Sustainable Agriculture Center
-
సుస్థిర వ్యవసాయంతోనే ఆహార భద్రత
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రానున్న సంవత్సరాల్లో భారత్‌లో ఆహార సంక్షోభం తలెత్తనుందా? దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధ్యం కావడం లేదా? కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ సుస్థిర వ్యవసాయంలో ముందుకు వెళ్తున్నాయా? అలా వెళ్తున్న రాష్ట్రాలు ఆహార భద్రతకు భరోసా కల్పిస్తున్నాయా? సుస్థిర వ్యవసాయానికి మొత్తం 51 సూచికలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా జరిపిన అధ్యయనం తర్వాత సుస్థిర వ్యవసాయం సాధించలేని పక్షంలో ఆహార భద్రత కష్టమేనని అఖిల భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్–ఐకార్) అభిప్రాయపడుతోంది. ‘కాంపోజిట్ ఇండెక్స్ ఆఫ్ అగ్రికల్చర్ సస్టైనబులిటీ’పేరిట దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని వ్యవసాయ విధానా లను ఐకార్ శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రేమ్‌చంద్, కిరణ్‌కుమార్‌లు పరిశీలించి నివేదిక సమర్పించారు. ఈ నేపథ్యంలో ఐకార్ ఈ అభిప్రాయానికి వచ్చింది. వ్యవసాయ విధానాల్లో స్పష్టమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తోంది. వ్యవసాయ సుస్థిరతకు సవాళ్లు ‘వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వినియోగం పెరగడం, తీవ్ర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం, భూసారం తగ్గిపోవడం వ్యవసాయ సుస్థిరతకు పెనుసవాలుగా మారుతోంది. 2030 నాటికి దేశ జనాభా 150 కోట్లకు చేరుకుంటుంది. ఆ జనాభాకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత సాగు రంగంపై ఉంది. కొన్ని రాష్ట్రాలు సామాజిక, ఆర్థిక రంగాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నా.. వ్యవసాయ సుస్థిరత సూచీలకు వచ్చేస రికి వెనుకబడుతున్నాయి..’అని ఐసీఏఆర్ వెల్లడించింది. పంజాబ్, హరియాణ సామాజిక, ఆర్థిక రంగాల్లో ముందంజలో ఉన్నప్పటికీ.. వ్యవసాయ సుస్థిరత సూచీని పరిశీలించినప్పుడు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. భారత వ్యవసాయ రంగం సుస్థిరత కోణంలో ఉన్నత స్థానంలో లేదని ఓ మోస్తరు సుస్థిరతతోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వాలుసహకరించాలి.. ‘సుస్థిర వ్యవసాయానికి ప్రధాన సూచికలైన అతి తక్కువ నీరు,రసాయనాలు, ఎరువులు,విద్యుత్ వినియోగిస్తూ, భూసారం తగ్గకుండా పంటలు పండించే రైతాంగానికి ప్రభుత్వాలు సరైన సమయంలో సాయం అందించాల్సిన అవసరం ఉంది. అప్పుడే భారత్‌లో ఆహార భద్రతకు ఇబ్బందులు రావు. ప్రస్తుతం మిజోరం, కేరళ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్,పశ్చిమ బెంగాల్ మాత్రమేసుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులుఎదుర్కొనే రాజస్తాన్ సుస్థిరవ్యవసాయంలో చివరలో ఉంది..’ అని ఐకార్ నివేదిక తెలిపింది. సుస్థిర వ్యవసాయానికి 51 సూచికలు సుస్థిర వ్యవసాయాభివృద్ధికి 51 సూచికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు ఐకార్ వెల్లడించింది. సారవంతమైన నేలలు, నీటి వనరులు, జీవ వైవిధ్యం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ సమతుల్యత తదితర సూచికలు ప్రధానమైనవిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, హరియాణాతోపాటు వరి పండించే జార్ఖండ్, అస్సాం రాష్ట్రాలు ఎక్కువ ప్రమాదంలో ఉన్నట్లు ఐకార్ వివరించింది. ఇక్కడ వ్యవసాయ విధానాల్లో మార్పులు అత్యావశ్యమని హెచ్చరించింది. పంటల మార్పిడి, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పంట రుణాలు, నీటి వనరుల కల్పన తదితరాలతో సుస్థిర వ్యవసాయం సాధ్యమంది. అధిక ఇన్పుట్ సబ్సిడీల నుంచి పద్ధతి ప్రకారం రైతులకు లబ్ధి చేకూరే విధానాలు రావాల్సి ఉందని తెలిపింది. భూములు సారవంతంగా లేని చోట రసాయన ఎరువుల వాడకం పెరుగుతోందని, దీనివల్ల భూమిలో ఆర్గానిక్ కార్బన్ తగ్గుదల చోటు చేసుకుంటోందని వివరించింది. దేశంలో ఓ మాదిరి సుస్థిరతే.. సుస్థిర వ్యవసాయంలో 0 నుంచి 1ని ప్రామాణికంగా తీసుకుంటే దేశంలో సరాసరిన 0.50 నమోదు అవుతోందని, ఇది ఓ మాదిరి సుస్థిరత మాత్రమేనని ఐసీఏఆర్ తేల్చింది. 0ను అధ్వానంగా పేర్కొంటే, 1ని అత్యుత్తమంగా పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలు జాతీయ సగటును మించి ఉన్నాయి. పంజాబ్, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో భూ గర్భ జలాల వినియోగం అధికంగా ఉందని, భూగర్భ జలాలు 40 సెంటీమీటర్ల మేరకు వేగంగా పడిపోయాయని ఐకార్ పేర్కొంది. ఇక పర్యావరణ సుస్థిరతలో కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరం, ఉత్తరాఖండ్‌లు మెరుగైన పనితీరును కనపరుస్తున్నట్లు తెలిపింది. ఇందులో అస్సాం, మణిపూర్, జార్ఖండ్, పంజాబ్, తెలంగాణ అధ్వానంగా ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చాలా తక్కువ పరిమాణంలో ఉందని, గ్రీన్హౌస్ గ్యాసెస్ ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వెలువడుతున్నట్లు పేర్కొంది. వాణిజ్య పంటలున్నా ఏపీ భేష్ సుస్థిర వ్యవసాయాభివృద్ధి సాధిస్తున్న ఐదారు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండటం అభినందనీయం. మిజోరం, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నా.. ఆ రాష్ట్రాల్లో వాణిజ్య పంటలు తక్కువగా ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో వాణిజ్య పంటలు అధికంగా సాగు చేస్తున్నా.. రసాయన ఎరువులు, నీరు తక్కువ వినియోగం, భూసారాన్ని పెంపొందించేలా చేయడం ద్వారా సుస్థిర వ్యవసాయాన్ని సాధించింది. సుస్థిర వ్యవసాయం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరం ఉంది. ఈ రైతులను ఆదుకుంటే దేశ ఆహార భద్రతకు వచ్చే ముప్పేమీ ఉండదు. -
గ్రామ స్థాయిలోనే వ్యవసాయ సూచనలు!
సాధారణంగా వ్యవసాయ/ఉద్యాన విశ్వవిద్యాలయాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు రాష్ట్ర, జిల్లా స్థాయిలో పంటల స్థితిగతులను పరిశీలించి నెలకు, వారానికి ఒకసారి రైతులను ఉద్దేశించి ప్రసార మాధ్యమాలు, పత్రికల ద్వారా వ్యవసాయ సూచనలను అందిస్తుండటం పరిపాటి. అయితే, వీటిని రైతులు తమ గ్రామంలో నెలకొన్న వాతావరణ, పంటల పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని అమలు చేసుకోవలసి ఉంటుంది. ఇది రైతులందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే, గ్రామ స్థాయిలోనే పంటలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను నిరంతరం అధ్యయనం చేస్తూ.. ఆ గ్రామంలోని రైతులు పండిస్తున్న వివిధ పంటలకు తగిన విధంగా అన్వయించి.. ప్రతి మూడు రోజులకోసారి వ్యవసాయ సూచనలను వారి సొంత భాషలో మొబైల్స్ ద్వారా అందిస్తే ఫలితాలు మెరుగ్గా ఉంటాయా? సకాలంలో సరైన సూచనలు అందిస్తే పంట దిగుబడులు పెరగటంతోపాటు మంచి ధరను సైతం పొందగలుగుతారా? గ్రామస్థాయిలో ఇలా అందించే సమగ్ర వ్యవసాయ సూచనలు కచ్చితంగా రైతులకు ఉపకరిస్తాయని స్వచ్ఛంద సంస్థ సుస్థిర వ్యవసాయ కేంద్రం (సిఎస్ఎ) ఆశిస్తోంది. గత 15 ఏళ్లుగా తెలుగునాట సేంద్రియ/ప్రకృతి/ఎన్‌పిఎం వ్యవసాయ పద్ధతులను ఈ సంస్థ ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) తోడ్పాటుతో సేంద్రియ / ప్రకృతి / ఎన్‌పిఎం పద్ధతుల్లో వివిధ పంటలు పండించే రైతులకు గ్రామస్థాయిలో వ్యవసాయ సూచనలు అందించే పైలట్ ప్రాజెక్టుకు సిఎస్ఎ ఇటీవల శ్రీకారం చుట్టింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం 15 గ్రామాల్లోని వెయ్యి మంది సేంద్రియ రైతులకు అందిస్తున్నారు. కిసాన్ మిత్ర కాల్ సెంటర్ ద్వారా సూచనలు సలహాలను ఫోన్ ద్వారా అందించే కార్యక్రమాన్ని నాబార్డ్ చైర్మన్ జి.వి.చింతల ఇటీవల హైద్రాబాద్ నుంచి జూమ్ ఆప్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ ఏపీ సిజిఎమ్ సుధీర్‌కుమార్ జనావర్, తెలంగాణ రాష్ట్ర సిజిఎమ్ వై.క్రిష్ణారావు, సుస్దిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. జి.వి.రామాంజనేయులు తదితరులు పాల్గొ్గన్నారు. హరిత రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 12 గ్రామాల రైతులను, వేపాడ గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంస్థలో సభ్యులైన 3 గ్రామాల రైతులను ఎంపిక చేసి సూచనలు అందిస్తున్నారు. వారికి ప్రతి బుధ, శనివారాల్లో ఫోన్ ద్వారా తెలుగులో సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్)తో పాటు శ్రవణ సందేశం (వాయిస్ మెసేజ్) పంపుతున్నారు. స్థానిక వాతావరణ వివరాలను తెలుసుకునేందుకు వేపాడ మండలం ఎస్కెఎస్ఆర్ పురంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఏయే పంటల్లో చీడపీడల పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది పసిగట్టడానికి గ్రామస్థాయిలో ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి, రైతులను అప్రమత్తం చేస్తుండటం విశేషం. వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు, వాతావరణ శాఖ అధికారులు అందించే సూచనలతోపాటు స్థానికంగా సేకరించిన వివరాల ఆధారంగా నిపుణులు తగిన సూచనలను కిసాన్ మిత్ర ద్వారా ఈ వెయ్యి మంది రైతులకు అందిస్తున్నారు. పంటల సాగు, సస్య రక్షణకే పరిమితం కాకుండా.. వారు పండించిన పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ సదుపాయాలు ఎక్కడ ఉన్నాయి? ఏయే పంట ఉత్పత్తుల ధరలు దగ్గర్లోని మార్కెట్లలో ఎలా ఉన్నాయి? అనే సమచారాన్ని కూడా రైతులకు అందించేందుకు కిసాన్ మిత్ర సిబ్బంది కృషి చేస్తున్నారు. మండలంలో రైతులు ప్రస్తుతం ప్రధానంగా వరి, కూరగాయలు, చిరుధాన్యాలు సాగు చేస్తున్నారు. వీరికి విత్తనశుద్ధి, జీవామృతం, ద్రవజీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీ, వాడకం, వాటి ప్రయోజనాలపై సుస్దిర వ్యవసాయం కేంద్రం సిబ్బంది పొలంబడి నిర్వహిస్తూ సూచనలు సలహాలు అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఈ వెయ్యి మంది రైతులుకు ఉచితంగా విత్తనాలు, సేంద్రియ ఎరువులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించేందుకు కిసాన్ మిత్ర సేవలు దోహదపడతాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సుస్దిర వ్యవసాయ కేంద్రం కోరుతోంది. – వరాహగిరి సత్యనారాయణ, సాక్షి, వేపాడ ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న రైతులకు ఎప్పటికప్పుడు రాబోయే ఐదు రోజుల వాతావరణ పరిస్తితులను వివరించటంతో పాటు పంటలను ఆశించేచీడపీడల నివారణకు, పండించిన పంటలకు మార్కెట్ ధరలు తెలుసుకోవటానికి కిసాన్ మిత్ర దోహాదపడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్రయత్నంగా విజయనగరం జిల్లా వేపాడ మండలంలో ఎంపికచేసిన రైతులకు ఈ అవకాశం కల్పించాం. ఈ సదుపాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తెలుగు స్థానిక యాసలోనే బుధ, శనివారల్లో సూ^è నలు, సలహాలు ఉదయం 7 గంటల నుండి సాయింత్రం 5 గంటల వరకు ఫోన్ ద్వారా వినియోగించుకోవచ్చు. 1800 120 3244 లేదా 08500 98 33 00 ద్వారా రైతులు కిసాన్ మిత్ర సేవలను పొందవచ్చు. – డా.జి.వి.రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సుస్థిర వ్యవసాయ కేంద్రం -
గులాబీ క్షేత్ర దినోత్సవానికి ప్రవేశం ఉచితం!
8, 22 తేదీల్లో ప్రకృతి సేద్యంపై విజయరామ్ శిక్షణ సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ (ఎస్.పి.ఎన్.ఎఫ్.) పద్ధతిపై సొసైటీ ఫర్ అవేర్నెస్ అండ్ విజన్ ఆన్ ఎన్విరాన్మెంట్ (సేవ్) ‘సేవ్’ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయదారులు విజయరామ్ ఈ నెల 8న తిరుపతిలో, 22న రాజమహేంద్రవరంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారికి, భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం చేద్దాం అనుకునే వారికి అవగాహన కల్పిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం, అంతర పంటల ద్వారా అధికాదాయం పొందటం, పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అమ్ముకోవటం, వాన నీటి సంరక్షణ పద్ధతులు, వ్యవసాయంలో దేశవాళీ ఆవు, ఎద్దు ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. ప్రవేశ రుసుము రూ. వంద. శిక్షణ సమయం ఉ. 9 నుంచి సా. 5 గంటల వరకు. ఆసక్తి గల వారు ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాలి. మార్చి 8 (ఆదివారం)న తిరుపతిలో.. వేదిక: ఎస్వీ యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియం, తిరుపతి రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 88849 12344, 94495 96039, 86889 98047 మార్చి 22 (ఆదివారం)న రాజమహేంద్రవరంలో.. వేదిక : శ్రీ ఉమారామలింగేశ్వర కళ్యాణ మండపం, జామ్‌పేట, రాజమహేంద్రవరం. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు.. 94495 96039, 86889 98047, 99498 00201. 16న తమిళనాడులో గులాబీ క్షేత్ర దినోత్సవం బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐ.ఐ.హెచ్.ఆర్.) ఆధ్వర్యంలో తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా దొడ్డమంచి గ్రామంలో గల తెలుగు రైతు మంజునాథ్ (79821 17354) కు చెందిన వన్య ఫార్మ్స్‌లో మార్చి 16, సోమవారం నాడు సేంద్రియ గులాబీ పూల సాగుపై క్షేత్ర దినోత్సవాన్ని (రోజ్ ఫీల్డ్ డే) నిర్వహించనుంది. సేంద్రియ పద్ధతుల్లో గులాబీలను సాగు చేస్తూ ఆయన మునగను అంతరపంటగా సాగు చేస్తున్నారు. కూరగాయలు, ఔషధ మొక్కలు కూడా సాగు చేయబోతున్నారు. రైతు క్షేత్రంలో గులాబీల సేంద్రియ సాగును ప్రత్యక్షంగా రైతులకు చూపించడం, సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం, ఐఐహెచ్ఆర్ సీనియర్ ఉద్యాన శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి అవకాశం కల్పించడం ఫీల్డ్ డే లక్ష్యం. ఉ. 9 గంటల నుంచి జరిగే ఈ క్షేత్ర దినోత్సవంలో రైతులకు ఉచిత ప్రవేశం ఉంటుంది. అయితే, 89192 71136 నంబరుకు ఫోన్ చేసి ముందుగా పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. సుస్థిర లాభసాటి వ్యవసాయంపై 3 నెలల కోర్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల–ఆయకట్టు అభివృద్ధి శాఖ, నీరు–భూమి యాజమాన్య శిక్షణ, పరిశోధనా సంస్థ (వాలంతరి–రాజేంద్రనగర్) ఆధ్వర్యంలో ‘భూమి, నీటి యాజమాన్యంతో సుస్థిరమైన లాభసాటి వ్యవసాయం’పై 3 నెలల రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశానికి ఈ నెల 5వ తేదీలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 10 నుంచి జూన్ 9 వరకు కోర్సు కాలం ఉంటుంది. ఇంటర్/ఐటిఐ/డిప్లొమా చదివిన 18–30 ఏళ్ల వయసులో గ్రామీణ యువతీ యువకులు అర్హులు. కోర్సు రుసుము రూ. 5 వేలు. ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు రుసుము రూ. 500. ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఆదర్శ రైతుగా ఎదగవచ్చు లేదా వ్యవసాయ కన్సల్టెంట్‌గా స్థిరపడవచ్చు. దరఖాస్తు ఫాం, ఇతర వివరాలకు సంబంధిత వెబ్సైట్ చూడండి. 8న కొర్నెపాడులో సూపర్ నేపియర్ సాగుపై శిక్షణ ప్రకృతి/సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పశుగ్రాసాల సాగు, ప్రత్యేకంగా సూపర్ నేపియర్ గడ్డి సాగు, పశుపోషణపై మార్చి 8(ఆదివారం)న గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. సూపర్ నేపియర్ కణుపులను ఉచితంగా పంపిణీ చేస్తారు. గన్నవరం పశువైద్య కళాశాల ప్రొఫెసర్ అండ్ హెడ్ డా. సి.హెచ్. వెంకట శేషయ్య, పాడి రైతు విజయ్ (గుంటూరు) రైతులకు శిక్షణ ఇస్తారు. ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. -
పురుగులతో వేగేదెలా?
ఇంటి పంట ఎండ గత కొద్ది రోజులుగా చుర్రుమంటోంది. ఇంటిపంటలకు (70% ఎండను వడకట్టే) 30% గ్రీన్ షేడ్‌నెట్‌తో నీడను కల్పించడం, ఆకులతో నేలకు ఆచ్ఛాదన(మల్చింగ్), డ్రిప్ వంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కూరగాయ పంటలకు వేసవిలో కొన్ని ప్రత్యేక పురుగుల బెడద ఉంటుంది. నేల మీద లేదా కుండీల్లో ఎక్కడైనా వీటి బెడద ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని మెలకువలు పాటిస్తే నష్టం తక్కువగా చూసుకోవడానికి వీలుంది. పెంకు పురుగులు: ఇవి చల్లదనాన్ని ఇష్టపడే పురుగులు. మొక్కల దగ్గర మట్టిలో పిల్ల పురుగులు దాక్కొని ఉంటాయి. రాత్రి పూట బయటకు వచ్చి మొక్కల ఆకులను తిని, మళ్లీ మట్టిలోకి చేరుకుంటాయి. వేపపిండిని మట్టిలో కలిపితే సమస్య తీరుతుంది. కూరగాయ మొక్కలు నాటడం లేదా ఆకుకూరల గింజలు చల్లడానికి ముందే మట్టిలో కొంచెం వేప పిండి వేసుకుంటే వీటి సమస్య రాదు. నులిపురుగు: వంగ, బీన్స్, టమాటా తదితర కూరగాయ మొక్కల వేళ్లను నులిపురుగులు ఆశిస్తుంటాయి. నులిపురుగుల సమస్య ఉన్న మొక్కలకు పోషకాల లభ్యత తగ్గిపోతుంది. ఆకులు పసుపు పచ్చగా మారి.. మాడిపోతాయి. ఆకుల్లో తేడా తప్ప ఇతర లక్షణాలేవీ ఉండవు. మట్టిని పక్కకు తీసి వేళ్లను గమనిస్తే వేళ్లకు బుడిపెలు కనిపిస్తాయి. దీన్ని మొదటి దశలో అయితే ట్రైకోడెర్మావిరిడితో కొంతమేరకు నియంత్రించవచ్చు. అయితే, ట్రైకోడెర్మా విరిడిని మట్టిలో వేస్తే.. ఆ తదనంతరం వరుసగా అనేక పంటలను నులిపురుగుల బారి నుంచి, ఎండుతెగులు నుంచి కూడా కాపాడుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడి తయారీ విధానం: ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్రనాశినిని మాగిన పశువుల పేడలో కలిపి వృద్ధి చేసి.. మొక్కలకు వేసుకోవాలి. పెరటి తోటలు, మేడపై ఇంటిపంటల కోసం తక్కువ పరిమాణంలో ట్రైకోడెర్మా విరిడిని వృద్ధి చేసుకోవచ్చు. 10 కిలోల పశువుల ఎరువును నీడలో నేలపైన పరిచి, 250 గ్రాముల(ఎక్కువైనా ఫర్వాలేదు) ట్రైకోడెర్మా విరిడి పొడిని కలిపి, పల్చగా నీటిని చిలకరించాలి. దానిపై గోనెసంచిని కప్పాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా నీరు చల్లుతుండాలి. వారం రోజుల్లో పశువుల ఎరువు పైన తెల్లని బూజు పెరుగుతుంది. అంటే.. ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చెందిందన్న మాట. మట్టిని ఒక అంగుళం మందాన తీసి పక్కన పెట్టి.. ట్రైకోడెర్మా విరిడితో కూడిన పశువుల ఎరువును వేసి, మళ్లీ మట్టిని కప్పేయాలి. ఎర్రనల్లి: వంగ, బెండ తదితర పంటల్లో ఆకుల కింద చేరే ఎర్రనల్లి రసం పీల్చేస్తూ ఉంటుంది. ఆకులు క్రమంగా పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క పెరగదు. దీని నివారణకు గుప్పెడు ఆవాలు, 2,3 వెల్లుల్లి రెబ్బలు నూరి, ఒక పల్చని గుడ్డలో మూటగట్టి, లీటరు నీటిలో 3 గంటలు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఆకుల అడుగున బాగా తడిసేలా పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. లేదా దుకాణాల్లో లభించే నీటకరిగే గంధకం(వెట్టబుల్ సల్ఫర్)ను తగిన మోతాదులో వాడుకోవచ్చు. - డా. బి. రాజశేఖర్ (83329 45368), శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్