Chawla
-
200 బిలియన్ డాలర్లకు ఫార్మా రంగం - 2030 నాటికి..
న్యూఢిల్లీ: ప్రస్తుతం దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి విలువపరంగా 4–5 రెట్లు వృద్ధి చెందనుంది. తయారీని, ఎగుమతులను పెంచుకోవడం ద్వారా 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందన్న అంచనాలు నెలకొన్నాయి. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి అరుణిష్ చావ్లా ఈ విషయాలు తెలిపారు. 2030 నాటికి 200 బిలియన్ డాలర్ల స్థాయికి చేరాలంటే ఫార్మా పరిశ్రమ ఏటా రెండంకెల స్థాయిలో వృద్ధి చెందాలని, దిగుమతులను తగ్గించుకుని.. ఎగుమతులపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ‘ఇందుకోసం మనం దిగుమతులపై ఆధారపడుతున్న నిర్దిష్ట రంగాలను ఎంపిక చేసుకోవాలి. వచ్చే పదేళ్లలో ఆయా విభాగాలన్నింటిలోనూ మనం ఎగుమతిదార్లుగా ఎదిగేలా విధానాలను రూపొందించుకోవాలి’ అని చావ్లా పేర్కొన్నారు. ‘కొత్తగా స్మార్ట్ ఔషధాల తరం వస్తోంది. వచ్చే 20–30 ఏళ్లలో ఎంతో సంక్లిష్టమైన అనారోగ్యాలకు కూడా స్మార్ట్‌గా చికిత్సను అందించగలిగే కొత్త థెరపీలు రాబోతున్నాయి. దాని కోసం మనం అంతా సంసిద్ధంగా ఉండాలి’ అని ఆయన చెప్పారు. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమకు ప్రభుత్వం విధానపరంగా అన్ని రకాల తోడ్పాటు అందిస్తోందని చావ్లా వివరించారు. భారత్ ఇప్పటికే చాలా విభాగాల్లో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు వస్తుండటంతో పాటు పరిశోధనలకు సంబంధించి విద్యా సంస్థలు, ప్రయోగశాలలు, పరిశ్రమ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో కీలకమైన దాదాపు అన్ని మెడికల్ టెక్నాలజీ ఉత్పత్తులను ఎగుమతి చేయగలిగే స్థాయికి ఎదగగలమని చావ్లా ధీమా వ్యక్తం చేశారు. ఫార్మా రంగంలో ప్రపంచ దిగ్గజంగా ఎదిగేందుకు సాంకేతిక వనరులు, నిపుణులు, పురోగామి ప్రభుత్వ విధానాలు మొదలైన వాటన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
థ్రిల్ కోసం దొంగయ్యాడు... అడ్డంగా బుక్కయ్యాడు..!
వాషింగ్టన్ : థ్రిల్ కోసం దొంగతనం చేసిన ఓ వ్యక్తిని అమెరికాలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సదరు వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న దినేష్ చావ్లా కావడం విశేషం. చావ్లా హోటల్స్ సీఈవో దినేష్ ఎయిర్‌పోర్టులో ఓ సూట్‌కేసు కొట్టేశాడు. తన కారులో పెట్టుకుని.. ఏమీ ఎరగనట్టు మళ్లీ ఎయిర్‌పోర్టుకొచ్చి విమానంలో ఉడాయించాడు. ఇదంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. పోలీసులు అతని కారును తనిఖీ చేయగా సూట్‌కేసు దొరికింది. దాంతోపాటు నెలక్రితం చోరీకి గురైన మరో సూట్‌కేసు కూడా కారులో లభించింది. వాటిల్లోని వస్తువుల విలువ సుమారు 4 వేల డాలర్లు ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, నేరాన్ని అంగీకరించిన దినేష్.. దొంగతనం నేరమని తెలిసినప్పటికీ థ్రిల్లింగ్ కోసమే అలా చేశానని చెప్పడం గమనార్హం. దినేష్, అతని తమ్ముడు సురేష్ చావ్లా డెల్టాలో లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తున్నారు. ట్రంప్‌నకు చెందిన నాలుగు హోటల్స్‌లో చావ్లా హోటల్స్ పార్టనర్‌గా ఉండేది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎవరికి వారు సొంతంగా హోటల్స్ స్థాపించుకున్నారు. -
‘ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యం’
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ర్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లా సమర్ధించారు. ఇతర యంత్రాలతో వాటిని హ్యాక్ చేయడం కానీ, తారుమారు చేయడం కానీ సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈవీఎంలు సీనియర్ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని, అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు. ఈవీఎంలు సమర్ధవంతమైన యంత్రాలనీ వాటిని నిర్వీర్యం చేసే అవకాశాలు లేవని తాను బలంగా నమ్ముతానని చావ్లా పేర్కొన్నారు. ఈవీఎం కేవలం రెండు మూడు విధులను నిర్వర్తించే డెస్క్‌టాప్ కాలిక్యులేటర్ వంటిదని, దీన్ని హ్యాక్ చేయలేరని తాను రాసిన పుస్తకం ’ఎవిరి ఓట్ కౌంట్స్’ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ చావ్లా చెప్పారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎం చిప్స్‌లను ఎవరైనా ఎలాగైనా మార్చేస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇతర యంత్రాలను ఉపయోగిస్తూ ఏ ఒక్కరూ ఈవీఎం చిప్స్‌లను మార్చలేరని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఈవీఎంకూ వీవీప్యాట్లను అమర్చుతుండటంతో మొత్తం ఈవీఎం వ్యవస్థ మరింత జవాబుదారీగా మారుతుందని చెప్పారు. -
వీల్ చెయిర్ కాదు.. విల్ చెయిర్!
పర్వీందర్ చావ్లా వయసు 48 ఏళ్లు. వీల్ చెయిర్‌పై ఇప్పటికి ఆరు ఖండాలను చుట్టేశారు. 23 దేశాలను çసందర్శించారు. ఒక్కో దేశానికి ఒక్కసారి మాత్రమే కాదు, రెండు–మూడుసార్లు కూడా వెళ్లారు. ఆమె టూర్లలో జస్ట్.. అలా చూసి వచ్చేవి మాత్రమే కాదు, ఏదో ఒక సాహసం చేసేవే ఎక్కువగా ఉంటాయి. తైవాన్‌లో పారాగ్లైడింగ్ నుంచి ఈక్వెడార్‌లో జిప్‌లైనింగ్ చావ్లా చేసి వచ్చిన సాహసాలెన్నో! సవాళ్లతో పోరాడటమెలాగో జీవితాన్నుంచి నేర్చుకున్నానని అంటున్న చావ్లాను నిజానికి నడిపించింది వీల్ చెయిర్ కాదు.. ఆమెలోని విల్ పవర్ అనే చెయిర్. ఏడాదిలో ఎన్ని నెలలు పర్యటనల్లో గడిపితే, యాభై ఏళ్ల లోపు ఇన్ని దేశాలు తిరగడం సాధ్యమవుతుంది? ఈవిడేమైనా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారా అనిపిస్తుంది. అవును చావ్లా చక్రాలు కట్టుకుని దేశాలు పర్యటిస్తున్న మాట అక్షరాలా నిజం. నడవడానికి కాళ్లు సహకరించని స్థితిలో చక్రాల కుర్చీలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్న జీవితానికి ఇంతటి సాహసం అవసరమా అని అడిగిన వాళ్లతో ‘ఎప్పుడో ఓ రోజు చనిపోవాల్సిందే కదా? చనిపోతామేమోనని భయపడుతూ ఆసక్తులను చంపుకోవడం ఎందుకు? ప్రపంచంలోని సౌందర్యాన్ని వీక్షిస్తూ, పోయేలోపు ఎన్ని చూడటం సాధ్యమైతే అన్నింటిని చూడవచ్చు’’ అంటున్నారు. పదిహేనేళ్ల వయసులో..! ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్న పర్వీందర్ చావ్లా పుట్టింది లూధియానాలో. తండ్రి హోటల్ నడిపేవారు, తల్లి గృహిణి. నలుగురు పిల్లల్లో చిన్నమ్మాయి పర్వీందర్. పదిహేనేళ్ల వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. అప్పుడు బయటపడింది రుమటాయిడ్ ఆర్రై్థటిస్. అప్పటికే వారి కుటుంబం లూధి యానా నుంచి ముంబయికి మారిపోయింది. చావ్లా అల్లోపతి, హోమియోపతి... రకరకాల వైద్య విధానాలను పాటించారు. స్కూలు చదువు పూర్తయింది, కాలేజ్‌లో చేరింది కూడా. పన్నెండవ తరగతిలో ఫైనల్ పరీక్షలు. చేతి మణికట్టుని కదిలించలేకపోయింది. అప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్తే ఒక ఇంజక్షన్ వేశారు. అది స్టిరాయిడ్స్ అని అప్పట్లో తెలియదు. మళ్లీ.. అక్క పెళ్లిలో! పెళ్లి వేడుక కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంతా. పర్వీందర్కి కూడా డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగింది. ఓ వారం ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారు యుక్తవయసు పిల్లలంతా. ఓ రోజు ఉన్నట్లుండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ నేల మీద చతికిలపడిపోయారు పర్వీందర్. ఒక మూల వీల్ చైర్లో కూర్చుని పెళ్లి వేడుకను గమనించిన పర్వీందర్కి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించింది. వీల్ చెయిర్ నుంచి రానురాను మంచానికే పరిమితమైతే... తల్లి మాత్రం ఎంతకాలమని చూస్తుంది? వాష్‌రూమ్ కెళ్లాలన్నా తల్లి సహాయం లేనిదే కదల్లేకపోతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఒకరి మీద ఆధారపడి జీవించే స్థితి నుంచి తన కాళ్ల మీద తాను నిలబడి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు చావ్లా. ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీతోపాటు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలన్నీ పాటించి తన పనులు తాను చేసుకోగలిగినట్లు దేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తర్వాత కాల్ సెంటర్లో పనిచేశారు. కొంతకాలం ‘బేబీ సిట్టింగ్’ (చంటిబిడ్డ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లినప్పుడు తిరిగి వాళ్లు వచ్చే వరకు బిడ్డకు తోడుగా ఉండటం) ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. తండ్రి హోటల్ నడుపుతున్నాడు కాబట్టి తనకు అంతో ఇంతో పరిచయమున్న రంగం అదొక్కటే. అందుకే చావ్లా సొంతంగా కేటరింగ్ సర్వీస్ నడిపారు. అన్నింటికంటే ముందు ఏ విషయానికీ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలగడం అలవాటు చేసుకున్నారు. తన మీద తనకు నమ్మకం కలిగింది. తాను ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన స్థితిలో లేదనే సంతోషం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే మరో మలుపు! కశ్మీర్‌కు టీమ్ టూర్ పర్వీందర్ స్నేహితులు కశ్మీర్‌లోని గుల్మార్గ్ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆమెను కూడా రమ్మని పిలిచారు. నిజానికి పర్వీందర్కు కూడా ఉన్న చోటనే ఉండిపోకుండా ఎక్కడికైనా వెళ్లాలని మనసులో ఉండేది. స్నేహితుల ఆహ్వానంతో సంతోషంగా ఆ టూర్ టీమ్‌తో కలిసిపోయింది. వెళ్లిన చోట స్నేహితులకు తన కారణంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన వీల్ చైర్‌ను నడిపించడానికి ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారామె. మెత్తని పొడి లాంటి మంచు గడ్డకట్టిపోయి రాయిలా పేరుకుపోయిన గుల్మార్గ్లో ఎల్తైన పాయింట్‌కు చేరడం పర్వీందర్ దృష్టి కోణాన్ని మార్చేసింది. అప్పటి నుంచి పర్యటిస్తూనే ఉన్నారు. అన్నీ సోలో టూర్లే పర్వీందర్ తొలి పర్యటన స్నేహితులతో కలిసి వెళ్లినా కానీ, ఆ తర్వాత ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘నాకైతే కుటుంబం లేదు. వాళ్లకు కుటుంబం, పిల్లలు ఉంటారు. నేను చేసినన్ని పర్యటనలు చేయడం వాళ్లకు సాధ్యం కాదు కదా’ అంటారు నవ్వేస్తూ. ట్రావెల్ కంపెనీల టూర్ ప్యాకేజ్‌లలో చావ్లాను తీసుకెళ్లడానికి చాలా కంపెనీలు ససేమిరా అన్నాయి. ‘మీతోపాటు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి, మీరు ఆ ఖర్చు కూడా భరిస్తేనే సాధ్యమవుతుంది’ అని ఖండితంగా చెప్పేశారు. దాంతో టూర్ ప్యాకేజ్‌ల జోలికి వెళ్లకుండా ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘సోలో ట్రావెల్ చేయాలనుకున్న తర్వాత మలేసియా పర్యటన మాత్రం స్నేహితులతో వెళ్లాను. ఆ ట్రిప్‌లోనే రెండు రోజులు మా ఫ్రెండ్స్ టీమ్‌తో కాకుండా ఒక్కదాన్నే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుని వెళ్లాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అన్నీ సోలో పర్యటనలే’ అన్నారు పర్వీందర్. ‘‘గుల్మార్గ్లో ఎల్తైన శిఖరాన్ని చేరినప్పటి అనుభూతిని మాటల్లో చెప్పలేను. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. ఇలాంటి అద్భుతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, అందమైన ప్రపంచం మొత్తాన్ని చూసి తీరాలనిపించింది. అదే (గుల్మార్గ్)నా పర్యటనలకు ఆది. అప్పటి నుంచి అలా ప్రయాణిస్తూనే ఉన్నాను’’ అని చెప్పారు. బుక్ చేసుకుని వెళితే.. అక్కడ హోటలే లేదు! పర్వీందర్ తన ప్లాన్లను వివరిస్తూ తనకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితిని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘తక్కువ లగేజ్‌తో టూర్ ప్లాన్ చేసుకుంటాను. తక్కువ బడ్జెట్ హోటళ్లలో దిగుతాను. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా గది తీసుకోకుండా డార్మెటరీల్లో కూడా బస చేస్తాను. ఒకసారైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్లిన చోట.. ఉండాల్సిన హోటల్ లేనేలేదు! దానిని పడగొట్టేశారట. ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో హోటల్‌కి చేరుకునే సరికి అదీ పరిస్థితి. అప్పుడు టైమ్ రాత్రి పదకొండు. క్షణం సేపు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఒకాయన దేవుడిలా కనిపించాడు. దగ్గరలో నా బడ్జెట్‌కు సరిపోయే హోటల్ ఎంత దూరంలో ఉందో, ఎలా చేరుకోవాలో వివరించి సహాయం చేశాడు’’ అని చెప్పారు.ఇంకా పర్యటన దాహం తీరలేదా అంటే చిరునవ్వుతో ‘‘నా పాస్‌పోర్టు పేజీలు ప్రపంచ పటంలోని అన్ని దేశాల స్టాంపులతో నిండిపోవాలి. అదే నా కల’’ అంటారు చావ్లా. పర్యటనలతో ప్రపంచదేశాల సంస్కృతితోపాటు అనేక విషయాలను తెలుసుకున్న పర్వీందర్ వాటన్నింటినీ తన బ్లాగ్‌లో పొందుపరుస్తున్నారు కూడా. – పర్వీందర్ చావ్లా – మంజీర -
గెలవగలమనే నమ్మకంతో ఉన్నాం: గంభీర్
కొల్‌కత: ప్రపంచ కప్ గెలుచుకొని నేటికి ఆరేళ్లు పూర్తయిన సంధర్భంగా ఆ జట్టులోని సభ్యులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సెహ్వాగ్ ట్వీటర్లో ఆనందం వ్యక్తం చేయగా ఐపీఎల్ కొల్‌కత నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచకప్ విజేత జట్టు సభ్యులైన గౌతమ్ గంభీర్, పీయూష్ చావ్లా, యూసఫ్ పఠాన్లు నైట్‌రైడర్స్ అధికారిక వెబ్సైట్లో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఆ సమయంలో బ్యాటింగ్‌కు సిద్దంగా లేను: గంభీర్ ఫైనల్ మ్యాచ్‌లో సెహ్వాగ్ రెండో బంతికే డక్ ఔట్ అవ్వడం అయోమయానికి గురి చేసిందని నైట్‌రైడర్స్ కెప్టెన్ గంభీర్ తెలిపాడు. ఆ సమయంలో బ్యాటింగ్ రావడానికి సిద్దంగా లేనని,ప్యాడ్లు కట్టుకుంటున్నానని గంభీర్ గుర్తు చేసుకున్నాడు. అంపైర్ రిఫరల్ తీసుకోవడంతో కాస్త సమయం దొరికందన్నాడు. క్రీజులోకి వెళ్లె ముందు మెదడులో ఇది ప్రపంచకప్ ఫైనల్, 275 పరుగుల లక్ష్యం అని చాలా ఆలోచనలు మొదలయ్యాయన్నాడు. వచ్చిన వెంటనే మలింగా విసిరిన తొలి బంతిని బౌండరీకి తరలించడంతో కొంత ఒత్తిడి తగ్గిందని చెప్పాడు. 275 పరుగుల లక్ష్యం స్వదేశంలో పెద్ద లక్ష్యం కాదని కానీ ఆసమయంలో కొంత ఒత్తిడికి లోనయ్యానన్నాడు. కానీ డ్రెస్సింగ్ రూంలో ఉన్న ప్రతి ఒక్కరం మ్యాచ్గెలుస్తామనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. ఈ అవకాశం మళ్లీ మళ్లీ రాదని భావించి ఆడానన్నాడు. ఈ మ్యాచ్‌లో గంభీర్, నాటి కెప్టెన్ ధోనితో కలసి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గెలుపుకు బాటలు వేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ రాత్రి జెర్సీ విప్పలేదు: పీయూష్ చావ్లా ప్రపంచ కప్ జట్టులో సభ్యుడైన లెగ్‌స్పిన్నర్ పీయూష్ చావ్లా అయితే మ్యాచ్‌గెలిచిన రాత్రి భారత్ జెర్సీ, మెడల్ తీసేయకుండా అలానే పడుకున్నానని గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్అనంతరం చాంపెన్ బాటిల్ ఓపెన్ చేసి సందడి చేశానని, కానీ తాగలేదని, ఇప్పటికీ తాగిన అనుభూతే కలుగుతుందన్నాడు ఈ లెగ్ స్పిన్నర్. టీషర్టుపై ప్రతి ఒక్క ఆటగాడి సంతకం తీసుకున్నానని, మెడల్ టీషర్టుతో అలానే పడుకున్నాని చావ్లా తెలిపాడు. ఆ వేడుకలతో తన జీవితంలో ఒక అద్భుతమైన రాత్రిగా నిలిచిందన్నాడు. ఫుల్ టాస్‌ను సింగిల్ తీశాను: యూసఫ్ పఠాన్ ఐర్లాండ్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మెరిపించిన యూసఫ్‌పఠాన్ తన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో యూసఫ్ 30 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోశించాడు. ఇదే మ్యాచ్ 5 వికెట్లు కోల్పోయి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన యువరాజ్, యూసఫ్‌లు జట్టును గెలిపించారు. యూవీ 50 కోసం ఫుల్‌టాస్ బాల్‌ను సింగిల్ తీశానని యూసఫ్ తెలిపాడు. ఆ సమయంలో భారత్ విజయానికి 8 పరుగులు దూరంలో ఉందని, యూవీ హాఫ్ సెంచరీకి 5 పరుగులు కావాలని, అయితే సింగిల్ తీయడంతో యూవీ ఫోర్, సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడని యూసఫ్ తన మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. దీంతో యూవీ వరల్డ్‌కప్‌లో ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు సాధించి 50 పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వరల్డ్‌కప్ ఫైనల్లో 6 వికెట్లతో భారత్ గెలుపొందడం 1983 వరల్డ్‌కప్ తర్వాత ఇది రెండోసారి.