలలో జపాన్ 121వ స్థానంలో ఉంది. -
‘రెండు చక్రాల’తో బస్సు నడిచేనా!
సాక్షి, హైదరాబాద్: పూర్తి స్థాయి ఎండీ లేక గందరగోళంగా తయారైన ఆర్టీసీలో, ఇప్పుడు కీలకమైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)ల కొరతతో మరింత అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. నలుగురు ఈడీలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ముగ్గురు ఈడీలతో కొనసాగుతోంది. ఇందులో ఏకంగా నాలుగు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఈడీ రవీందర్ ఈనెలాఖరుకు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో ఇద్దరు ఈడీలే మిగలనున్నారు. రిటైర్ కాబోతున్న రవీందర్ నుంచి నాలుగు కీలక బాధ్యతలు వచ్చిపడుతుండటంతో ఉన్న ఇద్దరు ఈడీలకు వాటిని అప్పగించాల్సి వస్తోంది. దీంతో పూర్తిస్థాయి ఎండీ లేకపోవటం, ఇద్దరు ఈడీలతో ఆర్టీసీ నిర్వహించాల్సి రావటం ఇప్పుడు గందరగోళానికి కారణమవుతోంది. తీవ్ర నష్టాలు, నిర్వహణలో సామర్థ్యం కొరవడటం, ఆదాయాన్ని పెంచే మార్గాలకు పదునుపెట్టే పరిస్థితి లేకపోవటం, ప్రభుత్వం నుంచి పెద్దగా ఆర్థిక సహాయం లేకపోవటం, బస్సుల కొరత, జీతాలకు డబ్బులు సరిపోకపోవటం, కొండలా పేరుకుపోతున్న అప్పులు, పాత బకాయిలు, తీవ్ర డ్రైవర్ల కొరత... ఇలాంటి స్థితిలో ఆర్టీసీని ఇద్దరు ఈడీలు నిర్వహించాల్సి రావటం పెద్ద సవాల్‌గా మారింది. పదోన్నతులు ఇచ్చేందుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఇన్చార్జిగా అప్పగించే యోచన ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్, మెడికల్, ఇంజనీరింగ్, ఐటీ–రెవెన్యూ, కార్పొరేషన్ కార్యదర్శి బాధ్యతలను ఈడీలు పర్యవేక్షిస్తారు. వీటితోపాటు హైదరాబాద్ సిటీ జోన్, హైదరాబాద్ జోన్, కరీంనగర్ జోన్ బాధ్యతలూ పర్యవేక్షిస్తారు. వీటన్నింటిని ఇద్దరు ఈడీలు మోయటం కష్టం. పదోన్నతులకు ఎన్నికల కోడ్ అడ్డుగా ఉన్నందున, సీనియర్ అధికారులకు వీటిని అదనపు బాధ్యతలుగా అప్పగించే వీలుంది. ఈ విషయంలో ఇప్పుడు ఉద్యోగుల మధ్య మరోరకమైన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా కార్పొరేషన్లో అస్తవ్యస్త పనులు జరుగుతున్నాయని, వాటికి కారణమైన ఓ అధికారి ఇప్పుడు సీనియర్లను కాదని, తనకు అనుకూలంగా ఉండే మరో అధికారికి ఆయా పనులు చూసే కీలక బాధ్యతను కట్టబెట్టేలా తెరవెనక చక్రం తిప్పుతున్నారని ఉద్యోగుల్లో ప్రచారం జరుగుతోంది. సీనియర్లు ఉన్నందున ఆ అధికారికి కీలక బాధ్యతలు అప్పగించొద్దంటూ ఎండీ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోమవారం బాధ్యతల పంపకంపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున, ఎస్ఎంఎస్ల రూపంలో ఉద్యోగులు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే అత్యంత అస్తవ్యస్థంగా సంస్థ తయారైనందున, సమర్థులైన అధికారులకే బాధ్యత అప్పగించాలని, ఆరోపణలున్న వారికి బాధ్యతలు ఇవ్వవద్దని వారు కోరుతున్నారు. -
బ్యాంకింగ్ రంగంపై గీతంలో యూబీఐ అధ్యయన పీఠం
సాక్షి, సాగర్‌నగర్ : బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులపై నిరంతర అధ్యయానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) అధ్యయన పీఠాన్ని నెలకొల్పడానికి కృషి చేస్తామని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కతూరియా హామీ ఇచ్చారు. యూబీఐ కార్పొరేట్ కార్యాలయం ఉన్నతాధికారుల బృందం బుధవా రం వర్సిటీని సందర్శించింది. ఈ సందర్భంగా కతూరియా మాట్లాడుతూ దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. గీతం ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.గంగాధరరావు మాట్లాడుతూ గీతం ప్రగతిని వివరించారు. వీసీ ప్రొఫెసర్ ఎం.ఎస్.ప్రసాద్ గాంధీయన్ అధ్యయన కేంద్రం, బ్యాంకింగ్ అధ్యయన కేంద్రం ప్రతిపాదనల గురించి వివరించారు. అనంతరం కతూరియాను వీసీ సత్కరించారు. కార్యక్రమంలో గీతం కార్యదర్శి బి.వి.మోహనరావు, పాలకవర్గ సభ్యుడు హమ్జాకె.మెహది, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ కె.వి.గుప్తా, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ గోపాలకృష్ణ, యూబీఐ జనరల్ మేనేజర్ ఎస్.ఎస్.చంద్రశేఖర్, ప్రాంతీయ అధికారి కె.ఎస్.ఎన్.మూర్తి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. -
పీఎన్బీ స్కాం : మరో ఇద్దరు అధికారులకు ఉచ్చు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగు చూసిన కుంభకోణం రూ.11,400 కోట్లు మాత్రమే కాదని, అంతకుమించి కుంభకోణం జరిగినట్టు బ్యాంకు తేల్చింది. గీతాంజలి గ్రూప్‌కు సంబంధించి మరో రూ.1,251 కోట్ల స్కాం కూడా వెలుగులోకి వచ్చింది. అంటే మొత్తంగా పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం రూ.12,636 కోట్లకు పెరిగిందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వెల్లడించింది. ఈ కుంభకోణంపై ఇప్పటికే పలుమార్లు పీఎన్బీ అధికారులను విచారించిన సీబీఐ, కుంభకోణం మరింత పెరిగిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ఎస్ కన్నన్ను కూడా ప్రశ్నిస్తోంది. ఈయన గీతాంజలి గ్రూప్‌కు అందించే నగదు విషయంలో కన్సోర్టియం ఆఫ్ ది బ్యాంకుకు అధినేతగా ఉన్నారు. ఈ కుంభకోణంలో ప్రమేయముందనే ఆరోపణలతో పీఎన్బీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత్‌ను కూడా విచారిస్తున్నారు. మరో ఇద్దరి అధికారులకు కూడా విచారణకు హాజరుకావాలని పిలుపు అందింది. మరోవైపు ఈ కుంభకోణ నేపథ్యంలో విదేశీ బ్రాంచుల్లో సరియైన ఆడిట్ జరుపాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాక మోసం జరిగే ఉద్దేశ్యమున్న రూ.50 కోట్లకు పైన ఉన్న మొండిబకాయిలను, నిరర్థక ఆస్తులను పరిశీలించాలని, వీటిపై 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. -
పీఎన్బీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.11,400 కోట్ల పీఎన్బీ కుంభకోణానికి బాధ్యులైన వారిచుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ జిందాల్ (2009–11 మధ్య కుంభకోణం జరిగిన పీఎన్బీ బ్రాడీహౌజ్ బ్రాంచ్ హెడ్) సహా తొమ్మిది మంది బ్యాంకు ఉన్నతాధికారులనూ సీబీఐ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వీరంతా.. మోదీ, చోక్సీలకు మేలు జరిగేలా అబద్ధపు గ్యారెంటీలను జారీచేశారన్నకోణంలో విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణాన్ని సీరియస్‌గా తీసుకున్న ఈడీ దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఈడీ చీఫ్ కర్నల్ సింగ్ తన ఫ్రాన్స్ పర్యటన (అంతర్జాతీయ మనీల్యాండరింగ్ కేసుల విచారణ సంస్థల సదస్సు)ను రద్దుచేసుకుని మరీ వ్యక్తిగతంగా ఈ కేసు విచారణను పర్యవేక్షిస్తున్నారు. అటు ఆరోరోజు దేశవ్యాప్తంగా పలుచోట్ల నీరవ్ మోదీ, చోక్సీలకు సంబంధించిన ఆస్తులపై ఈడీ, సీబీఐ దాడులు జరిగాయి. ముంబై సమీపంలోని అలీబాగ్‌లో ఉన్న నీరవ్ మోదీ విలాసవంతమైన ఫామ్‌హౌజ్ (1.5 ఎకరాల)ను సీబీఐ బుధవారం సీజ్ చేసింది. 2004లో 32 కోట్లకు నీరవ్ దీన్ని కొనుగోలు చేశారు. చోక్సీకి సంబంధించిన గీతాంజలి జెమ్స్, ఇతర సంస్థలపై ముంబై, పుణే, హైదరాబాద్, సూరత్, బెంగళూరు సహా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రొటొమ్యాక్ ఆస్తులు అటాచ్ రూ.3,695 కోట్ల రుణ ఎగవేత కేసుకు సంబంధించిన కేసులో రొటొమ్యాక్ కంపెనీ అధినేత విక్రమ్ కొఠారీ, ఆయన కుమారుడు రాహుల్‌లకు చెందిన ఆస్తులను ఐటీ శాఖ అటాచ్ చేసింది. కాన్పూర్‌లోని మూడు స్థిరాస్తులు, అహ్మదాబాద్‌లోని ఒక భవంతిని అటాచ్ చేసింది. వీటి విలువ రూ. 85 కోట్లు. విక్రమ్, రాహుల్‌లను ఢిల్లీలో సీబీఐ బుధవారం విచారించింది. సర్కారుకు స్వేచ్ఛనివ్వాలి: సుప్రీం పీఎన్బీ కేసు దర్యాప్తులో కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ కావాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రభుత్వ సంస్థలు దర్యాప్తు సరిగ్గా చేయని పక్షంలోనే తామే జోక్యం చేసుకుంటామంది. -
ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎట్టకేలకు కేంద్రం ఆంధ్రాబ్యాంక్‌కు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)ను నియమించింది. రెండు రోజుల కిందటే తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈడీలను నియమించినా... 10 నెలలకు పైగా ఖాళీగా ఉన్న ఆంధ్రాబ్యాంకుకు మాత్రం నియమించలేదు. చివరకు శుక్రవారంనాడు ఆంధ్రాబ్యాంక్ ఈడీగా అజిత్ కుమార్ రథ్‌ను ఎంపిక చేసినట్లు తెలిసింది. బ్యాంకింగ్ వర్గాలు దీన్ని ధ్రువీకరిస్తుండగా.. కేంద్రం నుంచి కానీ ఇటు బ్యాంకు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడకపోవడం గమనార్హం. శుక్రవారంనాడు కోల్‌కతాలో ఉన్న రథ్... ఎంపికైన వెంటనే అక్క డే ఈడీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిసింది. బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అనుభవం ఉన్న రథ్... ఈ పదవికి ముందు యూనియన్ బ్యాంక్‌లో ఐటీ విభాగ జీఎంగా పనిచేశారు. -
నిరుద్యోగులకు ఉపాధి భరోసా!
మహ బూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) నిరుద్యోగులకు ఉపాధితో పాటు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు తీ సుకుంటున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(ఈడీ)వీరఓబులు తెలి పారు. ఆర్థికంగా ఎదిగిన మిగతా కులాలవారితో సమానంగా ఎస్సీలు అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగానే కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ చొరవతో జిల్లాలో ప్రత్యేకంగా నాలుగు ప్రాంతాల్లో ఉద్యోగమేళాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈడీ మంగళవారం కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న పలు ఉపాధి పథకాల వివరాలను వెల్లడించారు. ఉద్యోగమేళాలు ఈనెల 25న నారాయణపేటలోని పోలెపల్లి ఫంక్షన్ హాల్లో, 31న నాగర్‌కర్నూల్‌లోని సాయి గార్డెన్ ఫంక్షన్హాల్లో, న వంబర్ 7న మహబూబ్‌నగర్‌లోని అంబేద్కర్ కళాభవన్‌లో,నవంబర్ 22న గద్వాల లోని బృందావన్ గార్డెన్స్‌లో ఉ ద్యోగమేళాలు నిర్వహిస్తున్నామని తెలిపా రు. సెక్యూరిటీగార్డు పోస్టుకు 7వ తరగతి, మార్కెటింగ్, సేల్స్‌మెన్ పోస్టులకు 10వ తరగతి నుంచి డిగ్రీ, కార్పొరేట్ ఆస్పత్రు ల్లో నర్సు ఉద్యోగానికి ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, కంప్యూటర్ ఆపరేటర్ లేదా డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్మీడియట్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు అర్హులని వెల్లడించారు. ఉద్యోగ మేళాలో పాల్గొనే వా రు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పా టు ఒక సెట్ జిరాక్స్‌కాపీలు తీసుకురావాల్సిందిగా సూచించారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగిన వారు మాత్రమే అర్హులని ప్రకటించారు. ఇదిలాఉండగా ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణాలు పొం దేందుకు అవసరమైన దరఖాస్తులను జిల్లాలోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కో రారు. సబ్సిడీ కింద కిరాణాషాపు, గొర్రెల పెంపకం, పాల డెయిరీ, వస్త్రదుకాణం, జిరాక్స్, కూల్‌డ్రింక్స్ షాపు, టైలరింగ్ తదితర యూనిట్ల నిర్వహణ కోసం రూ.30 వేల వరకు సబ్సిడీరుణం పొందే అవకాశం ఉందని వెల్లడించారు. జిల్లాకు 3975 యూనిట్లు జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 3975 యూనిట్లు లక్ష్యంగా నిర్ణయించినట్లు వివరించారు. బ్యాంకు నుంచి రుణం ఇస్తున్నట్లు ఆయా బ్యాంకుల మేనేజర్లు అనుమతి లెటర్లు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి మంజూరు చేయాల్సిన సబ్సిడీ మొత్తం నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ అవుతుందని వెల్లడించారు. ప్రతి లబ్ధిదారుని పేరిట ఎస్బీ ఖాతాతో పాటు లోన్అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రాబ్యాంకు, ఏపీజీవీబీ, బీఓబీ, సీబీ, సీబీఐ, కార్పొరేషన్ బ్యాంకు, డీసీసీబీ, ఐబీ, ఐఎన్జీ వైశ్యా, ఐఓబీ, పీఎన్బీ, ఎస్బీహెచ్, ఎస్బీఐ, ఎస్ఐబీ, యూబీఐ, యూకో బ్యాంక్, విజయ తదితర ‘ఆన్లైన్’ విధానం ఉన్న ఏ బ్యాంకుల నుంచైనా యూనిట్ల ఏర్పాటు కోసం రుణం మంజూరు చేయడానికి అభ్యంతరం లేదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తెలిపారు. లెటర్ తెస్తే ఇక ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందినట్లేనని ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు.