
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానమైన నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న సుప్రసిద్ధ దేశవాళీ టోర్నీ సెమీఫైనల్‌కు (కేరళ వర్సెస్ గుజరాత్) సరైన ప్రచారం లేక ప్రేక్షకులు అటువైపే కన్నెత్తి చూడలేదు. దాదాపు లక్షా 30 వేల సామర్థ్యమున్న ప్రేక్షకుల గ్యాలరీలో తొలిరోజు తొలి సెషన్‌లో కేవలం ఐదుగురే మ్యాచ్‌ను తిలకించేందుకు వచ్చారు. భోజన విరామం తర్వాత ఇందులో ఒకే ఒక్కడు మిగిలాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ స్పందించారు. కొందరేమో ప్రేక్షకులను అనుమతించరేమోనని వెళ్లలేదని పేర్కొనగా, మరికొందరు అసలిక్కడ సెమీస్ జరుగుతున్న సంగతే తమకు తెలియదని పోస్ట్‌లు పెట్టారు. మరికొందరు క్రికెట్ ఔత్సాహికులు అనుమతిస్తున్నారనే బదులు రావడంతో రెండో రోజు నుంచి వెళ్తామని ఆసక్తి చూపారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేరళ, ఇన్నింగ్స్‌ను చప్పగా ప్రారంభించింది. కెప్టెన్ సచిన్ బేబీ (193 బంతుల్లో 69 బ్యాటింగ్, 8 ఫోర్లు) జిడ్డుగా బ్యాటింగ్ చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30; 5 ఫోర్లు), రోహన్ (30; 5 ఫోర్లు) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. వరుణ్ నాయనార్ (10) తక్కువ స్కోర్‌కే ఔటయ్యాడు.జలజ్ సక్సేనా (30; 4 ఫోర్లు) గుజరాత్ బౌలర్ల సహనానికి పరీక్షించాడు. ఆట ముగిసే సమయానికి సచిన్ బేబితో పాటు మొహమ్మద్ అజారుద్దీన్ (30) క్రీజ్‌లో ఉన్నాడు. గుజరాత్ బౌలర్లలో అర్జన్ నగస్వల్లా, పి జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment