Inti panta
-
దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం'
ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని ఏడు నగరాల్లోకెల్లా అత్యధిక జనసాంద్రత గల నగరం దుబాయ్. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి ఇది మారుపేరు. దుబాయ్ అంటే చప్పున గుర్తొచ్చేది బుర్జ్ ఖలీఫా (భమ్మీద అత్యంత ఎత్తయిన 830 మీటర్ల భవనం) వంటి ఆకాశ హర్మ్యాలు, విలాసవంతమైన జీవనశైలే తప్ప.. వ్యవసాయం అసలు కాదు. అయితే, అది పాత సంగతి. ఇప్పుడు దుబాయ్ సిగలో ‘రూఫ్‌టాప్ సేద్యం’ తళుక్కుమంటోంది. పచ్చదనం, పర్యావరణ హితమైన జీవనం వైపు ఈ ప్రత్యేక ఉద్యమం దుబాయ్ పట్టణ వాతావరణాన్ని క్రమంగా పునర్నిర్మిస్తోంది. కాంక్రీటు అరణ్యానికి ఆకుపచ్చని సొబగులు అద్దుతోంది. ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలను భవనాల పైకప్పులపైనే నగరవాసులు పండించుకుంటున్నారు. అర్బన్ అగ్రికల్చర్ భావన అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఆకుపచ్చని పంటలతో నిండిన సుస్థిరమైన జీవనాకాంక్షను నెరవేర్చటం, వీలైనంత వరకు ఆహార భద్రతకు తోడ్పడడంతో పాటు.. నగరపు రొద మధ్యలో మనోల్లాస వాతావరణాన్ని కల్పిస్తోంది. రఫ్‌టాప్ కిచెన్ గార్డెనింగ్ ఎంత పాపులర్ అయ్యిందంటే.. ఇంటిపైన ఆహారాన్ని పండించుకునే సదుపాయాన్ని కల్పించే భవన నిర్మాణ ప్రాజెక్టుల కోసమే వెతుకుతున్నారంటే ఆశ్చర్యం లేదు! తీవ్రమైన ఎడారి వాతావరణం కారణంగా యూఏఈ.. ఆహారం మొత్తాన్నీ విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తామరతంపరగా విస్తరిస్తున్న మిద్దె తోటల వల్ల ఆహార దిగుమతి కొంతమేరకైనా తగ్గే అవకాశం కనపడుతోంది. ఈ ట్రెండ్ వెనుక.. పర్యావరణానికి మేలు చేసే పనులను ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సహిస్త విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. 2050 నాటికి సుస్థిర జీవనం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా మారాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యంతో యూఏఈ ముందడుగేస్తోంది. ఆహారాన్ని స్థానికంగా పండించుకోవటం, కాంక్రీటు భవనాల ద్వారా విడుదలయ్యే వేడిని తగ్గించుకోవడం వంటి పనులకు లభిస్తున్న ప్రభుత్వ తోడ్పాటుతో దుబాయ్ వాసుల్లో మిద్దె తోటలపై అవగాహన, ఆసక్తి నానాటికీ ఇనుమడిస్తోంది. రఫ్‌టాప్ సేద్యం అంటే కేవలం పరిసరాలను పచ్చగా వర్చడం లేదా పంటలు పండించడం మాత్రమే కాదు. నలుగురూ కలసికట్టుగా పనిచేసే సంస్కృతికి నారు పొయ్యటం కూడా. నగరవాసులు విశ్రాంతి తీసుకోవడానికి, ప్రకృతితో మమేకం కావడానికి మిద్దె తోటలు నిర్మలమైన వాతావరణాన్ని అందిస్తున్నాయని దుబాయ్ వాసులు సంతోషపడుతున్నారు. ఎడారిలో సాధ్యమేనా? ఎడారి పరిస్థితులు ఉన్నప్పటికీ మిద్దెపైన ప్రత్యేక నిర్మాణాల ద్వారా కూరగాయలు, ఔషధ మొక్కలు సాగు చేసుకునేందుకు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ వంటి అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు దోహదం చేస్తున్నాయి. తులసి, కలబంద వంటి ఔషధ మొక్కలు.. పాలకూర, చార్డ్, లెట్యూస్ వంటి పంటలను సులభంగా పండిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల కంటే ఈ పద్ధతులతో పోల్చితే అతి తక్కువ నీరే ఖర్చవుతోంది. నీటి కొరత పెద్ద సమస్యగా ఉన్న దుబాయ్ వంటి ప్రాంతంలో ఈ సాగు పద్ధతులు ఉపయోగకరం. నివాస భవనాలపై ప్రత్యేక శ్రద్ధతో రఫ్గార్డెన్లు నిర్మిస్తున్నందు వల్ల ‘అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్’ను తగ్గించడంలో తోడ్పడుతోంది. శీతలీకరణ అవసరాలు తగ్గుతున్నాయని భవన నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. సొంత రఫ్‌టాప్ ఫామ్‌ను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారికి వర్గనిర్దేశం చేయడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రోత్సాహకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ‘రియల్’ ఆకర్షణ... నూతన సాంకేతిక ఆవిష్కరణలు, భవన నిర్మాణంలో జరుగుతున్న మార్పులు, ప్రభుత్వ మద్దతు, వాతావరణ మార్పుల నేపథ్యంలో సుస్థిర జీవనశైలిపై పెరుగుతున్న సామాజిక అవగాహన.. దుబాయ్‌లో రఫ్‌టాప్ ఫార్మింగ్ విస్తరణకు దోహదపడుతున్నాయి. దీని వల్ల పట్టణ జీవవైవిధ్యం మెరుగుపడుతుంది. కాలుష్య కారకాలను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతోంది. రఫ్‌టాప్ ఫార్మింగ్ సదుపాయాన్ని జోడించే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు పర్యావరణ స్పృహతో ఉన్న కొనుగోలుదారులను, ఆరోగ్యకరమైన జీవనానికి విలువనిచ్చే అద్దెదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రెండ్ కేవలం రెసిడెన్షియల్ భవనాలకే పరిమితం కాలేదు. వాణిజ్య భవనాలపై కప్పులపై కూడా పంటల సాగు ఏర్పాట్లు నిర్మించటం సామాజిక బాధ్యతగా బిల్డర్లు భావిస్తున్నారు. ఇది సానుకల ప్రభావాన్ని కలిగిస్తోంది. స్మార్ట్ ఇరిగేషన్, సెన్సర్లు, డేటా అనలిటిక్స్ ద్వారా రఫ్‌టాప్ ఫార్మింగ్ మెరుగైన ఫలితాలను ఇవ్వడమే కాక, నేర్చుకునే వారికి ఆకర్షణీయంగా వరింది. విలాసాలను త్యాగం చేయకుండా నగరాలు ఆహార స్వావలంబన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎలా స్వీకరించవచ్చో చెప్పడానికి దుబాయ్‌లో పెరుగుతున్న మిద్దె తోటల ధోరణి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు. (చదవండి: 14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం) -
జానెడు జాగా ఖాళీగా ఉంచరు.. అక్కడ కూరగాయలన్నీ ఉచితమే!
సేంద్రియ పెరటి తోటల విప్లవానికి వెంకట్రాయపురం గ్రామ గృహిణులు శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలంలో ఓ మారుమూల గ్రామం ఇది. 364 కుటుంబాలు.. 1,566 మంది జనాభా. గతంలో కిలోమీటర్ల దూరం వెళ్ళి కూరగాయలు కొని తెచ్చుకునేవారు. గృహిణులంతా చైతన్యవంతులై 5 ఏళ్ళ క్రితం సెర్ప్ తోడ్పాటుతో సేంద్రియ పెరటి తోటల సాగును నేర్చుకొని ఆచరిస్తున్నారు. రోడ్ల పక్కన, ఇంటి చుట్టూ, ఖాళీ స్థలాల్లో, గ్రామంలో ఖాళీగా ఉన్న పోరంబోకు స్థలాల్లోనూ కూరగాయ పంటలు, పండ్ల మొక్కలు నాటి, చక్కని ఫలసాయం పొందుతున్నారు. జానెడు జాగా ఉందంటే అందులో ఏదో ఒక కూరగాయ మొక్క ఉండవలసిందే. డాబా ఇళ్ళపై, ఇళ్ల చుట్టూ పంట మొక్కలతో ఆ గ్రామం కళకళలాడుతూ కనిపిస్తున్నది. ప్రతీ ఇంటి వద్ద వంగ, బెండ, టమాటా, బీర, పొట్ల, ఆనప, గుమ్మడి, బూడిద గుమ్మడి, మునక్కాడలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూరతో పాటు కంద కూడా ఇళ్ల వద్దే సాగు చేసుకుంటున్నారు. జామ, బొప్పాయి, నారింజ, పంపర పనస, సపోటా, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు నాటారు. అవి ఇప్పుడు ఫలసాయం అందిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం గ్రామంలో ఒక ద్రాక్ష పాదును నాటారు. ఇప్పుడు గ్రామంలో 50 శాతం ఇళ్లలో ద్రాక్ష పాదులు పండ్లను అందిస్తున్నాయి. మహిళల్లో వచ్చిన చైతన్యం ఫలితంగా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా అనేక రకాల కూరగాయలు కనిపిస్తున్నాయి. ఎవరికి వీలైన పంటలు వారు తమ పెరట్లో పండిస్తున్నారు. తాము ఇంటిపట్టున పండించిన కూరగాయలు, పండ్లను డబ్బు ప్రమేయం లేకుండా ఇరుగు పొరుగు వారికి ఇచ్చిపుచ్చుకుంటూ ఆదర్శంగా జీవిస్తున్నారు. తాము సేంద్రియంగా పండించిన కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు తినటం వల్ల అందరం ఆరోగ్యంగా ఉన్నామని మహిళలు సంబరంగా చెబుతున్నారు. కుల మతాలకు అతీతంగా కలిసి మెలసి పనులు చేసుకుంటారు. ఒకటే మాట, ఒకటే బాట అన్నట్లు జీవిస్తుండటం విశేషం. – పంతం వెంకటేశ్వర రావు, సాక్షి, పెరవలి, తూ.గో. జిల్లా కూరగాయలన్నీ ఉచితమే ఈ గ్రామానికి కొత్త కోడలిని. కూరగాయల దుకాణాలు ఏమీ లేవు. ఏం వండుకోవాలో తెలిసేది కాదు. ప్రతీ ఇంటి వద్ద కూరగాయలు పండించడంతో ఇప్పుడు కూరగాయల కొరత బాధ లేదు. ఏ కూరగాయలు కావాలన్నా ఇక్కడే ఉచితంగా దొరుకుతున్నాయి. – బోళ్ళ నాగమణి, గృహిణి, వెంకట్రాయపురం ప్రతి ఇంటి పరిసరాల్లోనూ... గ్రామస్థులు కూరగాయల కోసం పడుతున్న ఇబ్బందుల గురించి ఉన్నతాధికారుల వివరించాను. సుస్థిర వ్యవసాయం ద్వారా కూరగాయల సమస్యను తీర్చవచ్చని అందుకు ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. ఆ మేరకు మహిళలందరినీ చైతన్యపరిచి సామూహిక కూరగాయల సాగు చేయించాను. ఇప్పుడు ఏ ఇల్లు చూసినా కూరగాయ పంటలతో కళకళలాడుతూ కనిపిస్తున్నది. ప్రభుత్వం 90 శాతం సబ్సీడీపై విత్తనాలు సరఫరా చేసింది. రోడ్ల పక్కన, పోరంబోకు స్థలాల్లో కూడా కూరగాయ పంటలు పండిస్తున్నారు. – పాటి అనంతలక్ష్మి(93909 72585), విఏఏ, వెంకట్రాయపురం సమష్టి నిర్ణయాలు తీసుకుంటాం గ్రామం చిన్నది. పంచాయతీ ఆదాయం ఏడాదికి రూ.70 వేలు మాత్రమే. ఉన్నదాంట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. గ్రామస్తులందరం కలసి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రతి ఇంటి వద్దా కూరగాయలు సాగు చేస్తున్నారు. ఎవరికి ఏ కూరగాయలు కావాలంటే అవి ఉన్న ఇంటి దగ్గరకు వెళ్ళి తెచ్చుకుంటారు. కుల మత భేదాలకు తావు లేదు. అనారోగ్యాల్లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నాం. – పోలిశెట్టి బాలాజీ (93164 44777), సర్పంచ్, వెంకట్రాయపురం 23న విత్తనోత్సవం తూర్పు కనుమలలో వెల్లివిరిసిన దేశీ వంగడాల వార్షిక జీవవైవిధ్య విత్తనోత్సవం ఈ నెల 23న అల్లూరి సీతారామరాజు జిల్లా దుంబ్రిగూడ మండలం దేముడువలస గ్రామంలో జరుగుతుందని నిర్వాహకులు, సంజీవని సంస్థ అధిపతి దేవుళ్లు తెలిపారు. వందలాది రకాల దేశీ విత్తనాలను ప్రదర్శిస్తారు. వివరాలకు.. దేవుళ్లు – 94401 19789. 25న అనంతపురం జిల్లాలో డా. ఖాదర్ సభలు ఈనెల 25(సోమవారం) ఉ.10.30 గం.కు ధర్మవరంలోని వివేకానంద డిగ్రీ కళాశాల ఆవరణలో జరిగే సభలో ఆహార, ఆరోగ్య నిపుణులు డాక్టర్ ఖాదర్ వలి ప్రసంగిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 3.30 గం.కు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ పాడి పంట ఎకో విలేజ్‌లో ఉపన్యసిస్తారు. సా. 5.30 గం.కు బత్తలపల్లిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే సభలో ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం‘ అనే అంశంపై డా. ఖాదర్ ప్రసంగిస్తారు. చదవండి: భళా.. బాపట్ల బ్లాక్ రైస్! -
ఇంటిపంట ఓ స్టేటస్ సింబల్!
ఇవాళ మనం ఒక ప్రత్యేక సందర్భంలో నిలిచి ఉన్నాం. ఇటువంటి సందర్భాన్ని ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఇలా ప్రపంచం యావత్తూ మృత్యుభయంతో గజగజ వణికిపోయి సమస్త పారిశ్రామిక కార్యకలాపాలను సమస్త రవాణా సాధనాలను ఎక్కడికక్కడ ఆపేసుకుని సమస్త దేశాలూ స్వీయ లాక్డౌన్ పాటించడం మునుపు ఎన్నడూ లేని విషయం. లాక్డౌన్ అనేది దశల వారీగా ఇంకా సాగుతూనే ఉంది. ఇదంతా కోవిడ్ వైరస్ వ్యాప్తి – తదనంతర సంక్షోభ పరిస్థితుల గురించి అని మీలో అందరికీ తెలుసు. కోవిడ్ వైరస్ అనేది ప్రపంచానికి అనేక పాఠాలను నేర్పుతోంది. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.అందులో ఒక పాఠం ’రోగనిరోధక శక్తి– బలవర్ధకమైన ఆహారం’ అనేది అతి ముఖ్యమైన పాఠం. బలమైనరోగ నిరోధకశక్తి కలిగిన వారిని కోవిడ్ వైరస్ ఏమీ చెయ్యలేకపోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోవిడ్ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. వారంతా బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్న వారు. రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి, ప్రకృతి సిద్ధ పద్ధతిలో పండించిన ఆహారం అవసరం. రసాయన పురుగు మందుల వ్యవసాయం మూలంగా ఉత్పత్తి చెయ్యబడిన ఆహారంలో రోగనిరోధక శక్తి దాదాపుగా ఉండదని ప్రామాణిక నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం సంగతి తెలియదు కానీ, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మటుకు, మనం ఇక ముందు ఏది మాట్లాడుకోవాలన్నా’ కోవిడ్ కు ముందు– తరువాత’ అని మాట్లడుకోవలసి ఉంటుంది. అంతగా గత తొమ్మిది నెలల లాక్డౌన్ ప్రజలకు పాఠాలు చెప్పింది. ఒక అంచనా ప్రకారం.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు రెండున్నర లక్షల మంది మిద్దె తోటలు లేదా ఇంటి పంటల సేద్యం చేస్తున్నారు. గత తొమ్మిది నెలల లాక్‌డౌన్‌కు పూర్వం వీరి సంఖ్య కేవలం వేలల్లో ఉండేది. కేవలం తొమ్మిది నెలల కోవిడ్ కాలంలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఇంటి పంటల సాగు వైపు మొగ్గు చూపారు ప్రజలు. ఇందుకు గల ముఖ్య కారణాల్లో గత దశాబ్ద కాలంగా ’సాక్షి’ దినపత్రిక ’ఇంటిపంట’ పేరుతో ప్రచారం చెయ్యడం కూడా. ప్రారంభంలో ‘అది సాధ్యమేనా?‘ అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా, ప్రస్తుతం మిద్దె తోటల కల్చర్ వైవు, పెరటి తోటల కల్చర్ వైవు మరలుతున్నారు. మరోవైపు అటు వ్యవసాయ రంగంలో కూడా, గత దశాబ్ద కాలంగా సాక్షి దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ రెండు రకాల ప్రోత్సాహాలకు తోడుగా అనేక ఇతర సంస్థలు కూడా బాధ్యతగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు వ్యక్తులు కూడా ఇటువంటి ప్రచారంలో పాలు పంచుకోవడం మనం ఎరుగుదుం. అటువంటి గత దశాబ్దపు కృషికి కోవిడ్ వైరస్ నేర్పిన పాఠాలు కూడా తోడై, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల సాగు వైపు మరలారు. ఇదంతా రసాయన ఎరువులు పురుగుమందులు హైబ్రిడ్ విత్తనాలు లేకుండా, పూర్తి దేశీ పద్ధతిలో, తిరిగి మన పురాతన వ్యవసాయ పద్ధతుల వైపు ఆలోచించడానికి– ఆచరణలోకి తేవడానికి కారణం అయింది. ఏదీ ఏమైనా ఇవాళ తెలుగునాట కోట్లాది మంది ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ పంటల ప్రాధాన్యత గురించి, అవి మన ఆరోగ్యానికే కాకుండా సమస్త పర్యావరణానికి ఎలా మేలు కలిగిస్తాయో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది ఇంటి పంటల వైపు మరలారు. ఇంటిపంట అంటే ప్రధానంగా మిద్దెతోట సేద్యమే. పట్టణాలలో పెరటి తోటల సేద్యానికి అవకాశాలు తక్కువ– దాదాపుగా లేవు. స్థలాల ఖరీదు విపరీతంగా పెరిగింది. అందువల్ల పెరటి తోటల సేద్యం చెయ్యడానికి అవకాశాలు మూసుకుపొయ్యాయి. కేవలం మిద్దె తోటల సేద్యానికి మాత్రమే అవకాశాలున్నాయి. నగరాల విస్తీర్ణం ఎంత ఉంటుందో, మిద్దె తోటల సేద్యానికి అంత అవకాశం ఉంటుంది. నగరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం, నగర మిద్దె తోటల్లో ఉంది. ఇప్పుడు మిద్దె తోట అనేది ఒక ఆరోగ్యమంత్రం. ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. ఇది శుభపరిణామం. ఇందుకు ప్రత్యక్ష, పరోక్ష కారకులకు అందరికీ అభినందనలు తెలుపుతూ.. మిద్దె తోటల లేదా ఇంటిపంటల అవసరం గురించి, వాటి నిర్మాణ, నిర్వహణల గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మిద్దె తోటల సాగు వల్ల నూరు లాభాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన లాభం పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, పండ్లు, ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తి. ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వగైరా మిద్దె తోటల్లో పెరటి తోటల్లో సాగు చెయ్యలేం. కారణం? తగినంత విస్తీర్ణంలో మిద్దె కానీ పెరడు భూమి కానీ అందుబాటులో ఉండకపోవడం. కనుక మనం ఇంటిపంట అని పిలుస్తున్నది అటు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయాన్నీ ఇటు పట్టణాలలో మిద్దె తోటల సేద్యాన్ని ఉద్దేశించి మాత్రమే. ► స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో హైబ్రిడ్ విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం క్రమంగా పెరిగింది. ఓ దశాబ్దం క్రితం వరకు కేవలం పైర్ల మీద మాత్రమే పురుగుమందులను స్ప్రే చేసే వారు! క్రమంగా కలుపు నివారణ కోసం విషపూరిత రసాయన మందులను భూమి మీద స్ప్రే చెయ్యడం ప్రారంభం అయింది. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన వారు బెండ, వంగ వంటి కూరగాయలను కొనేముందు పురుగు పుచ్చు ఉందో లేదో అని ప్రతీ కాయను పరీక్షగా చూసి తీసుకునే వారు. అయినా ఒకటో రెండో పుచ్చు కాయలు వచ్చేవి. ఇటీవల అటువంటి పురుగు, పుచ్చు కాయలు కనబడటమే లేదు. ఎందుకని? అంతగా పురుగుమందుల వాడకం పెరిగింది. వారం వారం ఏదో ఒక పురుగుమందును కూరగాయల మొక్కల మీద స్ప్రే చేస్తుంటారు. అదీ సంగతి! ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో సుమారు అయిదు వందల పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. సాలీనా వాటి టర్నోవర్ అయిదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో జరుగుతున్న పురుగుమందుల వ్యాపారం ఏ లెవల్లో సాగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లెక్క. ఇది స్వయంగా ఓ జిల్లా కేంద్రంలోని పురుగుమందుల వ్యాపారి చెప్పిన లెక్క. అంటే నిత్యం ముప్పూటలా మనం పురుగుమందులనే పళ్లాలలో పెట్టి మన పిల్లలకు, తల్లిదండ్రులకు తినమని పెడుతున్నాం– మనమూ అదే విషాహారం తింటున్నాం. ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా, ఎంత నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం. ఇవాళ మధ్య తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్లలో క్యాన్సర్ పేషెంట్ లేని ఇల్లు అరుదు. అదంతా ఈ పురుగుమందుల తిండి వల్లనే అని మనకు అనేక నివేదికలు చెప్తున్నాయి. మనం తినే ఆహారంలో సగభాగమైన కూరగాయలను పండ్లను ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను మనమే మన ఇంటిపంటలుగా ఇంటి మీదనే పండించుకోవచ్చు. అందుకు మిద్దె తోటలే సరైన సాధనాలు. ప్రకృతి జీవన విధాన సాధనకు, మిద్దె తోట సరైన సాధనం. పురుగుమందుల తిండికి భయపడితే చాలు, సమయమూ ఓపిక వాటంతట అవే చక చకా వస్తాయి. మిద్దె తోటల సాగు వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా? అందులో ప్రధాన లాభాలను ఒకసారి మీ దృష్టికి తెస్తాను. మిద్దె మీద తోట ఉండటం వల్ల, ఇంటిలో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఆ కారణంగా ఏసీ, కూలర్ వగైరా వాడవలసిన అవసరం తగ్గుతుంది. వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఆ మేరకు విద్యుత్ బిల్లులతోపాటు విద్యుత్ ఉత్పత్తి వల్ల వచ్చే కాలుష్యం కూడా తగ్గుతాయి. ఒక ఇంటి మీద తోట ఉండటం వల్ల అంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ఒక నగరం మీద మొత్తం మిద్దె తోటల సాగు చేస్తే నగరపు ఉష్ణోగ్రతలు ఎంత తగ్గాలి? ఓ సజృనాత్మక ప్రక్రియ! కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది– అందుకు వాడే వాహనం దానికి ఇంధనం తద్వారా వెలువడే వాయు కాలుష్యం, సమయం వగైరా తప్పుతాయి. రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. రోజూ ఓ అరగంట మిద్దెతోటలో లేదా పెరటి తోటలో పని చేసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మిద్దెతోట లేదా పెరటితోట లేదా వ్యవసాయం అనేది ఓ సజృనాత్మక ప్రక్రియ! పిల్లల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక కాలంలో ఒక పద్ధతిలో ఒక విత్తనాన్ని నాటితే ఇలా సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలా ఉత్పత్తి వస్తుంది అని ఒక ఉత్పత్తి క్రమం పిల్లలకు అర్థం అవుతుంది. అదే క్రమం పిల్లలకు బ్రతుకు క్రమాన్ని కూడా తెలియచేస్తుంది. ఇంటి మీద ఒక తోట ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టుగా మారి అందరి మధ్యా ఒక బంధం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలకు ఎటు వారు అటు పోయి ఒంటరితనానికి లోనయ్యే గృహిణులకు మిద్దెతోట ఒక ఆలంబనగా మారుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు మిద్దె తోట ఒక పునర్జన్మను ఇస్తుంది. మీ మిద్దెతోట మూలంగా తిరిగి వారికి ఒక సోషౖల్ లైఫ్ ప్రారంభం అవుతుంది. సమస్యలు తగ్గుతాయి! మిద్దె తోటల సాగు విస్తీర్ణం ఎంత పెరిగితే, ఉష్ణోగ్రతలు వాయు, ధ్వని కాలుష్యాలు అంత తగ్గుతాయి, ఆ మేరకు ప్రజలకే కాదు పరోక్షంగా ప్రభుత్వాలకు కూడా సమస్యలు తగ్గుతాయి. మిద్దె తోటల సాగు మూలంగా ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయి– ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి, ఆ డబ్బును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించ వచ్చు. ఇంటిపంట/మిద్దెతోట అనేది ఓ నాలుగు అక్షరాల చిన్నపదం మాత్రమే కాదు, అది బహుళార్థ సాధక సాధనం. బరువు సమస్యే కాదు! ’ఇంటి మీద మిద్దెతోట నిర్మాణం జరిపితే బరువు మూలంగా ఇంటికి ప్రమాదం కాదా?’ అని కొందరికి అనుమానం కలుగుతుంది. ’ఇంటి మీద మొక్కల పెంపకం చేపడితే, నీటి ఉరుపు సమస్య ఏమైనా ఏర్పడుతుందా?’ అని మరికొందరు అనుమానపడతారు. మిద్దె తోట బరువు ఒక ఇంటిమీద పెద్ద బరువు కాదు. కాలమ్స్ పద్ధతిలో కట్టిన ఆర్సీసీ బిల్డింగ్ అయితే, అది స్టాండర్డ్ బిల్డింగ్ అయితే, మనం భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు. మిద్దె మీద వర్షపు నీరు నిలవకుండా ఒక వైపు వాలు ఉంటుంది. పై కప్పు వేసేటప్పుడు ఆ వాలును సరిగా మెయింటైన్ చెయ్యమని మేసన్ పని వారికి, బిల్డర్‌కు చెప్పాలి. ఖర్చు ఎక్కువ అక్కర్లేదు ’మిద్దె తోటల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది’ అని కొందరు అనుకుంటున్నారు– అదీ నిజం కాదు. మీరు ఎంత బడ్జెట్లో అయినా ఓ మిద్దెతోటను ప్రారంభం చెయ్యవచ్చు. ఓ వంద రూపాయల సిమెంట్ లేదా మట్టి కుండీలో ఓ కరివేపాకు మొక్కను పెంచవచ్చు. అలాగే చిన్న చిన్న ట్రేలలో ఆకుకూరల పెంపకం చేపట్టవచ్చు. ఓ నెలలోనే ఆకుకూరలను పొందవచ్చు. ఓ ఖాళీ సిమెంట్ సంచిని నీళ్లలో ఝాడించి ఉతికి, సగానికి మడిచి మట్టి ఎరువుల్ని కలిపి నింపుకుని ఓ రెండు వంగ మొక్కలను నాటుకుని వారంలో ఒకసారి వంకాయలను ఉత్పత్తి చెయ్యవచ్చు. అది అన్నిటి కంటే చవకైన పద్ధతి. ఓ పదివేల రూపాయల నుండి ఓ లక్ష రూపాయల వరకు వ్యయం చేసుకుని చక్కని మిద్దెతోట నిర్మాణం చేసుకోవచ్చు. పురుగుమందుల దృష్టి కోణం నుంచి చూస్తే, ఇవాళ ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట కూడా అంతే ముఖ్యం. మిద్దె తోటల నిర్మాణం విషయంలో పీనాసితనం పనికి రాదు. సరైన సాధనం ఎంపిక ముఖ్యం మునుపు మిద్దె తోటల నిర్మాణానికి సరైన సాధనం లేదు. ఎవరికి తోచిన పాత్రలను వారు పెట్టుకుని, అరకొర ప్రయత్నాలు చేసే వారు. పగిలిన ప్లాస్టిక్ బకెట్ లేదా సంచులు మట్టి సిమెంట్ కుండీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందమైన పటిష్ఠమైన ఇటుకల మడుల నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మడుల కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు. అంత సౌకర్యవంతమైన మడుల నమూనాలు అభివృద్ధి చెయ్యబడ్డాయి. మిద్దెతోట నిర్మాణం విషయంలో సరైన సాధనాన్ని ఎన్నుకోవడం ముఖ్యమైన విషయం. ఏవో చిప్పా దొప్పా మొక్కలను నాటడానికి వాడితే , సరైన ఉత్పత్తులు రావు. పైగా నిరాశ ఉత్పత్తి అవుతుంది. మొదటికే మోసం వస్తుంది. ఇటుకల మడులు శ్రేయస్కరం మిద్దెతోట నిర్మాణానికి ఇటుకల మడులు శ్రేయస్కరం. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. ప్రతీ మడి లేదా బెడ్ కింద ప్రత్యేకంగా రెండు అంగుళాల మందం కలిగిన ’సిమెంట్– ఐరన్ రాడ్ – బిళ్లను పోత పోసి వేస్తారు. క్యూరింగ్ తరువాత ఆ బిళ్లను ఒక ఫీటు ఎత్తుపైకి లేపి దిగువన నాలుగుౖ వెపులా నాలుగు ఇటుకలనే కాళ్లుగా పెట్టి, బిళ్ల మీద చుట్టూ నాలుగుౖ వెపులా ఫీటు ఎత్తు ఇటుకల గోడ కట్టాలి. మడి అడుగున నీరు నిలవ కుండా ఒక వైపు కాస్తా వాలుగా సిమెంట్ ప్లాస్టరింగ్ చెయ్యాలి. మడి గోడలకు లోపల బయట కూడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయించాలి. టెర్రకోట రంగు చేయించుకున్న తరువాత చక్కగా నచ్చిన ముగ్గులను మడుల గోడల మీద వేసుకోవాలి. అందమైన పటిష్ఠమైన ఇటుకల మడులు సిద్దం అవుతాయి. భూమి మీద చేసే వ్యవసాయానికి మిద్దె మీద చేసే వ్యవసాయానికి ప్రధానమైన తేడా ఇటుకల మడులు అమర్చుకునే విషయంలో మాత్రమే. తక్కిన వ్యవసాయం అంతా ఒక లాగే ఉంటుంది. ఇటువంటి ఇటుకల మడులను మిద్దె మీద మొత్తం ఎన్ని పడతాయో ఒకేసారి లెక్కవేసుకుని కట్టించాలి. దారులు వదులుకుని చక్కగా సిస్టమెటిగ్గా కట్టుకోవాలి. మడుల వరుసలు అన్నీ బీమ్ల మీద కట్టుకోవాలి. ఇటుకల మడుల నిర్మాణానికి దాదాపు ఓ వారం పని దినాలు అవుతాయి. ఇనుపరాడ్ –సిమెంట్ –ఇటుకలు ఇసుక – కంకర వంటి మెటీరియల్‌ను తాపీ మేస్త్రీతో కలిసి కొనుగోలు చెయ్యాలి. లేదా వారికే గుత్తకు ఇవ్వవచ్చు. స్టాండర్డ్ పని చెయ్యమని చెప్పాలి. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు కలిగిన ఒక మడి నిర్మాణానికి సుమారు మూడు వేల రూపాయలు వ్యయం కావచ్చు. మట్టి ఎరువులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రతీ రెండు మడుల తరువాత మూడవ మడిని మాత్రం మరో ఫీటు లోతు ఎక్కువగా పెట్టి కట్టించాలి. వాటిని పండ్ల మొక్కల పెంపకానికి వాడాలి. మిద్దెతోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. అన్ని రకాల కూరగాయల మొక్కల సాగుకు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీటు లోతు మడులు సరిపోతాయి. గ్రోబ్యాగులు మూడవ ప్రత్యామ్నాయం గ్రోబ్యాగులు– ఇవి ప్లాస్టిక్ సంచులు తక్కువ ఖర్చు– బరువు తక్కువ– ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నాలుగైదు సంవత్సరాల తరువాత పనికిరావు! ఎండలకు పాడౌతాయి. పైగా ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అని విజ్ఞులు చెప్తున్నారు. మట్టి కుండీలు తరువాత సిమెంట్ లేదా మట్టి కుండీలు ఉన్నాయి. అవి కేవలం పూల మొక్కల పెంపకానికి మాత్రమే పనికి వస్తాయి. లేదా ఒక సిమెంట్ కుండీలో ఒక వంగ మొక్కను పెంచవచ్చు. కూరగాయలను పండ్లను కుటుంబ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చెయ్యాలంటే ఇటుకల మడులు తప్పకుండా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న ప్రతీ వారు ఇటువంటి మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అపార్ట్మెంట్లలో ఉన్నవారు కూడా ఇటువంటి ఇటుకల మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్ మడులు ఇటుకల మడులు కట్టడానికి ఓ వారం రోజుల పని దినాలు అవుతాయి. కొంత రిస్క్ ఉంటుంది. మరో చోటకు మార్చడానికి కుదరదు. బరువు ఎక్కువ అనే భావన ఉంటుంది. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఫైబర్ మడులను కూడా డిజైన్ చెయ్యడం జరిగింది. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు కలిగి ఒక ఫీటు లోతు ఉన్న మడులతో పాటు వివిధ రకాల డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫైబర్ టబ్బులతో ఒక్క రోజులోనే మిద్దె తోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు. స్థూలంగా మిద్దె తోట నిర్మాణం విషయంలో మడుల నమూనాల గురించి సమాచారం ఇది. నిలువు పందిళ్లు మిద్దెతోట నిర్మాణం విషయంలో మడులను అమర్చుకోవడంతో ప్రధానమైన దశను దాటుతాం. తరువాత రెండోదశలో టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా నిలువు పందిరి నిర్మించుకోవాలి. టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది. మూడు ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. ఆ గోడనుబేస్ చేసుకుని ఎనిమిది ఫీట్ల ఎత్తుతో పందిరి వేసుకోవాలి. పందిరి అంటే మనకు అడ్డంగా వేసే పందిరి తెలుసు. మిద్దె మీద అడ్డంగా పందిరి వేస్తే దిగువన నీడపడి మొక్కలు ఎదగవు– స్థలం వృథా అవుతుంది. అందుకని నిలువు పందిరి కట్టాలి. ప్రతీ పది ఫీట్లకు రక్షణ గోడను సపోర్ట్ చేసుకుని ఒక ఐర న్ పోల్ బిగించి అడ్డం పొడవు తీగలు కట్టుకుని చక్కని పందిరి కట్టు కోవాలి. కూరగాయల జాతుల్లో సగం తీగజాతి కూరగాయల మొక్కలే ఉన్నాయి– నిలువు పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుస కట్టిస్తే తీగ జాతులన్నిటినీ అటువైపు పెంచి పందిరికి పాకించవచ్చు. ఈ విధంగా మిద్దెతోట నిర్మాణంలో మడులను కట్టుకోవడం – నిలువు పందిరి వేసుకోవడంతో రెండు దశలు పూర్తి అవుతాయి. సిమెంటు కుండీలు మూడవ దశ – సిమెంట్ లేదా మట్టికుండీలను అమర్చుకోవాలి. ఇటుకలతో ప్రధాన మడులు కట్టించుకున్న తరువాత , మిగిలిన చిన్న చిన్న ప్లేసులు బయటపడతాయి. వాటిలో సిమెంట్ లేదా మట్టికుండీలను తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా పూల మొక్కలు పెంచడానికి వాడాలి. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పొలాలలో పూల మొక్కలు తప్పకుండా ఉండాలి. రోజు పూలు పుయ్యాలి. పూలు తేనెటీగలను ఆకర్షించి మొక్కల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. పుష్పాల ఫలదీకరణ చెందిన తరువాత సంపూర్ణ ఉత్పత్తి జరుగుతుంది. ఎర్రమట్టి మేలు ఈ మూడు దశల తరువాత మట్టి గురించి ఎరువుల గురించి ఆలోచించాలి. మట్టిలో ఎర్రమట్టి నల్లమట్టి అని రెండు రకాల మట్టి లభిస్తుంది. నగరాలలో భవన నిర్మాణ పనులు సాగుతున్న ఏరియాలలో రోడ్లపక్కన అక్కడక్కడా కొందరు మట్టిని కుప్పులుగా పోసి అమ్ముతుంటారు. అది సాధారణంగా ఎర్రమట్టి అయుంటుంది. మొక్కలకు అని చెప్పాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. సారవంతమైన మట్టి కావాలి. మొరం లేదా చవుడు మట్టి పనికి రాదు. ప్రస్తుత అవసరం కంటే ఎక్కువ మట్టిని తెచ్చుకోవాలి. మాటిమాటికి మట్టిని తేలేం. ఎక్కువ తెచ్చుకోవాలి. టెర్రస్ మీద ఓ మూలన నిల్వ చేసుకుని ఓ షీట్ కప్పాలి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మట్టిని వాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు మంచిది. గొర్రెల మేకల కోళ్ల ఎరువులు కూడా వాడుకోవచ్చు. అవి కూడా విష రసాయనాలు కలువని ఎరువులు అయి ఉండాలి. మాగిన లేదా చివికిన ఎరువులు మట్టిలో కలపాలి. తాజా పచ్చి ఎరువులు కలపకూడదు. మట్టి రెండు భాగాలుగా ఎరువు ఒక భాగంగా తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మడులను కాస్తా వెలితి ఉండేలా నింపుకోవాలి. మట్టి ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది. మిగిలింది విత్తనాల విషయం. దేశీ విత్తనాలు మేలు విత్తనాలలో దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కడపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పరవాలేదు. వాటిని కూడా వాడుకోవచ్చు. వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారతాయి. సంవత్సరంలో మూడు కాలాలు ఉన్నాయి. ఆ మూడు కాలాల ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటు కోవాలి. కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం.పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి. శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం. శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో మాత్రం కొంత పండించవచ్చు. ఈ జాగ్రత్త వహించాలి. గుమ్మడి – బూడిద గుమ్మడి – దుంపలు వంటి వాటిని వర్షాకాలం ప్రారంభంలో నాటు కోవాలి. మిగతా అన్ని మూడు కాలాల్లో కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి యాజమాన్య విషయంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లోఎక్కువ నీరు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోతాయి. వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మట్టి పొడిగా ఉంటేనే నీరు మొక్కలకు నీరు అవసరం ఉండదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది. తేమ ద్వారా మాత్రమే మట్టిలో ఉన్న సూక్ష్మ, స్థూల పోషకాలను గ్రహిస్తాయి. ప్రతిరోజూ మిద్దెతోటలో ఉదయం ఓ రౌండ్ తిరగాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తేమ ఉంటే నీరు పెట్టడం అవసరం లేదు. తేమ లేకుంటే– మట్టి పొడిగా ఉంటే నీరు పెట్టడం అవసరం ఉంటుంది. మనం పెట్టిన నీరు మడుల్లోంచి బయటకు రాకుండా– తగు మాత్రమే పెట్టాలి. నాలుగైదు గంటల పాటు ఎండ మొక్కల మీద కనీసం ప్రతీ రోజూ నాలుగైదు గంటల పాటు ఎండ తప్పకుండా పడాలి. మొక్కల మొలిచిన తరువాత పది రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. మొక్కల మధ్య మట్టిని లూజ్ చెయ్యాలి. చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడుతుంది. మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ప్రతీ అంతర కృషి తరువాత స్వల్పంగా వర్మీకంపోస్టు చల్లి తగినంత నీరు పెట్టాలి. చీడపీడల సమస్యలు తక్కువే చీడపీడల సమస్యలు కూడా మిద్దెతోటల్లో ఉంటాయి. సమృద్ధిగా పశువుల ఎరువులు పోసి మొక్కలను పెంచుతాం కనుక మొక్కలు బలంగా ఎదిగి సహజంగా రోగనిరోధకశక్తి కలిగి ఉంటాయి. చీడపీడల సమస్యలు తక్కువ ఉంటాయి. వాటిలో పేను సమస్య ముఖ్యమైనది. పేను అనేది నల్లగా పచ్చగా ఉంటుంది. కంటికి కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాలను పీల్చి ఆకులు ముడుచుకు పొయ్యేలా చేసి మొక్కను ఎదగకుండా చేసి గిడస బారుస్తాయి. పేనును గమనించాలి. మొక్కల మీద చీమలు పారడాన్ని గమనిస్తే, పేను ఉందని అర్థం చేసుకోవాలి. ఆకుల అడుగు భాగం చెక్ చెయ్యాలి.పేనును చేతి వేళ్లతో నలిపి కూడా నివారణ చెయ్యవచ్చు.పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంలో పారెయ్యాలి. మిగిలిన లేత ఆకుల కింద ఉన్న పేను నివారణకు లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె బాగా కలిపి నురగ వచ్చే దాకా షేక్ చేసి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చెయ్యాలి. మొక్క సాంతం తడిసేలా స్ప్రే చెయ్యాలి. నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి స్ప్రే చెయ్యాలి. బీర, సోర, కాకర, బెండ, వంగ, పొట్ల, గుమ్మడి వంటి మొక్కల మీద ఎక్కువగా సోకుతుంది. తెల్లనల్లి పేను తరువాత తెల్లనల్లి మరో సమస్య. బెండ, వంగ, మందార, టొమాటో, మొక్కల మీద ఎక్కువ సోకుతుంది. దీన్ని కూడా చేతి వేళ్లతో నలిపి నివారణ చెయ్యాలి. దీనికి ఏ వేపనూనె కూడా అవసరంలేదు. పచ్చ పురుగులు చుక్కకూర, పాలకూర వంటి ఆకుకూరల మీద వన్ ఇంచ్ పొడవు, పెన్సిల్ సైజ్ పచ్చని పురుగులు వస్తాయి. రాత్రి బయటకు వచ్చి ఆకులను తిని తెల్లవారుతుంటే కిందకు జారుకుంటాయి. ఉదయాన్నే చెక్ చేస్తే పురుగులు దొరుకుతాయి. ఏరి అవతల పడెయ్యాలి. అలా వరుసగా రెండు మూడు రోజుల పాటు చెయ్యాలి. బీర, సొర మొక్కలు పూత దశలోకి రాగానే పిందెలు పండుబారి ఎండిపోయే సమస్య ఎదురవుతుంది. దానికి కొన్ని కారణాలుఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం– మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడం– పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వగైరా కారణాలు. పువ్వులు పూసే సాయంత్రం వేళల్లో వెళ్లి మగ పువ్వును తెంపి సమీపంలో ఉన్న ఆడపువ్వు కేసరాల మీద మగపువ్వు కేసరాలను సున్నితంగా రుద్దాలి. ఫలదీకరణ శాతంపెరుగుతుంది. బూడిద తెగులు ఆకుల మీద బూడిద తెగలు సోకుతుంది. తెగలు సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. పుల్లని మజ్జిగను మిగిలిన ఆకుల మీద స్ప్రే చెయ్యాలి. కొంత కంట్రోల్ అవుతుంది. చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని గ్రహించాలి. ఈ విధంగా కొంచెం ఖర్చు కొంచెం శ్రద్ధా శ్రమతో చక్కగా మిద్దెతోటల సాగు చెయ్యవచ్చు. ఇంటిల్లి పాదికీ సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్దెతోటల నిర్మాణం విషయంలో సౌందర్య దృష్టి కూడా ఉండాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలి. మిద్దె మీద ఓ అందమైన తోటగా మార్చుకోవాలి. ఆయురారోగ్య రహస్యాలు, మిద్దె తోటల్లో దాగి ఉన్నాయి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట! ప్రకృతికి మనిషికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో, మిద్దెతోట కూడా అటువంటి సంబంధాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతికి దూరమై పలువ్యాధులకు దగ్గరైన ఆధునిక సమాజానికి మిద్దె తోట సరైన ఆయురారోగ్య పరిరక్షణా సాధనం. ఇలా చెప్పుకుంటూ పోతే మిద్దెతోటల సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. నిర్వహణ సులభం మిద్దెతోట నిర్వహణ చాలా కష్టం అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. మిద్దెతోట లేదా పెరటి తోట చాలా సులభంగా చెయ్యగల పని. సుమారు రోజూ ఒక అర గంటసేపు పనిచేసినా సరి పోతుంది. ఇంటికి సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటిపంటల రుచి అమోఘమైన రుచి. ఏ రోజు ఉత్పత్తిని ఆ రోజే వాడుకోవడం వల్ల వాటిలోని సంపూర్ణ పోషకాలు మనకు అందుతాయి. ఎంతో విలువైన జీవశక్తి పూరితమైన ఉత్పత్తి అది. జీవశక్తి పూరితమైన ఆహారమే మనల్ని బలోపేతం చేస్తుంది. మనం ఎంత బలంగా ఉంటే, మనకు అంతగా రోగనిరోధకశక్తి ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. హైదరాబాద్ మహానగరం - మిద్దెతోటల చరిత్ర క్రీస్తు శకం1667 నాటికే గొల్లకొండ కోట భవనాల మీద తాని తోటలను చూసాను అని ’టావెర్నియర్’ అనే యాత్రా చరిత్రకారుడు రాసాడు. ‘హీనా మహల్ ఆర్చీల మీద అంత పెద్దపెద్ద వృక్షాలను ఎలా పెంచారో ఆశ్చర్యం కలిగించింది’ అని రాసాడు. నగరాల నిర్మాణం ప్రారంభం అయిన నాటి నుంచే, స్ధలాల కొరత ఏర్పడి మిద్దెల మీద తోటల నిర్మాణం ప్రారంభం అయింది. సిమెంటు రింగులూ బాగుంటాయి. ఇటుకల మడుల తరువాత మరో ప్రత్యామ్నాయం సిమెంట్ రింగులు లేదా గూనలు అని కూడా అంటారు. పూర్వం చేద బావులు పూడి పోకుండా ఉండటానికి వాడేవారు. వాటిని కూడా మన మిద్దెతోటల మడులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వాటి వల్ల కాస్తా మిద్దె తోట నిర్మాణ పనిదినాలు– రిస్కు కూడా కొంత తగ్గుతాయి. ఈ రింగులకు కూడా అడుగున గుండ్రని బిళ్లలు వేసి వాటి కింద ఫీటు ఎత్తు ఇటుక కాళ్లను నాలుగు పెట్టి రింగులను కూర్చుండబెట్టి సిమెంటుతో అతుకుతారు– ఇదంతా వారినే చెయ్యమని అడగాలి. వేరే వారు అవి తేలేరు. -
గెలుపు పంటలు!
యుద్ధభేరి మోగగానే ఆహార భద్రత గురించిన ఆలోచన మదిలో రేకెత్తుతుంది. కష్టకాలంలోనే ఆహార స్వావలంబన మార్గాల అన్వేషణ ప్రారంభమవుతుంది. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సేంద్రియ ఇంటి పంటలు, పెరటి తోటల సాగు దిశగా అడుగులు పడతాయి. తొలి, మలి ప్రపంచ యుద్ధ కాలాల్లోనూ ‘విక్టరీ గార్డెన్స్’ విస్తరించాయని చరిత్ర చెబుతోంది. అమెరికా విధించిన కఠోర ఆంక్షల నడుమ క్యూబా బతికి బట్టకట్టగలిగింది కూడా సేంద్రియ ఇంటిపంటల ద్వారానే. కరోనా మహమ్మారి మానవాళిపై విరుచుకుపడిన ఈ యుద్ధ కాలమూ అందుకు అతీతం కాదు. గోదాముల్లో తిండి గింజలకు కొరత లేదు. కానీ వాటికి మన సేంద్రియ ఇంటిపంటలు కూడా తోడైతేనే సంపూర్ణ ఆహార భద్రత చేకూరేది. అప్పుడే పౌష్టికాహార లోపాన్ని, అనారోగ్యాలనూ మనం గెలవగలం. అందుకే మనకు ఇప్పుడు ఇంటింటా ‘గెలుపు పంటలు’ కావాలి! కరోనా మహమ్మారి విశ్వమానవాళిపై యుద్ధం ప్రకటించగానే ఆహార భద్రత గురించిన తలపులు మదిలో మెదిలాయి. లాక్డౌన్ పునరాలోచనకు పురికొల్పింది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు కొంతమేరకైనా ఇంటి పట్టున అప్పటికే పండించుకుంటున్న నగరాలు, పట్టణ వాసులు సంతోషించారు. టెర్రస్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో కూరగాయలు, పండ్లను సాగు చేసుకోవడమే మేలన్న భావన మిగతా వారిలోనూ వేరూనుకుంటున్నది. ఈ చైతన్యం మున్ముందు అర్బన్ ఫార్మింగ్ వ్యాప్తికి దోహదం చేస్తుందని ఆర్కిటెక్ట్‌లు, ఆహార నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘మనం తినే ఆహారం ఎంత దూరం నుంచి తరలివస్తున్నది? అక్కడి నుంచి తరలి వచ్చే దారిలో ఎటువంటి అవాంతరాలకు ఆస్కారం ఉంది? ఈ అవాంతరాలను తగ్గించుకునే మార్గాలేమి ఉన్నాయి? అని చాలా మంది ఇప్పుడు ఆలోచిస్తున్నారు’ అని థాయ్‌లాండ్‌కు చెందిన ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్ కొచ్చకార్న్ ఒరాఖోమ్ ఇటీవల వ్యాఖ్యానించారు. బాంకాక్లో ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ రూఫ్‌టాప్ ఫామ్‌కు రూపుకల్పన చేసిన ఆర్కిటెక్ట్‌గా ఆమె ప్రసిద్ధిపొందారు. తొలి ప్రపంచ యుద్ధ కాలంలో ఆహార కొరత రాకుండా చూసుకోవడానికి ప్రతి ఒక్కరూ ‘విక్టరీ గార్డెన్స్’ పేరిట పంటల సాగు చేపట్టాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ తమ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో కూడా అంతే. అమెరికాలో ప్రతి ఇల్లు, స్కూలు పరిసరాల్లో గజం కూడా ఖాళీ స్థలం వదలకుండా కూరగాయలు సాగు చేయడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్ష భవనం ఎదుట కూడా కూరగాయలు సాగు చేశారు. 1940వ దశకంలో 2 కోట్ల అమెరికన్ కుటుంబాలు కూరగాయలు ఇంటిపంటలు పండించడం ప్రారంభించారు. నాలుగేళ్లలో 40% కూరగాయలను విక్టరీ గార్డెన్లే వారికి తఅందించాయట. ‘ఇంటిపంటల టవర్’ విశేషం ఏమిటంటే.. దీని పైన, చుట్టూతా కూడా అనేక మొక్కలు పెంచుకోవచ్చు. కంపోస్టు తయారు చేసుకోవచ్చు. టవర్ పైభాగన నీరు పోస్తే చాలు. ♦ అమెరికా కఠోర ఆంక్షల వల్ల క్యూబాకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చమురు దిగుమతి ఆగిపోయింది. ఆ కష్టకాలంలో క్యూబా నగరాలు, పట్టణాల్లో ప్రజలు సేంద్రియ ఇంటి పంటల సాగు ద్వారానే బతికి బట్టకట్టగలిగారు. అంతేకాదు, తాము పండించిన కూరగాయలు, పండ్లు గ్రామాలకు కూడా పంపగలిగారు! ♦ 2050 నాటికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు మంది నగరాల్లో నివాసం ఉండబోతున్నారని ఐక్యరాజ్య సమితి అంచానా వేస్తోంది. వీరికి కావాల్సిన కూరగాయలు, పండ్లలో కొంత మేరకైనా అర్భన్ ప్రాంతాల్లోనే పండించే మార్గాంతరాలు వెతకాల్సి ఉందని ఎర్త్ ఫ్యూచర్ అధ్యయనం చెబుతోంది. ♦ భారత్ సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నగరీకరణ వేగం పుంజుకున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతవాసుల్లో పౌష్టికాహార లోపం (హిడెన్ హంగర్) పెరుగుతున్నది. కనపడని శత్రువుపై పోరులో మనకు నిండుగా తోడుండేవి ఇంటి పంటలు. ♦ అవును, ఇవే గెలిపించే పంటలు.. మనుషులుగా మనల్ని, దేశాన్ని కూడా! ♦ ఇంటిపంటలు ఎంత మంచివైనా ఇప్పుడు టైం ఎక్కడుందిలే అని ఇక సరిపెట్టుకోలేం!!– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి ‘ఇంటిపంటల టవర్’తో మేలు పట్టణాలు, నగరాల్లో గృహస్తులు టెర్రస్ల మీద కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మా ఇంటిపైన పుదీనా, పొన్నగంటి, గంగవాయిలి, ఎర్రగలిజేరు వంటి ఆకుకూరలు, టమాటా, వంగ వంటి కూరగాయలను అతితక్కువ స్థలంలో ఇమిడిపోయే ‘ఇంటిపంటల టవర్’లో పెంచుతున్నాం. మేం తినడంతోపాటు బంధుమిత్రులకూ పంచుతున్నాం. వంటింటి వ్యర్థాలను ఈ టవర్‌లో వేసి కంపోస్టు తయారు చేస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కుటుంబాల పౌష్టికాహార, ఆరోగ్య భద్రతకు టవర్ గార్డెనింగ్ ఎంతగానో దోహదపడుతుంది. – కె. క్రాంతికుమార్‌రెడ్డి,లక్ష్మి దంపతులు (83096 15657),రామాంతపూర్, హైదరాబాద్అర్బన్ ఫార్మింగ్తోనే ఆహార భద్రత ప్రజలు, ప్రణాళికావేత్తలు, ప్రభుత్వాలు కూడా నగరాల్లో భూమిని ఇప్పుడు ఉపయోగిస్తున్న తీరుపై పునరాలోచన చేయాలి. అర్బన్ ఫార్మింగ్‌కు చోటివ్వాలి. ఇది ఆహార భద్రతను కల్పించడంతోపాటు పౌష్టికాహార లోపాన్ని అరికడుతుంది. వాతావరణ మార్పుల్ని తట్టుకునే శక్తినిస్తుంది. మానసిక వత్తిడినీ ఉపశమింపజేస్తుంది.– కొచ్చకార్న్ ఒరాఖోమ్,ప్రముఖ లాండ్స్కేప్ ఆర్కిటెక్ట్,ఆసియాలోకెల్లా అతిపెద్ద అర్బన్ ఫామ్ రూపశిల్పి, బ్యాంకాక్ -
మట్టిపై నమ్మకం.. మొక్కలపై మక్కువ!
ఒకటి కాదు పది కాదు.. ఏకంగా 35 ఏళ్ల మాట. పుట్టింటి నుంచి తెచ్చిన మాసుపత్రి, మరువం మొక్కలను, వాటితోపాటు తెచ్చిన మట్టిని, మట్టి కుండీని కూడా తన ఇంటిపైన కూరగాయలు, పండ్ల తోట పొత్తిళ్లలో ఉంచి అపురూపంగా చూసుకుంటున్నారు సీనియర్ మోస్ట్ సిటీ ఫార్మర్ నూర్జహాన్. ఆమెకు మట్టి మీద నమ్మకం ఉంది, మొక్కల మీద మక్కువ వుంది. ప్రకాశం జిల్లా నుంచి హైదరాబాద్ నగరానికి తరలి వచ్చి 35 ఏళ్లయినా అవి చెక్కుచెదరలేదు సరికదా.. వందల రెట్లు పెరిగాయి! వారి మేడపైన వందలాది పండ్లు, కూరగాయ మొక్కలై వర్థిల్లుతున్నాయి. నూర్జహాన్ గుండెల నిండుగా ఉన్న ప్రకృతిపై ప్రేమ.. వారి ఇంటిపై సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటగా విరిజిల్లుతూ కుటుంబానికి వరప్రసాదంగా మారింది. ఒంగోలులో పుట్టిన ఆమె ప్రకాశం జిల్లా కరవదికి చెందిన రహంతుల్లాతో వివాహం అయిన తర్వాత భాగ్యనగరానికి వచ్చి ఆసిఫ్‌నగర్‌లో స్థిరపడ్డారు. వారికి ఇద్దరు మగ పిల్లలు. పోలీస్‌గా పనిచేసిన రహంతుల్లా ఇటీవలే హెడ్ కానిస్టేబుల్‌గా రిటైరయ్యారు. అద్దె ఇళ్లలో ఉన్న 15 ఏళ్లు కొద్ది కుండీలకే పరిమితమైన నూర్జహాన్ ఇంటిపంటలు.. 20 ఏళ్ల క్రితం వెయ్యి చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకున్నాక రెండు మడులు వందల కుండీలుగావిస్తరించింది. ఇంటి పిట్టగోడలపైన, దారి పక్కన, మేడపైన.. ఎక్కడ చూస్తే అక్కడ ఇంటిపంటలు వందలాది చిన్నా పెద్దా కుండీల్లో ఫలప్రదంగా అలరారుతున్నాయి. పాత డబ్బాలు, సీసాలు, సేట్‌కేసులు.. పచ్చని మొక్కలకు ఆలంబనగా మారి కనిపిస్తాయి. ఇరుకు అనేది ఇంటిపంటల సాగుకు సమస్యే కాదని ఆమె నిరూపిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అని నూర్జహాన్ ఇంటిపంటలను చూస్తే ఇట్టే అర్థమవతుంది ఎవరికైనా. సేంద్రియ ఇంటిపంటల సాగులో అనుసరిస్తున్న పద్ధతులు ఆసక్తిగొలుపుతున్నాయి. ఒక మడిలో 4 కుండీలు.. పది మొక్కలు.. ఉద్యాన శాఖ ఇచ్చిన పెద్ద సిల్పాలిన్ రౌండ్ గ్రోబాగ్స్‌తోపాటు తాము నిర్మించుకున్న ఇటుకల సిమెంటు మడుల్లో కూడా ఇంటిపంటలను నూర్జహాన్ సాగు చేస్తున్నారు. మేడ పైన నాపరాళ్లు పరిచి వాటిపైన ఇటుకలతో మడి నిర్మించుకుంటే శ్లాబ్ లీక్ అవకాశం ఉండదు అంటారామె. రౌండ్ గ్రోబాగ్/ ఇటుకల మడిలో ఒకటికి పది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు ఉండేలా చూసుకోవడం విశేషం. రౌండ్ గ్రోబ్యాగ్/ ఇటుకల మడిలో మట్టి నింపిన తర్వాత.. ఆ మట్టి మీద 3 లేక 4 పండ్ల మొక్కల కుండీలను పెడతారు. ఆ కుండీల అడుగు భాగాన్ని పూర్తిగా తొలగిస్తారు. కుండీల్లో మొక్కల వేర్లు అడుగున ఉన్న రౌండ్ గ్రోబాగ్/ ఇటుకల మడిలోని మట్టి లోపలికి కూడా విస్తరిస్తాయి. అందువల్ల ఆ కుండీలను పెట్టిన దగ్గరి నుంచి కదిలించరు. మట్టి మార్చరు. ఆ కుండీల చుట్టూ గ్రోబాగ్ / ఇటుకల మడిలోని మట్టిలో కూరగాయ మొక్కలు, తీగ జాతి కూరగాయలు, ఆకుకూరలు వేస్తారు. కూరగాయ మొక్కల పంట అయిపోయిన తర్వాత ఆ మొక్కను తీసేసి.. అక్కడి మట్టి కూడా కొద్దిగా తీసి ఆ గుంతలో వంటింటి వ్యర్థాలు, ఆకులు అలములు వేసి కంపోస్టు తయారయ్యేలా చూస్తారు. అంతే. ప్రతి 15 రోజులకో, నెలకో కంపోస్టు ఎరువు వేయాల్సిన అవసరం లేదంటారు సీనియర్ మోస్ట్ సిటీ ఫార్మర్ నూర్జహాన్(98852 24081). ఫొటోలు: కె. రమేశ్‌బాబు, సీనియర్ ఫొటోగ్రాఫర్ -
ఇంటిపంట పండిద్దాం
మన ఇల్లు – మన కూరగాయలు పథకం కింద 4 సిల్ఫాలిన్ కవర్స్, 52 ఘనపుటడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువు, 2:1 నిష్పత్తిలో పాలీబ్యాగులు ఇస్తారు ∙పాలకూర, మెంతి, కొత్తిమీర, చుక్కకూర, పుంటికూర, బచ్చలి, తోటకూర, పుదీనా, ముల్లంగి, క్యారట్, బెండ, వంకాయ, టమాటా, గోరుచిక్కుడు, సొరకాయ, బీర తదితర 12 రకాల విత్తనాలను అందజేస్తారు. సీతాఫలం, జామ, రేగి పండ్ల మొక్కలను కూడా అందజేస్తారు ∙25 కిలోల వేపపిండి, 500 మిల్లీగ్రాముల వేపనూనె ఇస్తారు ∙అలాగే రూఫ్గార్డెన్కు అవసరమైన పనిముట్లు కుర్ఫీ,సికేచర్,చిన్న స్ప్రేయర్,ఫవర్, ఒక చేతి సంచి కూడా ఇస్తారు ∙ఈసారి కొత్తగా వర్టికల్ పైపులను అందజేస్తున్నారు. కుండీలకు బదులుగా వీటిలో మొక్కలను పెంచుకోవచ్చు ∙ప్రతి యూనిట్‌కు 2 వర్టికల్ పైపులు అందజేస్తారు ∙ వీటిని50 శాతం సబ్సిడీపై రూ.4 వేలకే ఇవ్వనున్నారు. సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం వచ్చేసింది. పల్లె పంటలకే కాదు. ఇంటిపంటలకు సైతం ఇదే అదను. ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు పండించుకొనేందుకు ఇది అనువైన సమయం. ఇప్పటికే గ్రేటర్లో ఇంటిపంట ఒక ఉద్యమంలా సాగుతోంది. వేలాదిమంది సహజ ఆహారప్రియులు ఇంటి డాబాలపై, బాల్కనీల్లో, పెరట్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా ఇంటిపంటలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉద్యాన శాఖ ఇంటి పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సబ్సిడీపై వివిధ రకాల వస్తువులను అందజేయడమే కాకుండా అర్బన్ ఫార్మర్స్‌కు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఎలాంటి పురుగుమందులు, రసాయన ఎరువులు లేకుండా సహజమైన పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించే సాంకేతిక పరిజ్ఞానంపై సుమారు 10 వేల మందికి శిక్షణనిచ్చారు. త్వరలో విత్తనాలు, వర్మీ కంపోస్టు, వర్టికల్ పైపులు తదితర వస్తువులు అందజేయనున్నారు. ఉద్యమంలా ఇంటి పంటలు.. ఇంటిపై, ఇతరత్రా ఏ కొంచెం స్థలం ఉన్నా సహజమైన పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వెసులుబాటు ఉంది. పదేళ్లుగా కొనసాగుతున్న ఇంటిపంటల ఉద్యమంలో వేలాదిమంది నగరవాసులు భాగస్వాములవుతున్నారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతోంది. ఉద్యాన శాఖ అంచనాల ప్రకారం గత ఏడాది 15 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్ల డాబాలపై, పెరట్లో, బాల్కనీల్లో పంటలు పండించగా ఈ సంవత్సరం అది 17వేల చదరపు మీటర్లకు చేరినట్లు ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ తెలిపారు. దీంతో ప్రజల అభిరుచికి అనుగుణంగా రూఫ్‌గార్డెన్, కిచెన్ గార్డెన్లను ఉద్యాన శాఖ ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. ప్రతి సంవత్సరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘సాధారణంగా విత్తనాలు నాటే కుండీల్లో మట్టి ఎంతవరకు ఉండాలనే విషయంతో పాటు విత్తనాలు ఎంత లోతులో నాటాలనేది చాలామందికి తెలియదు. కేవలం 1/2 ఇంచు లోతులోనే విత్తనాలు నాటాలి. సహజమైన ఎరువులను తయారు చేసుకోవడం, వాటి వాడకంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇలాంటి విషయాలపై సీనియర్ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణనిప్పిస్తున్నాం’ అని మధుసూదన్ పేర్కొన్నారు. ప్రతి గ్రూపులో 200 మందికి శిక్షణనివ్వడమే కాకుండా వారితో వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారిలో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు, అభిప్రాయాలను పంచుకొనేందుకు వాట్సప్ గ్రూపులు దోహదం చేస్తాయి. మన ఇల్లు– మన కూరగాయలు.. ప్రతి వ్యక్తికీ సమృద్ధికరమైన పోషక పదార్థాలు లభించాలనే లక్ష్యంతో ఉద్యాన శాఖ పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. రోజుకు సగటున 280 గ్రాముల చొప్పున కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ప్రజల డిమాండ్‌కు తగిన విధంగా కూరగాయలు, ఆకుకూరలు లభించడం లేదు. దీంతో సహజమైన పద్ధతిలో పండించుకొనేందుకు ఉద్యాన శాఖ ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా 12 రకాల విత్తనాలను, సేంద్రియ ఎరువులను, వస్తువులను అందజేస్తున్నారు. 50 శాతం సబ్సిడీపై ఈ వీటిని అందజేస్తారు. -
ఇంటిపంటలతోపాటే పుట్టగొడుగులూ పెంచుకోవచ్చు!
పుట్టగొడుగుల పెంపకం సాధారణంగా వేడి, వెలుతురు తగలని పక్కా భవనాల్లోని గదుల్లో చేపడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా స్థానం (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఆరుబయట పెరట్లో లేదా మేడ మీద(గ్రామాల్లో లేదా నగరాల్లో) పెట్టుకొని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఉత్పత్తి చేసుకునే ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్‌కు రూరపకల్పన చేశారు. సౌర విద్యుత్తుతో పనిచేయడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చుతోనే ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌ను రూపొందించారు. ఎవాపొరేటివ్ కూలింగ్ సూత్రం ఆధారంగా పని చేసే ఈ అవుట్‌సైడ్ మొబైల్ ఛాంబర్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎండలు మండిపోయే ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ ఛాంబర్లో ఎంచక్కా పుట్టగొడుగులను పెంచుకోవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి ఛాంబర్ల ద్వారా పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన వారితో పాటు.. ఈ ఛాంబర్ల తయారీదారులు కూడా స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలున్నాయి. పుట్టగొడుల పెంపకాన్ని సులభతరం చేసే ఈ ఛాంబర్ వల్ల పుట్టగొడుగుల వినియోగం కూడా పెరుగుతుంది. మహిళలు వీటి పెంపకాన్ని చేపడితే వారిలో పౌష్టికాహార లోపం తగ్గడంతోపాటు ఆదాయ సముపార్జనకూ దారి దొరుకుతుంది. మష్రూమ్ ఛాంబర్ తయారీ పద్ధతి ఇదీ.. ఈ ఛాంబర్‌ను 1 అంగుళం మందం గల సీపీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌తో తయారు చేసుకోవాలి. చాంబర్ పొడవు 1.35 మీటర్లు, వెడల్పు 0.93 మీటర్లు, ఎత్తు 1.69 మీటర్లు. పురుగూ పుట్రా లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం, గాలి పారాడటం కోసం దీని చుట్టూతా నైలాన్ 40 మెష్‌ను అమర్చుకోవాలి. ఈ మెష్ పైన గన్నీ బ్యాగులు చూట్టేయాలి. గన్నీ బ్యాగ్‌లను తడుపుతూ ఉంటే ఛాంబర్ లోపల గాలిలో తేమ తగ్గిపోకుండా ఉంచగలిగితే పుట్టగొడుగులు పెరగడానికి తగిన వాతావరణం నెలకొంటుంది. ఛాంబర్ లోపల నిరంతరం సన్నని నీటి తుంపరలు వెదజల్లే 0.1 ఎం.ఎం. నాజిల్స్‌తో కూడిన 30 డబ్లు్య డీసీ మిస్టింగ్ డయాఫ్రం పంప్‌ను అమర్చుకోవాలి. 300 వాల్ట్స్ పేనెల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజీ బ్యాటరీలను, ఒక టైమర్‌ను అమర్చుకొని.. విద్యుత్‌తో గాని లేదా సౌర విద్యుత్తుతో గాని నడవపవచ్చు. ఈ ఛాంబర్ మొత్తాన్నీ స్టీల్ ఫ్రేమ్ (1.08 “ 1.48 “ 1.8 సైడ్ హైట్ “ 2.2 సెంటర్ హైట్) లోపల ఉండేలా అమర్చుకొని, ఛాంబర్ కింద 4 వైపులా చక్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటే.. ఛాంబర్‌ను అటూ ఇటూ కదుల్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సోలార్ పేనల్స్‌ను ఫ్రేమ్‌పైన అమర్చుకోవాలి. ఫ్రేమ్ లోపల ఇన్వర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలి. 30 లీటర్ల నీటి ట్యాంకును, మిస్టింగ్ పంప్‌ను స్టీల్ ఫ్రేమ్‌లో కింది భాగంలో అమర్చుకోవాలి. అంతే.. మష్రూమ్ ఛాంబర్ రెడీ. మూడేళ్ల పరిశోధన పక్కా భవనంలోని గదిలో, ఆరుబయట సోలార్ ఛాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్ పుట్టగొడుగుల రకాలను 20 బ్యాగ్‌ల(ఒక కిలో)లో మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా పెంచారు. 2016 నుంచి 2018 వరకు అన్ని నెలల్లోనూ ఈ పరిశోధన కొనసాగించి ఫలితాలను బేరీజు వేశారు. పక్కాభవనంలో కన్నా సోలార్ చాంబర్లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి సగటున 108% మేరకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదేమాదిరిగా వైట్ మష్రూమ్స్ దిగుబడి 52% పెరిగింది. ఈ యూనిట్ నుంచి నెలకు సగటున 25–28 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయవచ్చని ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌కు రూపకల్పన చేసిన ఐ.ఐ.హెచ్.ఆర్. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సెంథిల్ కుమార్ (94494 92857) ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఆయనను సంప్రదించవచ్చు. అయితే, ఈ యూనిట్‌కు సంబంధించిన టెక్నాలజీ హక్కులను ఐఐహెచ్ఆర్ వద్ద నుంచి ఎవరైనా కొనుగోలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత, ఈ యూనిట్లను తయారుచేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టవచ్చని డా. సెంథిల్ కుమార్ తెలిపారు. దీనిపై ఆసక్తి గల వారు ఐ.ఐ.హెచ్.ఆర్. డైరెక్టర్‌ను సంప్రదించాల్సిన ఈ–మెయిల్:director.iihr@icar.gov.in మష్రూమ్ స్పాన్ లభించే చోటు.. బెంగళూరు హెసరఘట్ట ప్రాంతంలో ఉన్న ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ సెంటర్‌కు ఫోన్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే మష్రూమ్ స్పాన్(విత్తనాన్ని)ను విక్రయిస్తారు. మష్రూమ్ స్పాన్‌ను బుక్ చేసుకున్న వారు 30 రోజుల తర్వాత స్వయంగా ఐ.ఐ.హెచ్.ఆర్.కి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాగులను ఎవరికి వారే వెంట తెచ్చుకోవాలి. స్పాన్ బుకింగ్ నంబర్లు.. 70909 49605, 080–23086100 ఎక్స్టెన్షన్–349, 348, 347, డైరెక్టర్– 080–28466471, ఎస్.ఎ.ఓ. – 080 28466370 ఝuటజిటౌౌఝఃజీజీజిట.ట్ఛట.జీn -
ఇంటి పంటలకు రెండంతస్తుల పందిరి!
ఒక చిత్రకారుడు శ్రద్ధతో చిత్రించిన చిత్రంలా.. ఒక శాస్త్రవేత్త లోకాన్ని మరచి పరిశోధనలో లీనమై చేసే ఆవిష్కరణలా ఆయన ఇంటిపంటలు పండించే తీరు అబ్బురపరుస్తుంది. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌజింగ్ బోర్డ్‌కు చెందిన టి. వి. ఎస్. నాగేంద్రరావు గత రెండేళ్లుగా మేడ పై ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. కన్సల్టింగ్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకొని ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ప్రకృతి వనరుల పునర్ వినియోగంపై ఆసక్తి, పనిలో నవ్యత, నిత్యం కొత్తగా ఆలోచించటం ఆయన్ను వృత్తి జీవితంలో అగ్రపథాన నిలిపాయి. అవే సూత్రాలను అన్వయిస్తూ తన దైన శైలిలో ఆయన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు రెండు కుండీల్లో ఆకు కూరలతో ప్రారంభించి.. ప్రస్తుతం మూడడుగుల వ్యాసార్థం గల 11 సిల్ఫాలిన్ బ్యాగ్‌లు, మట్టి కుండీల్లో వివిధ రకాల ఇంటిపంటలు పండిస్తున్నారు. కొత్తిమీర, తోటకూర, లెట్యూస్ వంటి ఆకుకూరలు, సొర, నేతిబీర, పొట్ల, పిచ్చుక పొట్ల కాయ వంటి తీగ జాతి కూరగాయలు. వంకాయ, టమాటా, బెండ, చిక్కుడు వంటి కూరగాయలతోపాటు దోమలకు సహజ వికర్షకంగా పనిచేసే నిమ్మగడ్డిని పెంచుతున్నారు. శాశ్వతంగా ఉండేలా పక్కాగా పందిరిని ఏర్పాటు చేసుకుంటే తీగజాతి మొక్కలు పెంచటం సులభం అంటారాయన. అటువంటి పందిరి సాయంతో పాదులు ఎక్కువ రోజులు కాపునివ్వటంతో పాటు అధిక దిగుబడినిస్తాయంటారాయన. రూ. ఆరు వేలు ఖర్చు చేసి (10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 8 అడుగుల ఎత్తు) ఇనుప కడ్డీలు, బద్దెలతో మేడపైన ఇనుప ఊచలతో పందిరి నిర్మించారు. కర్రలతో ఒక పందిరి, దానిపై రెండడుగుల ఎత్తులో ఇనుప బద్దెలతో మరో పందిరిని రెండంతస్తులుగా నిర్మించటం విశేషం. తీగెలను రెండో అరపైకి పాకించటం వల్ల దిగుబడి పెరిగిందని ఆయన చెప్పారు. తుంపర సేద్యం.. వేసవి ఎండల నుంచి మొక్కలను కాపాడుకునేందుకు స్ప్రింక్లర్లను ఉపయోగించి నీటిని తుంపరలుగా చల్లేలా ఏర్పాటు చేశారు. వాటర్ ప్యూరిఫైయర్‌లో ఉండే విడి భాగాలను ఉపయోగించి ఆయన స్వంతగా దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం రోజుకో సారి మొక్కలకు నీటిని అందిస్తున్నారు. ఆరు సిమెంటు సంచుల మట్టి (ఇంటి పునాదులు తవ్వేటప్పుడు వచ్చేది), చివికిన పశువుల ఎరువు 2 సంచులు, వర్మీ కంపోస్ట్ 2 సంచులు, కొబ్బరి పొట్టు 10 కిలోలు, వేపపిండి 2 కిలోలను కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని మొక్కల పెంపకంలో వాడుతున్నారు. కొబ్బరిపొట్టు వాడకం వల్ల మట్టి మిశ్రమం మెత్తగా ఉండి లోపలి పొరలు వదులవుతాయి. దీంతో మొక్కల వేర్లు సులభంగా మట్టిలోకి దిగి గాలి, పోషకాలను గ్ర హించటం వీలవుతుంది. ఒకే కుండీలో.. ఆకుకూరలు, కాయగూరలు అన్ని కుండీల్లో తీగ జాతి కూరగాయలు, ఆకుకూరల మొక్కలను కలిపి పెంచుతున్నారు. సిల్ఫాలిన్ సంచుల్లో ఒక అంచున తీగజాతి కూరగాయ మొక్కలు పెంచి పందిరి పైకి పాకిస్తున్నారు. మిగిలిన భాగంలో ఆకు కూరలు పెంచుతున్నారు. దీనివల్ల పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ తగ్గి దిగుబడి పెరుగుతుందని ఆయన చెప్పారు. నెలకో సారి ఎండు పేడను, వర్మీకంపోస్ట్‌ను పొడిగా చేసి మొక్కల పాదుల్లో వేస్తారు. ఉద్యాన శాఖ వారు అందించే ద్రవరూప ఎరువులను మొక్కలపై 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. వేప నూనె పిచికారీ చేసి గొంగళి పురుగును నివారించారు. ఇంటిపంటల పెంపకంలో వచ్చే సందేహాల నివృత్తి, సల హాల కోసం వాట్సప్ (83744 50023)లో ఉద్యాన శాఖ అధికారులను సంప్రదిస్తారు. బిల్డింగ్ నిర్మాణంలో పునాదులు తవ్వేటప్పుడు లభించే మట్టి, చెట్లు నరికేటప్పుడు దొరికే కర్రలు తెచ్చి దాచి అవసరమైనప్పుడు వాడుతున్నారు. మేడ కింది భాగంలో చూట్టూ ఉన్న కొద్ది స్థలంలోను వివిధ రకాల పండ్లు, కూరగాయ మొక్కలు పెంచుతున్నారు. లాన్లో గడ్డికి బదులు పుదీనాను సాగు చేస్తున్నారు. ఇనుప బద్దెలతో తయారు చేసిన అరను గోడకి ఏర్పాటు చేసి మార్కెట్లో దొరికే ప్లాస్టిక్ డబ్బాలను అందులో అమర్చి తక్కువ స్థలంలోనే రకరకాల అలంకార మొక్కలను పెంచుతున్నారు. కుండీలకు రంధ్రాలు ఏర్పాటు చేసి పై కుండీల్లో పోసిన నీరే అడుగున ఉన్న వాటి లోకి దిగేలా ఏర్పాటు చేయటం విశేషం. నలుగురు సభ్యులు గల తమ కుటుంబానికి సరిపడా కూరగాయలు ఉంచుకొని మిగిలినవి స్నేహితులకు పంచుతున్నారు. వాటి రుచికి మెచ్చి ఐదారుగురు స్నేహితులు ఇంటి పంటలు పెంచుతున్నారని ఆయన (్చజ్టఠఝఝ్చ్చ ఃజఝ్చజీ.ఛిౌఝ) సంతోషంగా చెప్పారు. కొత్తవారికి కుండీల్లో ఇంటిపంటలు సాగు ఇబ్బందిగా ఉంటుందని... పెద్ద సిల్ఫాలిన్ సంచుల్లో ఆకుకూరలు సులువుగా పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ ఇంటిపంటలకు తులసి వైద్యం! మంగళూరుకు చెందిన బ్లేనీ బీ డిసౌజా దశాబ్ద కాలంగా ఇంటిపంటలను సాగు చేస్తున్నాడు. గత ఆరేళ్లుగా తమకుటుంబానికి సరిపడా కూరగాయలను మార్కెట్లో కొనకుండానే ఇంటిపంటల ద్వారానే పండించుకుంటున్నారు. అయితే ఇటీవలే ఇంటిపంటల్లో ఆయన చేసిన ఓ ప్రయోగం ఆశ్చర్యకరమైన ఫలితాన్నిచ్చింది. మొక్కలను ఆశించే చీడపీడలను నివారించేందుకు గతంలో దోమల ఎరలను ఏర్పాటు చేసేవారు. అయితే అవేవీ అనుకున్నంతగా సత్ఫలితాన్నివ్వలేదు. నలైభై రోజుల క్రితం తులసి మొక్కలను ఉంచిన కుండీలను ఇంటిపంటలు పెంచే చోట ఉంచారు. ఆశ్చర్యకరంగా చీడపీడల ఉధృతి పూర్తిగా తగ్గిపోయిందని ఆయన తెలిపారు. మొత్తం 1200 చ. అ. విస్తీర్ణంలో ఇంటిపంటలు పెంచుతుండగా తులసి మొక్కలుంచిన ఆరు కుండీలను అక్కడక్కడా ఉంచారు. ఆశ్చర్యకరంగా అప్పటి నుంచి క్రమంగా మొక్కలపై చీడపీడల దాడి తగ్గిపోవటం గమనించారు. దీంతో పాటు ఎటువంటి సేంద్రియ, రసాయన కీటక నాశనలను పిచికారీ చేయకపోయినా చీడపీడల బెడద తగ్గటంతో.. దీనికి కారణం తులసి మొక్కలేనని ఆయన బలంగా విశ్వసిస్తున్నారు. దోమ లార్వాలను తులసి నియంత్రించగలదని పరిశోధనల్లో తేలిందని నిపుణులు చెబుతున్నారు. -
మూడేళ్లుగా ఆకుకూరలు కొనలేదు!
18 అడుగుల మడిలో ఇంటిపంటల సాగు ఈ ఫొటోలో ఉన్న ఆకుపచ్చని ఇటుకల మడి.. ఒక చిన్న కుటుంబానికి సరిపడా ఆకుకూరలు అందిస్తోంది. 6 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు.. అంతా కలిపితే 18 చదరపు అడుగుల నేల. అయితేనేం.. ఈ చిన్న మడిలోనే కేతిరెడ్డి విజయశ్రీ(98495 27445) ముగ్గురితో కూడిన తమ కుటుంబానికి సరిపడా సేంద్రియ ఆకుకూరలు పండిస్తున్నారు. భర్త కృపాకర్‌రెడ్డి ఇంటిపంటల సాగులో ఆమెకు సహకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని కల్యాణ్పురిలో తాము అద్దెకుంటున్న ఇంటి ముందున్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో ఇటుకలతో చిన్న మడిని ఏర్పాటు చేసుకున్నారు. మెంతికూర, దుంప బచ్చలికూర, గోంగూర, పాలకూర, పుదీనా, వామాకు, కొత్తిమీర.. పెంచుతున్నారు. వీటితోపాటు కాకర, బీర తీగలను కుండీల్లో సాగు చేస్తున్నారు. మూడొంతులు ఎర్రమట్టి, ఒక వంతు పుట్ట మన్ను, ఒక వంతు పశువుల ఎరువును కలిపి తయారు చేసిన మట్టి మిశ్రమాన్ని వాడుతున్నారు. మొదట్లో ఎర్రమట్టి ఒక్కటే ఉపయోగించటంతో మొక్కలు సరిగ్గా ఎదగలేదని.. పుట్టమట్టి, పశువుల పేడ కలిపిన తర్వాత ఏపుగా పెరుగుతున్నాయని విజయశ్రీ వివరించారు. ‘గత మూడేళ్లుగా మేం ఏనాడూ ఆకుకూరలు కొనలేదు. అతి తక్కువ స్థలమే కావటంతో ఇంటి యజమానులు కూడా అభ్యంతరం చెప్పలేదు. పురుగులు, వాటి గుడ్లు కనిపిస్తే చేతులతోనే తీసివేస్తాను. రైతు కుటుంబంలో పుట్టి పెరట్లోనే ఆరోగ్యకరమైన ఆకుకూరలను పండించుకోవటం సంతృప్తిగా ఉందంటున్నారు విజయశ్రీ. -
ఇంటినీరు! ఇంటిపంట!!
అసలే ఎండాకాలం.. ఇంట్లో పనులకే నీళ్లు కరువొచ్చింది. 30-40 శాతం తక్కువ వర్షపాతం నమోదవడంతో భూగర్భ జలాలు తొందరగానే అడుగంటాయి. నీటి ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఇక ఇంటిపంటలకు నీళ్లెక్కడి నుంచి వస్తాయి? ‘ఇంటిపంట’ బృంద సభ్యుల మధ్య ఫేస్బుక్లో ఇటీవల ఇదే చర్చ నడుస్తోంది. ఇంతలో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి పెద్ద వాన కురిసింది. అరగంటకు పైగా నిలబడి కురిసింది. టైల మీద కుండీలు, మడుల్లో పెరుగుతున్న ఇంటిపంటలు వర్షంలో తడిసి హర్షం వెలిబుచ్చుతూ తళతళలాడుతూ తలలూపాయి. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న ఇంటిపంటల సాగుదారులు ‘అమ్మయ్య.. ఇంకో రెండు రోజులు నీటి బాధ లేదు’ అనుకొని సంతోషించారు. అయితే, హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన వనమామళె నళిని మాత్రం ఇంక వారం రోజుల వరకు తన ఇంటిపంటలకు నీటి ఇబ్బందే లేదని ప్రకటించారు! తమ మేడ మీద 300 కుండీల్లో వివిధ రకాల పూలు, పండ్లు, కాయగూర మొక్కలను ఆమె అపురూపంగా పెంచుతున్నారు. తమ కుటుంబానికి సరిపడా పండ్లతోపాటు వారంలో మూడు రోజులకు సరిపోయే కూరగాయలు, ఆకుకూరలను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకుంటున్నారు.. ఇంతకీ, ఆమె ఇంటిపంటలకు వారం వరకూ నీరెక్కడ నుంచి వస్తాయనే కదా.. మీ సందేహం..? అక్కడికే వస్తున్నా.. ఈ సమస్యకున్న సరైన పరిష్కారాన్ని ఆమె ముందుగానే గ్రహించి, తగిన విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమె చేసిందల్లా.. వర్షపు నీటిని.. కురుస్తుండగానే ఒడిసిపట్టుకున్నారు. సిమెంటు రేకుల వసారా మీద నుంచి జారే వర్షపు నీటిని బక్కెట్లు, ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నింపుకున్నారు. చూరు నీటిని పట్టుకోవడానికి అంతకుముందే ఏర్పాట్లు చేసుకొని ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. నళిని ఒక్కరే కాదు.. ఇలా ముందుచూపుతో కదిలిన వారంతా వాన నీటిని ఒడిసిపట్టుకోగలిగే ఉంటారు. ఈ సీజన్లో ఇదే మొదటి వాన కావటంతో... చూరు నీటిలో మట్టి, పూలు, ఎండాకులు కలిశాయంతే..! వాన ఎలిసిందో లేదో.. అంతులేని ఈ వర్షానందాన్ని ఇంటిపంట గ్రూప్‌లో నళిని సచిత్రంగా పోస్టు చేసేశారు. నీటి కొరత సమస్యకు వర్షపు నీటి సంరక్షణే అసలు సిసలు పరిష్కారమని సూచించారు! సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుందని గుర్తుచేశారు. ఒక మంచి పనిని ముందు తాను చేసి.. తర్వాతే ఇతరులకు సూచించాలన్న గాంధీజీ బాటను నళిని అనుసరించి చూపడం బాగుంది.. అంతలోనే ఓ సందేహం..!! అయినా.. మొక్కలకు పోయడానికి ఏ నీరు మంచిది? వర్షం నీరు మంచిదేనా? ఇంటిపంట గ్రూప్‌లో చర్చ మొదలైంది. మున్సిపాలిటీ వాళ్లు అవీ ఇవీ కలిపి సరఫరా చేసే నీటికన్నా, భూగర్భ జలం కన్నా వర్షం నీరు స్వచ్ఛమైనది కాబట్టి.. భేషుగ్గా పనికొస్తాయని సీనియర్లు తేల్చి చెప్పేశారు. ఆస్బెస్టాస్ నీళ్లు ఇంటిపంటలకు మంచిదేనా? ఇంతలో.. సీనియర్ కిచెన్ గార్డెనర్ పూనం భిదే గారికి గట్టి సందేహమే వచ్చింది (పూనం భిదే తమ టై మీది నుంచి వర్షం నీటిని ఇంకుడు గుంట ద్వారా భూమిలోకి ఇంకేలా ఏర్పాటు చేశారు. బోరు నీటినే ఇంటి అవసరాలకు, ఇంటిపంటలకు వినియోగిస్తున్నారు). ఆస్బెస్టాస్ డస్ట్‌ను పీల్చితే ఆరోగ్యానికి హానికరమని తెలుసు. అయితే ఈ రేకుల మీద నుంచి జారిన నీటిలో ఆస్బెస్టాస్ డస్ట్ కలిసి ఉంటుంది కదా.. ఆ నీటిని ఇంటిపంట మొక్కలకు పోయడం మంచిదేనా? అన్నదే ఆమె సందేహం. అదృష్టంకొద్దీ తాను టిన్ షీట్లను వాడాను కాబట్టి.. సమస్య లేదన్నారు నళిని. ఏ మలినమూ అంటకుండా.. వర్షపు నీటిని స్వచ్ఛంగా ఒడిసిపట్టుకునే మార్గాలు అనేకం వాడుకలో ఉన్నాయి. అందులో ఒకటి: శుభ్రమైన వస్త్రాన్ని ఆరుబయట నాలుగు వైపులా లాగి కట్టి.. మధ్యలో ఏదైనా చిన్న బరువు వేసి.. దాని అడుగున బక్కెట్ లేదా డ్రమ్ము పెడితే చాలు.. స్వచ్ఛమైన ఈ నీరు ఇంటిపంటలకే కాదు.. మనం తాగడమూ మంచిదే! - ఇంటిపంట డెస్క్ -
పురుగుల భరతం పట్టే ద్విపత్ర ద్రావణం!
- అడవి జెముడు కొమ్మలు, సునాముఖి ఆకులతో - ద్రావణం.. 10 రోజుల్లో సిద్ధం - పంటలపై పిచికారీతో రసం పీల్చే పురుగుల పీడ విరగడ స్థానికంగా అందుబాటులో ఉండే వనరులతోనే రైతులు స్వయంగా ఎరువులు, కషాయాలను, ద్రావణాలను తయారు చేసుకోవడం సేంద్రియ సేద్యంలో ముఖ్యాంశం. సేంద్రియ సేద్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి రైతులు నిరంతరం కొత్తదారుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. తమ పరిసరాల్లోని చెట్టూ చేమను సేద్య అవసరాల కోసం మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలా అని ఆలోచిస్తూ.. ప్రయోగాలు చేసే సేంద్రియ రైతు నిత్యాన్వేషి కొమ్మూరి విజయకుమార్. రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా పారదోలే సరికొత్త ద్విపత్ర ద్రావణాన్ని తమ పంటలపై వాడుతూ, తోటి రైతులకూ నేర్పిస్తున్నారు. ఆకులు, అలములను నీటిలో మరిగించి తయారు చేసే కషాయాల కన్నా.. పులియబెట్టి తయారు చేసే ద్రావణాలు చీడపీడలపై ప్రభావశీలంగా పనిచేస్తున్నాయని ఆయన స్వానుభవంతో అంటుంటారు. వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి వెలంవారిపల్లెకు చెందిన విజయకుమార్(98496 48498) తమ ప్రాంతంలో విరివిగా లభించే అడవి జెముడు, సునాముఖి మొక్కలతో తయారు చేసిన ద్రావణ ం వివిధ పంటలపై రసం పీల్చే పురుగులను చక్కగా అరికడుతున్నదంటున్నారు. విజయకుమార్ ఏమంటున్నారంటే... ఎలా తయారు చేస్తారు? పొలాలు, గుట్టలు, కొండల్లో ముళ్లతో ఉండే అడవి జెముడు మొక్కలు విరివిగా కన్పిస్తుంటాయి. వీటిని మేకలు తింటాయి. ఆ మొక్కల కొమ్మలు కిలో తీసుకోవాలి. సునాముఖి పచ్చి ఆకును కిలో తీసుకోవాలి. వీటిని ముందుగా విడివిడిగా బాగా దంచి, వాటితోపాటు 4 లీటర్ల ఆవు మూత్రాన్ని డ్రమ్ము/తొట్టిలో వేసి బాగా కలియదిప్పాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఉంచి, అడపా దడపా కలుపుతూ పులియబెట్టాలి. 10 రోజుల పాటు పులిసిన ద్రావణాన్ని ఉపయోగించవచ్చు. లీటరు ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేసుకోవాలి. అన్ని పంటలకూ ఉపయోగమే.. పెసర, మినుము, కంది, వేరుశనగ... ఇలా దాదాపు అన్ని పంటల పైన ఈ ద్రావణాన్ని వినియోగించవచ్చు. పురుగు ఉధృతిని బట్టి పంటకాలంలో మూడుసార్లు ఈ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. వేసవి కాలంలో... పంట 20 రోజుల దశలో ఉన్నప్పుడు మొదటిసారి 100 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి వాడాలి. రెండోసారి 80 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని, మూడోసారి 60 లీటర్ల నీటిలో లీటరు ద్రావణాన్ని కలిపి పిచికారీ చేయాలి. చలికాలంలో అయితే.. పంట 15 రోజుల దశలో ఉన్నప్పుడే మొదటిసారి ద్రావణాన్ని వినియోగించాలి. భూమి, మొక్కలు బాగా తడిసేలా ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఒకసారి ద్విపత్ర ద్రావణాన్ని తయారు చేసుకుంటే దాన్ని సంవత్సర కాలం వరకూ నిల్వ చేసుకోవచ్చు. రెక్కల పురుగులు.. తెల్లదోమ.. ద్విపత్ర ద్రావణం రెక్కల పురుగుల గుడ్లను సమర్థవంతంగా నాశనం చేస్తుంది. అలాగే తెల్లదోమను కూడా నివారిస్తుంది. తెల్లదోమ నివారణకు ద్రావణాన్ని పిచికారీ చేసే వారు దానిలో కొంచెం సర్ఫ్ పొడిని కానీ లేదా కుంకుడుకాయ రసాన్ని కానీ కలుపుకుంటే మంచిది. ఈ ద్రావణం బాగా పనిచేస్తోంది.. సునాముఖి, అడవి జెముడుతో తయారు చేసిన ద్విపత్ర ద్రావణం పంటలపై బాగా పని చేస్తోందని వేంపల్లె మండలం బుగ్గకొట్టాలకు చెందిన రైతు వెంకట్రాముడు చెప్పారు. సంజీవని ఎరువు, ద్రావణాల వాడకం వల్ల ఖర్చు తగ్గిందని వేంపల్లె మండలం టి.వెలంవారి పల్లెకు చెందిన రైతు పక్కీరప్ప తెలిపారు. - మాచుపల్లి ప్రభాకర్‌రెడ్డి, కడప అగ్రికల్చర్ -
రైతు ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లే!
విశ్వవరం మోహన్‌రెడ్డి.. పర్యావరణ, సేంద్రియ వ్యవసాయోద్యమకారుడు. నల్గొండ జిల్లా ఆత్మకూరులో 60 ఏళ్ల క్రితం మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టారు. వ్యవసాయ సంక్షోభ మూల కారణాలను కొత్తకోణంలో అర్థం చేసుకుంటూ.. సులువైన పరిష్కార మార్గాన్ని అనుభవపూర్వకంగా సూచిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్’లేనని, ఇందుకు మూలం ‘హరిత విప్లవ భూతమే’నంటారాయన. మెట్ట భూముల్లో లోతైన కందకాలు తవ్వి.. సేంద్రియ సేద్యం చేపడితే.. కరువు కాలంలోనూ రెండు సీజన్లలో ఆరుతడి పంటలకు ఢోకా ఉండదంటున్నారు. పాలమూరు జిల్లాలో మెట్ట సేద్యానికి కాయకల్ప చికిత్స చేస్తున్న మోహన్‌రెడ్డి (87900 51059)తో ‘సాక్షి’ ఇటీవల ముచ్చటించింది. ముఖ్యాంశాలు మీ కోసం.. - చేనుకు చినుకులే చాలు! - ఇది ‘హరిత విప్లవ భూతం’ నిర్వాకమే - లోతైన కందకాలతోనే మెట్ట పొలాలన్నిటికీ సాగు నీటి భద్రత ‘సాక్షి’తో పర్యావరణ, సేంద్రియ సేద్య ఉద్యమకారుడు మోహన్‌రెడ్డి రైతుల ఆత్మహత్యలకు హరిత విప్లవమే మూలకారణమా? హరిత విప్లవం వల్ల రసాయనిక ఎరువులు, పురుగుమందులు, ట్రాక్టర్లు, హైబ్రిడ్ విత్తనాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. ఉచిత విద్యుత్ ఇవ్వటంతో బోర్లు విస్తారంగా తవ్వి, ట్రాక్టర్ల దుక్కితో మెట్ట భూమిని అత్యధిక విస్తీర్ణంలో సాగులోకి తెచ్చారు. కొన్ని దశాబ్దాలపాటు మధ్యతరగతి రైతులు కళ్లు చెదిరే ఆదాయాలు కళ్లజూశారు. కానీ, 1995 నాటికి బోర్లు విఫలం కావటం, మెట్టపంటలు విఫలం కావడం ఎక్కువైంది. క్రమంగా వ్యవసాయ కుటుంబాలు తట్టుకోలేనంత అప్పుల్లో కూరుకుపోవటంతో రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయి. భారత్ వంటి ఉష్ణమండల దేశాలు నీటి కొరత నుంచి ఎప్పటికీ బయటపడలేవని, ఆహార భద్రత కోల్పోయి శీతల దేశాల నుంచి ఆహారం దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని ప్రపంచబ్యాంక్ కన్సల్టెంట్ ఒకరు అప్పట్లోనే ప్రకటించారు. సామాజిక కార్యకర్తగా ఉన్న నాకు ఇది పెద్ద షాకింగ్ న్యూస్.. అప్పటి నుంచి నీటి సమస్యపై సీరియస్‌గా అధ్యయనం చేస్తున్నాం. నిరంతర కరువులే వర్షాధార పంటలను, మెట్ట రైతును చావు దెబ్బతీస్తున్నాయని, రైతుల ఆత్మహత్యలన్నీ ‘క్లైమేట్ ఛేంజ్ డెత్‌లే’(తల్లకిందులైన వాతావరణం వల్ల జరుగుతున్న మరణాలే)నన్న నిర్థారణకొచ్చాం. అంతేకాదు, క్లైమెట్ ఛేంజ్‌కు మూలకారణం కొందరు చెబుతున్నట్లు వాయు కాలుష్యం కాదు.. హరిత విప్లవం తెచ్చిన రసాయనిక వ్యవసాయ పద్ధతులే! వీటి వల్లనే సుమారు 10 లక్షల మంది మెట్ట రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.. నిరంతర కరువుల గురించి మీ అధ్యయనంలో తేలిందేమిటి? హరిత విప్లవం తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. వరదలొచ్చిన ఏడాదిలోనూ మెట్ట పంటలు ఎండిపోవటం ఇందుకే. ఉదాహరణకు మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులో 2004-2014 మధ్యకాలంలో వర్షపాతం చూస్తే.. 6 ఏళ్లు పంటలు దాదాపు ఫెయిల్ అయ్యాయి(ఇందులో 3 ఏళ్లు పంటలు పూర్తిగా పోయాయి. చిత్రమేమిటంటే.. ఈ మూడేళ్లలోనూ అదనుదాటిన తర్వాత కుండపోత వానల వల్ల వరదలొచ్చాయి). మిగతా నాలుగేళ్లలో పంటలు బాగున్నాయి. అంతకుముందుకన్నా ఎక్కువ సార్లు కరువొచ్చినట్టు గమనించాం. రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లో సైతం హరిత విప్లవానికి ముందు నీటి కరువు లేదు. ఇప్పటిలా శాశ్వత కరువు లేదు. ప్రకృతిసిద్ధంగా చెట్టూచేమను కనిపెట్టుకొని ఉండే ‘జలదుర్గా’న్ని హరిత విప్లవం బదాబదలు చేయడమే వ్యవసాయ సంక్షోభానికి దారితీస్తోంది. జలదుర్గం అంటే? నీటికి ఉన్నది ద్రవ రూపం మాత్రమేననుకుంటాం. కానీ, వాస్తవానికి 7 రూపాలున్నాయి. వర్షం, భూగర్భ జలం, నేలలోని తేమ, ఉపరితల జలం(బావులు, చెరువులు, రిజర్వాయర్లలో కనిపించే నీరు). చెట్టూ చేమ(ఆ మాటకొస్తే పంటల) మనుగడకు ఈ ‘జలదుర్గం’ పటిష్టమైన పర్యావరణపరమైన పునాది. అంతేకాదు.. గాలిలో తేమ, మంచు, తక్కువ ఎత్తులో ఉండి వర్షం కురిపించే మబ్బులు.. ఇవన్నీ నీటి ప్రతిరూపాలే. నీరు స్థిరంగా ఒకే రూపంలో ఉండదు. అనుదినం రూపాంతరం చెందుతూ ఉంటుంది. హరిత విప్లవం ప్రకృతిసిద్ధమైన ఈ జలదుర్గాన్ని అన్నివిధాలా బదాబదలు చేసింది. గతంలో మాదిరిగా ఇప్పుడు కార్తెల ప్రకారం వర్షాలు పడటం లేదు. వర్షాకాలంలోనూ ఎక్కువ రోజులు చినుకు జాడ ఉండటం లేదు. తర్వాతెప్పుడో కుండపోత వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తున్నాయి. వర్షాధార పంటలు చాలా సార్లు చేతికి రాకుండాపోతున్నాయి. రసాయనిక సేద్యం మానేస్తే ఆత్మహత్యలు ఆగుతాయా? మెట్ట పంటలకు నీటి కొరత తీరిస్తే రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. చెరువులకు పూడిక తీస్తే సరిపోతుందని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. కానీ, చెరువులు బాగుచేసి వాన నీటిని నిల్వచేస్తే వాటి వాలులో ఉన్న 25% మెట్ట పొలాలకే నీరందుతుంది. మిగతా 75% మెట్ట పొలాల మాటేమిటి? ప్రతి మెట్ట పొలానికీ నీటి కొరత తీర్చే పద్ధతిని మేం రూపొందించాం. ప్రతి పొలంలోనూ వాలుకు అడ్డంగా లోతైన (4 అడుగుల లోతు, 4 అడుగుల వెడల్పు) కందకాలు తవ్వాలి. కురిసిన ప్రతి చినుకూ పొలంలోనే ఇంకుతుంది. కురిసిన ప్రతి చినుకును చెరువుకు పారబెట్టడం కాదు.. ఆ పొలంలోనే ఇంకేలా కందకాలు తవ్వాలి. రసాయనిక ఎరువుల వల్ల నేల బండబారిపోయింది. మనుషులు కందకాలు తవ్వడం అసాధ్యం. యంత్రాలతో తప్ప తవ్వలేం. అసలు వర్షమే తక్కువ కురిస్తే..? రెండు దుక్కుల (50ఎంఎం) వాన పడితే చాలు. కందకాల ద్వారా భూగర్భ జలం పెరుగుతుంది. జలదుర్గాన్ని తిరిగి నిర్మించడానికి చేయాల్సిన మొదటి పని ఇది. సాధారణంగా మహబూబ్‌నగర్‌లో 560ఎంఎం, అనంతపురంలో 550ఎంఎం వర్షపాతం కురుస్తుంది. తక్కువ కురిసినా, ప్రతి చినుకునూ నేలకు తాపితే చాలు, మెట్ట పొలాలకు నీటికరువుండదు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికి 700 ఎకరాల్లో కందకాలు తవ్వించాం. రానున్న మూడేళ్లలో 18 వేల ఎకరాల్లో తవ్వించబోతున్నాం. ఒక్క పెద్దవానతోనే 15 ఏళ్ల నాడు ఎండిపోయిన వ్యవసాయ బావుల్లోకి నీళ్లొచ్చాయి. బోర్ల కింద డ్రిప్ పెట్టుకుంటే రెండు ఆరుతడి పంటలకు నిశ్చింతగా నీరందుతున్నది. ఖరీఫ్‌లో ఆరుతడి వరి, రబీలో ఇతర పంటలు పండిస్తున్నారు. ప్రభుత్వ సాయం లేకుండానే కందకాలు తవ్వుకోవడానికి రైతులు ముందుకొస్తున్నారు. క్లైమెట్ ఛేంజ్‌ని అడ్డుకోవడం కందకాలతో సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యమే. కందకాలతో 100% వాననీటి సంరక్షణ చేయవచ్చు. భారీ వర్షాల ద్వారా 60% వర్షపాతం నమోదవుతోంది. ఇందులో మూడింట ఒక వంతు మాత్రమే ఇప్పుడు భూమిలోకి ఇంకుతోంది. వాలుకు అడ్డంగా లోతైన కందకాలు తవ్వితే వర్షం 100% భూమిలోకి ఇంకుతుంది. నీటి కరువు తీర్చడానికి ఈ నీరంతా ఇంకితే చాలు. కందకాల్లో 2 మీటర్ల పొడవైన మొక్కలు నాటుతున్నాం. చెట్టూచేమ పెరుగుతుంది. రైతు ఇంటిదగ్గర గొర్రెలు, మేకలను కట్టేసి(దొడ్డిమేత పద్ధతిలో) మొలకగడ్డితో పెంచుతున్నాం. రసాయనిక ఎరువులకు బదులు వీటి ఎరువు వాడుతున్నాం. గేదెలు, ఆవులకన్నా చిన్న జీవాలే మెట్ట రైతుకు అధికాదాయాన్నిస్తాయి. ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండే మార్గాలున్నాయి. పొలాల్లోనే ప్రతి చినుకునూ ఇంకింపజేసి, సేంద్రియ సేద్యంతో నీటి భద్రతను, ఆహార భద్రతను, ఆదాయ భద్రతను మెట్ట రైతులకు కల్పించడమా? లేక క్లైమేట్ ఛేంజ్‌ను ఎదుర్కొనే పేరిట కంపెనీల దోపిడీకి అనువైన జన్యుమార్పిడి పంటలకు జై కొట్టడమా? ఇంటర్వ్యూ : పంతంగి రాంబాబు ఫొటో : ఎ. సతీష్ -
బడ్జెట్ కేటాయింపుల్లో.. రైతుకు దక్కేది పిడికెడే!
ఈ ఏడాది తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పోటీపడి తగ్గించాయి. రుణ మాఫీ పథకానికి కేటాయించిన నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, సిబ్బంది జీతాలు మినహాయిస్తే నికరంగా రైతుకు చేరేది చాలా తక్కువ. చిన్న రైతుల ఆర్థిక స్వావలంబనకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేదంటున్నారు డాక్టర్ డి.నరసింహారెడ్డి. వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో నిధుల కేటాయింపులు తగ్గిపోతున్నాయి. చిన్న రైతులకు అవసరమైన పథకాలను కుదించడం లేదా ఎత్తివేయడం జరుగుతోంది. కేటాయింపులను సైతం పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదు. రైతులు అధికారుల వద్దకు తిరగలేక, పథకాలు ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇచ్చిన వారికే ఇవ్వటం, నిబంధనల పేరిట అర్హులకు ఇవ్వకపోవటం, అరకొరగా ఇవ్వటం వంటి కారణాలతో రైతులకు ప్రయోజనం కలగటంలేదు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖకు 2014-15లో రూ. 6,276 కోట్లు, 2015-16లో రూ. 5,545 కోట్లు కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే 13 శాతం నిధుల కేటాయింపు తగ్గింది. ప్రణాళికా కేటాయింపులు రూ. 1,035 కోట్లు కాగా ప్రణాళికేతర కేటాయింపులు రూ. 4,510 కోట్లు! ప్రణాళికా కేటాయింపులు గతేడాది కంటే భారీగా 76 శాతం తగ్గించారు. మొదటి నుంచి కూడా కేంద్ర పథకాలు, తద్వారా వచ్చే నిధులనే రాష్ట్రాలు నమ్ముకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమేమో రాష్ట్రాలకు నిధులు నేరుగా బదలాయించి, స్వేచ్ఛ కల్పించానంటుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని పట్టించుకోకపోవటం శోచనీయం. నికర కేటాయింపులు స్వల్పమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులు ఇందుకు భిన్నంగా ఏమీలేవు. 2015-16 సంవత్సరానికి వ్యవసాయ శాఖ కేటాయింపులు రూ. 6,454 కోట్లు. గత సంవత్సర కేటాయింపుల కన్నా ఈ కేటాయింపులు తొమ్మిది శాతం తక్కువ. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో రుణ మాఫీ పథకం నిధులు, కేంద్ర ప్రాయోజిత పథకాలను మినహాయిస్తే వ్యవసాయానికి నికర కేటాయింపులు చాలా తక్కువ. రుణమాఫీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ. 5 వేల కోట్లు కేటాయించి 2015-16లో రూ. 4,300 కోట్లకు తగ్గించింది. తెలంగాణ ప్రభుత్వం రూ. 4,250 కోట్లు కేటాయించింది. రెండు రాష్ట్రాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వ్యవసాయాభివృద్ధికి సమృద్ధిగా నిధులివ్వకపోవడం ఆయా ప్రభుత్వాల హ్రస్వ దృష్టిని సూచిస్తుంది. రైతులకు నేరుగా లబ్ధి చేకూర్చే నిధులు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రూ. 10 కోట్లకు మించవు. మిగతా నిధులు, బిల్డింగులు పరిశోధనలు పెద్ద కమతాలకు ఉపయోగపడేవే. అధికార టి.డి.పి., టి.ఆర్.ఎస్. పార్టీలు ఎన్నికల సమయంలో ఘనమైన హామీలు ఇచ్చాయి. కాంప్లెక్స్ ఎరువుల సరఫరాకు రూ. 500 కోట్లు ఇస్తానని టీడీపీ హామీ ఇచ్చింది. మార్కెట్ స్థిరీకరణ నిధికి రూ. 5 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఆ పథకం ఊసే ఎత్తలేదు. అనేక పంటలకు గిట్టుబాటు ధర లభించటం లేదు. మార్కెట్ స్థిరీకరణ నిధి ఈ పరిస్థితిలో అత్యంత అవసరం. చిన్న, సన్న కారు రైతుల అవసరాలు తీర్చే కొత్త పథకం ఒక్కటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించలేదు. ప్రణాళిక కేటాయింపులలో వ్యవసాయ అనుబంధ రంగాలకు 2014-15లో కేటాయించిన రూ. 5415 కోట్లు వార్షిక ప్రణాళికలో 20.31 శాతం కాగ, 2015-16లో కేటాయించిన రూ. 1863 కోట్లు కేవలం 5.42 శాతం మాత్రమే. రైతులను, ఆదుకోవాల్సిన ప్రభుత్వం అరకొర కేటాయింపులు చేయటం దురదృష్టం. రైతుకు చేరేది తక్కువే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర బడ్జెట్లో అవీ ఇవీ ఒకచోట చేర్చి వ్యవసాయ బడ్జెట్ అన్నారు. వ్యవసాయాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలేమిటో, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిందో పేర్కొని ఉంటే స్పష్టత ఉండేది. పట్టు పరిశ్రమకు రూ. 93 కోట్లు ఇచ్చామన్నారు. దీనిలో రూ. 82 కోట్లు, సిబ్బంది జీతభత్యాలకు ఖర్చుకాగా పరిశ్రమ అభివృద్ధికి మిగిలేది కేవలం రూ.7.25 కోట్లు మాత్రమే. అలాగే పశుగణాభివృద్ధికి ప్రకటించిన రూ. 672 కోట్లలో సిబ్బంది జీతభత్యాలకే రూ. 489 కోట్లు ఖర్చవుతాయి. రెండు రాష్ట్రాలు కలిపి కేటాయించిన రూ. 11,999 కోట్లలో రైతుల సమస్యలు తీర్చేందుకు ఉపయోగపడే నిధులు రూ. 500 కోట్లకు మించవు. చిన్న రైతులు దశలవారీగా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు తోడ్పడే చర్యలకు నిధులు కేటాయిస్తే బాగుండేది. ప్రభుత్వ పథకాల అమలులో సమన్వయం సాధించి, అవినీతిని తగ్గించి, నిధులను పరిపూర్ణంగా రైతులకు చేర్చే ప్రక్రియలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్షేషకులు. మొబైల్ : 90102 05742) -
పురుగులతో వేగేదెలా?
ఇంటి పంట ఎండ గత కొద్ది రోజులుగా చుర్రుమంటోంది. ఇంటిపంటలకు (70% ఎండను వడకట్టే) 30% గ్రీన్ షేడ్‌నెట్‌తో నీడను కల్పించడం, ఆకులతో నేలకు ఆచ్ఛాదన(మల్చింగ్), డ్రిప్ వంటి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. కూరగాయ పంటలకు వేసవిలో కొన్ని ప్రత్యేక పురుగుల బెడద ఉంటుంది. నేల మీద లేదా కుండీల్లో ఎక్కడైనా వీటి బెడద ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని మెలకువలు పాటిస్తే నష్టం తక్కువగా చూసుకోవడానికి వీలుంది. పెంకు పురుగులు: ఇవి చల్లదనాన్ని ఇష్టపడే పురుగులు. మొక్కల దగ్గర మట్టిలో పిల్ల పురుగులు దాక్కొని ఉంటాయి. రాత్రి పూట బయటకు వచ్చి మొక్కల ఆకులను తిని, మళ్లీ మట్టిలోకి చేరుకుంటాయి. వేపపిండిని మట్టిలో కలిపితే సమస్య తీరుతుంది. కూరగాయ మొక్కలు నాటడం లేదా ఆకుకూరల గింజలు చల్లడానికి ముందే మట్టిలో కొంచెం వేప పిండి వేసుకుంటే వీటి సమస్య రాదు. నులిపురుగు: వంగ, బీన్స్, టమాటా తదితర కూరగాయ మొక్కల వేళ్లను నులిపురుగులు ఆశిస్తుంటాయి. నులిపురుగుల సమస్య ఉన్న మొక్కలకు పోషకాల లభ్యత తగ్గిపోతుంది. ఆకులు పసుపు పచ్చగా మారి.. మాడిపోతాయి. ఆకుల్లో తేడా తప్ప ఇతర లక్షణాలేవీ ఉండవు. మట్టిని పక్కకు తీసి వేళ్లను గమనిస్తే వేళ్లకు బుడిపెలు కనిపిస్తాయి. దీన్ని మొదటి దశలో అయితే ట్రైకోడెర్మావిరిడితో కొంతమేరకు నియంత్రించవచ్చు. అయితే, ట్రైకోడెర్మా విరిడిని మట్టిలో వేస్తే.. ఆ తదనంతరం వరుసగా అనేక పంటలను నులిపురుగుల బారి నుంచి, ఎండుతెగులు నుంచి కూడా కాపాడుకోవచ్చు. ట్రైకోడెర్మా విరిడి తయారీ విధానం: ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంధ్రనాశినిని మాగిన పశువుల పేడలో కలిపి వృద్ధి చేసి.. మొక్కలకు వేసుకోవాలి. పెరటి తోటలు, మేడపై ఇంటిపంటల కోసం తక్కువ పరిమాణంలో ట్రైకోడెర్మా విరిడిని వృద్ధి చేసుకోవచ్చు. 10 కిలోల పశువుల ఎరువును నీడలో నేలపైన పరిచి, 250 గ్రాముల(ఎక్కువైనా ఫర్వాలేదు) ట్రైకోడెర్మా విరిడి పొడిని కలిపి, పల్చగా నీటిని చిలకరించాలి. దానిపై గోనెసంచిని కప్పాలి. తేమ ఆరిపోకుండా తగుమాత్రంగా నీరు చల్లుతుండాలి. వారం రోజుల్లో పశువుల ఎరువు పైన తెల్లని బూజు పెరుగుతుంది. అంటే.. ట్రైకోడెర్మా విరిడి వృద్ధి చెందిందన్న మాట. మట్టిని ఒక అంగుళం మందాన తీసి పక్కన పెట్టి.. ట్రైకోడెర్మా విరిడితో కూడిన పశువుల ఎరువును వేసి, మళ్లీ మట్టిని కప్పేయాలి. ఎర్రనల్లి: వంగ, బెండ తదితర పంటల్లో ఆకుల కింద చేరే ఎర్రనల్లి రసం పీల్చేస్తూ ఉంటుంది. ఆకులు క్రమంగా పత్రహరితాన్ని కోల్పోతాయి. మొక్క పెరగదు. దీని నివారణకు గుప్పెడు ఆవాలు, 2,3 వెల్లుల్లి రెబ్బలు నూరి, ఒక పల్చని గుడ్డలో మూటగట్టి, లీటరు నీటిలో 3 గంటలు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని ఆకుల అడుగున బాగా తడిసేలా పిచికారీ చేయాలి. వారం వ్యవధిలో 2,3 సార్లు పిచికారీ చేయాలి. లేదా దుకాణాల్లో లభించే నీటకరిగే గంధకం(వెట్టబుల్ సల్ఫర్)ను తగిన మోతాదులో వాడుకోవచ్చు. - డా. బి. రాజశేఖర్ (83329 45368), శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్ -
వృథా భూముల్లో అమృత సాగు
వృథా భూములు, రాతినేలలు కలిగి ఉన్న వారికి దిగులు అవసరం లేదు. ఆ భూముల్లోనూ తోటలు పెంచుకోవచ్చని అంటున్నారు ఉద్యాన అధికారులు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిచ్చే సీతాఫలాన్ని సాగు చేసుకోచ్చని సూచిస్తున్నారు. అడవులు, రాతి గుట్టల్లోనే కాకుండా పొలాల్లో అంతర పంటగా కూడా వేసుకోచ్చని చెబుతున్నారు. ఏ పంటకూ అనువుగాని భూముల్లో సీతాఫలాన్ని సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ అధికారులు తెలుపుతున్నారు. సీతాఫలం పంట, రకాలు, నాటే పద్ధతులు, నీటి, ఎరువుల యాజమాన్యం తదితర అంశాలపై ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు-2 కె.సూర్యనారాయణ (87344 49066) వివరించారు. -ఖమ్మం వ్యవసాయం ఏ పంటకూ అనువుగాని నేలల్లోనూ సీతాఫలం సీతాఫలంలో పిండి పదార్థాలు (కార్బోహైడ్రేట్స్), విటమిన్ సీ, విటమిన్ ఏ ఉండటం వల్ల పలు రకాల పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. అనోనైన్ అనే పదార్థం ఆకులు, గింజలు, ఇతర భాగాల్లో ఉండటం వల్ల చేదుగుణం కలిగి పశువులు, మేకలు తినవు. సీతాఫలం రసాన్ని కీటకనాశినిగా వాడొచ్చు. గింజల నుంచి నూనె తీయొచ్చు. దీనిని పెయింట్, సబ్బు పరిశ్రమల్లో వాడతారు. వాతావరణం సీతాఫలం ఉష్ణ మండల పంట. ఎక్కువ చలి, మంచును తట్టుకోలేదు. అధిక వర్షపాతాన్ని, వర్షాభావ పరిస్థితులను తట్టుకోలేదు. పుష్పించే దశలో పొడి వాతావరణం, కాయ దశలో అధిక తేమ, వర్షపాతం (50 నుంచి 75 సెంటీ మీటర్లు) అనుకూలం. అధిక చలి ఉంటే కాయలు పండుబారాక గట్టిగా, నల్లగా మారతాయి. ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ అయితే పూత రాలిపోతుంది. నేలలు చౌడు, క్షార తప్ప మిగతా అన్ని రకాల నేలల్లోనూ సీతాఫలం తోటలు పెంచుకోవచ్చు. నీరు నిలవని గరప నేలలు, ఎర్రనేల లు శ్రేష్టం. రాళ్లతో ఉన్న నేలల్లో కూడా సాగు చేయొచ్చు. మురుగునీరు పోయే సదుపాయం కలిగి 5.5-7.5 ఉదజని సూచిక గల నేలలు అనుకూలం. రకాలు బాలానగర్: కాయలు పిరమిడ్ ఆకారంలో పెద్ద సైజులో పెద్ద కళ్లతో ఉంటాయి. కళ్ల మధ్య లేత పసుపురంగు నుంచి నారింజరంగులో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. మధురమైన రుచి, 27శాతం చక్కెర కలిగి, 200-260 గ్రాముల సగటు బరువుతో ఉంటాయి. అతిమాయ: కాయలపై చర్మం నునుపుగా ఉండి తక్కువ గింజలు కలిగి తీపి పులుపు కలిగిన ప్రత్యేకమైన గుజ్జు ఉంటుంది. ఈ చెట్లలో పరాగ సంపర్కానికి ప్రతి 20 చెట్లకు ఒకదానిని నాటాలి. అర్కనహాన్: ఇది హైబ్రిడ్ రకం. ఐఐహెచ్ఆర్ బెంగళూరు వారు రూపొందించారు. ఐలాండ్, జమ్ మమ్మిత్ రకాలను సంకరపరచి దీనిని రూపొందించారు. కాయలు గుండ్రంగా చర్మంగా కళ్లు ప్రస్ఫుటంగా లేకుండా నునుపుగా ఉంటాయి. గుజ్జు అత్యంత తియ్యగా, గింజలు చాలా తక్కువగా ఉంటాయి. పింక్స్మమ్మిత్: ఇది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకం. కాయలు పెద్దగా అండాకారంలో ఉండి చర్మం ఆకుపచ్చ మీద పింక్ రంగు కలిగి ఉంటుంది. గుజ్జు తక్కువగా ఉంటుంది. ఐలాండ్జెను: ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న రకమే. కాయలు మంచి నాణ్యత కలిగి పెద్దగా నునుపైన చర్మం కలిగి ఉంటాయి. నాటే పద్ధతి పొలం బాగా దుక్కి చేసిన తర్వాత 60ఁ60ఁ60 సెంటీమీటర్ల గుంతలను 5ఁ5 మిల్లీమీటర్లు లేదా 6ఁ6 మిల్లీమీటర్లు ఎడంగా తీసి గుంత నుంచి తీసిన పైమట్టికి 20 కిలోల పశువుల ఎరువు, ఒక కిలో సూపర్ ఫాస్పేట్, 100 గ్రాముల పాలిడాల్ 2శాతం పొడి బాగా కలిపి గుంతలు నింపి అంట్లు నాటుకోవాలి. అంటు నాటేటప్పుడు అంటు కట్టిన భాగం భూమిపైన ఉండేలా చూడాలి. నాటిన తర్వాత నీరు పోసి ఊతం ఇవ్వాలి. కత్తిరింపులు వేరు మూలంపై చిగుళ్లను, కొమ్మలను వెంనువెంటనే తీసివేయాలి.తెగుళ్లుసోకిన అనవసర కొమ్మలు కత్తిరించి తీసివేయాలి. ఎరువులు 50 కిలోల పశువుల ఎరువు ఒక కిలో ఆముదం పిండి, ఒక కిలో ఎముకల పొడి చెట్టు పాదులో ఒకసారి వేసుకోవాలి. ఐదు గ్రాముల యూరియా 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్సేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టు పాదుల్లో రెండు దఫాలుగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం వాతావరణ పరిస్థితిని బట్టి నీటిని పారించాలి. నీరు తక్కువైతే కాయలు గట్టిగా మారి పండవు. డ్రిప్ పద్ధతి పాటించి నీరు సమృద్ధిగా పారిస్తే పెరుగుదల, దిగుబడి అధికంగా ఉంటుంది. దిగుబడి సీతాఫలం నాటిన తర్వాత మూడో యేట నుంచి కాపు వచ్చినా మంచి కాపు 7-8 సంవత్సరాల వయసులో పొందొచ్చు. ఆధునిక యాజమాన్యం పాటించి ఒక్కో చెట్టుకు 100-150 కాయల వరకు దిగుబడి పొందొచ్చు. పక్వదశ కాయలపై కళ్లు ప్రస్ఫుటంగా కనిపిస్తూ కళ్ల మధ్య తెలుపు నుంచి లేత పసుపురంగు లేదా నారింజరంగుకు మారడంతోపాటు కాయలు ఆకుపచ్చ రంగు నుంచి లేత ఆకుపచ్చ రంగుకు మారతాయి. ప్యాకింగ్ సీతాఫలం కోత తర్వాత త్వరగా పండుతాయి. కోసిన వెం టనే గ్రేడ్ చేసి గంపల్లో వేసి సీతాఫలం ఆకులను కింద, పక్క కు వేసి దూరప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. -
ఇంటి ఆవరణలో ఒంటరి సేద్యం
* 200 గజాల స్థలంలో ఆకుకూరల సాగు * ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధురాలు మల్లమ్మ ఘట్కేసర్: ఒకవైపు వృద్ధాప్యం.. మరోవైపు చుట్టుముట్టిన కష్టాలు.. అయినా ఆమె కుంగిపోలేదు. చిన్న జాగాలోనే ఆకుకూరలు పండిస్తోంది. ఎకరాలకొద్ది స్థలం లేకున్నా కేవలం 200 గజాల స్థలంలోనే గ్రామ పంచాయతీ బోరు నీటితో మడులను తడుపుతూ.. సేంద్రియ ఎరువులను వాడుతూ ఆకుకూరలు సాగు చేస్తోంది. నెలకు రూ.5 వేల వరకు సంపాదిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది మల్లమ్మ. మండలంలోని బొక్కానిగూడేనికి చెందిన సక్కూరు మల్లమ్మ (57), పెంటారెడ్డి( 59) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఒకప్పుడు 3 ఎకరాల భూమి, పాడి గేదెలు ఉండేవి. కూతుళ్లకు వివాహాలు చేశారు. వీరి పెళ్లిల కోసం అప్పులు చేశారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చారు. ఏడు సంవత్సరాల క్రితం వీరి ఒక్కగానొక్క కుమారుడు మధుసూదన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వీరి భూమిని కాజేయాలని భావించిన కొందరు వ్యక్తులు పథకం పన్నారు. భూమిని కోర్టు వివాదంలోకి నెట్టారు. దీంతో ఈ దంపతుల్ని వరుస కష్టాలు మానసికంగా కుంగదీశాయి. కుమారుడి ఆకస్మిక మరణం వారికి తీవ్ర మానసిక వేదన కలిగించింది. కొంతకాలం డిప్రెషన్‌కు గురై మంచాన పడ్డారు. కొడుకు జ్ఞాపకాలే మనసులో వెంటాడేవి. ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోవడానికి కొంత కాలం గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్లారు. వృద్ధాప్యం మీదపడటంతో చేసేవారు లేక పాడిగేదెలు అమ్మేశారు. కొడుకు మరణించిన బాధకు దూరం కావాలంటే.. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని చిన్న కూతురు ఇచ్చిన సలహాతో తాము నివసిస్తున్న 200 గజాల పశువుల పాక స్థలం కనిపించింది. అందులోనే ఆకుకూరల సాగు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నల్లా నీటిని పారిస్తున్నాను. పాలకూర, కోయికూర, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా తదితర ఆకుకూరలు పండిస్తున్నారు. మల్లమ్మ ప్రతి రోజు ఉదయం ఆకుకూరలను గంపలో పెట్టుకొని రెండు కిలో మీటర్ల దూరంలోని ఘట్కేసర్కు నడుచుకుంటూ వెళ్లి విక్రయిస్తోంది. నెలకు రూ. 5 వేల వరకు సంపాదిస్తున్నట్లు మల్లమ్మ చెబుతోంది. భర్త పెంటారెడ్డి ఓ పరిశ్రమలోని చెట్లకు నీరు పెట్ట్టే పనిలో కుదిరాడు. వృద్ధాప్యంలో మరొకరిపై ఆధారపడటం కంటే రెక్కలున్నంత వరకు సాగు చేస్తానని చెబుతోంది మల్లమ్మ. -
రైతన్న మేడెక్కిన ఇంటిపంట!
ఒకటికి నాలుగు ఆహార పంటలు పండించుకునే రైతు కుటుంబాలకు ఇంట్లో వండుకు తినడానికి కూరగాయలు, ఆకుకూరలకు కొదవ ఉండదు. అయితే, బహుళ పంటలు పండించుకునే అలవాటు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. పొలంలో ఒకటో, రెండో పంటలను మాత్రమే(అది కూడా వాణిజ్య పంటలు) సాగు చేస్తూ.. పండీ పండగానే అక్కడికక్కడే అమ్మి అప్పులు తీర్చే పరిస్థితులొచ్చాక.. ఇక ఇంటి అవసరాలకు పొలం నుంచి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడాది పొడవునా కొనుక్కొని తినాల్సిందే గదా! ఇప్పుడు చాలా రైతు కుటుంబాల దుస్థితి ఇదే. కూరగాయల ధరలు మండిపోతున్న దశలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్న దుర్గతిని అధిగమించేందుకు ఒక చిన్న రైతు కుటుంబం ముందడుగు వేసింది. - 150 డ్రమ్ముల్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగు - 3 కుటుంబాలకు చేదోడు మేడ మీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే అవసరం సెంటు పొలంలేని పట్నవాసులకే కాదు.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి గ్రామీణ రైతు కుటుంబాలకు కూడా ఎంతగానో ఉందని చాటి చెబుతున్నారు యువ రైతు అన్నారం రవీందర్ గౌడ్(35), మౌనిక దంపతులు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వీరి స్వగ్రామం. ఎస్సెస్సీ వరకు చదివి వ్యవసాయంలో స్థిరపడిన రవీందర్‌కు ఇద్దరు సోదరులున్నారు. వారి కుటుంబాలూ అదే గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. తలా రెండెకరాల పొలం ఉంది. తన రెండెకరాల్లో బోరు కింద వరి, పత్తి వంటి పంటలు పండిస్తున్న ఆయన బోరు మెకానిక్ షాపు కూడా నిర్వహిస్తూ.. సొంత పక్కా భవనంలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది వర్షం లేకపోవడంతో పత్తి వేయడం మానేసి.. రెండు కుంటల్లో వరి ఊడ్చాడు. ఇంటి ముందున్న పాత తొట్టిలో పడి మొలిచిన టమాటా మొక్క చాలా కాయలు కాసింది. ఇది రెండేళ్ల నాటి ముచ్చట. ఇంటి అవసరాల కోసం రెండు మూడు రోజులకోసారి రూ.50-100లు పెట్టి కూరగాయలు, ఆకుకూరలు కొనేవారు. మనం కొనడం ఎందుకు? మేడ మీద కొన్ని కుండీలు పెట్టుకొని సొంతంగా పండించు కోవచ్చు కదా? అన్న ఆలోచన వచ్చింది. ఆ క్షణంలోనే రవీందర్ మదిలో ఇంటిపంటకు బీజం పడింది. గత ఏడాది వర్షాకాలం ప్రారంభంకాగానే పూర్తిస్థాయిలో మేడ మీద ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు రవీందర్ దంపతులు. వారి మేడ మీద 150 చదరపు గజాల స్థలం ఉంది. వాడేసిన 50 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములు 75 కొని తెచ్చాడు రవీందర్. ఒక్కో డ్రమ్మును సగానికి కోశాడు. 150 చిన్న డ్రమ్ములు సిద్ధమయ్యాయి. వాటికి అడుగున నీరు బయటకుపోవడానికి రెండు, మూడు చిల్లులు పెట్టాడు. మట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. షాద్‌నగర్‌లోని నర్సరీ నుంచి తెచ్చిన నారు, విత్తనాలు వేశారు. టమాటా, వంగ, మిర్చి మొక్కలు నాటారు. చెట్టుచిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి గింజలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల గింజలు విత్తారు. ఒక్కో డ్రమ్ములో రెండు, మూడు చొప్పున వివిధ కూరగాయ మొక్కలు నాటాడు. పొలం కోసమని సబ్సిడీపై తెచ్చిన డ్రిప్ లేటరల్ పైపులు కొన్ని తెచ్చి ఏర్పాటు చేసి, మేడ మీదున్న నీటి ట్యాంకుకు అనుసంధానం చేశాడు. వాల్వు తిప్పగానే మొక్కలన్నిటికీ డ్రిప్ ద్వారా నీరందే ఏర్పాటు చేయడంతో పని తగ్గిపోయింది. సహజ కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్న ఆసక్తితో సేంద్రియ ఎరువుతో సాగు ప్రారంభించిన రవీందర్.. ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు నెలకోసారో, రెండు సార్లో వేప నూనెను తన భార్య పిచికారీ చేస్తుంటుందని చెప్పాడు. రోజూ పెద్దలూ పిల్లలూ టై కిచెన్ గార్డెన్‌ను పరిశీలిస్తూ.. కలుపు మొక్కలు కనిపిస్తే తీసేస్తుంటారు. అంతే.. చూస్తుండగానే మొక్కలు రసాయనిక అవశేషాల్లేని, తాజా ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. ఆలుగడ్డలు తప్ప.. అప్పటి నుంచీ తమ కుటుంబంతోపాటు తన ఇద్దరు సోదరుల కుటుంబాలు కూడా ఆలుగడ్డల్లాంటివి తప్ప ఆకుకూరలు, కూరగాయలు కొనాల్సిన అవసరం రావడం లేదని రవీందర్ సంతోషంగా చెప్పాడు. కొద్ది నెలల క్రితం టమాటా కిలో రూ. 70లు అమ్మిన రోజుల్లో కూడా తమ మేడ మీద కోసినప్పుడల్లా నాలుగైదు కిలోల టమాటాలు వచ్చేవని చెప్పాడు. గత ఏడాది నాటిని మొక్కల్లో టమాటా కాపు అయిపోయింది. చెట్టు చిక్కుడు మొక్కలు కాపు అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు చిగుళ్లు వచ్చి కాపుకొచ్చాయి. టమాటా, వంగ మొక్కలు మళ్లీ నాటారు. మేడ మీద మొక్కలుండడం వల్ల గత ఎండాకాలంలో ఇంట్లో ఉబ్బరం తక్కువగా ఉందని, చల్లగా ఉందని రవీందర్ తెలిపాడు. ఇంటిముంగల కూరగాయ మొక్కలు పెట్టుకోమని ఉద్యాన శాఖ వాళ్లు కిట్లు ఇచ్చినా గ్రామస్తులు పెద్దగా స్పందించని పరిస్థితు ల్లో రవీందర్ తన మేడ మీద భారీగా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పండించడం స్థానికం గా చర్చనీయాంశమైంది. అయితే, కొందరు వివ రాలు అడిగి తెలుసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ మొదలు పెట్టలేదని రవీందర్ చెప్పాడు. కొత్తదారి తొక్కేవాడెప్పుడూ ఒక్కడే కదా! - గుట్టల్ల బాలయ్య, కొందుర్గు, మహబూబ్‌నగర్‌జిల్లా రోజూ తాజా కూరగాయలు దొరుకుతున్నాయి.కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంటివద్దనే పెంచుకోవడం వల్ల రోజు తాజా కూరగాయలు దొరుకుతున్నాయి. ఖర్చూ పెద్దగా లేదు. ఆకుకూరలు, పూలమొక్కలను కూడా కుండీలలో పెంచుకుంటున్నాం. - అన్నారం మౌనిక, గృహిణి, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ ఈ పంటయ్యాక మట్టి మార్చేస్తా! ప్రస్తుత పంటయ్యేటప్పటికి మొక్కల వేళ్లు డ్రమ్ముల్లో మట్టి నిండా నిండిపోతాయి. పంట పూర్తయిన తర్వాత డ్రమ్ముల్లోని మట్టిని గుమ్మరించి.. కొత్త మట్టి + పశువుల ఎరువు కలిపి మళ్లీ నింపుతా. నిమ్మ, బత్తాయి మొక్కలు కూడా డ్రమ్ముల్లో వేద్దామనుకుంటున్నా.. - అన్నారం రవీందర్ గౌడ్ (93945 22416), రైతు, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ తక్కువ చోటుందా? మేడ మీదనో, పెరట్లోనో ఎండ తగిలే చోటు ఒకటి, రెండు గజాలకు మించి లేదు.. అయినా, సేంద్రియ ఆకుకూరలు సాగు చేయాలనుంది! అప్పుడేం చేయాలి? ఇలాంటి ప్రశ్నలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన! పుస్తకాల రాక్ మాదిరిగా ఇలా ఆకుకూరల మడి(వర్టికల్ గార్డెన్)ను పెట్టుకుంటే సరి! ఇనుప రాక్ వంటి ఫ్రేమ్ చేయించి, దానికి అవసరం మేరకు షేడ్‌నెట్‌ను కుట్టి.. చిన్న ట్రేలలో ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరీ ఎండ ఎక్కువ అవసరం అనుకున్న మొక్కలను పై అంతస్తులో వేసుకోవాలి. ఆకుకూరలను తరిగి సలాడ్సగా ఉపయోగించడం చాలా ఆరోగ్య దాయకం అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ సలాడ్స్‌లోకి అవసరమైన మైక్రో గ్రీన్స్‌ను కూడా ఈ పద్ధతిలో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఆకుకూర లేకాకుండా కొన్ని పప్పు ధాన్యాలు, నూనెగింజల రకాలను కూడా వత్తుగా మొలకెత్తించి రెండు అంగుళాలు ఎదిగిన మొక్కలను సలాడ్సలో వినియోగిస్తున్నారు. 3,4 అంగుళాల లోతుండి, వెడల్పుగా ఉండే ట్రేలను ఎంపిక చేసుకొని ఉపయోగించవచ్చు. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు గానీ లేదా చివికిన పశువుల ఎరువు గానీ సమపాళ్లలోను, కొద్దిగా మట్టిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ట్రేలలో నింపి మైకోగ్రీన్స పెంచవచ్చు. అడపాదడపా జీవామతం, వర్మీవాష్, కంపోస్టు టీ, అమత్పానీ.. వీటిల్లో ఏది వీలైతే అది పిచికారీ చేసుకుంటే చాలు! కావాల్సిన ఎత్తులో కావల్సినన్ని అరలతో బోల్టు ల బిగింపు ద్వారా సులభంగా సిద్ధం చేసుకునే ఇనుప రాక్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇల్లు మారేటప్పుడైనా.. ఇప్పుడు అవసరం లేదనుకు న్పప్పుడైనా ఆ రాక్ల బోల్టులు విప్పేసి బస్తాలో కట్టేసి అటక మీద పెట్టేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
కిచెన్ గార్డెన్‌కు బలిమి ‘కంపోస్టు టీ’..!
ఇంటి పంట 1. కంపోస్టు టీ తయారీకి కావాల్సిన వస్తువులు ఇవే.. 2. బక్కెట్లో నీరు పోసి, కంపోస్టు / పచ్చి పేడ నింపిన సాక్స్‌లను ఈ విధంగా నీటిలోకి వేలాడ గట్టాలి. బబ్లర్ను ఏర్పాటు చేసి నీటిలో వృద్ధి చెందే సూక్ష్మజీవులకు ప్రాణవాయువును నిరంతరం అందించాలి. 3. బక్కెట్కన్నా ఎక్కువ కంపోస్టు టీ కావాలనుకుంటే.. ఈ విధంగా 200 లీటర్ల డ్రమ్ములను ఉపయోగించవచ్చు. 4. వాడకానికి సిద్ధమైన కంపోస్టు టీ. ఆకుకూరలు, కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండించే క్రమంలో మొక్కలకు పోషకాల లోపం రాకుండా చూసుకోవడం ఒక ముఖ్యాంశం. కుండీలు, మడుల్లో విత్తనాలు లేదా మొక్కలు నాటిన తర్వాత రోజూ అవసరం మేరకు నీళ్లు పోస్తుంటాం. అడపా దడపా కంపోస్టు వేయడం, జీవామృతం, పంచగవ్య వంటి ద్రవ ఎరువులను నీటిలో కలిపి పోయడం లేదా పిచికారీ చేయడం ద్వారా పోషకాల లోపం రాకుండా చూసుకోవచ్చు. అయితే, వీటి సేకరణ వ్యయ ప్రయాసలతో కూడిన పని. ఇవి ఒక్కోసారి దొరక్కపోవచ్చు కూడా. అలాంటప్పుడు పోషకాల లోపంతో కిచెన్ గార్డెన్ కళ తప్పొచ్చు. ఈ సమస్యను అధిగమించడానికి మరో మార్గం లేదా? తప్పకుండా ఉంది! అదే.. కంపోస్టు టీ! కిచెన్ గార్డెన్లో మొక్కలకు నీళ్లకు బదులు పోషకాలతో కూడిన కంపోస్టు టీని పోస్తూ.. మంచి దిగుబడి పొందొచ్చు. పోషకాలను మొక్కలు వినియోగించుకోగలిగే రూపంలోకి మార్చి అందించడంలో సూక్ష్మ జీవుల పాత్ర చాలా కీలకం. కంపోస్టు/పేడలో లెక్కలేనన్ని మేలు చేసే సూక్ష్మజీవు లుంటాయి. కంపోస్టు టీ రూపంలో వీటిని ఎన్నో రెట్లు పెంపొందించి అందిస్తే కిచెన్ గార్డెన్‌కు పుష్కలంగా పోషకాలు అందుతాయి. కంపోస్టు టీతో పంటలు బలంగా, ఏపుగా పెరుగుతాయి. చీడపీడల బెడద తగ్గుతుంది. కంపోస్టు టీని స్వల్పఖర్చుతో ఇంటిదగ్గరే సులభంగా తయారు చేసుకోవచ్చు. కంపోస్టు టీ తయారీ ఇలా.. 3 లేదా 4 కప్పుల తాజా వర్మీ కంపోస్టు లేదా కంపోస్టును తీసుకొని.. సాక్స్‌లో లేదా పల్చటి గుడ్డలో మూట కట్టాలి. బక్కెట్ లేదా చిన్న తొట్టిలో 20 లీటర్ల నీటిని పోసి.. ఆ నీటిలో కంపోస్టు మూటను వేలాడగట్టాలి. అర స్పూను బెల్లం/ పంచ దారతోపాటు.. అర స్పూను శనగ/ పెసర/ కంది/ మినుము పిండిని నీటిలో కలపాలి. చిన్న అక్వేరియం పంపు(బబ్లర్)ను ఈ బక్కెట్‌కు అమర్చి నిరంతరాయంగా ఆక్సిజన్ అందించే ఏర్పాటు చేయాలి. ఈ బబ్లర్కు అయ్యే విద్యుత్ ఖర్చు చాలా స్వల్పం. దీన్ని ఆన్ చేసిన 48 గంటల్లో ‘కంపోస్టు టీ’ వాడకానికి సిద్ధమవుతుంది. కిచెన్ గార్డెన్లో మొక్కలకు నీళ్లకు బదులు కంపోస్టు టీని (నీటిని కలపకుండా) యథాతథంగా మొక్కలకు పోసుకోవచ్చు. కుండీలు, మడుల్లో అవసరం మేరకు మితంగా వాడుకోవాలి. ఇలా.. బక్కెట్లో నుంచి కంపోస్టు టీని తీసిన తర్వాత అందులో మళ్లీ మామూలు నీటిని పోయాలి. ఇలా కొత్త నీరు పోసిన తర్వాత ఒక రోజులోనే కంపోస్టు టీ వినియోగానికి సిద్ధమవుతుంది. కొత్త నీరు పోసిన ప్రతి సారీ బక్కెట్లోని కంపోస్టు మూటను విదల్చాలి. వారానికోసారి అరస్పూను బెల్లం, అరస్పూను పిండిని నీటిలో కలిపితే.. సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కంపోస్టు ఎన్నాళ్లకు మార్చాలి? 20 లీటర్ల బక్కెట్లో నానగట్టిన 3 లేదా 4 కప్పుల కంపోస్టును 2 లేదా 3 వారాలకోసారి మార్చుకుంటే సరిపోతుంది. 200 లీటర్ల డ్రమ్ములో అయితే 5 కిలోల కంపోస్టు నానగట్టాలి. దీంట్లోంచి 50 లీటర్ల వరకు కంపోస్టు టీ తీసి వాడుకుంటూ ఆ మేరకు నీటిని తిరిగి నింపుతూ ఉంటే.. 30 రోజులకోసారి కంపోస్టు మార్చుకోవాలి. కంపోస్టుతోపాటు పచ్చి పేడను కూడా వేరే మూటగా కట్టి కంపోస్టుతోపాటు బక్కెట్లో నానబెడితే.. కంపోస్టు టీ మరింత ప్రభావశీ లంగా తయారవుతుందని హైదరాబాద్‌కు చెందిన పర్మాకల్చర్ డిజైనర్, యువ సిటీ ఫార్మర్ జీ సాయి ప్రసన్న కుమార్(99514 52345. మధ్యాహ్నం 2-5 గంటల మధ్యలో మాత్రమే ఫోన్ చేయాలి) తెలిపారు. సాధార ణంగా కంపోస్టు టీ దుర్వాసన రాదు. ఆక్సిజన్ అందకపోయినా, పిండి/ బెల్లం ఎక్కు వైనా రంగుమారి, దుర్వాసన వస్తుంది. - ఇంటిపంట డెస్క్ intipanta@sakshi.com -
ఇంటి పంట
-
ఇది ‘ఇంటిపంట’ల కాలం!
ఇంటి పంట సాక్షి మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్పై అమితాసక్తిని రేకెత్తించింది. పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నప్పటికీ.. ఉన్నంతలో తులసితోపాటు నాలుగు పూలమొక్కలు పెంచుకోవడం చాలా ఇళ్లలో కనిపించేదే. అయితే, విష రసాయనాల అవశేషాలు లేని ఆకుకూరలు, కూరగాయల ఆవశ్యకతపై చైతన్యం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను స్వయంగా సేంద్రియ పంటల సాగుకు ఉపక్రమింపజేసింది ‘ఇంటిపంట’. డాబాపైన, పెరట్లో, బాల్కనీల్లో.. వీలును బట్టి సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల్లో ‘ఇంటిపంట’లు సాగు చేస్తున్న వారెందరో ఉన్నారు. జనాభా సంఖ్యలో వీరి సంఖ్య కొంచెమే కావచ్చు. కానీ, వీరి కృషి ఇతరుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఇంటిపంట’ కాలమ్‌ను ప్రతి శనివారం మళ్లీ ప్రచురించాలని ‘సాక్షి’ సంకల్పించింది. ఈ సందర్భంగా ‘ఇంటిపంట’తో స్ఫూర్తి పొందిన కొందరి అనుభవాలు క్లుప్తంగా.. తోటకూర, టమాటా..! ‘ఇంటిపంట’ కథనాలు చదివి స్ఫూర్తిపొంది ఆర్గానిక్ కిచెన్ గార్డెనింగ్ ప్రారంభించాను. మా డాబాపైన కొన్ని కుండీలు, నల్ల గ్రోబాగ్స్‌లో వర్మీకంపోస్టు, కొబ్బరిపొట్టు, వేపపిండితో మట్టి మిశ్రమాన్ని తయారుచేసుకొని వాడుతున్నా. టమాటాతోపాటు చూడముచ్చటగా ఉండే చెర్రీ టమాటా సాగు చేశా. ప్రస్తుతం తోటకూర, గోంగూర, బెండ, మిరప కుండీల్లో పెంచుతున్నా. ఈ కుండీల మధ్యలో కొన్ని పూల మొక్కలు, బోన్సాయ్ మొక్కలు కూడా పెంచుతున్నా. ఇంటిపంట గూగుల్, ఫేస్బుక్ గ్రూప్‌ల ద్వారా సూచనలు, సలహాలు పొందుతున్నాను. - కాసా హరినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, కేపీహెచ్‌బీ 7 ఫేజ్, హైదరాబాద్ జీవామృతం, అమృత్‌పానీ.. మూడేళ్ల క్రితం ‘ఇంటిపంట’ కాలమ్ ద్వారా స్ఫూర్తి పొందా. మేడ మీద 150 బియ్యం సంచుల్లో ఆకుకూరలతోపాటు జొన్న. సజ్జ, మొక్కజొన్న మొక్కలను గతంలో పండించా. ప్రస్తుతం ఇంటిపక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చుక్కకూర, పాలకూర, తోటకూరతోపాటు జొన్న, సజ్జ, బీర, కాకర సాగుచేస్తున్నా. ఘనజీవామృతం, జీవామృతం, అమృత్‌పానీ వంటివి స్వయంగా తయారు చేసుకొని, క్రమం తప్పకుండా వాడుతూ చక్కని దిగుబడి సాధిస్తున్నా. నగరంలో ఉంటూ ఇంటిపంటల ద్వారా కొంతమేరకైనా సహజాహారాన్ని పండించుకోగలగడం ఆనందంగా ఉంది, ఇంటిపంటల సాగుపై ఆసక్తి ఉన్న పెద్దలు, పిల్లలకు మెలకువలను ఓపిగ్గా వివరిస్తున్నా.. -ఎస్. సత్యనారాయణ మూర్తి విశ్రాంత వ్యవసాయ విస్తరణాధికారి, రామనామక్షేత్రం, గుంటూరు ‘ఇంటిపంట’ల సేవలో.. వనస్థలిపురం ప్రాంతంలో ‘ఇంటిపంట’ల సాగు వ్యాప్తికి కృషి చేస్తున్నా. గతంలో సాక్షి తోడ్పాటుతో వర్క్‌షాప్ నిర్వహించాం. ఇటీవల ఉద్యాన శాఖ తోడ్పాటుతో ఇంటిపంట సబ్సిడీ కిట్లను స్థానికులకు పంపిణీ చేయించాను. ఇంటిపంటల సాగులో స్థానికులకు అన్నివిధాలా తోడ్పాటునందిస్తున్నా. మా ఇంటి వద్ద జీవామృతం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుతున్నా. - భావనా శ్రీనివాస్, జాగృతి అభ్యుదయ సంఘం, వనస్థలిపురం, హైదరాబాద్ ‘ఇంటిపంట’ శిక్షణ పొందా.. మా ఇంటిపైన కుండీలు, గ్రోబాగ్స్, సిల్పాలిన్ మడుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాను. మూడేళ్ల క్రితం ఇంటిపంట శీర్షిక ద్వారా స్ఫూర్తిపొందాను. వనస్థలిపురంలో సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో నేను, నా భార్య పాల్గొన్నాం. అప్పటి నుంచి సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపంటలు పండిస్తున్నాం. వర్మీకంపోస్టు, ఎర్రమట్టి, కోకోపిట్, వేపపిండి కలిపిన మిశ్రమాన్ని కుండీల్లో వేస్తున్నాను. స్వయంగా తయారుచేసుకున్న జీవామృతంతోపాటు వేప నూనె 10 రోజులకోసారి వాడుతున్నాం. గత వేసవిలోనూ వంకాయల కాపు బాగా వచ్చింది. ప్రస్తుతం మిరప, వంగ, బెండ, బీర, దొండ, గోరుచిక్కుడు, పాలకూర మా గార్డెన్లో ఉన్నాయి. కొందరం కలసికట్టుగా ఉంటూ ఇంటిపంటల సాగు సజావుగా కొనసాగిస్తున్నాం..’’ - కొల్లి దుర్గాప్రసాద్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి, కమలానగర్, హైదరాబాద్ పూల మొక్కల నుంచి కూరగాయల వైపు.. పూల మొక్కలు పెంచే అలవాటుండేది. ‘సాక్షి’లో ఇంటిపంట కాలమ్ స్ఫూర్తితోనే సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నాను. మేడ మీద కుండీల్లో అనేక రకాల కూరగాయలు సాగు చేస్తున్నా. బెండ మొక్కలున్న కుండీల్లో ఖాళీ ఎక్కువగా ఉందని తాజాగా ఎర్ర ముల్లంగిని సాగు చేశా. దిగుబడి బాగుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ఇంటిపంట గ్రూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. - కందిమళ్ల వేణుగోపాలరెడ్డి, సాఫ్ట్వేర్ ఇంజినీర్, టీసీఎస్, హైదరాబాద్ ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - OrganicKitchen/Terrace Gardening గూప్ ఉంది. ఇందులో సభ్యుల సంఖ్య 4,500 దాటింది! గూగుల్ గ్రూప్‌లో 773 మంది సభ్యులున్నారు. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. గూగుల్ గ్రూప్ అడ్రస్ ఇది: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు.