ప్రతీకాత్మక చిత్రం
వాషింగ్టన్ : థ్రిల్ కోసం దొంగతనం చేసిన ఓ వ్యక్తిని అమెరికాలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సదరు వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న దినేష్ చావ్లా కావడం విశేషం. చావ్లా హోటల్స్ సీఈవో దినేష్ ఎయిర్‌పోర్టులో ఓ సూట్‌కేసు కొట్టేశాడు. తన కారులో పెట్టుకుని.. ఏమీ ఎరగనట్టు మళ్లీ ఎయిర్‌పోర్టుకొచ్చి విమానంలో ఉడాయించాడు. ఇదంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. పోలీసులు అతని కారును తనిఖీ చేయగా సూట్‌కేసు దొరికింది. దాంతోపాటు నెలక్రితం చోరీకి గురైన మరో సూట్‌కేసు కూడా కారులో లభించింది.
వాటిల్లోని వస్తువుల విలువ సుమారు 4 వేల డాలర్లు ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, నేరాన్ని అంగీకరించిన దినేష్.. దొంగతనం నేరమని తెలిసినప్పటికీ థ్రిల్లింగ్ కోసమే అలా చేశానని చెప్పడం గమనార్హం. దినేష్, అతని తమ్ముడు సురేష్ చావ్లా డెల్టాలో లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తున్నారు. ట్రంప్‌నకు చెందిన నాలుగు హోటల్స్‌లో చావ్లా హోటల్స్ పార్టనర్‌గా ఉండేది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎవరికి వారు సొంతంగా హోటల్స్ స్థాపించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment