పుట్టగొడుగుల పెంపకం సాధారణంగా వేడి, వెలుతురు తగలని పక్కా భవనాల్లోని గదుల్లో చేపడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన తోటల పరిశోధనా స్థానం (ఐ.ఐ.హెచ్.ఆర్.) శాస్త్రవేత్తలు ఆరుబయట పెరట్లో లేదా మేడ మీద(గ్రామాల్లో లేదా నగరాల్లో) పెట్టుకొని ముత్యపు చిప్ప పుట్టగొడుగులు ఉత్పత్తి చేసుకునే ఒక ఇంటిగ్రేటెడ్ యూనిట్‌కు రూరపకల్పన చేశారు. సౌర విద్యుత్తుతో పనిచేయడం దీని ప్రత్యేకత. తక్కువ ఖర్చుతోనే ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌ను రూపొందించారు. ఎవాపొరేటివ్ కూలింగ్ సూత్రం ఆధారంగా పని చేసే ఈ అవుట్‌సైడ్ మొబైల్ ఛాంబర్ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఎండలు మండిపోయే ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ ఛాంబర్‌లో ఎంచక్కా పుట్టగొడుగులను పెంచుకోవచ్చని ఐ.ఐ.హెచ్.ఆర్. శాస్త్రవేత్తలు తెలిపారు. ఇటువంటి ఛాంబర్ల ద్వారా పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన వారితో పాటు.. ఈ ఛాంబర్ల తయారీదారులు కూడా స్వయం ఉపాధి పొందడానికి అవకాశాలున్నాయి. పుట్టగొడుల పెంపకాన్ని సులభతరం చేసే ఈ ఛాంబర్ వల్ల పుట్టగొడుగుల వినియోగం కూడా పెరుగుతుంది. మహిళలు వీటి పెంపకాన్ని చేపడితే వారిలో పౌష్టికాహార లోపం తగ్గడంతోపాటు ఆదాయ సముపార్జనకూ దారి దొరుకుతుంది.
మష్రూమ్ ఛాంబర్ తయారీ పద్ధతి ఇదీ..
ఈ ఛాంబర్‌ను 1 అంగుళం మందం గల సీపీవీసీ పైపులు, ఫిట్టింగ్స్‌తో తయారు చేసుకోవాలి. చాంబర్ పొడవు 1.35 మీటర్లు, వెడల్పు 0.93 మీటర్లు, ఎత్తు 1.69 మీటర్లు. పురుగూ పుట్రా లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం, గాలి పారాడటం కోసం దీని చుట్టూతా నైలాన్ 40 మెష్‌ను అమర్చుకోవాలి. ఈ మెష్ పైన గన్నీ బ్యాగులు చూట్టేయాలి. గన్నీ బ్యాగ్‌లను తడుపుతూ ఉంటే ఛాంబర్ లోపల గాలిలో తేమ తగ్గిపోకుండా ఉంచగలిగితే పుట్టగొడుగులు పెరగడానికి తగిన వాతావరణం నెలకొంటుంది. ఛాంబర్ లోపల నిరంతరం సన్నని నీటి తుంపరలు వెదజల్లే 0.1 ఎం.ఎం. నాజిల్స్‌తో కూడిన 30 డబ్లు్య డీసీ మిస్టింగ్ డయాఫ్రం పంప్‌ను అమర్చుకోవాలి. 300 వాల్ట్స్ పేనెల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజీ బ్యాటరీలను, ఒక టైమర్‌ను అమర్చుకొని.. విద్యుత్‌తో గాని లేదా సౌర విద్యుత్తుతో గాని నడవపవచ్చు. ఈ ఛాంబర్ మొత్తాన్నీ స్టీల్ ఫ్రేమ్ (1.08 “ 1.48 “ 1.8 సైడ్ హైట్ “ 2.2 సెంటర్ హైట్) లోపల ఉండేలా అమర్చుకొని, ఛాంబర్ కింద 4 వైపులా చక్రాలు కూడా ఏర్పాటు చేసుకుంటే.. ఛాంబర్‌ను అటూ ఇటూ కదుల్చుకోవడానికి సులువుగా ఉంటుంది. సోలార్ పేనల్స్‌ను ఫ్రేమ్‌పైన అమర్చుకోవాలి. ఫ్రేమ్ లోపల ఇన్వర్టర్, బ్యాటరీలను ఏర్పాటు చేసుకోవాలి. 30 లీటర్ల నీటి ట్యాంకును, మిస్టింగ్ పంప్‌ను స్టీల్ ఫ్రేమ్‌లో కింది భాగంలో అమర్చుకోవాలి. అంతే.. మష్రూమ్ ఛాంబర్ రెడీ.
మూడేళ్ల పరిశోధన
పక్కా భవనంలోని గదిలో, ఆరుబయట సోలార్ ఛాంబర్‌లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్, వైట్ ఆయిస్టర్ పుట్టగొడుగుల రకాలను 20 బ్యాగ్‌ల(ఒక కిలో)లో మూడేళ్లపాటు ప్రయోగాత్మకంగా పెంచారు. 2016 నుంచి 2018 వరకు అన్ని నెలల్లోనూ ఈ పరిశోధన కొనసాగించి ఫలితాలను బేరీజు వేశారు. పక్కాభవనంలో కన్నా సోలార్ చాంబర్‌లో ఇ.ఎల్.ఎం. ఆయిస్టర్ పుట్టగొడుగుల ఉత్పత్తి సగటున 108% మేరకు పెరిగిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అదేమాదిరిగా వైట్ మష్రూమ్స్ దిగుబడి 52% పెరిగింది. ఈ యూనిట్ నుంచి నెలకు సగటున 25–28 కిలోల పుట్టగొడుగులు ఉత్పత్తి చేయవచ్చని ఈ ఇంటిగ్రేటెడ్ అవుట్ డోర్ మష్రూమ్ గ్రోయింగ్ యూనిట్‌కు రూపకల్పన చేసిన ఐ.ఐ.హెచ్.ఆర్. ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సెంథిల్ కుమార్ (94494 92857) ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఆయనను సంప్రదించవచ్చు. అయితే, ఈ యూనిట్‌కు సంబంధించిన టెక్నాలజీ హక్కులను ఐఐహెచ్‌ఆర్ వద్ద నుంచి ఎవరైనా కొనుగోలు చేసి అవగాహన ఒప్పందం చేసుకున్న తర్వాత, ఈ యూనిట్లను తయారుచేసి మార్కెట్లో అమ్మకానికి పెట్టవచ్చని డా. సెంథిల్ కుమార్ తెలిపారు. దీనిపై ఆసక్తి గల వారు ఐ.ఐ.హెచ్.ఆర్. డైరెక్టర్‌ను సంప్రదించాల్సిన ఈ–మెయిల్:director.iihr@icar.gov.in
మష్రూమ్ స్పాన్ లభించే చోటు..
బెంగళూరు హెసరఘట్ట ప్రాంతంలో ఉన్న ఐ.ఐ.హెచ్.ఆర్.లోని మష్రూమ్ సెంటర్‌కు ఫోన్ చేసి ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే మష్రూమ్ స్పాన్(విత్తనాన్ని)ను విక్రయిస్తారు. మష్రూమ్ స్పాన్‌ను బుక్ చేసుకున్న వారు 30 రోజుల తర్వాత స్వయంగా ఐ.ఐ.హెచ్.ఆర్.కి వచ్చి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్యాగులను ఎవరికి వారే వెంట తెచ్చుకోవాలి. స్పాన్ బుకింగ్ నంబర్లు.. 70909 49605, 080–23086100 ఎక్స్‌టెన్షన్–349, 348, 347, డైరెక్టర్– 080–28466471, ఎస్.ఎ.ఓ. – 080 28466370 ఝuటజిటౌౌఝఃజీజీజిట.ట్ఛట.జీn
Comments
Please login to add a commentAdd a comment