గార్డెనింగ్ ఒక కళ. కాస్త ఓపిక, మరికాస్త శ్రద్ధపెడితే ఇంట్లోనే చాలారకాల పూల మొక్కల్ని పెంచుకోవచ్చు. కూరగాయలు, ఆకుకూరలు పండించు కోవచ్చు. పైగా వర్షాకాలం కాబట్టి బాల్కనీలోగానీ, ఇంటిముందు ఉన్న చిన్నస్థలంలోగానీ హాయిగా వీటిని పెంచు కోవచ్చు. గార్డెనింగ్‌తో మనసుకు సంతోషం మాత్రమేకాదు ఆర్గానిక్ ఆహారాన్ని తిన్నామన్న ఆనందమూ మిగులుతుంది. కిచెన్‌గార్డెన్‌లో చాలా సులభంగా పెరిగే మొక్కల్లో ఒకటి పచ్చి మిరపకాయ. ఇంట్లోనే పచ్చి మిరపకాయలను ఎలా పండించవచ్చు? తొందరగా పూత, కాపు రావాలంటే పాటించాల్సిన కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
పచ్చిమిరపతో చాలా రకాల ప్రయోజనాలున్నాయి. ఆహారంలో రుచిని జోడించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రసిద్ధి చెందిన విటమిన్ సి విటమిన్ పుషల్కంగా లభిస్తుంది. మొటిమలు, చర్మం ముడతల్ని నివారిస్తుంది. జుట్టుకు మంచిది , బరువు తగ్గడంలో సహాయ పడుతుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తికి కూడా చాలా మంచిది. మరి ఇన్ని రకాల లాభాలున్న ఈ చిన్ని మొక్కను ఎలా పెంచుకోవాలి.
సరైన విత్తనాలు ఎంచుకోవడం ముఖ్యంగా. సాధారణంగా ఎండుమిరపగింజలు వేసినాసులభంగా మొలకెత్తుతాయి. కానీ మంచి ఫలసాయం రావాలంటే నాణ్యమైన విత్తనాలను తెచ్చుకోవాలి. చిన్ని చిన్న కంటైనర్‌లు , కుండీలలో కూడా బాగా పెరుగుతాయి. 3-4 అంగుళాల లోతు , సరైన డ్రైనేజీ రంధ్రాలు ఉండేలా చూసుకోండి. తేమ , వెచ్చని వాతావరణం అవసరం కాబట్టి వాటిని పండించడానికి ఇంట్లో సెమీ షేడ్ ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవాలి. కంపోస్ట్ కలిపిన సారవంతమైన మట్టితో కుండీని ఉపయోగించాలి.
మంచి నాణ్యమైన పచ్చిమిర్చి విత్తనాలను తీసుకుని, కుండీలో ఒక అంగుళం లోతులో నాటండి. మట్టిని తేమగా ఉంచాలి. అలా అని ఎక్కువ నీరు పోయకూడదు. వాతావరణాన్ని బట్టి ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి నీరు పోయాలి. నీళ్లు ఎక్కువైతే మొక్క కుళ్లిపోతుంది.
విత్తనాలను నాటిన 7-10 రోజులలో రెండు చిన్న మొలకలు వస్తాయి. వీటికి ప్రతిరోజూ 5-6 గంటల సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. కాస్త ఎదిగిన తరువాత ఈ మొక్కలకు ట్రిమ్మింగ్ చాలా కీలకం. పూతకు ముందే చివర్లను కత్తిరిస్తే, మొక్క గుబురుగా వచ్చి, తొందరగా పూత కొస్తుంది. పూత దశలో లిక్విడ్ ఫెర్టిలైజర్ మొక్కకు అందిస్తే పూత నిలబడి, బోలెడన్ని కాయలు వస్తాయి. సరైన రక్షణ, పోషణ అందితే దాదాపు రెండేళ్లయినా కూడా మిరప చెట్టు కాయలు కాస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment