న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి.
పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు.
‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్‌గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment