ఇంటి చాకిరీలో హింస! | Brutality against domestic maids | Sakshi
Sakshi News home page

ఇంటి చాకిరీలో హింస!

Published Fri, Nov 8 2013 4:00 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

ఇంటి చాకిరీలో హింస!

ఇంటి చాకిరీలో హింస!

నాగరికత పెరుగుతున్నకొద్దీ శ్రమ దోపిడీ రూపాన్ని మార్చుకుంటున్నది. ‘అభివృద్ధి’ విస్తరించి, కులవృత్తులు క్షీణించి సమాజంలోని అట్టడుగు వర్గాలకు జీవనోపాధి కరువవుతున్న నేపథ్యంలో అలాంటివారంతా కూటికోసం, కూలి కోసం పట్టణంలో బతుకుదామని వస్తున్నారు. అమ్మానాన్నలు ఏ నిర్మాణ రంగంలోనో కూలిపనులు సంపాదించుకుంటుంటే వారి పిల్లలు ఇళ్లల్లో పని మనుషులుగా కుదురుకుంటున్నారు. వీరుగాక అపహరణలకుగురై అమ్ముడై పని మనుషులవుతున్నవారూ ఉన్నారు.  ఇలాంటి వారంతా నిస్సహాయలు. వీరిలో ఎక్కువమంది మైనారిటీ తీరని పిల్లలు. వీరికి ఒక సమయం అంటూ ఉండదు. పనులకు పరిమితంటూ ఉండదు.  పొద్దస్తమానం బండెడు చాకిరీ చేసినా వీరి సేవలకు ఎలాంటి గుర్తింపూ ఉండదు. తమకు అప్పగించిన పని ఏదైనా ఓర్పుగా, నేర్పుగా చేయాలి. అయినా అది ‘నైపుణ్యం ఉన్న పని’గా గుర్తించేవారుండరు. యజమానుల ఈసడింపులు, బెదిరింపులు, తిట్ల మధ్య బిక్కుబిక్కుమంటూ అర్ధాకలితో కాలం గడపాలి. వారాంతపు సెలవులు, పండుగ సెలవులు ఉండవు. జనాభా లెక్కలకు అందరు గనుక వీరిగురించి ప్రణాళికా సంఘానికిగానీ, జనం తలరాతలు నిర్ణయిస్తున్న ఆర్ధికవేత్తలకుగానీ ఏమీ తెలియదు. ఇలాంటి అభాగ్యులు ఈమధ్య మళ్లీ వార్తల్లోకెక్కుతున్నారు. పని మనుషులను అత్యంత దారుణంగా హింసిస్తున్న ఘటనలు వెలుగులోకొస్తున్నాయి. దేశ రాజధాని నగరంలో రెండురోజులక్రితం బయటపడిన ఘటనలో అయితే బీఎస్‌పీ ఎంపీ ధనుంజయ్ సింగ్ ఇంట్లో యజమానురాలు పెట్టిన చిత్రహింసలకు తట్టుకోలేక 35 ఏళ్ల యువతి  తనువు చాలించింది. ఆ యువతి మృతదేహంనిండా ఇనుపరాడ్‌తో కొట్టిన గాయాలే. వాతలుపెట్టిన ఆనవాళ్లే. ఆమెకే కాదు...ఇంట్లో ఉన్న మరో ఇద్దరు పనిమనుషులకూ ఈ చిత్రహింసలు నిత్యకృత్యం. ఈ ఘటనకు ముందూ వెనకా అదే ఢిల్లీలో మరో రెండు కేసులు బయటపడ్డాయి. రెండు సందర్భాల్లోనూ ఇంటి యజమానులుగా ఉన్నవారు వారిని తాళంపెట్టి విదేశాలకు విహారయాత్రకు పోయారు. బాహ్యప్రపంచం దృష్టికిరాని ఘటనలు ఇంకెన్నో!
 
  దేశంలో మారుమూల పల్లెటూళ్లో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునేంతగా సమాచార వ్యవస్థను ఏర్పాటుచేసుకుంటున్న ప్రభుత్వాలకు తమ పొరుగునే సాగిపోతున్న ఇలాంటి క్రౌర్యం తెలియడంలేదు. స్వాతంత్య్రం వచ్చాక ఈ ఆరున్నర దశాబ్దాల్లోనూ రూపొందిన కార్మిక చట్టాలన్నీ సంఘటితరంగంలో ఉన్న 5శాతం కార్మికులకు సంబంధించినవే. మిగిలిన 95 శాతంమంది అసంఘటిత రంగంలోనే ఉన్నా అలాంటివారి సంక్షేమానికి సరైన చర్యలు లేవు. ఇందులో పనిమనుషులుగా ఉండేవారి సంఖ్య 10కోట్ల పైమాటే. వీరిలో కొందరు ఇళ్లల్లోనే ఉండి చాకిరీ చేస్తుండగా, మరికొందరు వేర్వేరు ఇళ్లల్లో పనులు చేసి పొట్ట పోసుకుంటున్నారు. 2008లో అసంఘటితరంగ కార్మికుల సామాజిక భద్రతా చట్టం వచ్చినప్పుడు అందులో పనిమనుషుల ప్రస్తావన ఉన్నది. కానీ, అది కూడా అసంపూర్ణమే. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పనిమనుషులకు సంబంధించి జాతీయ విధాన రూపకల్పనకు పూనుకుని మూడేళ్లు దాటుతున్నా ఇంతవరకూ దాన్ని నోటిఫై చేయలేదు. జాతీయ మహిళా కమిషన్ 2010లో పనిమనుషుల సంక్షేమం, సామాజిక భద్రతాచట్టం ముసాయిదాను రూపొందించినా ఇంత వరకూ అది పార్లమెంటు ముందుకే రాలేదు. ఈ ముసాయిదా చట్టం పని మనుషుల హక్కులను నిర్వచించడంతోపాటు వారికి నిర్ణీత పనివేళలను, వారాం తపు సెలవులను నిర్దేశించింది. కనీస వేతనాలను నిర్ణయించింది. నిబంధనలను ఉల్లంఘించే ఇంటి యజమానులకు ఎలాంటి శిక్షలు వేయాలో చెప్పింది.
 
  నిజానికి పనిమనిషుల కోసం చేసే చట్టంవల్ల నిరుపేద, అసహాయ కుటుంబాలు ఎదుర్కొంటున్న మరో క్లిష్టమైన సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దేశంలో ఏటా వేలాదిమంది బాల, బాలికలు, మగదిక్కులేని మహిళలు అపహరణలకు గురవుతున్నారు. వీరిని ఎక్కడెక్కడికో అక్రమంగా తరలించి అమ్మేస్తున్నారు. అలాంటివారిలో కొందరు వ్యభిచార కొంపలకు చేరితే, మరి కొందరు నాగరికతకు ఆనవాళ్లుగా చెప్పుకునే మహానగరాల్లో పనిమనుషులుగా వెట్టిచాకిరీలో మగ్గిపోతున్నారు. ఇళ్లల్లో లైంగిక వేధింపులకు లోనవుతున్నారు. ఢిల్లీలో దుకాణాల చట్టం అంటూ ఒకటుంది. దానికింద పనివారిని సమకూర్చే సంస్థలు రిజిస్టర్ చేసుకోవాలన్న నిబంధన ఉంది. ఇదికాక రెండేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు ఆదేశించాక అక్కడి ప్రభుత్వం ఢిల్లీ ప్రైవేటు ఉపాధికల్పనా సంస్థల (నియంత్రణ) బిల్లు ముసాయిదాను రూపొందించింది. ఇంతవరకూ అది చట్టరూపం దాల్చలేదు. కర్ణాటక, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు కొన్ని పరిమితులతో పనిమనుషుల సంక్షేమం, కనీస వేతనాలకు సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయిగానీ... మెజారిటీ రాష్ట్రాలు ఇంతవరకూ అటువైపుగా దృష్టి సారించలేదు. రెండేళ్లక్రితం అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) పనిమనుషుల సంక్షేమంపై ఒక విధానాన్ని రూపొందించింది. దానికి మద్దతిస్తున్నట్టు మన దేశం తెలిపినా ఇంతవరకూ రాటిఫై చేయలేదు. పని మనుషుల శ్రమవల్ల కోట్లాది కుటుంబాలకు కావలసినంత తీరిక లభిస్తోంది. ఆ ఇళ్లల్లోని ఆడ మగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుని ఎంతో సంపాదించుకుంటున్నారు. సమాజసేవ, రాజకీయాలని తిరుగుతూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇదంతా పనిమనుషులు చేసే చాకిరీవల్లే సాధ్యమైందని గుర్తించకుండా వారిని వేధించుకుతింటున్నారు. వారిని మనుషులుగానే గుర్తించడం లేదు. ప్రభుత్వాలన్నీ తమ నిర్లక్ష్యంవల్లా, నిర్వ్యాపకత్వంవల్లా ఈ స్థితిని పెంచి పోషిస్తున్నాయి. ఇప్పుడు బయటపడిన అమానుష ఘటనల తర్వాతనైనా పాలకులు తమ బాధ్యతను గుర్తెరగాలి. కోట్లాదిమంది మాన, ప్రాణాలతో ముడిపడి ఉన్న సమస్య పరిష్కారానికి కదలాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement