memphis
-
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
మెంఫిస్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు
దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 72వ జయంతి సందర్భంగా వేడుకలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. మెంఫిస్(టెన్నెస్సీ స్టేట్) నగరంలో వైఎస్సార్ అభిమానులు, దివంగత ముఖ్యమంత్రి.. మహానేత వైఎస్సార్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా సమైక్యాంధ్రలో ఆ మహానేత చేపట్టిన ప్రజారంజక సంక్షేమ పథకాలు, అమలు చేసిన అభివృద్ధి పథకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం తండ్రి బాటలో పయనిస్తూ.. ఆ మహానేత వారసుడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొనసాగిస్తున్నప్రజా ప్రయోజన పథకాల సత్ఫలితాల గురించి చర్చించుకున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో స్థానిక కార్యనిర్వాహక నాయకులు రాజశేఖర్‌రెడ్డి, భద్రం నరిశెట్టి, జైపాల్‌రెడ్డి బుడ్డాల, వీరమోహన్‌రెడ్డి, రమేష్, రాహుల్‌రెడ్డి గౌరవరం, అలీ సయ్యద్, నాగిరెడ్డి, హరి, మధుకర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, నీలోత్పల్ రెడ్డి, సూర్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
థ్రిల్ కోసం దొంగయ్యాడు... అడ్డంగా బుక్కయ్యాడు..!
వాషింగ్టన్ : థ్రిల్ కోసం దొంగతనం చేసిన ఓ వ్యక్తిని అమెరికాలోని మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. సదరు వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న దినేష్ చావ్లా కావడం విశేషం. చావ్లా హోటల్స్ సీఈవో దినేష్ ఎయిర్‌పోర్టులో ఓ సూట్‌కేసు కొట్టేశాడు. తన కారులో పెట్టుకుని.. ఏమీ ఎరగనట్టు మళ్లీ ఎయిర్‌పోర్టుకొచ్చి విమానంలో ఉడాయించాడు. ఇదంతా అక్కడి సీసీటీవీల్లో రికార్డయింది. పోలీసులు అతని కారును తనిఖీ చేయగా సూట్‌కేసు దొరికింది. దాంతోపాటు నెలక్రితం చోరీకి గురైన మరో సూట్‌కేసు కూడా కారులో లభించింది. వాటిల్లోని వస్తువుల విలువ సుమారు 4 వేల డాలర్లు ఉంటుందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. అయితే, నేరాన్ని అంగీకరించిన దినేష్.. దొంగతనం నేరమని తెలిసినప్పటికీ థ్రిల్లింగ్ కోసమే అలా చేశానని చెప్పడం గమనార్హం. దినేష్, అతని తమ్ముడు సురేష్ చావ్లా డెల్టాలో లగ్జరీ హోటల్స్ నిర్వహిస్తున్నారు. ట్రంప్‌నకు చెందిన నాలుగు హోటల్స్‌లో చావ్లా హోటల్స్ పార్టనర్‌గా ఉండేది. కానీ కొన్నాళ్ల తర్వాత ఎవరికి వారు సొంతంగా హోటల్స్ స్థాపించుకున్నారు. -
పిల్లలను దారుణంగా చంపేసింది!
మెంఫిస్ః నలుగురు పిల్లలను దారుణంగా చంపేసిన తల్లి ఉదంతం అమెరికాలోని టెన్నెస్సీలో వెలుగు చూసింది. మెంఫిస్ నగర శివారులో జరిగిన ఘటన స్థానికంగా భయాందోళనలు రేపింది. పదునైన ఆయుధంతో ఆ మహిళ నలుగుర్నీ పొడిచి చంపేసినట్లు మెంఫిస్ ప్రాంతంనుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలోని మెంఫిస్ ప్రాంతం టెన్నెస్సీలో చోటుచేసుకున్న ఘటన అక్కడి వారిని కలచి వేసింది. టెన్నెస్సీ గేటెడ్ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లో నలుగురు పిల్లలను ఓ తల్లి చంపేసిందంటూ తమకు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా.. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే చనిపోయిన నలుగురు పిల్లలతోపాటు, తల్లికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియకపోవడంతో ఆమెపై నేరాభియోగాలు నమోదు చేయలేదని పోలీసులు చెప్తున్నారు. ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండే వెర్డెంట్ గోల్ఫ్ కోర్స్ సమీపంలోని ఆపార్టుమెంట్‌లో ఇటువంటి సంఘటనలు ఎప్పుడూ చూడలేదని స్థానికులు, కౌంటీ షరీఫ్ విలేకర్లు చెప్తున్నారు. పదునైన ఆయుధంతో చిన్నారులను ముక్కలు ముక్కలు చేసేందుకు ఆమెకు ఎలా మనసొప్పిందోనని, అంతటి దారుణానికి ఎలా ఒడిగట్టిందో తమకు తెలియడం లేదని ఇరుగు పొరుగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో విగతజీవులుగా పడి ఉన్న నలుగురు చిన్నారులను గుర్తించిన పోలీసులు.. తల్లిని కస్టడీలోకి తీసుకున్నారు. చిన్నారుల వయసు, పేర్లు మొదలైన వివరాలేమీ పోలీసు అధికారులు వెల్లడించలేదు. వారిని బేబీస్ అంటూ పిలుస్తున్నారు. అయితే షరీఫ్ కార్యాలయం మాత్రం వారంతా ఆరేళ్ళ లోపు వారేనని తెలిపింది. కాగా తల్లికి మానసిక సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకునే పనిలో పడిన పోలీసులు హత్యలు జరిగిన సమయంలో చిన్నారుల తండ్రి ఇంట్లో లేకపోకపోవడంపై కూడ దృష్టి సారించారు. దర్యాప్తుకోసం కావలసిన అన్నిరకాల సహకారాన్ని అందిస్తామని షెల్బీ కౌంటీ మేయర్ మార్క్ లుటరెల్ పోలీసులకు హామీ ఇచ్చారు. అయితే ఆ ఫ్యామిలీ గురించి పూర్తి వివరాలు తెలియకపోయినా.. పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఇంటి ముందు స్థలంలో ఆడుకుంటూ కనిపించేవారని, అందరూ ఆరేళ్ళలోపు వారేనని ఓ పొరుగు వ్యక్తి తెలిపాడు. తాను తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్ కు వెళ్ళేప్పుడు కూడ ఇష్టంగా పలకరించేవారని, నాకు తెలిసినంతవరకూ ఆ పిల్లలు ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని వివరించాడు. ఇరుగు పొరుగువారు చెప్పిన వివరాలను సైతం నోట్ చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
మెంఫిన్‌లో ఘనంగా సంక్రాంతి సంబరాలు
వాషింగ్టన్ : టెన్నెస్సీ రాష్ట్రం, మెంఫిన్ పట్టణంలో మెంఫిన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో 'సంక్రాంతి సంబరాలు' ఘనంగా జరిగాయి. ఈ వేడుకల కోసం స్థానిక 'సౌత్ విండ్ ఉన్నత పాఠశాల'ను అందంగా ముస్తాబయింది. సంక్రాంతిశోభ ఉట్టిపడే విధంగా వేదికను అందంగా అలంకరించారు. ఈ సంబరాల్లో భాగంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. తెలుగు ఇంటి ఆడపచులు చేతులతో అందమైన రంగురంగుల రంగవల్లులు రూపు దిద్దుకున్నాయి. అలాగే సంక్రాంతి పాటలు పాడారు. ఈ వేదికపై జరిగిన భోగి పళ్ళ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహం గా పాల్గొన్నారు. సంప్రదాయ సంగీత నృత్యాలతో ప్రారంభమయిన కార్యక్రమం సుమారు నాలుగు గంటల పాటు సాగింది. చిన్నారులు సినీ గీతాలను అనుగుణంగా చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. యువతులు చేసిన డాన్సులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వర్ధమాన గాయకుడు సందీప్ కురపాటి పాల్గొన్నారు. ఆయన తనదైన శైలిలో పాడిన పాత, కొత్త తెలుగు చిత్రాల్లోని గీతాలు ఆహ్వానితులను కట్టిపడేశాయి. కమిటి సభ్యులతోపాటు తెలుగువారు వండి వడ్డించిన విందు భోజనం అందరి మెప్పు పొందింది. ఈ సంబరాలను పురస్కరించుకుని తెలుగు అసోషియేషన్ ఆఫ్ మెంఫిన్ ఆధ్వర్యంలో చిత్రలేఖనం, ముద్దు మాటలు, పద్యాలు, బుల్లికథలు, వ్యాసాలు, ఆహా ఏమిరుచి, ఆహా ఏమి రుచి, గోరింటాకు, ముత్యాల ముగ్గులు తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహాకులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమం తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెంఫిన్ అధ్యక్షుడు యెదురు పుల్లారెడ్డి గారి ఆధ్వర్యం లో ఘనంగా జరిగింది. ఉపాధ్యక్షుడు గోపి జవాబ్ నవీస్, సహా ఉపాధ్యక్షుడు రంజిత్ కొమరవెల్లి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మండలపు, సహ ప్రధాన కార్యదర్శి మదన్ వెన్న, కోశాధికారి సుబ్బారెడ్డి కర్నాటి, సహా కోశాధికారి రమేష్ నర్సాపురం, సాంసృతిక కార్యదర్శి రత్నాకర్‌రావు వాన, సాంసృతిక సహా కార్యదర్శి స్వప్న వొంటరి, క్రీడల విభాగ కార్యదర్శి శ్రీనివాస్ బుసిరెడ్డి, క్రీడల విభాగ సహా కార్యదర్శి అరవింద్ నూనె, ఫుడ్ కమిటీ చైర్ పర్సన్ చంద్రశేఖర్ పొట్నూరు, క్రియేటివ్ డైరెక్టర్ సత్య ప్రోద్దుటూరి, మీడియా చైర్ పర్సన్ సింధూర కల్లేపల్లి, యూత్ కమిటీ చైర్ పర్సన్ రవిపోలూరి, మార్కెటింగ్ కమిటీ చైర్ పర్సన్ రాజేంద్ర తంగళ్లపల్లి, మార్కెటింగ్ కమిటీ ఉప చైర్ పర్సన్ అరుణ్ ద్యసాని మరియు ధర్మకర్తల అధ్యక్షుడు వీరభద్రం నరిశెట్టి, ధర్మకర్తలు స్వామి పొలస, ఉదయ్ నట్ర , రాజ్ తోట మరియు సురేశ్ కొత్త ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. 2015 వ సంవత్సరంలో సేవలు అందించిన కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ జ్ఞాపికలను అందజేశారు. గత మూడుసంవత్సరాలుగా సేవలు అందించిన ధర్మకర్త, శేషాద్రి బెల్డే గారికి ప్రత్యెక కృతజ్ఞత తెలుపుతూ జ్ఞాపిక అందజేశారు.