సాధరణంగా ఊహించని లాభాలు, ఆదాయం వస్తే అదృష్టం వరించింది అంటుంటారు. కానీ ఒక్క రోజులో రూ. 3.2 లక్షల కోట్ల సంపద పెరిగితే దాన్ని ఏమంటారు? అదృష్టం కాదు.. అంతకు మించి అంటారు. సింగపూర్‌కు చెందిన ఆటోమొబైల్ సంస్థ విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్ (VinFast Auto Ltd) స్టాక్ మార్కెట్‌లలో ప్రవేశించిన మొదటి రోజునే దూసుకెళ్లి, దాని వ్యవస్థాపకుడి సంపదను భారీగా పెంచింది.
దిగ్గజ కంపెనీలను దాటేసి..
ఈ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ షేర్లు మంగళవారం (ఆగస్టు 15) ఏకంగా 255 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ చైర్మన్ వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ (Pham Nhat Vuong) నికర సంపదకు 39 బిలియన్ డాలర్లు (రూ.3.2 లక్షల కోట్లకు పైగా) చేరాయి. పరిశ్రమ దిగ్గజాలు జనరల్ మోటార్స్ కో, మెర్సిడెస్ బెంజ్ గ్రూప్ ఏజీ కంటే విన్‌ఫాస్ట్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, వియత్నాంకు చెందిన ఫామ్ నాట్ వూంగ్ సంపద ఇప్పుడు 44.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
కంపెనీలో వూంగ్ వాటాను స్టాక్ ఇండెక్స్ గతంలో చేర్చలేదు. తన వింగ్ గ్రూప్ జేఎస్‌సీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 99 శాతం కంపెనీ అవుట్‌స్టాండింగ్ వూంగ్ నియంత్రణలోనే ఉన్నాయి. అత్యధిక వాటా ఆయనకే ఉండటంతో ఇతర ఇన్వెస్టర్‌లకు కంపెనీ షేర్లు అందుబాటులో లేవు.
విన్‌ఫాస్ట్ ఆటో లిమిటెడ్‌ను 2017లో వూంగ్ స్థాపించారు. తమ వాహనాల అమ్మకాలు ఈ సంవత్సరం 45,000 నుంచి 50,000కి చేరుకుంటాయని కంపెనీ అంచనా వేసింది. గత నెలలో నార్త్ కరోలినాలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఈ సంస్థ చేపట్టింది. వూంగ్‌తోపాటు అతని బంధువులు విన్‌ఫాస్ట్ సంస్థలో కనీసం 300 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు.
న్యూడిల్స్ బిజినెస్‌తో మొదలుపెట్టి...
రష్యాలో జియో-ఎకనామిక్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత 1990ల ప్రారంభంలో వూంగ్ ఉక్రెయిన్‌కు వెళ్లారు. అనంతరం వియత్నాంకు తిరిగి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఇన్‌స్టాంట్ న్యూడిల్స్ బిజినెస్‌ను ప్రారంభించారు. తర్వాత దాన్ని 2010లో నెస్లే ఎస్‌ఏకి అమ్మేశారు. అప్పటికే ఆయన రియల్ ఎస్టేట్, రిసార్ట్‌లు, స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వ్యాపారాలు నిర్వహించే వింగ్ గ్రూప్ జేఎస్‌సీ (Vingroup JSC)ని స్థాపించారు. హనోయి కేంద్రంగా కార్యకలాపాలు నర్వహిస్తున్న ఈ సంస్థ గత సంవత్సరం 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. విన్‌ఫాస్ట్ కంపెనీలో ఇది ప్రధాన వాటాదారుగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment