billions of dollars
-
200 బిలియన్ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు. ‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్‌గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
అదానీ గ్రూప్‌పై అవే ఆరోపణలు
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై మరోసారి అక్రమ పెట్టుబడుల ఆరోపణలు తలెత్తాయి. అదానీ ప్రమోటర్ కుటుంబం వెలుగులోలేని మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్లను గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోరి్టంగ్ ప్రాజెక్ట్(ఓసీసీఆర్పీ) తాజాగా ఆరోపించింది. యూఏఈకి చెందిన నాసెర్ అలీ షాబాన్ అలీ, తైవాన్‌కు చెందిన చాంగ్ చుంగ్–లింగ్ ఏళ్లపాటు మారిషస్ ఫండ్స్ ద్వారా కోట్లాది డాలర్ల పెట్టుబడులతో అదానీ గ్రూప్ స్టాక్స్‌లో లావాదేవీలు నిర్వహించినట్లు ఓసీసీఆర్పీ తాజా ఆరోపణలకు తెరతీసింది. వినోద్ అదానీకి చెందిన వ్యక్తి నిర్వహణలోని దుబాయ్ సంస్థ ఈ ఫండ్స్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. కాగా.. ఇంతక్రితం ఈ ఏడాది జనవరిలోనూ అదానీ గ్రూప్ కంపెనీలలో అకౌంటింగ్ అవకతవకలు జరుగుతున్నట్లు యూఎస్ షార్ట్‌సెల్లర్ హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీలలో అమ్మకాలు వెల్లువెత్తి గ్రూప్ మార్కెట్ విలువలో 150 బిలియన్ డాలర్లమేర ఆవిరైంది. అయితే ఆపై గ్రూప్ వీటిని ఖండించింది. ఆపై షేర్ల ధరల్లో అవకతవకలకు ఆధారాలు లేవంటూ సుప్రీం కోర్టు నియమిత కమిటీ ఆరోపణలను కొట్టివేసింది. తాజాగా ఓసీసీఆర్పీ ఆరోపణల నివేదికలో పేర్కొ న్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను ఇప్పటికే సుప్రీం కోర్టు నియామక కమిటీ దర్యాప్తులోనూ పరిగణించిన విషయాన్ని ఈ సందర్భంగా అదానీ గ్రూప్ ప్రస్తావించింది. ఇవన్నీ రీసైకిల్ చేసిన ఆరోపణలుగా కొట్టిపారేసింది. ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ పెట్టుబడులున్న సంస్థల లబ్ది కోసం ఆరోపణలను తిరగతోడుతున్నట్లు వ్యాఖ్యానించింది. కొన్ని విదేశీ మీడియా వర్గాలు పసలేని హిండెన్‌బర్గ్ నివేదికను మరోసారి హైలైట్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా వీటిని తోసిపుచి్చంది. తాజా ఆరోపణలు ఇలా.. 2013–2018 మధ్య కాలంలో ప్రమోటర్ కుటుంబం తమ నిర్వహణలోని మారిషస్ ఫండ్స్ ద్వారా గ్రూప్ కంపెనీలలో కోట్లాది డాలర్ల నిధులను రహస్యంగా ఇన్వెస్ట్ చేశాయని ఓసీసీఆర్పీ పేర్కొంది. తద్వారా గ్రూప్ షేర్ల ధరలలో భారీ ర్యాలీకి కారణమైనట్లు ఆరోపించింది. ఈ కాలంలో షేర్ల ధరల్లో భారీ ర్యాలీ ఫలితంగా అదానీ గ్రూప్ దేశంలోనే అ త్యంత శక్తివంతమైన బిజినెస్ గ్రూప్‌లలో ఒకటిగా ఆవిర్భవించినట్టు పేర్కొంది. ఓసీసీఆర్పీ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ అదానీ గ్రూప్ లోని పలు షేర్లు 4.4–2.2% మధ్య క్షీణించాయి. అదానీపై విచారణకు జేపీసీ వేయాలి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ అదానీ గ్రూప్‌పై తాజా ఆరోపణల విషయంలో ప్రధాని మోదీ తగు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతున్న వేళ దేశం ప్రతిష్ట మసకబారకుండా ఉండాలంటే అదానీ గ్రూప్‌పై జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ)తో పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. ఈ అంశంపై ప్రతిపక్ష పారీ్టలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. అదానీ విషయంలో ఇండియా కూటమిలో ఎలాంటి విబేధాలు లేవన్నారు. ‘భారత్‌లో అందరికీ సమానావకాశాలుంటాయి. పారదర్శకత ఉంటుంది, అవినీతికి తావులేదని మనం చెప్పుకుంటున్నాం. కానీ, అదానీపై వస్తున్న ఆరోపణలు దేశ ప్రతిష్టను, ప్రధాని మోదీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రధానికి సన్నిహితుడైన ఈ పెద్ద మనిషి బిలియన్ డాలర్లతో షేర్ ధరలను పెంచేలా ఎలా చేయగలిగారు? ఆ సొమ్ము ఎవరిది? దీని వెనుక గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ హస్తం ఉందా?. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం కూడా ఉంది. వారు నాసిర్ అలీ షాబాన్, చైనా వాసి చాంగ్‌చుంగ్ లింగ్. ఈ విదేశీయులను ఈ వ్యవహారంలోకి ఎలా అనుమతించారు? వీటిపై విచారణ ఎందుకు జరిపించడం లేదు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? వీటన్నిటిపైనా ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలి’అని రాహుల్ డిమాండ్ చేశారు. ‘రుజువులు ఇచ్చినా సెబీ అదానీకి క్లీన్చిట్ ఇచ్చింది. క్లీన్చిట్ ఇచ్చిన సెబీలోని ఆ పెద్దమనిషి ఇప్పుడు అదానీ ఎన్డీ టీవీలో డైరెక్టర్. ఎలాంటి విచారణ జరిగిందో దీన్నిబట్టి అర్థమవుతోంది’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
అదృష్టం కాదిది.. అంతకు మించి! ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద..
సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది. దిగ్గజ కంపెనీలను దాటేసి.. ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్‌స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు. విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్‌ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్తోపాటు అతని బంధువులు విన్‌ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. న్యూడిల్స్ బిజినెస్‌తో మొదలుపెట్టి... రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్‌కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్‌ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్‌ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది. -
మహారాష్ట్రలో గోగోరో వేల కోట్ల ఇన్వెస్ట్ - కారణం తెలిస్తే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న సమయంలో దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ విభాగాన్ని ప్రోత్సహించడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంలో కేరళ, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను భారీగా పెంచుకున్నాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విభాగంలో మరో అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వంతో ప్రముఖ బ్యాటరీ స్వాపింగ్ కంపెనీ 'గొగోరో' (Gogoro) భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యాటరీ స్వాప్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు 'అల్ట్రా మెగా ప్రాజెక్ట్' ప్రారంభించనుంది. దీని కోసం దాదాపు 1.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు సమాచారం. (ఇదీ చదవండి: కోకాకోలా క్యాన్సర్ కారకమా? డబ్ల్యూహెచ్ఓ ఏం చెబుతోందంటే!) అల్ట్రా మెగా ప్రాజెక్ట్‌లో భాగంగా కంపెనీ ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో ఓపెన్ అండ్ యాక్సెస్ చేయగల బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. దీనికి మహారాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగంలో రాష్ట్రం అగ్రగామిగా కావాలనే లక్ష్యంతో ఈ ఒప్పందం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా దాదాపు 10,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. (ఇదీ చదవండి: మస్క్ & జుకర్‌బర్గ్ రియల్ ఫైట్? చూడటానికి సిద్ధమేనా!) ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ రిమూవబుల్ బ్యాటరీ కలిగి ఉన్నాయి. కావున ఛార్జింగ్ సమయాన్ని ఆదా చేయడానికి స్వాపబుల్ స్మార్ట్ బ్యాటరీ స్టేషన్లు చాలా సహాయపడతాయి. ఇది ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచడంలో కూడా సహాయపడే అవకాశం ఉందని భావిస్తున్నాయి. తైవాన్‌లో మల్టిపుల్ వెహికల్ తయారీదారులకు మద్దతు ఇచ్చే ఓపెన్ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను గొగోరో విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో చేతులు కలిపి భారతదేశంలో కూడా తన ఉనికిని చాటుకోనుంది. ఇది తప్పకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాము. -
స్టార్టప్ ఇండస్ట్రీ: యూనికార్న్‌ల సెంచరీ
చెన్నై: స్టార్టప్ పరిశ్రమలో 100 యూనికార్న్‌లకు ఇండియా ఆవాసంగా నిలిచినట్లు ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. వీటి మొత్తం ఉమ్మడి విలువ 250 బిలియన్ డాలర్లు(రూ. 20 లక్షల కోట్లు)గా తెలియజేశారు. గత కొన్నేళ్లలో ఈ సంస్థలు 63 బిలియన్ డాలర్ల(రూ. 5,04,000 కోట్లు) పెట్టుబడులను సమీకరించినట్లు వెల్లడించారు. దేశీయంగా అంకుర సంస్థలు(స్టార్టప్) ఊపిరి పోసుకునేందుకు అనువైన పటిష్ట వ్యవస్థ ఏర్పాటైనట్లు కాంచీపురం ఐఐఐటీ, డిజైన్, తయారీ నిర్వహించిన 10వ స్నాతకోత్సంలో కొత్త గ్రాడ్యుయేట్లనుద్ధేశించి మంత్రి ప్రసంగించారు. సిలికాన్ వ్యాలీలోని 25 శాతం స్టార్టప్‌లను భారత సంతతికి చెందినవారే నిర్వహిస్తుండటం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక్కడినుంచి గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారి ఇతరులకు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తారన్న అభిప్రాయంతో ఈ విషయాలను ప్రస్తావిస్తున్నట్లు తెలియజేశారు. 25 శాతం స్టార్టప్‌లను భారతీయులు నిర్వహిస్తున్న సిలికాన్ వ్యాలీపై ఇప్పటికే మీలో చాలా మంది దృష్టి పెట్టి ఉంటారని వ్యాఖ్యానించారు. -
‘లక్ష కోట్ల’ కంపెనీలు జూమ్
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి విడిచిపెట్టనప్పటికీ స్టాక్ మార్కెట్లు లెక్కచేయడం లేదు. ప్రధానంగా దేశీ స్టాక్ ఇండెక్సులు రేసు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లకు జతగా రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు క్యూ కట్టడం లిస్టెడ్ కంపెనీలకు జోష్‌నిస్తోంది. ఫలితంగా బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 250 లక్షల కోట్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మార్కెట్ క్యాప్‌లో రూ. లక్ష కోట్ల విలువను అందుకుంటున్న కంపెనీలు పెరుగుతున్నాయ్! వివరాలు చూద్దాం.. ముంబై: గతేడాది మార్చిలో విరుచుకుపడిన కోవిడ్–19తో స్టాక్ మార్కెట్లకు షాక్ తగిలినప్పటికీ తిరిగి వెనువెంటనే నిలదొక్కుకున్నాయి. ఆపై భారీ లిక్విడిటీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు మార్కెట్లకు హుషారునిచ్చాయి. ఇటీవల రిటైల్ ఇన్వెస్టర్లు సైతం రికార్డులు స్థాయిలో పెట్టుబడులకు దిగుతుండటంతో సెంటిమెంటు మరింత బలపడింది. ఈ ప్రభావంతో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తాజాగా(ఆగస్ట్ 31కల్లా) 57,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. మరోపక్క ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 17,000 పాయింట్ల మార్క్‌ను సులభంగా దాటేసింది. ఈ ప్రభావంతో పలు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మెరుగుపడుతోంది. వెరసి తాజాగా రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ సాధించిన కంపెనీల జాబితా 47కు చేరింది. 2021లోనే కొత్తగా 19 కంపెనీలు జత కలవడం విశేషం! కొనసాగిన జాబితా మార్కెట్ విలువ రీత్యా గతేడాది(2020) రూ. లక్ష కోట్ల క్లబ్లో 28 సంస్థలు చోటు సాధించాయి. ఈ బాటలో కొత్తగా టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజెస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, డాబర్, గోద్రెజ్ కన్జూమర్ తదితరాలు చేరాయి. వీటితోపాటు గతేడాది ఈ జాబితాలో గల కంపెనీలు కూడా తమ పొజిషన్లను నిలుపుకోవడం గమనించదగ్గ అంశం! యూఎస్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ప్యాకేజీలు అమలు చేయడంతో పెరిగిన లిక్విడిటీ, దేశీ ఆర్థిక వ్యవస్థపట్ల బలపడుతున్న అంచనాలు మార్కెట్లకు జోష్‌నిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. పీఎస్‌యూలు సైతం ఏడాది కాలాన్ని పరిగణిస్తే సెన్సెక్స్ 20 శాతం పుంజుకోగా.. ప్రభుత్వ రంగ సంస్థల ఇండెక్స్ 32 శాతం ఎగసింది. దీంతో రూ. ట్రిలియన్ విలువైన పీఎస్‌యూ దిగ్గజాల జాబితాలో ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ జత కలిశాయి. ప్రభుత్వ బ్లూచిప్ కంపెనీలు స్టేట్‌బ్యాంక్, ఓఎన్జీసీ ఇప్పటికే జాబితాకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం విదితమే. కాగా.. ఇటీవల మార్కెట్ విలువలో ఎస్బీఐ 49 శాతం, ఓఎన్జీసీ 24 శాతం చొప్పున జంప్ చేశాయి. ట్రిలియన్ క్లబ్లో చేరిన పీఎస్‌యూలు.. వేల్యూ స్టాక్స్‌కు లభిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ వాటాల విక్రయం, ఆస్తుల మానిటైజేషన్, పునరుత్పాదక ఇంధనాలకు డిమాండ్ సైతం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అదానీ, టాటాల స్పీడ్ రూ. ట్రిలియన్ మార్కెట్ క్యాప్ క్లబ్లో ఐదు కంపెనీల ద్వారా అదానీ గ్రూప్ అగ్రస్థానం వహిస్తోంది. ఈ బాటలో టాటా గ్రూప్ సైతం నాలుగు కంపెనీలతో రెండో ర్యాంకును ఆక్రమించింది. అయితే విడిగా విలువ రీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 14.32 లక్షల కోట్లు), టీసీఎస్(రూ. 14 లక్షల కోట్లు) తొలి రెండు ర్యాంకులలో నిలుస్తున్నాయి. ఈ ఏడాది మార్కెట్ విలువను భారీగా జమ చేసుకున్న కంపెనీలలో టీసీఎస్(రూ.2.8 లక్షల కోట్లు), ఇన్ఫోసిస్(రూ. 2 ట్రిలియన్లు), రిలయన్స్ ఇండస్ట్రీస్(రూ. 1.7 లక్షల కోట్లు), విప్రో(రూ. 1.2 లక్షల కోట్లు) ఆధిపత్యం వహిస్తున్నాయి.