మన ఇల్లు – మన కూరగాయలు పథకం కింద 4 సిల్ఫాలిన్ కవర్స్, 52 ఘనపుటడుగుల ఎర్రమట్టి, పశువుల ఎరువు, 2:1 నిష్పత్తిలో పాలీబ్యాగులు ఇస్తారు ∙పాలకూర, మెంతి, కొత్తిమీర, చుక్కకూర, పుంటికూర, బచ్చలి, తోటకూర, పుదీనా, ముల్లంగి, క్యారట్, బెండ, వంకాయ, టమాటా, గోరుచిక్కుడు, సొరకాయ, బీర తదితర 12 రకాల విత్తనాలను అందజేస్తారు. సీతాఫలం, జామ, రేగి పండ్ల మొక్కలను కూడా అందజేస్తారు ∙25 కిలోల వేపపిండి, 500 మిల్లీగ్రాముల వేపనూనె ఇస్తారు ∙అలాగే రూఫ్‌గార్డెన్‌కు అవసరమైన పనిముట్లు కుర్ఫీ,సికేచర్,చిన్న స్ప్రేయర్,ఫవర్, ఒక చేతి సంచి కూడా ఇస్తారు ∙ఈసారి కొత్తగా వర్టికల్ పైపులను అందజేస్తున్నారు. కుండీలకు బదులుగా వీటిలో మొక్కలను పెంచుకోవచ్చు ∙ప్రతి యూనిట్‌కు 2 వర్టికల్ పైపులు అందజేస్తారు ∙ వీటిని50 శాతం సబ్సిడీపై రూ.4 వేలకే ఇవ్వనున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం వచ్చేసింది. పల్లె పంటలకే కాదు. ఇంటిపంటలకు సైతం ఇదే అదను. ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు లేకుండా సహజమైన ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు పండించుకొనేందుకు ఇది అనువైన సమయం. ఇప్పటికే గ్రేటర్‌లో ఇంటిపంట ఒక ఉద్యమంలా సాగుతోంది. వేలాదిమంది సహజ ఆహారప్రియులు ఇంటి డాబాలపై, బాల్కనీల్లో, పెరట్లో ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా వేదికగా ఇంటిపంటలపై అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉద్యాన శాఖ ఇంటి పంటలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. సబ్సిడీపై వివిధ రకాల వస్తువులను అందజేయడమే కాకుండా అర్బన్ ఫార్మర్స్‌కు శిక్షణ నిర్వహిస్తున్నారు. ఎలాంటి పురుగుమందులు, రసాయన ఎరువులు లేకుండా సహజమైన పద్ధతిలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పండించే సాంకేతిక పరిజ్ఞానంపై సుమారు 10 వేల మందికి శిక్షణనిచ్చారు. త్వరలో విత్తనాలు, వర్మీ కంపోస్టు, వర్టికల్ పైపులు తదితర వస్తువులు అందజేయనున్నారు.
ఉద్యమంలా ఇంటి పంటలు..
ఇంటిపై, ఇతరత్రా ఏ కొంచెం స్థలం ఉన్నా సహజమైన పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే వెసులుబాటు ఉంది. పదేళ్లుగా కొనసాగుతున్న ఇంటిపంటల ఉద్యమంలో వేలాదిమంది నగరవాసులు భాగస్వాములవుతున్నారు. ఏటా వీరి సంఖ్య పెరుగుతోంది. ఉద్యాన శాఖ అంచనాల ప్రకారం గత ఏడాది 15 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇళ్ల డాబాలపై, పెరట్లో, బాల్కనీల్లో పంటలు పండించగా ఈ సంవత్సరం అది 17వేల చదరపు మీటర్లకు చేరినట్లు ఉద్యాన శాఖ అధికారి మధుసూదన్ తెలిపారు. దీంతో ప్రజల అభిరుచికి అనుగుణంగా రూఫ్‌గార్డెన్, కిచెన్ గార్డెన్‌లను ఉద్యాన శాఖ ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. ప్రతి సంవత్సరం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ‘సాధారణంగా విత్తనాలు నాటే కుండీల్లో మట్టి ఎంతవరకు ఉండాలనే విషయంతో పాటు విత్తనాలు ఎంత లోతులో నాటాలనేది చాలామందికి తెలియదు. కేవలం 1/2 ఇంచు లోతులోనే విత్తనాలు నాటాలి. సహజమైన ఎరువులను తయారు చేసుకోవడం, వాటి వాడకంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇలాంటి విషయాలపై సీనియర్ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణనిప్పిస్తున్నాం’ అని మధుసూదన్ పేర్కొన్నారు. ప్రతి గ్రూపులో 200 మందికి శిక్షణనివ్వడమే కాకుండా వారితో వాట్సప్ గ్రూపును కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వారిలో వారికి వచ్చే సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు, అభిప్రాయాలను పంచుకొనేందుకు వాట్సప్ గ్రూపులు దోహదం చేస్తాయి.
మన ఇల్లు– మన కూరగాయలు..
ప్రతి వ్యక్తికీ సమృద్ధికరమైన పోషక పదార్థాలు లభించాలనే లక్ష్యంతో ఉద్యాన శాఖ పట్టణ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. రోజుకు సగటున 280 గ్రాముల చొప్పున కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ప్రజల డిమాండ్‌కు తగిన విధంగా కూరగాయలు, ఆకుకూరలు లభించడం లేదు. దీంతో సహజమైన పద్ధతిలో పండించుకొనేందుకు ఉద్యాన శాఖ ‘మన ఇల్లు–మన కూరగాయలు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకంలో భాగంగా 12 రకాల విత్తనాలను, సేంద్రియ ఎరువులను, వస్తువులను అందజేస్తున్నారు. 50 శాతం సబ్సిడీపై ఈ వీటిని అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment