
టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.
హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారతదేశంలో.. అమెరికన్ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.
టెస్లా ధరలు ఎలా ఉంటాయంటే?
ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది. టెస్లా మోడల్ వై ధరలు రూ. 70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2023లో 82,688 యూనిట్ల నుంచి 2024లో 20 శాతం పెరిగి 99,165 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్.. జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్స్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి.
లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ కూడా ఈ సంవత్సరంలో అమ్మకాలలో పెరుగుదలను నమోదు చేసింది. 2024లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, వోల్వో కార్స్ ఇండియా, ఆడి, పోర్స్చే కంపెనీలు 2,809 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. 2023లో ఈ అమ్మకాలు 2,633 యూనిట్లుగా ఉన్నాయి. మాత్రమే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు దాదాపు 20 శాతం పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment