సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ కోర్టు మంగళవారం నాడు నగర పోలీసు జాయింట్ కమిషనర్ అశోక్ యాదవ్, డిప్యూటీ పోలీసు కమిషనర్ శ్వేతా శ్రీమాలితోపాటు మరో నలుగురు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది. అన్యాయంగా పోలీసులు జరిపిన దాడిలో ఇరుగు పొరుగు వారితో పాటు గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న అహ్మదాబాద్ కోర్టు అక్టోబర్ 11వ తేదీనాడు కోర్టుకు రావాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది.
అహ్మదాబాద్ శివారులోని ఛరానగర్ కాలనీపై జూలై 26వ తేదీ రాత్రి దాదాపు 400 మంది పోలీసులు కర్రలతో దాడి చేసి బీభత్సం సష్టించారు. కనిపించిన టూ వీలర్లు, కార్లు, వ్యాన్ల అద్దాలను, లైట్లను, ఇళ్ల తలుపులను, కిటికీలను విచక్షణా రహితంగా పగులగొట్టారు. ఇళ్లలో జొరబడి దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. మహిళలను సైతం తరిమి తరిమి కొట్టారు. చిన్న జుట్టున్న ఓ బాలికను బాలుడనుకొని పోలీసులు కొడుతుంటే తల్లి అడ్డం వచ్చి బాలుడు కాదు, బాలికంటూ వదిలేయమనడంతో పోలీసులు రుజువు కోసం ఆమె బట్టలిప్పి చూశారు. చెస్టా, బ్రెస్టా అంటూ తడిమారు. ఇంకా అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసుల ఈ వికత చేష్టలకు సంబంధించి కొన్ని సన్నివేశాలు వీధుల్లోని సీసీటీవీ కెమరాలకు చిక్కాయి. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరికి చేతులు విరగ్గా, కొందరికి నడుములు విరిగాయి. పోలీసుల వికృత చేష్టలను ఫొటోలు తీస్తున్న ఓ నేషనల్ మీడియా ఫొటో జర్నలిస్టును కూడా పోలీసులు చితక బాదారు.
ఈ మూకుమ్మడి పోలీసుల దాడిలో తన భార్య, న్యాయవాదులైన ముగ్గురు కుమారులతోపాటు తాను గాయపడిన న్యాయవాది మనోజ్ తమాంచే దాడుల పేరిట పోలీసులు సాగించిన అరాచకంపై ఫిర్యాదు చేయడానికి నగరంలోని పలు పోలీసు స్టేషన్లకు వెళ్లారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. అందుకు ఏ పోలీసు అధికారి కూడా అంగీకరించలేదు. దాంతో ఆ న్యాయవాది అహ్మదాబాద్ కోర్టును ఆశ్రయించారు. ఛరానగర్ వాసులు నియోజకవర్గం ఎమ్మెల్యేను, ఇతర రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో అహ్మదాబాద్‌లోని ‘అల్పసంఖ్యాక్ మంచ్’ అనే పౌర సంస్థ నిజ నిర్ధారణ కమిటీగా ఆగస్టు 14వ తేదీన ఛరానగర్ కాలనీని సందర్శించింది. అప్పటికీ పోలీసుల బీభత్సానికి గుర్తుగా పగిలిన కిటికీలు, తలుపులు, వాహనాల పగిలిన అద్దాల గుర్తులు అలాగే ఉన్నాయి. దాదాపు 70 ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారని, 80 మంది కాలనీ వాసులను చితక బాదారని, వారిలో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయని, దాదాపు 50 వాహనాలను ధ్వంసమయ్యాయని, ఇళ్లలోని టెలివిజన్లు, వాషింగ్ మషిన్లకూడా ధ్వంసం చేశారని అల్పసంఖ్యాక్ మంచ్ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ నివేదికను కూడా న్యాయవాది మనోజ్ తమంచే కోర్టు దష్టికి తీసుకెళ్లడంతో కోర్టు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఛరానగర్‌లో ఎవరుంటారు?
ఈ కాలనీలో ఛరా అనే ఆదివాసీలు ఉంటారు. వారి జనాభా దాదాపు 20 వేల మంది. ఒకప్పుడు బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పోరాడిన సైనికులవడం వల్లన ఈ తెగకు చెందిన మగవారిని భటులని పిలిచేవారు, ఇప్పటికీ కొందరు అలాగే పిలుస్తారు. అత్యంత ధైర్య సాహసాలు కలిగిన ఈ జాతి మొత్తాన్ని ‘క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్–1871’ కింద బ్రిటిష్ పాలకులు నేరస్థుల తెగ వారని ప్రకటించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక భారత ప్రభుత్వం 1952లో ఈ చట్టాన్ని ఎత్తివేసి ఆ స్థానంలో ‘హాబిచ్యువల్ అఫెండర్స్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఎన్నో తరాలు మారినా, ఛరానగర్ వాసులు ఎంత అభివద్ధి చెందినా, వారు ఎలాంటి నేరం చేయక పోయినా వారిపై నేరస్థుల ముఠా అనే ముద్ర మాత్రం పోవడం లేదు.
ఛంగ్లీ సారాయికి అడ్డా
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న నాటు సారాయిలాగా ఛంగ్లీ అనే మత్తు ద్రావకాన్ని సంప్రదాయకంగా తయారు చేయడం ఛరా ఆదివాసీలకు అలవాటు. గుజరాత్‌లో మద్యంపై నిషేధం ఉండడంతో ఈ ఛంగ్లీ సారాయికి డిమాండ్ పెరిగింది. కొన్ని కుటుంబాలు దీనిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ఛంగ్లీ తయారీ కేంద్రాలపై పోలీసులు ఉత్తుత్తి దాడులు జరపడం, లంచంగా డబ్బులు తీసుకెళ్లడం తరచూ జరిగే తతంగమే. ఛరానగర్ కాలనీ, శారదా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్ బదిలీపై వచ్చే పోలీసు సైకిల్‌పై వస్తాడని, వెళ్లేటప్పుడు కారులో వెళతాడనే ప్రతీతి కూడా ఇక్కడ ప్రచారంలో ఉంది.
అసలు ఆ రోజు ఏం జరిగిందీ?
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం జూలై 26వ తేదీ రాత్రి 11.30 గంటల ప్రాంతం. కూబర్‌నగర్ పోలీస్ చౌక్‌కు చెందిన సబ్ ఇనిస్పెక్టర్ డీకే మోరీ కాలనీకి వ్యక్తిగత కారులో వచ్చారు. పెట్రోలింగ్‌కు వచ్చినట్లు చెప్పుకున్నారు. ఓ రోడ్డులో స్కూటర్‌ను ఆపిన ఓ యువకుడితో ‘స్కూటర్‌ను అలా పార్క్ చేయడం ఏమటి’ అంటూ గొడవ పడ్డారు. పక్కనే ఉన్న ఆయన భార్యను అసభ్య పదజాలంతో దూషించారు. చుట్టుపక్కల వారు కూడా ఎస్సైనే దూషించడంతో రెచ్చిపోయిన డీకే మోరీ వెళ్లి అహ్మదాబాద్ ఫోర్త్ జోన్ డిప్యూటి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. పెట్రోలింగ్‌కు వచ్చిన తనపై, తన సిబ్బందిపై ఛరానగర్ వాసులు భారీ ఎత్తున రాళ్లు విసురుతున్నారని, అదనపు బలగాలు కావాలని కోరారు. దాంతో రెండున్నర కిలోమీటర్ల దూరంలోని నవ నరోడా నుంచి 80 మంది పోలీసులు, శారదా నగర్, నరోడా, మెఘాని నగర్, గాంధీనగర్ నుంచి దాదాపు 320 మంది పోలీసులు లాఠీలతో వచ్చి విచక్షణా రహితంగా దాడులకు దిగారు. 29 మందిని అరెస్ట్ చేశారు, వారిపైనా వివిధ దోపిడీలు, దొంగతనాల కింద కేసులు బనాయించారు. గాయపడిన వారిలో ఫొటో జర్నలిస్ట్ ప్రవీణ్ ఇంద్రేకర్, వస్త్రాల వ్యాపారి 40 ఏళ్ల అతులు డేకర్. అనితా తమాంచేలు అసలు ఎం జరిగిందో మీడియాకు వివరించారు. అందుకు వారి వీడియోలే సాక్ష్యం.
జూలై 29 నగరంలో మౌన ర్యాలీ
పోలీసుల దాడికి వ్యతిరేకంగా ఛరానగర్ వాసులు దాదాపు ఐదువేల మంది మౌనంగా ర్యాలీ తీశారు. ర్యాలీలో మహిళలతోపాటు పిల్లలు పాల్గొన్నారు. ర్యాలీని వీక్షించేందుకు వచ్చిన నగర పోలీసు కమిషనర్ సింగ్‌కు పిల్లలు గులాబీ పూలు అందజేశారు. పూలు అందుకున్న ఆయన ఛరానగర్‌వాసులకు క్షమాపణలు చెప్పారు. పోలీసు దాడులపై అంతర్గత దర్యాప్తునకు తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అంతర్గత దర్యాప్తులో ఏమి తేలిందని డిప్యూటి పోలీసు కమిషనర్ నీరజ్‌ను మీడియా ప్రశ్నించగా, కేసులో పోలీసులే నిందితులవడం వల్ల దర్యాప్తును క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించామని వారి నుంచి ఇంకా నివేదిక రావాల్సి ఉందన్నారు.
మమ్మల్నీ ఇంకా ఎందుకు ఇలా చూస్తున్నారు?
‘మా ఆదీవాసీల్లో లాయర్లు, జర్నలిస్టులు, టీచర్లు, నటులు, కళాకారులు, గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారు. మాలో నూటికి నూరు శాతం అక్షరాస్యులు ఉన్నారు. మా పూర్వులు నేరం చేశారో, లేదోగానీ మమ్మల్ని మాత్రం ఇంకా నేరస్థులుగా చూడడం అన్యాయం’ అని ఓ థియేటర్ ఆర్టిస్ట్ డాక్సిన్ ఛరా వ్యాఖ్యానించారు. మహా రచయిత్రి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మహా శ్వేతాదేవీ, ఫిల్మ్ మేకర్ గణేశ్ దేవీ కలిసి ఏర్పాటు చేసిన ‘బుధాన్ థియేటర్ గ్రూప్’లో సభ్యుడు డాక్సిన్ ఛరా. ఈ గ్రూప్ ఆధ్వర్యంలోనే ఛరానగర్‌లో పలు సామాజిక అభివద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ గ్రూపులో శిక్షణ పొందుతున్న కొందరు విద్యార్థులు పోలీసు దాడులపై నాటకాలు రూపొందిస్తుండగా, మరికొందరు డాక్యుమెంటరీలు నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment