పోలీసుల చేతిలో దెబ్బలు తిని నిస్తేజంగా పడున్న నికోల్స్. (ఇన్‌సెట్‌లో) అతనిపై పెప్పర్ స్ప్రే జల్లుతున్న పోలీసులు
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి.
2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు.
వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు.
బైడెన్ దిగ్భ్రాంతి
టైర్ నికోల్స్‌పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment