పురుగులతో వేగేదెలా?
ఇంటి పంట
ఎండ గత కొద్ది రోజులుగా చుర్రుమంటోంది. ఇంటిపంటలకు (70% ఎండను వడకట్టే) 30% గ్రీన్ షేడ్‌నెట్‌తో నీడను కల్పించడం, ఆకులతో నేలకు ఆచ్ఛాదన(మల్చింగ్), డ్రిప్ వంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కూరగాయ పంటలకు వేసవిలో కొన్ని ప్రత్యేక పురుగుల బెడద ఉంటుంది. నేల మీద లేదా కుండీల్లో ఎక్కడైనా వీటి బెడద ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని మెలకువలు పాటిస్తే నష్టం తక్కువగా చూసుకోవడానికి వీలుంది.
పెంకు పురుగులు: ఇవి చల్లదనాన్ని ఇష్టపడే పురుగులు. మొక్కల దగ్గర మట్టిలో పిల్ల పురుగులు దాక్కొని ఉంటాయి. రాత్రి పూట బయటకు వచ్చి మొక్కల ఆకులను తిని, మళ్లీ మట్టిలోకి చేరుకుంటాయి. వేపపిండిని మట్టిలో కలిపితే సమస్య తీరుతుంది. కూరగాయ మొక్కలు నాటడం లేదా ఆకుకూరల గింజలు చల్లడానికి ముందే మట్టిలో కొంచెం వేప పిండి వేసుకుంటే వీటి సమస్య రాదు.
నులిపురుగు: వంగ, బీన్స్, టమాటా తదితర కూరగాయ మొక్కల వేళ్లను నులిపురుగులు ఆశిస్తుంటాయి. నులిపురుగుల సమస్య ఉన్న మొక్కలకు పోషకాల లభ్యత తగ్గిపోతుంది. ఆకులు పసుపు పచ్చగా మారి.. మాడిపోతాయి. ఆకుల్లో తేడా తప్ప ఇతర లక్షణాలేవీ ఉండవు. మట్టిని పక్కకు తీసి వేళ్లను గమనిస్తే వేళ్లకు బుడిపెలు కనిపిస్తాయి. దీన్ని మొదటి దశలో అయితే ట్రైకోడెర్మావిరిడితో కొంతమేరకు నియంత్రించవచ్చు. అయితే, ట్రైకోడెర్మా విరిడిని మట్టిలో వేస్తే.. ఆ తదనంతరం వరుసగా అనేక పంటలను నులిపురుగుల బారి నుంచి, ఎండుతెగులు నుంచి కూడా కాపాడుకోవచ్చు.
ట్రైకోడెర్మా విరిడి తయారీ విధానం:
ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్రనాశినిని మాగిన పశువుల పేడలో కలిపి వృద్ధి చేసి.. మొక్కలకు వేసుకోవాలి. పెరటి తోటలు, మేడపై ఇంటిపంటల కోసం తక్కువ పరిమాణంలో ట్రైకోడెర్మా విరిడిని వృద్ధి చేసుకోవచ్చు. 10 కిలోల పశువుల ఎరువును నీడలో నేలపైన పరిచి, 250 గ్రాముల(ఎక్కువైనా ఫర్వాలేదు) ట్రైకోడెర్మా విరిడి పొడిని కలిపి, పల్చగా నీటిని చిలకరించాలి. దానిపై గోనెసంచిని కప్పాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా నీరు చల్లుతుండాలి. వారం రోజుల్లో పశువుల ఎరువు పైన తెల్లని బూజు పెరుగుతుంది. అంటే.. ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చెందిందన్న మాట. మట్టిని ఒక అంగుళం మందాన తీసి పక్కన పెట్టి.. ట్రైకోడెర్మా విరిడితో కూడిన పశువుల ఎరువును వేసి, మళ్లీ మట్టిని కప్పేయాలి.
ఎర్రనల్లి: వంగ, బెండ తదితర పంటల్లో ఆకుల కింద చేరే ఎర్రనల్లి రసం పీల్చేస్తూ ఉంటుంది. ఆకులు క్రమంగా పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క పెరగదు. దీని నివారణకు గుప్పెడు ఆవాలు, 2,3 వెల్లుల్లి రెబ్బలు నూరి, ఒక పల్చని గుడ్డలో మూటగట్టి, లీటరు నీటిలో 3 గంటలు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఆకుల అడుగున బాగా తడిసేలా పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. లేదా దుకాణాల్లో లభించే నీటకరిగే గంధకం(వెట్టబుల్ సల్ఫర్)ను తగిన మోతాదులో వాడుకోవచ్చు.
- డా. బి. రాజశేఖర్ (83329 45368), శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్