
సాక్షి, న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సమావేశాలను ఏప్రిల్ 8, 9వ తేదీల్లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఆదివారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రాజ్యాంగానికి ఎదురవుతున్న సవాళ్లు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనను ఈ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపింది.
కీలకమైన చర్చలకు వేదికగానే కాకుండా, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి, దేశం కోసం బలమైన ప్రత్యామ్నాయ దృక్పథ ఆవిష్కరణకు, పార్టీ సమష్టి సంకల్పానికి పునరుద్ఘాటనగా ఉంటాయని ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ సమావేశం దేశ వ్యాప్తంగా ఉన్న ఏఐసీసీ ప్రతినిధులను ఒకచోట చేర్చి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎదురయ్యే సవాళ్లను, రాజ్యాంగం, దాని విలువలపై బీజేపీ చేస్తున్న నిరంతర దాడులను చర్చించి, కార్యాచరణను సిద్ధం చేస్తుంది’అని చెప్పారు.
1924 సమావేశంలో మహాత్మాగాంధీ అధ్యక్ష పదవి చేపట్టిన వందేళ్ల వార్షికోత్సవాన్ని పురష్కరించుకొని బెళగావిలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో ఆమోదించిన తీర్మానాలకు కొనసాగింపుగా ఈ సమావేశాలు ఉంటాయని తెలిపారు. గాం«దీజీ, బీఆర్ అంబేడ్కర్‌ల వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరాన్ని గుర్తిచేలా సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్రను చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భేటీకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాం«దీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌గాం«దీ హాజరవుతారు.