brutality
-
రెవెన్యూ అధికారిపై టీడీపీ నేతల దౌర్జన్యం
చంద్రగిరి (తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యకాండ ఇది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు రెవెన్యూ అధికారులపైనే టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. జిల్లాలోని చంద్రగిరి సమీపంలోని స్వర్ణముఖి నది వద్ద జేసీబీ సాయంతో ఇసుకను తవ్వేస్తున్నారని రైతులు బుధవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో చంద్రగిరి–1 వీఆర్వో భాస్కరయ్య వెంటనే ఇసుక తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇసుక తవ్వుతున్న వారు వాహనాలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గౌస్‌బాషా, చంద్రగిరి మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యం నాయుడు, జేసీబీ యజమాని యుగంధర్, మరికొందరు ఆ పార్టీ కార్యకర్తలు గురువారం తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించారు. పెద్దగా కేకలు పెడుతూ ఎన్నికల విధుల్లో ఉన్న భాస్కరయ్యపై దూషణలకు దిగారు. రాయలేని భాషలో దూషిస్తూ ‘నీ అంతు చూస్తాం’ అంటూ బెదిరించారు. టీడీపీ నాయకుల ఇసుక ట్రాక్టర్లను అడ్డుకుంటావా? నీకు ఎవడు ఆ అధికారం ఇచ్చాడు? మా సంగతి నీకు తెలియదు. నీ అంతు చూస్తాం అంటూ దౌర్జన్యానికి దిగినట్లు బాధిత వీఆర్వో తెలిపారు. ఒక దశలో ఆయనపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. వీఆర్వోల సంఘం ఆగ్రహం టీడీపీ నాయకులు రెవెన్యూ ఉద్యోగిపై.. అదీ ఒక దళిత వీఆర్వోపై దౌర్జన్యం చేయడం పట్ల వీఆర్వోల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉద్యోగిపై టీడీపీ నాయకులు దాడికి యత్నించడం అమానుషమని వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తహసీల్దార్ శిరీషను సంఘం రాతపూర్వకంగా కోరింది. పోలీసులకు ఫిర్యాదు దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నేతలపై బాధిత వీఆర్వో భాస్కరయ్య, తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భాస్కరయ్య, వీఆర్వోల సంఘం నాయకులు గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌కు వచ్చి తహసీల్దార్ అందజేసిన ఫిర్యాదును ఇచ్చారు. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీఆర్వోకు ఎటువంటి హాని జరిగినా టీడీపీ నాయకులదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోల సంఘం రాష్ట్ర నాయకుడు నాగరాజు, జిల్లా నాయకులు వెంకన్న నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, మునస్వామి, అశోక్, వాసయ్య, సుబ్రమణ్యం, విజయ్, గిరి, యజ్ఞశ్రీ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
నేలమీద పడేసి చేతులు విరగ్గొట్టి
టెన్నెసీ: అమెరికాలో పోలీసుల క్రూరత్వం ఏ స్థాయిలో ఉంటుందో తెలిపే ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ నగర పోలీసులు 29 ఏళ్ల నల్లజాతీయుడ్ని దారుణంగా హింసించడంతో ఆ దెబ్బలకు తాళలేక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల మొదట్లో జరిగిన దారుణానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడుతున్నాయి. 2020 మేలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడ్ని శ్వేతజాతీయుడైన పోలీసు అధికారి గొంతుపై బూటు కాలుతో తొక్కి చంపిన ఘటనని తలపించేలా ఈ దౌర్జన్య కాండ కూడా సాగింది. కాకపోతే తాజా ఘటనకు పాల్పడ్డ పోలీసులు కూడా నల్లజాతీయులే! ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఫెడెక్స్‌లో పనిచేసే 29 ఏళ్ల టైర్ నికోల్స్‌ను ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై మెంఫిస్ పోలీసులు జనవరి 7న ఆపారు. వాహనంలోంచి లాగి నేలమీద పడేసి దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పు చేయలేదంటూ వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఆరుగురు పోలీసులు అతనిపై పెప్పర్ స్ప్రే చల్లి, ఎలక్ట్రిక్ పరికరాలతో షాకిచ్చి కిండపడేశారు. ముఖంపై ఇష్టారాజ్యంగా కొట్టారు. వికృతానందంతో నవ్వుతూ భుజం విరిగేలా కొట్టారు. ‘మామ్ , మామ్’ అంటూ నికోల్స్ దీనంగా రోదిస్తున్నా రెండు నిమిషాల పాటు ఆపకుండా చితక్కొట్టారు. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 10న మరణించాడు. పోలీసులు కొడుతున్న వీడియో చూసి ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దౌర్జన్యాలు ఇంకా ఎన్నాళ్లంటూ రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. పోలీసులపై హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు. నికోల్స్‌కు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. నికోల్స్ తన భుజంపై తల్లి వెల్స్ పేరును టాటూగా వేసుకున్నాడు. తన కొడుకు దారుణ హింసకు గురై మరణించాడంటూ విలపిస్తున్న ఆమెను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. బైడెన్ దిగ్భ్రాంతి టైర్ నికోల్స్పై పోలీసుల హింసాకాండపై బైడెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అత్యంత దారుణమైన ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూస్తే మనసు కలచివేసిందని ఒక ప్రకటనలో తెలిపారు. నల్లజాతీయులకు దేశంలో ఎదురవుతున్న ఎదురుదెబ్బలకి ఇది మరొక ఉదాహరణన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు. నికోల్స్ కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. -
ఢిల్లీ వీధుల్లో దారుణం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మరో దారుణం బుధవారం మధ్యాహ్నం జరిగింది. తమ కుటుంబంలో యువకుడి ఆత్మహత్యకు కారణమని ఆరోపిస్తూ 20ఏళ్ల యువతిని కొందరు నిర్భంధించి లైంగిక దాడి జరిపారు. అనంతరం అత్యాచార బాధితురాలిని నిందితులు తీవ్రంగా హింసిస్తూ కస్తూర్బా నగర్ వీధుల్లో నడిపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం సృష్టించాయి. యువతి ముఖానికి నల్లరంగు పూసి, జుట్టు కత్తిరించి, మెడలో చెప్పు వేలాడదీసి నిందితులు అవమానించడం వీడియోల్లో కనిపించింది. ఈ ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 11మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఏడుగురు మహిళలు కాగా నలుగురు పురుషులు. 11మందిలో ఇద్దరు 18ఏళ్లలోపు వారు కావడం గమనార్హం. బాధిత యువతి భర్తతో కలిసి ఆనంద్ విహార్ ప్రాంతంలో నివసిస్తుంది. ఆమె పుట్టిల్లు కస్తూర్బా నగర్లో ఉంది. నిందితుల కుటుంబంలోని ఒక కుర్రాడితో ఆమెకు స్నేహం ఉందని, గత నవంబర్‌లో ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు ఈ యువతే కారణమని నిందితులు ఆరోపిస్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రతీకారం కోసం వేచి చూసిన నిందితులు గుణపాఠం నేర్పాలంటూ సదరు యువతిని అపహరించారన్నారు. ఆమెపై లైంగిక దాడి జరిపారని తెలిపారు. ఘటన సమాచారం తెలియగానే స్పందించామని, బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీలోని 12 సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
మరుగుతున్న నూనెలో తల ముంచి కిరాతకం..
పాడేరు రూరల్: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంగా ఓ మహిళపై దారుణమైన రీతిలో వ్యవహరించాడో రాక్షసుడు. సలసల కాగుతున్న నూనెలో ఆమె తలను ముంచి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ సంఘటన శనివారం రాత్రి పాడేరులో జరిగింది. పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్ వీధిలో నివాసం ఉంటున్న రత్నం (45) అనే మహిళ భర్త ఎనిమిదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబ పోషణ భారం ఆమెపై పడింది. ఇద్దరు పిల్లలను పెంచేందుకు పాత బస్టాండ్ వద్ద పకోడి, బజ్జీల దుకాణం నిర్వహిస్తోంది. పెట్టుబడి కోసం పది నెలల క్రితం అమె పాడేరుకు చెందిన పెంటారావు అనే వ్యక్తి వద్ద డైలీ ఫైనాన్స్ కింద రూ.20వేలు అప్పు తీసుకుంది. అందులో ఇప్పటి వరకు రూ.10,600 చెల్లించింది. ఆమె అనారోగ్యం కారణంగా ఇటీవల షాపు తెరవలేదు. అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి డబ్బు చెల్లించామని ఒత్తిడి తెచ్చాడు. ఈ నెల 15న పెంటారావు ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆ నేపథ్యంలోనే శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో మళ్లీ వచ్చిన పెంటారావు బజ్జీలు, పకోడీలు వేసే సలసల మరుగుతున్న నూనెలో ఆమె తల, ముఖం భాగాలను ముంచేశాడు. ఆమె తెరుకునే లోపలే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా 50 శాతం చర్మం కాలిపోయిందని వైద్యులు చెప్పారు. ఈ సంఘటపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఊరకనే పోలీసులు ఉతికి ఆరేశారు!
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు మంగళవారం నాడు నగర పోలీసు జాయింట్ కమిషనర్ అశోక్ యాదవ్, డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్వేతా శ్రీమాలితోపాటు మరో నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అన్యాయంగా పోలీసులు జరిపిన దాడిలో ఇరుగు పొరుగు వారితో పాటు గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న అహ్మదాబాద్ కోర్టు అక్టోబర్ 11వ తేదీనాడు కోర్టుకు రావాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. అహ్మదాబాద్ శివారులోని ఛరానగర్ కాలనీపై జూలై 26వ తేదీ రాత్రి దాదాపు 400 మంది పోలీసులు కర్రలతో దాడి చేసి బీభత్సం సష్టించారు. కనిపించిన టూ వీలర్లు, కార్లు, వ్యాన్ల అద్దాలను, లైట్లను, ఇళ్ల తలుపులను, కిటికీలను విచక్షణా రహితంగా పగులగొట్టారు. ఇళ్లలో జొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలను సైతం తరిమి తరిమి కొట్టారు. చిన్న జుట్టున్న ఓ బాలికను బాలుడనుకొని పోలీసులు కొడుతుంటే తల్లి అడ్డం వచ్చి బాలుడు కాదు, బాలికంటూ వదిలేయమనడంతో పోలీసులు రుజువు కోసం ఆమె బట్టలిప్పి చూశారు. చెస్టా, బ్రెస్టా అంటూ తడిమారు. ఇంకా అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల ఈ వికత చేష్టలకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వీధుల్లోని సీసీటీవీ కెమరాలకు చిక్కాయి. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి చేతులు విరగ్గా, కొందరికి నడుములు విరిగాయి. పోలీసుల వికృత చేష్టలను ఫొటోలు తీస్తున్న ఓ నేషనల్ మీడియా ఫొటో జర్నలిస్టును కూడా పోలీసులు చితక బాదారు. ఈ మూకుమ్మడి పోలీసుల దాడిలో తన భార్య, న్యాయవాదులైన ముగ్గురు కుమారులతోపాటు తాను గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాడుల పేరిట పోలీసులు సాగించిన అరాచకంపై ఫిర్యాదు చేయడానికి నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు వెళ్లారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఏ పోలీసు అధికారి కూడా అంగీకరించలేదు. దాంతో ఆ న్యాయవాది అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఛరానగర్ వాసులు నియోజకవర్గం ఎమ్మెల్యేను, ఇతర రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అహ్మదాబాద్‌లోని ‘అల్పసంఖ్యాక్ మంచ్’ అనే పౌర సంస్థ నిజ నిర్ధారణ కమిటీగా ఆగస్టు 14వ తేదీన ఛరానగర్ కాలనీని సందర్శించింది. అప్పటికీ పోలీసుల బీభత్సానికి గుర్తుగా పగిలిన కిటికీలు, తలుపులు, వాహనాల పగిలిన అద్దాల గుర్తులు అలాగే ఉన్నాయి. దాదాపు 70 ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారని, 80 మంది కాలనీ వాసులను చితక బాదారని, వారిలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయని, దాదాపు 50 వాహనాలను ధ్వంసమయ్యాయని, ఇళ్లలోని టెలివిజన్లు, వాషింగ్ మషిన్లకూడా ధ్వంసం చేశారని అల్పసంఖ్యాక్ మంచ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను కూడా న్యాయవాది మనోజ్ తమంచే కోర్టు దష్టికి తీసుకెళ్లడంతో కోర్టు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఛరానగర్లో ఎవరుంటారు? ఈ కాలనీలో ఛరా అనే ఆదివాసీలు ఉంటారు. వారి జనాభా దాదాపు 20 వేల మంది. ఒకప్పుడు బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులవడం వల్లన ఈ తెగకు చెందిన మగవారిని భటులని పిలిచేవారు, ఇప్పటికీ కొందరు అలాగే పిలుస్తారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన ఈ జాతి మొత్తాన్ని ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్–1871’ కింద బ్రిటిష్ పాలకులు నేరస్థుల తెగ వారని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం 1952లో ఈ చట్టాన్ని ఎత్తివేసి ఆ స్థానంలో ‘హాబిచ్యువల్ అఫెండర్స్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఎన్నో తరాలు మారినా, ఛరానగర్ వాసులు ఎంత అభివద్ధి చెందినా, వారు ఎలాంటి నేరం చేయక పోయినా వారిపై నేరస్థుల ముఠా అనే ముద్ర మాత్రం పోవడం లేదు. ఛంగ్లీ సారాయికి అడ్డా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న నాటు సారాయిలాగా ఛంగ్లీ అనే మత్తు ద్రావకాన్ని సంప్రదాయకంగా తయారు చేయడం ఛరా ఆదివాసీలకు అలవాటు. గుజరాత్లో మద్యంపై నిషేధం ఉండడంతో ఈ ఛంగ్లీ సారాయికి డిమాండ్ పెరిగింది. కొన్ని కుటుంబాలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఛంగ్లీ తయారీ కేంద్రాలపై పోలీసులు ఉత్తుత్తి దాడులు జరపడం, లంచంగా డబ్బులు తీసుకెళ్లడం తరచూ జరిగే తతంగమే. ఛరానగర్ కాలనీ, శారదా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ బదిలీపై వచ్చే పోలీసు సైకిల్‌పై వస్తాడని, వెళ్లేటప్పుడు కారులో వెళతాడనే ప్రతీతి కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందీ? ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూలై 26వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతం. కూబర్నగర్ పోలీస్ చౌక్‌కు చెందిన సబ్ ఇనిస్పెక్టర్ డీకే మోరీ కాలనీకి వ్యక్తిగత కారులో వచ్చారు. పెట్రోలింగ్‌కు వచ్చినట్లు చెప్పుకున్నారు. ఓ రోడ్డులో స్కూటర్‌ను ఆపిన ఓ యువకుడితో ‘స్కూటర్‌ను అలా పార్క్ చేయడం ఏమటి’ అంటూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న ఆయన భార్యను అసభ్య పదజాలంతో దూషించారు. చుట్టుపక్కల వారు కూడా ఎస్సైనే దూషించడంతో రెచ్చిపోయిన డీకే మోరీ వెళ్లి అహ్మదాబాద్ ఫోర్త్ జోన్ డిప్యూటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్‌కు వచ్చిన తనపై, తన సిబ్బందిపై ఛరానగర్ వాసులు భారీ ఎత్తున రాళ్లు విసురుతున్నారని, అదనపు బలగాలు కావాలని కోరారు. దాంతో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని నవ నరోడా నుంచి 80 మంది పోలీసులు, శారదా నగర్, నరోడా, మెఘాని నగర్, గాంధీనగర్ నుంచి దాదాపు 320 మంది పోలీసులు లాఠీలతో వచ్చి విచక్షణా రహితంగా దాడులకు దిగారు. 29 మందిని అరెస్ట్ చేశారు, వారిపైనా వివిధ దోపిడీలు, దొంగతనాల కింద కేసులు బనాయించారు. గాయపడిన వారిలో ఫొటో జర్నలిస్ట్ ప్రవీణ్ ఇంద్రేకర్, వస్త్రాల వ్యాపారి 40 ఏళ్ల అతులు డేకర్. అనితా తమాంచేలు అసలు ఎం జరిగిందో మీడియాకు వివరించారు. అందుకు వారి వీడియోలే సాక్ష్యం. జూలై 29 నగరంలో మౌన ర్యాలీ పోలీసుల దాడికి వ్యతిరేకంగా ఛరానగర్ వాసులు దాదాపు ఐదువేల మంది మౌనంగా ర్యాలీ తీశారు. ర్యాలీలో మహిళలతోపాటు పిల్లలు పాల్గొన్నారు. ర్యాలీని వీక్షించేందుకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ సింగ్‌కు పిల్లలు గులాబీ పూలు అందజేశారు. పూలు అందుకున్న ఆయన ఛరానగర్వాసులకు క్షమాపణలు చెప్పారు. పోలీసు దాడులపై అంతర్గత దర్యాప్తునకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత దర్యాప్తులో ఏమి తేలిందని డిప్యూటి పోలీసు కమిషనర్ నీరజ్‌ను మీడియా ప్రశ్నించగా, కేసులో పోలీసులే నిందితులవడం వల్ల దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని వారి నుంచి ఇంకా నివేదిక రావాల్సి ఉందన్నారు. మమ్మల్నీ ఇంకా ఎందుకు ఇలా చూస్తున్నారు? ‘మా ఆదీవాసీల్లో లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు, నటులు, కళాకారులు, గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. మాలో నూటికి నూరు శాతం అక్షరాస్యులు ఉన్నారు. మా పూర్వులు నేరం చేశారో, లేదోగానీ మమ్మల్ని మాత్రం ఇంకా నేరస్థులుగా చూడడం అన్యాయం’ అని ఓ థియేటర్ ఆర్టిస్ట్ డాక్సిన్ ఛరా వ్యాఖ్యానించారు. మహా రచయిత్రి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మహా శ్వేతాదేవీ, ఫిల్మ్ మేకర్ గణేశ్ దేవీ కలిసి ఏర్పాటు చేసిన ‘బుధాన్ థియేటర్ గ్రూప్’లో సభ్యుడు డాక్సిన్ ఛరా. ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే ఛరానగర్లో పలు సామాజిక అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గ్రూపులో శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులు పోలీసు దాడులపై నాటకాలు రూపొందిస్తుండగా, మరికొందరు డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు. -
అన్యాయంగా పోలీసులు దాడి
-
మృత్యుకౌగిలి..
కేఎస్ ఆర్టీసీ, సిమెంట్ లారీ ఢీ బస్సు సీటులోనే ప్రాణం విడిచిన యువకుడు వారం రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే దారుణం.. మరో ముగ్గురు ప్రయాణికులకూ గాయాలు కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలో హిందూపురం – కదిరి రహదారిపై సోమవారం ఉదయం కేఎస్ ఆర్టీసీ బస్సు సిమెంటు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైఎస్సార్ జిల్లా చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ (28) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరుకు కేఎస్ ఆర్టీసీ బస్సు బయలుదేరింది. అనంతపురం జిల్లా కదిరి మండలం ముత్యాలచెరువు సమీపంలోకి రాగానే బెంగూళురు నుంచి వస్తున్న సిమెంటు లారీ కేఎస్ ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొంది. బస్సులో వెనుక సీట్లో కూర్చున్న చిలమకూరుకు చెందిన ప్రేమ్‌నజీర్‌కుమార్ ముందుసీటును బలంగా గుద్దుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. వైఎస్సార్‌జిల్లా పులివెందులకు చెందిన చైతన్యరెడ్డి, శకుంతల, వేమలకు చెందిన గంగరాజులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెళ్లింట విషాదం.. ప్రేమ్‌నజీర్‌కుమార్ స్వస్థలం వైఎస్సార్‌జిల్లా సింహాద్రిపురం మండలం చౌవారుపల్లి. ఉపాధి నిమిత్తం అదే చిలమకూరులో స్థిరపడ్డాడు. ప్రేమ్‌నజీర్‌కుమార్‌కు పులివెందులకు చెందిన అమ్మాయితో ఈ నెల 16న వివాహం జరగాల్సి ఉంది. పెళ్లిపత్రికలను బంధువులకు ఇచ్చేందుకు బస్సులో బయలుదేరి దుర్మరణం చెందాడు. పెళ్లింట విషాదం నెలకొంది. -
దారుణం: కొడుకులే కర్కోటకులై..!
ఆస్తి కోసం తన మన బేధాలు మరిచిపోయారు. కన్న కొడుకులే కర్కోటకులుగా మారారు. తండ్రి అన్న జాలి కూడా లేకుండా.. వృద్ధుడనే దయ కూడా చూపకుండా రాక్షసుల్లా ప్రవర్తించారు. చేతులుకాళ్లు కట్టేసి ఈడ్చుకుపోయారు. ఉత్తర కర్నాటకలోని నింగపుర గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం ఇద్దరు కొడుకులు తండ్రిని దారుణాతి దారుణంగా కొట్టారు. ఇంటి దగ్గర కిందపడేసి కాళ్లు చేతులు కట్టేసి.. పొలం వరకూ ఈడ్చుకుపోయారు. ఇద్దరు కొడుకుల రాక్షసకాండను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకలోని బగల్ కోట్ ప్రాంతంలోని నింగపురం గ్రామానికి చెందిన షేకప్ప మనగూళి (80)కు ఇద్దరు కొడుకులు. ఆయనకు భూమి, ఇల్లు ఉన్నాయి. ఆస్తి మొత్తం ఆయన పేరుతోనే ఉంది. ఆస్తులు పంచాలని కొడుకులు కన్నప్ప, ఎల్లప్ప ఎప్పటినుంచో ఒత్తిడి చేస్తున్నారు. తాను చనిపోయిన తర్వాతే ఆస్తులు పంచుకోవాలని.. అప్పటివరకు రాసి ఇవ్వనని తేల్చేశాడు షేకప్ప. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కొడుకులు.. తండ్రిని రోడ్డుపైకి లాగారు. కింద పడేసి కర్రలు, రాళ్లతో కొట్టారు. ఓ కొడుకు కాళ్లు పట్టుకుంటే.. మరో కుమారుడు చేతులు పట్టుకుని కొట్టాడు. గ్రామస్తులు అందరూ చూస్తుండగానే ఈ తంతు జరిగింది. చేతులు, కాళ్లను కట్టేసి.. అలాగే మోసుకెళ్లి ఊరిచివర ఉన్న పొలంలో పడేసి వచ్చారు. ఆస్తి రాసిస్తేనే ఇంటికి తీసుకొస్తామని.. లేదంటే అక్కడే చావు అని చెప్పారు. ఈ వ్యవహారాన్ని చిత్రీకరించిన ఊరిలోని కుర్రోళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇద్దరి కొడుకులను అరెస్ట్ చేశారు. పొలంలోని పెద్దాయనను ఇంటికి తీసుకొచ్చారు. ఆస్తి కోసం 80 ఏళ్ల కన్నతండ్రిని.. ఈ రకంగా హింసించటం దారుణం అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. -
కన్నతల్లి కర్కశత్వం
సిఫ్‌కాట్ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఒకటిన్నరేళ్ల కన్న కూతురినే హత్య చేసిందో తల్లి. ఉద్దనపల్లి కెలమంగలం రోడ్డులోని హనుమంతపురం గ్రామానికి చెందిన కెంపయ్య, రాధ దంపతులకు మహేంద్రన్(4), మధుశ్రీ అనే ఒకటిన్నరేళ్ల పాప ఉంది. శనివారం ఉదయం చిన్నారి మధుశ్రీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని తల్లి రాధను విచారించగా అసలు విషయం బయటపడింది. రాధకు హŸసూరు సమీపంలోని మాయనాయకనపల్లికి చెందిన శ్రీనివాస్‌తో వివాహేతర సంబంధం ఉండేది. మూడు నెలల క్రితం రాధ చిన్నారిని తీసుకొని శ్రీనివాస్‌తో వెళ్లిపోయింది. గత 15వ తేదీ మళ్లీ భర్త ఇంటికి వచ్చింది. మళ్లీ శ్రీనివాస్‌తో వెళ్లేందుకు ప్రయత్నించగా భర్త కెంపయ్య డెంకణీకోట మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో వివాహేతర సంబంధానికి చిన్నారి అడ్డుగా ఉందని గొంతునులిమి హత్య చేశానని రాధ పోలీసుల ఎదుట అంగీకరించింది. -
అలా ఐదుగురి మొండాలను వేలాడదీశారు....
రియాద్: సౌదీ అరేబియాలో ఇస్లాం చట్టాలను ఉల్లంఘించినా, చిన్నపాటి నేరాలకు పాల్పడినా అమానుష శిక్షలను అమలు చేస్తారు. టెర్రరిస్టులకన్నా భయానకంగా రాళ్లతో కొట్టి చంపుతారు. కరవాలంతో ఒక్క వేటున కుత్తుకను తెగ నరికి చంపేస్తారు. సౌదీ రాజధాని రియాద్‌లో ఇటీవల జరిగిన ఇలాంటి అమానుష హత్యలను ఓ మీడియా బృందం ప్రాణాలకు తెగించి డాక్యుమెంటరీగా చిత్రీకరించింది. విదేశీయులనే కాకుండా దేశీయులెవరూ కూడా ఇలాంటి శిక్షలను కళ్లతో ప్రత్యక్షంగా చూడాల్సిందే తప్ప, ఫొటోలు తీయనీయరు, వీడియోల్లో చిత్రీకరించనీయరు. ఎవరైనా అలా చేసేందుకు ప్రయత్నిస్తే వారి ప్రాణాలను కూడా ఇలాగే తీస్తారు. దొంగతనానికి పాల్పడిన ఓ ఐదుగురు వ్యక్తులను సౌదీ పోలీసులు ఇటీవల ‘చాప్ చాప్’ (తలలు నరికే చోటు) సెంటర్‌కు ఈడ్చుకొచ్చారు. కత్తితో మెడ వరకు వారి తలలను నరికేశారు. అనంతరం ఆ ఐదుగురి మొండాలను రెండు క్రేన్ల మధ్య ఓ వెదురు బొంగుకు గాలిలో వేలాడదీశారు. వారం రోజులపాటు జనం వీక్షణం కోసం వాటిని అలాగే ఉంచారు. ఆ తర్వాత మరో రోజు సవతి కూతురును హత్య చేశారనే ఆరోపణలపై నల్లటి వస్త్రాలు ధరించిన ఓ మహిళను దారుణంగా తల నరికి చంపేశారు. ‘నేనే పాపం చేయలేదు’ అంటూ ఆ మహిళ హృదయవిదారకంగా అరవడం మీడియా తీసిన డాక్యుమెంట్లో స్పష్టంగా వినిపిస్తోంది. హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, సాయుధ దోపిడీలు, తాంత్రిక పూజలు లాంటి నేరాలకు సౌదీలో ఇంత దారుణంగా మరణ శిక్షలు విధిస్తారు. మత్తపదార్థాలు సేవిస్తూ పలుసార్లు పట్టుబడినా రాళ్లతో కొట్టి చంపుతారు. సౌదీ ప్రభుత్వాన్ని లేదా ఇస్లాం మతాన్ని దూషిస్తే వెయ్యి కొరడా దెబ్బలతోపాటు పదేళ్ల నుంచి యావజ్జీవ కారాగారం వరకు శిక్షలు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో నిందితులు కొరడా దెబ్బలకే ప్రాణాలు విడిచిన సంఘటనలు ఉన్నాయి. సున్నీలు మినహా అన్య మతస్థులందరిని సౌదీ ప్రభుత్వం ద్వేషిస్తుంది. క్రైస్తవులను, యూదులను, షియాలను కూడా చంపేయాలంటూ పాఠశాలల్లో విద్యార్థులకు బోధిస్తారు. ఈ విషయాలు కూడా మీడియా డాక్యుమెంటరీలో ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో ఇస్లాం పేరిట సౌదీ అరేబియా ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా బ్రిటన్ మాత్రం సౌదీతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ఇరు దేశాల రాజ కుటుంబాల మధ్య కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రిన్స్ చార్లెస్ ఎన్నోసార్లు సౌదీలో పర్యటించారు. సౌదీ నుంచి బ్రిటన్ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేస్తూ, అందుకు ప్రతిగా ఆయుధాలను విక్రయిస్తోంది. అల్ ఖాయిదానే కాకుండా ప్రపంచంలో ఏ టైర్రరిస్టు సంస్థతో తమకు సంబంధాలు లేవని చెప్పుకునే సౌదీకి అల్ ఖాయిదాతో సంబంధాలున్న విషయాన్ని మీడియా డాక్యుమెంటరీ వెల్లడిస్తోంది. టెర్రరిస్టులకు సౌదీ ప్రధానంగా బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకున్న ఆయధాలను విక్రయిస్తోంది. ఈ మీడియా డాక్యుమెంటరీని అమెరికా బ్రాడ్‌కాస్టింగ్ సర్వీస్ సహకారంతో ఐటీవీ మంగళవారం రాత్రి ప్రసారం చేస్తోంది. -
పోలీసుల కర్కశత్వం
సమస్యలు పరిష్కరించమంటూ శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపారు. ర్యాలీకి అనుమతి లేదన్న పేరుతో తమ కర్కశత్వాన్ని లాఠీలతో విద్యార్థులపై చూపించారు. అమ్మాయిలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను మెరుగు పరచాలని, నాణ్యమైన ఆహారం అందివ్వాని, మెస్ చార్జీలు తగ్గించవద్దని కోరుతూ నగరంలోని వివిధ హాస్టళ్ల విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్దకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీకి అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చేసేదిలేక విద్యార్థులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకె ళ్లాలని వేరే మార్గంలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు కలెక్టరేట్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పి దొరికిన వాళ్లను దొరికినట్టు చావబాదారు. ఆడబిడ్డలని కూడా చూడకుండా జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారు. పోలీసుల దౌర్జన్యకాండపై విద్యార్థిలోకం తీవ్రంగా మండిపడుతోంది. సమస్యలు పరిష్కరించమని కొరినందుకే లాఠీచార్జ్ చేస్తారా అంటూ మండిపడుతోంది. లాఠీచార్జ్‌కి నిరసనగా బుధవారం విశాఖలోని విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. - సాక్షి, విశాఖపట్నం -
ఇంటి చాకిరీలో హింస!
నాగరికత పెరుగుతున్నకొద్దీ శ్రమ దోపిడీ రూపాన్ని మార్చుకుంటున్నది. ‘అభివృద్ధి’ విస్తరించి, కులవృత్తులు క్షీణించి సమాజంలోని అట్టడుగు వర్గాలకు జీవనోపాధి కరువవుతున్న నేపథ్యంలో అలాంటివారంతా కూటికోసం, కూలి కోసం పట్టణంలో బతుకుదామని వస్తున్నారు. అమ్మానాన్నలు ఏ నిర్మాణ రంగంలోనో కూలిపనులు సంపాదించుకుంటుంటే వారి పిల్లలు ఇళ్లల్లో పని మనుషులుగా కుదురుకుంటున్నారు. వీరుగాక అపహరణలకుగురై అమ్ముడై పని మనుషులవుతున్నవారూ ఉన్నారు. ఇలాంటి వారంతా నిస్సహాయలు. వీరిలో ఎక్కువమంది మైనారిటీ తీరని పిల్లలు. వీరికి ఒక సమయం అంటూ ఉండదు. పనులకు పరిమితంటూ ఉండదు. పొద్దస్తమానం బండెడు చాకిరీ చేసినా వీరి సేవలకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. తమకు అప్పగించిన పని ఏదైనా ఓర్పుగా, నేర్పుగా చేయాలి. అయినా అది ‘నైపుణ్యం ఉన్న పని’గా గుర్తించేవారుండరు. యజమానుల ఈసడింపులు, బెదిరింపులు, తిట్ల మధ్య బిక్కుబిక్కుమంటూ అర్ధాకలితో కాలం గడపాలి. వారాంతపు సెలవులు, పండుగ సెలవులు ఉండవు. జనాభా లెక్కలకు అందరు గనుక వీరిగురించి ప్రణాళికా సంఘానికిగానీ, జనం తలరాతలు నిర్ణయిస్తున్న ఆర్ధికవేత్తలకుగానీ ఏమీ తెలియదు. ఇలాంటి అభాగ్యులు ఈమధ్య మళ్లీ వార్తల్లోకెక్కుతున్నారు. పని మనుషులను అత్యంత దారుణంగా హింసిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి. దేశ రాజధాని నగరంలో రెండురోజులక్రితం బయటపడిన ఘటనలో అయితే బీఎస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ ఇంట్లో యజమానురాలు పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక 35 ఏళ్ల యువతి తనువు చాలించింది. ఆ యువతి మృతదేహంనిండా ఇనుపరాడ్‌తో కొట్టిన గాయాలే. వాతలుపెట్టిన ఆనవాళ్లే. ఆమెకే కాదు...ఇంట్లో ఉన్న మరో ఇద్దరు పనిమనుషులకూ ఈ చిత్రహింసలు నిత్యకృత్యం. ఈ ఘటనకు ముందూ వెనకా అదే ఢిల్లీలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ ఇంటి యజమానులుగా ఉన్నవారు వారిని తాళంపెట్టి విదేశాలకు విహారయాత్రకు పోయారు. బాహ్యప్రపంచం దృష్టికిరాని ఘటనలు ఇంకెన్నో! దేశంలో మారుమూల పల్లెటూళ్లో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేంతగా సమాచార వ్యవస్థను ఏర్పాటుచేసుకుంటున్న ప్రభుత్వాలకు తమ పొరుగునే సాగిపోతున్న ఇలాంటి క్రౌర్యం తెలియడంలేదు. స్వాతంత్య్రం వచ్చాక ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ రూపొందిన కార్మిక చట్టాలన్నీ సంఘటితరంగంలో ఉన్న 5శాతం కార్మికులకు సంబంధించినవే. మిగిలిన 95 శాతంమంది అసంఘటిత రంగంలోనే ఉన్నా అలాంటివారి సంక్షేమానికి సరైన చర్యలు లేవు. ఇందులో పనిమనుషులుగా ఉండేవారి సంఖ్య 10కోట్ల పైమాటే. వీరిలో కొందరు ఇళ్లల్లోనే ఉండి చాకిరీ చేస్తుండగా, మరికొందరు వేర్వేరు ఇళ్లల్లో పనులు చేసి పొట్ట పోసుకుంటున్నారు. 2008లో అసంఘటితరంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం వచ్చినప్పుడు అందులో పనిమనుషుల ప్రస్తావన ఉన్నది. కానీ, అది కూడా అసంపూర్ణమే. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పనిమనుషులకు సంబంధించి జాతీయ విధాన రూపకల్పనకు పూనుకుని మూడేళ్లు దాటుతున్నా ఇంతవరకూ దాన్ని నోటిఫై చేయలేదు. జాతీయ మహిళా కమిషన్ 2010లో పనిమనుషుల సంక్షేమం, సామాజిక భద్రతాచట్టం ముసాయిదాను రూపొందించినా ఇంత వరకూ అది పార్లమెంటు ముందుకే రాలేదు. ఈ ముసాయిదా చట్టం పని మనుషుల హక్కులను నిర్వచించడంతోపాటు వారికి నిర్ణీత పనివేళలను, వారాం తపు సెలవులను నిర్దేశించింది. కనీస వేతనాలను నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘించే ఇంటి యజమానులకు ఎలాంటి శిక్షలు వేయాలో చెప్పింది. నిజానికి పనిమనిషుల కోసం చేసే చట్టంవల్ల నిరుపేద, అసహాయ కుటుంబాలు ఎదుర్కొంటున్న మరో క్లిష్టమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దేశంలో ఏటా వేలాదిమంది బాల, బాలికలు, మగదిక్కులేని మహిళలు అపహరణలకు గురవుతున్నారు. వీరిని ఎక్కడెక్కడికో అక్రమంగా తరలించి అమ్మేస్తున్నారు. అలాంటివారిలో కొందరు వ్యభిచార కొంపలకు చేరితే, మరి కొందరు నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పుకునే మహానగరాల్లో పనిమనుషులుగా వెట్టిచాకిరీలో మగ్గిపోతున్నారు. ఇళ్లల్లో లైంగిక వేధింపులకు లోనవుతున్నారు. ఢిల్లీలో దుకాణాల చట్టం అంటూ ఒకటుంది. దానికింద పనివారిని సమకూర్చే సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన ఉంది. ఇదికాక రెండేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఆదేశించాక అక్కడి ప్రభుత్వం ఢిల్లీ ప్రైవేటు ఉపాధికల్పనా సంస్థల (నియంత్రణ) బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇంతవరకూ అది చట్టరూపం దాల్చలేదు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు కొన్ని పరిమితులతో పనిమనుషుల సంక్షేమం, కనీస వేతనాలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయిగానీ... మెజారిటీ రాష్ట్రాలు ఇంతవరకూ అటువైపుగా దృష్టి సారించలేదు. రెండేళ్లక్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) పనిమనుషుల సంక్షేమంపై ఒక విధానాన్ని రూపొందించింది. దానికి మద్దతిస్తున్నట్టు మన దేశం తెలిపినా ఇంతవరకూ రాటిఫై చేయలేదు. పని మనుషుల శ్రమవల్ల కోట్లాది కుటుంబాలకు కావలసినంత తీరిక లభిస్తోంది. ఆ ఇళ్లల్లోని ఆడ మగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని ఎంతో సంపాదించుకుంటున్నారు. సమాజసేవ, రాజకీయాలని తిరుగుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదంతా పనిమనుషులు చేసే చాకిరీవల్లే సాధ్యమైందని గుర్తించకుండా వారిని వేధించుకుతింటున్నారు. వారిని మనుషులుగానే గుర్తించడం లేదు. ప్రభుత్వాలన్నీ తమ నిర్లక్ష్యంవల్లా, నిర్వ్యాపకత్వంవల్లా ఈ స్థితిని పెంచి పోషిస్తున్నాయి. ఇప్పుడు బయటపడిన అమానుష ఘటనల తర్వాతనైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరగాలి. కోట్లాదిమంది మాన, ప్రాణాలతో ముడిపడి ఉన్న సమస్య పరిష్కారానికి కదలాలి.