ప్రస్తుతం కాలంలో ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు, పూలను సాగు చేయడం ఒక అలవాటుగా మారింది. చాలామంది టెర్రస్ గార్డెన్, బాల్కనీ గార్డెనింగ్ పేరుతో ఉన్నకొద్దిపాటి స్థలంలోనే చాలా రకాల మొక్కల్ని పెంచుతూ సేంద్రీయ ఉత్పత్తులను సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇది కాలుష్యం లేని ఆహారాన్ని అందించండం మాత్రమే కాదు ఇంటి వాతావారణానికి, పర్యావరణానికి చాలా మంచిది కూడా. ఇంట్లో చిన్న చిన్న కుండీలల్లో కొత్తమీర, పుదీనా లాంటి వాటిని సులభంగా పండించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు పాటించకపోతే ఇంత అంత ఈజీ కూడా కాదు. మరి సులభంగా, చక్కగా కొత్తిమీరను ఎలా పండించుకోవాలో చూద్దామా!
ఇంట్లో కొత్తిమీరను పెంచడం అనేది చాలా సులభమైన ప్రక్రియ. కొత్తిమీరలో అనేక రకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంట్లో పెంచేందుకు విత్తన ఎంపిక చాలా ముఖ్యం. ఇందులో శాంటో, లీజర్ లేదా కాలిప్సో వంటి రకాలను ఎంచుకోవడం ఉత్తమం. ఈ రకాలు త్వరగా మొలకెత్తి, ఎక్కువ కాలం పంట ఉండేలా చేస్తుంది.
సరైన కంటైనర్
కనీసం 8-12 అంగుళాల లోతు, మంచి డ్రైనేజీ ఉన్న కంటైనర్, లేదా గ్రో బ్యాగ్‌ను తీసుకోండి. ఎందుకంటే కొత్తిమీర వేళ్లు లోతుగా వెళతాయి. కుండీ, లేదా కంటైన్ లోతుగా ఉండేలా చేసుకోవాలి. కంటైనర్ దిగువన నీళ్లు పోయేలా రంధ్రాలేన్నాయో లేదో చూసుకోవాలి.
సాయిల్ మిక్సింగ్
కొత్తిమీర బాగా పెరగాలంటే, బాగా ఎండిపోయే, సారవంతమైన మట్టి కావాలి. అందుకే కాస్త మట్టి, కొద్దిగా ఇసుక ఉండేలా సేంద్రీయ ఎరువు, అధిక-నాణ్యత పాటింగ్ మిశ్రమాన్ని ఉపయోగించాలి. మడి మరీ తడిగా, మరీ పొడిగా లేకుండా జాగ్రత్తపడాలి.
విత్తనాలు విత్తడం
నాటేముందు విత్తనాలను(ధనియాలు) కొద్దిగా నలపాలి. అంటే ఒక గుడ్డపై ధనియాలను పోసి చపాతీ కర్రతోగానీ, ఏదైనా రాయితో గానీ సున్నితంగా నలపాలి. అపుడు గింజలు రెండుగా చీలతాయి. ఇలా చేయడం వల్ల విత్తనాలు తొందరగా మొలకలొస్తాయి. 1-2 అంగుళాలు దూరంలో విత్తనాలను 1/4 అంగుళాల లోతులో చల్లాలి. ఆపై మట్టితో తేలికగా కప్పి, నీరు పోయాలి.
మొలకలు
కంటైనర్‌ను వెచ్చని ఎండ తగిలేలా ఉంచాలి. కొత్తిమీర గింజలు సాధారణంగా మొల కెత్తడానికి 7 నుంచి 14 రోజులు పడుతుంది. ఈ కాలంలో మట్టిలో నీళ్లు నిల్వలేకుండా, తేమగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు కనీసం 4-6 గంటల పాటు ప్రత్యక్ష ఎండ తగలాలి. నీళ్లు పోయడానికి విత్తనాలు చెదిరిపోకుండా, దెబ్బ తగలకుండా, స్ప్రే బాటిల్‌ని ఉపయోగించాలి.
నిర్దిష్ట సమయంలో సాధారణంగా మొలకలు వచ్చేస్తాయి. మట్టిని సమానంగా తేమగా ఉంచడానికి కొత్తిమీర మొక్కలకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి. ఇంకా బలంగా పెరగాలంటే, నీటిలో కరిగే ఎరువులు, కంపోస్ట్ టీ లేదా డైల్యూటెడ్ ఫిష్ ఎమల్షన్ వంటి సేంద్రీయ ఎరువు వాడితే మంచిది.
చక్కగా గుబురుగా, పచ్చపచ్చగా కొత్తిమీర మొక్కలు ఎదుగుతాయి. 6 అంగుళాల ఎత్తు పెరిగాక కొత్తమీరను హార్వెస్ట్ చేయ వచ్చు. కోస్తూ ఉంటే, కొత్తమీర ఇంకా గుబురుగా పెరుగుతుంది.
అఫిడ్స్, సాలీడు , శిలీంధ్ర వ్యాధుల సమస్యలొస్తాయి. ఎలాంటి చీడపీడలు రాకుండా, వేపనూనె, పుల్లటి మజ్జిగ ద్రావణం లాంటి స్ప్రే చేయవచ్చు. కొత్తమీర పువ్వులు వచ్చేదాకా వాడుకోవచ్చు. దీన్ని బోల్టింగ్ అంటారు. ఈ టైంలో ఆకులు చేదుగా మారతాయనేది గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment