సంపూర్ణ సేంద్రియ గ్రామాలు! | Training Program on PGS Certification Held to Farmers | Sakshi
Sakshi News home page

సంపూర్ణ సేంద్రియ గ్రామాలు!

Published Tue, Feb 11 2025 4:35 AM | Last Updated on Tue, Feb 11 2025 10:57 AM

Training Program on PGS Certification Held to Farmers

ఛత్తీస్‌ఘడ్‌లో ఐదేళ్లుగా వ్యవసాయ రసాయనాలు వాడని గ్రామాలకు సేంద్రియ గుర్తింపు

దంతెవాడ జిల్లాలో ఒకటీ రెండూ కాదు ఏకంగా 110 గ్రామాలకు సేంద్రియ సర్టిఫికేషన్‌ మంజూరు

సికింద్రాబాద్‌ కేంద్రంగా నడిచే సిఎస్‌ఎ రీజినల్‌ కౌన్సెల్‌ ద్వారా సర్టిఫికేషన్‌ మంజూరు

తాజాగా సిఎస్‌ఎ రీజినల్‌ కౌన్సెల్‌కు దక్కిన ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా జాతీయ పురస్కారం

తెలుగు రాష్ట్రాల్లో 30 వేల మంది రైతులకు సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇచ్చాం: డా. రామాంజనేయులు

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో 110 గిరిజన గ్రామాలు పిజిఎస్‌ సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందాయి. సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్‌ఎ)కి చెందిన రీజినల్‌ కౌన్సెల్‌ ఈ సర్టిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల సిఎస్‌ఎకు ప్రతిష్టాత్మక ‘జైవిక్‌ ఇండియా’ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సిఎస్‌ఎ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జీ వీ రామాంజనేయులుతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. 

రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల వాడకం పూర్తిగా మానుకొని ప్రకృతి /సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యదాయకంగా ఆహారోత్పత్తి చేసే రైతులకు ప్రత్యేక గుర్తింపునిచ్చేదే సేంద్రియ సర్టిఫికేషన్‌. ఈ సర్టిఫికేషన్‌ ద్వారా మెరుగైన ధరకు పంట దిగుబడులను అమ్ముకునే అవకాశం కలుగుతుంది. రైతు వ్యక్తిగతంగా సర్టిఫికెట్‌ పొందొచ్చు. నలుగురితో కలసి సహకార సంఘంగా లేదా రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి సమష్టిగా సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందవచ్చు.

 ఒంటరిగా సర్టిఫికేషన్‌ పొందే కంటే సంఘంగా పొందటం సులభం. ఇంకా చెప్పాలంటే, గ్రామంలో రైతులందరూ కలసి సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం దిశగా నడిస్తే పరివర్తన దశలో ఎదురయ్యే సమస్యలను సులువుగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు, మార్కెటింగ్‌కు అవసరమైన సేంద్రియ సర్టిఫికేషన్‌ను ఒక గ్రామంలో రైతులంతా కలసి ఊరుమ్మడిగా అయితే తొందరగానే పొందవచ్చు. విడిగా అయితే మూడేళ్ల ప్రక్రియ. ఊళ్లో రైతులంతా కలిస్తే ఆర్నెల్లు చాలు. దీన్నే ‘లార్జ్‌ ఏరియా సర్టిఫికేషన్‌’ అని పిలుస్తున్నారు. ఈ విషయంలో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. 

ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ జిల్లాలో గత ఐదేళ్లుగా రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం ఐదేళ్ల క్రితమే మానేసిన 110 గ్రామాలు సేంద్రియ సర్టిఫికేషన్‌ గుర్తింపు పొందాయి. ఈ గ్రామాల్లోని మొత్తం 10,264 మంది రైతులు 65,279 హెక్టార్లలో సేంద్రియ పంటలు పండిస్తున్నారు. సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్‌ఎ) రీజినల్‌ కౌన్సెల్‌ ఈ సర్టిఫికేషన్‌ ఇచ్చింది.  

చదవండి: Safer Internet Day 2025 భద్రత... బాధ్యత... గౌరవం!

మరో 121 గ్రామాలకు సర్టిఫికేషన్‌ప్రాసెస్‌ వివిధ దశల్లో ఉందని సిఎస్‌ఎ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. రామాంజనేయులు తెలిపారు. శిక్షణ, తనిఖీలకు హెక్టారుకు రూ. 700ల చొప్పున పిజిఎస్‌ సర్టిఫికేషన్‌కు ఖర్చవుతుందన్నారు. గ్రామం మొత్తం సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందటం అంత సులువేమీ కాదు. దశలవారీ పరీక్షల్లో రసాయనిక అవశేషాలు లేవని తేలితేనే సర్టిఫికేషన్‌ ఇస్తారు. 

లార్జ్‌ ఏరియా సర్టిఫికేషన్‌ రావాలంటే మొదట రైతులు గత ఐదేళ్లుగా పూర్తిగా సేంద్రియంగానే పంటలు పండిస్తున్నామని ప్రతిజ్ఞ చేయాలి. సర్పంచ్‌ కూడా బాధ్యత తీసుకొని డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఆ వూళ్లో రసాయనిక ఎరువులు, పురుగు/కలుపు మందులు అమ్మే దుకాణం లేదని జిల్లా వ్యవసాయ అధికారి సర్టిఫై చెయ్యాలి. ఇవన్నీ అయ్యాక రీజినల్‌ కౌన్సెల్‌ పరీక్షలు చేసి సర్టిఫై చేస్తుంది.

ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా పురస్కారం
సుస్థిర వ్యవసాయ కేంద్రాని(సిఎస్‌ఎ)కి ఇటీవల ప్రతిష్టాత్మక జైవిక్‌ ఇండియా రీజినల్‌ కౌన్సెల్‌ పురస్కారం లభించింది. ఇంటర్నేషనల్‌ కాంపిటెన్స్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (ఐసీసీఓఏ) గత ఐదేళ్లుగా ‘జైవిక్‌ ఇండియా’ పురస్కారాలను సేంద్రియ రైతులతో పాటు సర్టిఫికేషన్‌ సేవలందిస్తున్న రీజినల్‌ కౌన్సెళ్లకు కూడా ఏటేటా పురస్కారాలను  ప్రదానం చేస్తోంది. బెంగళూరులో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సేంద్రియ, చిరుధాన్యాల ప్రదర్శనలో జాతీయ స్థాయిలో ఉత్తమ రీజినల్‌ కౌన్సెల్‌గా సిఎస్‌ఎ ఎంపికైంది. సిఎస్‌ఎ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డా. జీవీ రామాంజనేయులు, సిఎస్‌ఎ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ (సర్టిఫికేషన్‌) చంద్రకళ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

క్లైమెట్‌ ఛేంజ్‌ నేపథ్యంలో సుస్థిర సేద్యం అనివార్యం
ఛత్తీస్‌ఘడ్‌ దంతెవాడ జిల్లాలో ఐదేళ్లుగా రసాయనాల జోలికి పోని 110 గ్రామాల్లో రైతులందరికీ పిజిఎస్‌ సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇచ్చాం. వారు ఎక్కువగా వరి ధాన్యమే పండిస్తున్నారు. ప్రభుత్వం రూ. 500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తోంది. 

దేశవ్యాప్తంగా వ్యవసాయంలో రసాయనాల వాడకం విపరీతం కావటం.. భూసారం క్షీణిస్తుండటం, నీటి వనరుల లభ్యత తగ్గిపోవటం, పెచ్చుమీరిన పర్యావరణ సమస్యలు వ్యవసాయాన్ని మరింత జఠిలంగా మార్చాయి. 

క్లైమెట్‌ ఛేంజ్‌ నేపథ్యంలో సుస్థిర సేద్యం వైపు మారాల్సిన అనివార్యతను ఇప్పుడు అందరూ గుర్తిస్తున్నారు. అది ఏ పద్ధతిలో అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చంతా. ఆంధ్రప్రదేశ్‌లో డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం(2007–08) నుంచే వ్యవసాయ రసాయనాల వాడకం తగ్గుతుండగా, గత పదేళ్లలో తెలంగాణలో 5 రెట్లు పెరిగింది. లక్ష ఎకరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించాం.  
– డా. జీవీ రామాంజనేయులు
ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్‌
https://csa-india.org/  
https://krishnasudhaacademy.org 

20 ఏళ్ల క్రితం 
ఐఆర్‌ఎస్‌ వద్దనుకొని.. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్‌డి పూర్తిచేసిన డా. రామాంజనేయులు ఐసిఎఆర్‌లోని అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సర్వీస్‌ (ఎఆర్‌ఎస్‌)లో 8 ఏళ్లు సీనియర్‌ శాస్త్రవేత్తగా పని చేశారు. ఆ తర్వాత ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌)కు ఎంపికయ్యారు. శిక్షణా కాలంలోనే ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి సేంద్రియ/ ప్రకృతి వ్యవసాయ వ్యాప్తి కోసం సుస్థిర వ్యవసాయ కేంద్రం అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ఈ దిశగా గత 20 ఏళ్లుగా విశేష కృషి చేస్తున్నారు. సేంద్రియ పద్ధతులపై పరిశోధన చేస్తూ శిక్షణ ఇచ్చే కృష్ణసుధ అకాడమీ ఫర్‌ ఆగ్రోఎకాలజీ (కొండపర్వ)ని స్థాపించటంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ‘ఏపీ, తెలంగాణలో 66 సహకార సంఘాలు, ఎఫ్‌పిఓలకు చెందిన 50 వేల మంది రైతులను సేంద్రియ సాగు వైపు మళ్లించే కృషి చేస్తున్నాం. ఇప్పటికే 30 వేల మందికి సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇచ్చాం. వారి నుంచి సేకరించిన ఉత్పత్తులను టీటీడీకి అందిస్తున్నామ’ని డా.రామాంజనేయులు తెలిపారు. 
 

ఇదీ చదవండి: బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!

 సేంద్రియ సర్టిఫికేషన్‌ ఎవరిస్తారు?
సేంద్రియ / ప్రకృతి వ్యవసాయం చేపట్టిన రైతులకు, సహకార సంఘాలకు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, గ్రామాలకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ గుర్తింపు పొందిన సంస్థలు సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇస్తాయి. ఈ సంస్థలను రీజినల్‌ కౌన్సెళ్లు అంటారు. ఇలాంటి కౌన్సెళ్లు దేశంలో 76 ఉన్నాయి. రీజినల్‌ కౌన్సెల్‌ ఎన్ని రాష్ట్రాల్లో అయినా సర్టిఫికేషన్‌ సేవలు అందించవచ్చు. చురుగ్గా పనిచేస్తున్న రీజినల్‌ కౌన్సెళ్లలో సికింద్రాబాద్‌లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం రీజినల్‌ కౌన్సెల్‌ ఒకటి. 

వ్యక్తిగతంగా ఒక రైతు గానీ, 10–15 మంది రైతుల బృందాలు / సహకార సంఘాలు / రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పిఓల)కు పిజిఎస్‌ సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇస్తారు. అందరి రైతులూ పరస్పరం బాధ్యత తీసుకోవాలి. బృందంలో ఒక్క రైతు దారితప్పినా గ్రూప్‌ మొత్తానికీ గుర్తింపు రద్దవుతుంది. పూర్తిగా గ్రామంలో రైతులందరికీ కలిపి కూడా సర్టిఫికేషన్‌ ఇస్తారు. దీన్నే లార్జ్‌ ఏరియా సర్టిఫికేషన్‌ అంటారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు అనేక దఫాలు పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్టిఫికేషన్‌ ఏ యేటికాయేడు ప్రదానం చేస్తారు.

సర్టిఫికేషన్‌ రెండు రకాలు
ఆరోగ్యదాకమైన ఆహారోత్పత్తులను పండించే రైతులు / సంస్థలు తమ ఉత్పత్తులకు సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందడానికి ప్రధానంగా రెండు సర్టిఫికేషన్లు ఉన్నాయి. మొదటిది.. పిజిఎస్, రెండోది.. ఎన్‌పిఓపి. ఎక్కడ అమ్మాలనుకునే దాన్ని బట్టి ఏ సర్టిఫికేషన్‌ అవసరమో చూసుకోవాలి. దేశంలోనే విక్రయించాలనుకుంటే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పిజిఎస్‌) ఇండియా సర్టిఫికేషన్‌ తీసుకుంటే సరిపోతుంది. కొందరు రైతులు బృందంగా ఏర్పడి, పరస్పర బాధ్యతతో తీసుకునే సర్టిఫికేషన్‌ ఇది. 

దీనికి అయ్యే ఖర్చు కొంచెం తక్కువ. విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటే నేషనల్‌ప్రోగ్రామ్‌ ఫర్‌ ఆర్గానిక్‌ ప్రొడక్షన్‌ (ఎన్‌పిఓపి) థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌ పొందాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ సర్టిఫికేషన్‌ అయినా పూర్తిగా సేంద్రియ సర్టిఫికెట్‌ పొందటానికి మూడేళ్ల కాలం పడుతుంది. పరివర్తన దశలో తొలి రెండేళ్లకు ‘గ్రీన్‌’ సర్టిఫికేట్‌ ఇస్తారు. మూడో ఏడాది అన్ని పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన తర్వాత ‘ఆర్గానిక్‌’ సర్టిఫికేట్‌ ఇస్తారు. నిపుణులు, అధికారుల సమన్వయంతో రీజినల్‌ కౌన్సెళ్లే ఈ సర్టిఫికేషన్‌ సేవలు అందిస్తున్నాయి.

నేరుగా అమ్మితే సర్టిఫికేషన్‌ అక్కర్లేదు!
రసాయన రహితంగా వ్యవసాయం చేస్తూ, తాము పండించే ఉత్పత్తులను, ఎటువంటి బ్రాండ్‌ పేరు పెట్టకుండా, నేరుగా వినియోగదారులకు అమ్ముకునే సేంద్రియ రైతులు ఎటువంటి సేంద్రియ సర్టిఫికేషన్‌ తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే, వారి వ్యాపారం ఏడాదికి రూ. 12 లక్షలు లోపు ఉండాలి. ఆ పరిమితి దాటితే సర్టిఫికేషన్‌ తీసుకోవాలి. అదేవిధంగా.. రైతు బృందాలు, కోఆపరేటివ్‌లు, ఎఫ్‌పిఓలు, వారి వద్ద నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను సేకరించే ప్రైమరీ అగ్రిగేటర్లు, స్టార్టప్‌లు కూడా వార్షిక వ్యాపారం రూ. 50 లక్షలకు లోపు ఉంటే సేంద్రియ సర్టిఫికేషన్‌ పొందాల్సిన అవసరం లేదు. ఈ వ్యవహారాలను ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) అధికారులు పర్యవేక్షిస్తుంటారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement